రైతుల సమస్యల పట్ల పాలక, ప్రతిపక్ష పార్టీలు ఇరువురికీ చిత్తశుద్ధి కొరవడిందని శక్తివంతంగా చెబుతున్న కార్టూన్ ఇది.
రాహుల్ గాంధీ తన పునరాగమనానికి భూసేకరణ చట్టం – 2013 కు మోడీ ప్రభుత్వం తెస్తున్న సవరణలను ఆలంబనగా చేసుకున్నారు. తాము రైతులకు అనుకూలమైన చట్టం తెస్తే మోడి దానికి చిల్లులు పొడుస్తున్నారని ఆయన ఆక్రందన!
విచిత్రంగా బి.జె.పి, మోడిలు సైతం తమ సవరణలు రైతుల కోసమే అని చెబుతున్నారు. కొంతమంది పనిగట్టుకుని తమ సవరణలపై దుష్ప్రచారం చేస్తున్నారని చట్ట సభల్లోనే ప్రధాని ఆక్రోశించారు. రైతులకు తమ సవరణలు చేసే మేలు ఏమిటో ఆయనగానీ బి.జె.పి నేతలు గానీ చెప్పింది లేదు.
భూసేకరణ చట్టం సవరణలే కేంద్రంగా పోయిన పరువు తెచ్చుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుంటే, సవరణలే రైతులకు వరదాయని అని బి.జె.పి చెప్పుకుంటోంది. వీరు ఇరువురు పడుతున్న ఘర్షణ వల్ల చివరికి రైతులకు ఏమన్నా ఒరుగుతుందా అంటే ఏమీ ఉండదని కార్టూన్ చెబుతోంది.
రాహుల్, మోడీల ఘర్షణ పరమ భీకరంగా ఉన్నట్లుగా పత్రికలు, ఛానెళ్లు చిత్రీకరిస్తున్నాయి. ఈ ఘర్షణ వల్ల ఉత్తుత్తి మెరుపులే తప్ప రైతులకు మేలు చేసే వర్షం మాత్రం కురిసేది లేదని కార్టూనిస్టు పరోక్షంగా చెప్పారు.
ఋతుపవన వర్షాలు రైతులకు ఎంత అవసరమో అందరికి తెలిసిందే. ముఖ్యంగా భారత దేశంలో ఋతుపవనాలు సమయానికి ప్రవేశిస్తున్నాయా, ఆశించినట్లుగా దేశంలో విస్తరిస్తున్నాయా అన్న అంశంపై ప్రపంచ వాణిజ్య పత్రికలు, ఛానెళ్లన్నీ దృష్టి పెట్టి వార్తలు కవర్ చేస్తాయి. అనగా ఇక్కడి రైతులు పండించే పంటలు ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధకు సైతం ముఖ్య అవసరం అని అర్ధం.
అలాంటి రైతులకు మన పాలకులు ద్రోహం చేస్తున్నారు. వారి భూములు లాక్కుని విదేశీ కంపెనీలకు కట్టబెట్టడానికి శతధా ప్రయత్నిస్తున్నారు. ఈ యజ్ఞంలో బి.జె.పి, కాంగ్రెస్ లు ఇరువురూ పాత్రధారులే. అందుకే వారి మధ్య ఘర్షణ వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం చేకూరదు.