బుధవారం ఢిల్లీలో ఎఎపి నిర్వహించిన కిసాన్ ర్యాలీ సందర్భంగా రాజస్ధాన్ నుండి వచ్చిన రైతు (గజేంద్ర సింగ్) ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య లేఖ రాసి మరీ చనిపోయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నెపాన్ని ఢిల్లీ ప్రభుత్వం పైకి నేట్టేందుకు చట్ట సభల సాక్షిగా ఆసక్తి ప్రదర్శించింది. కాగా అనంతరం జరిగిన, జరుతున్న తంతు ఈ దేశ పాలకవర్గాల కపటత్వాన్ని పచ్చిగా వెల్లడి చేసింది.
భారత దేశంలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడడం కొత్త కాదు. కాంగ్రెస్, టి.డి.పి, బి.జె.పి, ఎస్.పి, బి.ఎస్.పి, బి.జె.డి, ఎల్.జె.పి ఇలా ప్రతి పార్టీ నడిపిన ప్రభుత్వంలోనూ రైతుల ఆత్మహత్యలు నిర్విఘ్నంగా కొనసాగాయి. ఆత్మహత్య చేసుకున్నందుకు కొద్ది పాటి నష్టపరిహారం ప్రకటించడమే గానీ వారి బలవన్మరణాలకు కారణం అయిన, అవుతున్న ప్రపంచ బ్యాంకు, ఐ.ఎం.ఎఫ్ విధానాలను సమీక్షించుకున్న ప్రభుత్వం ఒక్కటీ లేదు.
కాగా ఈ దేశంలో రైతు ఆత్మహత్యకు పాల్పడడం ఇదే మొదటిసారి అన్నట్లుగా రాజకీయ పార్టీల నేతలు, ప్రభుత్వ నేతలు ఒకటే పనిగా కన్నీరు కార్చడం రాజకీయ పార్టీల బూటకత్వానికి, మోసపూరిత స్వభావానికి పరాకాష్ట. రైతు ఆత్మహత్యను పార్లమెంటులో లేవనెత్తిన ప్రతిపక్ష పార్టీలన్నీ యధాశక్తిగా సానుభూతి ప్రకటించి, తీవ్ర పరితాపాన్ని వ్యక్తం చేయగా, ప్రధాని మోడి సైతం ప్రతిపక్షాల బాధను తానూ పంచుకుంటున్నానని విషణ్ణ వదనంతో చాటారు.
“నిన్నటి ఘటన దేశం అంతటికీ తీవ్ర బాధను కలిగించింది. ఇక్కడి సభ్యులు కూడా తమ బాధను వ్యక్తం చేశారు. వారి బాధను నేనూ పంచుకుంటున్నాను” అని ప్రకటించిన ప్రధాని రైతుల ఆత్మహత్యలకు కారణాలు వెతికి పరిష్కారం కనుగొనాలని అమాయకంగా మాట్లాడడం తీవ్ర అభ్యంతరకరం. “రైతులను బాధిస్తున్న సమస్య చాలా పాతది, లోతుగా వేళ్ళు చొచ్చుకుపోయినట్టిది, విస్తారమైనది. ఈ నేపధ్యం నుండి మనం పరిష్కారాలు వెతకాలి… ఈ విషయంలో అందరం కలిసికట్టుగా శపధం చేయాలి. ఎలాంటి సూచననైనా నిండు మనసుతో స్వీకరిస్తాము. మనం ఇక రైతులను చనిపోనివ్వరాదు” అని ప్రధాని ప్రతిన చేశారు.
కానీ ప్రధాన మంత్రి గారు రైతుల ఆత్మహత్యలకు ఎక్కడికో లోతులకు వెళ్ళి వేళ్ళు పెరికి చూడవలసిన అవసరం లేదు. ‘భూసేకరణ చట్టం – 2013’ కు ఆయన ప్రభుత్వం తెస్తున్న సవరణలను ఒక్కసారి పరికించి చూస్తే చాలు. రైతుల ఆత్మహత్యలు పెరుగుతాయో, తరుగుతాయో వారికే అర్ధం అవుతుంది! రైతుల భూములు తీసుకోవడానికి రైతుల అనుమతి తీసుకోవాలని చట్టం చెబుతుంటే దానిని నామమాత్రం చేసేశారు. గ్రామసభల అనుమతి అవసరం లేదని, ఉన్న చోట నామమాత్రం చేస్తూ సవరణ తెస్తున్నారు. విదేశీ, స్వదేశీ ప్రవేటు కంపెనీలకు కూడా అభివృద్ధి పేరుతో, దేశ భద్రత పేరుతో రైతుల భూముల్ని ఇష్టారాజ్యంగా లాక్కోవచ్చని చట్టాన్ని సవరిస్తున్నారు. ఓ పక్క రైతు వ్యతిరేక చట్టాన్ని తెస్తూ, ఆ చట్టాన్ని ప్రవేశపెట్టిన సభలోనే రైతు ఆత్మహత్యకు కారణాలు శోధించాలని వాపోవడం ఎంతటి హిపోక్రసీ!
రైతు పండించే పంటలను రైతుకు లాభదాయకం చేసే బదులు దళారులకు లాభదాయకం చేసిన పాలకులే వరస బెట్టి కన్నీళ్లు కారవడం కంటే మించిన మోసం, నయవంచన మరొకటి ఉండబోదు. దేశ ఆదాయ వనరులు అన్నింటినీ, చివరికి బడ్డీ కొట్టులను కూడా మిగలకుండా ఎఫ్.డి.ఐ లకు అప్పగించే నేతలే ఈ రోజు పార్లమెంటులో రైతు బతుకుపై క్రూరమైన పరాచికాలు ఆడటం దుర్మార్గం. కాస్తో కూస్తో ఉపాధి కల్పిస్తున్న ప్రభుత్వ రంగ పరిశ్రమలను కూడా అయినకాడికి ప్రైవేటు గుత్తస్వామ్య కంపెనీలకు అమ్మేస్తూ అది కూడా దేశాభివృద్ధి కోసమే అని చెబుతున్న నేతలు రైతు ఆత్మహత్య పట్ల బాధ వ్యక్తం చేయడం వికృత పరిహాసం మాత్రమే.
పంటకు గిట్టుబాటు ధరలు ప్రకటించే విధానాన్ని రద్దు చేసింది మోడి ప్రభుత్వమే. జాతీయ ఉపాధి హామీ పధకానికి నిధులు తగ్గించాలని, క్రమంగా రద్దు చేయాలని వాదించింది బి.జె.పి నేతలే. ఎరువులు, పెట్రోలు, గ్యాస్ తదితర సబ్సిడీలను మతిలేని పాపులిస్టు విధానాలుగా అభివర్ణించింది ఇప్పటి ఆర్ధిక మంత్రి గారే. బడ్జెట్ లోటు తగ్గించడానికి దేశ ప్రజలకు ఇచ్చే సబ్సిడీల్లో కోత పెట్టాల్సిందే అని కాంగ్రెస్, బి.జె.పి లు రెండూ వాదించినవే. విదేశాల్లో దాచిన కోటి కోట్ల నల్లధనాన్ని వెనక్కి రప్పించడానికి చేతులు రాని ప్రభుత్వాలన్నీ ఇప్పుడు కన్నీరు కార్చుతున్న నేతల ఏలుబడిలోని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలే.
సమస్య, పరిష్కారం రెండూ ఇంత చక్కగా పక్కపక్కనే కనిపిస్తుండగా ఉమ్మడిగా పూనుకుని తవ్వకాలు జరిపి ఎక్కడినుంచో వెలికి తీయాలని చెప్పడం పరిహాస భాజనమైన వింత! తగుదునమ్మా అంటూ రైతు ఆత్మహత్యకు ఢిల్లీ ప్రభుత్వాన్ని, ఎఎపి ర్యాలీని బాధ్యుల్ని చేసేందుకు ప్రయత్నించడం లోనే పరిష్కారం వెతికే ఉద్దేశ్యం ఈ పాలకులకు లేదని స్పష్టం చేస్తుంది.
ఈ కింది ఫోటోలు వివిధ న్యూస్ వెబ్ సైట్ల నుండి, ఫోటో సైట్ల నుండి సేకరించినవి. రైతు ఆత్మహత్య జరిగిన క్రమం ఈ ఫొటోల్లో లీలగా ద్యోతకం అవుతుంది.
మన్మోహన్ సింగ్ కాలంలో సెజ్‌లకి ఇచ్చిన భూములు చాలా వరకు నిరుపయోగంగా పడి ఉన్నాయి. కొన్ని భూములని రియల్ ఎస్తేత్ వ్యాపారానికి దుర్వినియోగం చేస్తే, కొన్నిటిని బ్యాంక్‌లలో తనఖా పెట్టి లోన్‌లు తీసుకోవడం జరిగింది. వాళ్ళు కావాలని పట్టణానికి దగ్గరలోనో, హైవే పక్కనో ఉన్న భూములు తీసుకుంటారు. ఆ భూముల్లో పరిశ్రమలు పెట్టకపోయినా అవి రియల్ ఎస్తేత్స్ వ్యాపారానికి పనికొస్తాయి.