[ఏప్రిల్ 21 తేదీన ది హిందూలో ప్రచురించిన ‘Return of Rahul’ సంపాదకీయానికి ఇది యధాతధ అనువాదం.]
దాదాపు రెండు నెలల పాటు సెలవు రాహుల్ గాంధీ సెలవులో వెళ్లిపోవడం సరైన సమయంలో జరిగిన పరిణామమో ఏమో గానీ ఆదివారం నాడు ఢిల్లీలో భూ సేకరణ చట్టం (సవరణలు) కు వ్యతిరేకంగా నిర్వహించిన భారీ ర్యాలీ మాత్రం కాంగ్రెస్ పార్టీని మరింత చురుకైన ప్రతిపక్షంగా నిలబెట్టినట్లు కనిపిస్తోంది. నిరసనలకు ప్రారంభ ఊపు ఇచ్చింది రైతుల గ్రూపులు, పౌర సమాజ సంస్ధలే అయినప్పటికీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీయే (ఆ నిరసనకు) కేంద్రం అయింది. తద్వారా చట్టంలోని కొన్ని తీవ్ర వివాదాస్పద క్లాజులను ఉపసంహరించుకునే వైపుగా నరేంద్ర మోడి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచింది.
కాంగ్రెస్ నేతృత్వంలోని గత యు.పి.ఏ ప్రభుత్వం రూపొందించిన అసలు చట్టం కంటే తమది మరింత హేతుబద్ధమైన, ఆచరణ యోగ్యమైన చట్టంగా కేంద్ర ప్రభుత్వం ఆది నుండీ చెబుతున్నది కాస్తా ఇప్పుడు “రైతు-వ్యతిరేక”, “పేదల-వ్యతిరేక” చట్టంగానూ కార్పొరేట్ సంస్ధలను సంతృప్తిపరిచేందుకు చేసిన చట్టంగానూ ముద్ర వేయబడుతోంది. గత భూ సేకరణ చట్టానికి చేయాలనుకుంటున్న మార్పులకు ప్రభుత్వం ఇస్తున్న వివరణ ఏదైనప్పటికీ పరిశ్రమల లాబీని సంతృప్తిపరచడం కోసం తమకు దక్కవలసిన దాన్ని దక్కకుండా చేస్తున్నారని రైతులు, గ్రామీణ పేదలు భావిస్తున్నారు. ఈ అసంతృప్తిలోని కొంత భాగాన్నైనా సరే, కాంగ్రెస్ పార్టీ మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాను చేస్తున్న పోరాటంలోకి సమీకరించగలిగితే, ఆ పార్టీ అదృష్టం తిరగరాతకు ఇదే ప్రారంభం కావచ్చు.
రాహుల్ గాంధీయే ర్యాలీలోని ప్రధాన ఆకర్షణను సొంతం చేసుకున్నట్లయితే అది కేవలం ఆయన రాజకీయ రంగం నుండి తీసుకున్న ‘సుదీర్ఘ కాలపు సెలవు’ నుండి అప్పుడే బైటికి వచ్చినందువల్లనే. పార్టీ అధ్యక్షులు సోనియా గాంధీ స్వయంగా ర్యాలీకి కేంద్ర బిందువుగా ఉండడం ద్వారా ఈ సమస్యపై కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షమే వహిస్తుందని ప్రభుత్వానికి తేటతెల్లం చేశారు. కాంగ్రెస్ పార్టీలోని పాత కాపులను వ్యాకులపరుస్తున్న అంశాల్లో ఒకటి ఏమంటే, రాహుల్ గాంధీకి ప్రధాన (నాయకత్వ) పాత్ర ఇచ్చినట్లయితే సోనియా గాంధీ పాత్ర తగ్గిపోతుందని. సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ లు కూడా ర్యాలీలో పాల్గొన్నందున ఆ నాయకులకు కాస్త ఉపశమనం కలిగి ఉండాలి. సోనియా గాంధీ మరి కొంతకాలం పాటు పార్టీకి నాయకత్వం వహించాలని వారి వాదనగా ఉంటోంది.
తాను అయిష్టంగా రాజకీయవేత్తను అయ్యానన్న అభిప్రాయాన్ని కొన్నిసార్లు కలిగించిన రాహుల్ గాంధీ, సమయం సందర్భం చూడకుండా తాను (రాజకీయాల నుండి) గైర్హాజరీ అయ్యారన్న అభిప్రాయం కలిగి ఉన్న ఆయన మద్దతుదారుల అనుమానాలను (భారీ గ్యాలీ ద్వారా) పటాపంచలు చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పై నేరుగా దాడి చేయడం ద్వారా తన సెలవు యుద్ధరంగం నుండి పారిపోయెందుకు ఉద్దేశించినది కాదని, గత యేటి లోక్ సభ ఎన్నికల్లోనూ, అనంతరం జరిగిన రాష్ట్ర శాసన సభల ఎన్నికల్లోనూ తమ పార్టీ చవి చూసిన భారీ ఓటములను నిజంగానే పునర్మూల్యాంకనం కావించుకుని తాను, తన పార్టీలు పోషించవలసిన పాత్రలను నిశ్చయించుకునే ప్రయత్నాలకే ఉద్దేశించినదని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ తాను కోల్పోయిన పునాదిని తిరిగి పూడ్చుకోవాలంటే అది తప్పనిసరిగా భూ సేకరణ చట్టం లాంటి జీవన సమస్యలను (ఆందోళనలకు) స్వీకరించడం కొనసాగించాలి. జాగరూకత కలిగిన ప్రతిపక్షం లేకపోతే తన తప్పులను సవరించుకోవడానికి ప్రభుత్వానికి ఎన్నటికీ అవకాశం రాదు. మోడి ప్రభుత్వం తెస్తున్న భూ సేకరణ చట్టం కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షంగా తగిన పాత్ర పోషించే అవకాశం కల్పించగా, రాహుల్ గాంధీకి తన పార్టీలోనే తగిన పాత్ర పోషించే అవకాశం కల్పించేదిగానే చివరికి తేలవచ్చు.
[ఈ సంపాదకీయం ఒక కోణంలో చూసినప్పుడు కాంగ్రెస్ ను పోరాట మార్గంలో ఇరికించడానికి ఉద్దేశించినదిగా కనిపిస్తోంది. మరో కోణంలో చూస్తే కాంగ్రెస్ పార్టీ పోరాట శక్తి పట్ల ఎనలేని నమ్మకం పత్రిక కలిగి ఉన్నట్లుగా చూపుతోంది. కానీ కాంగ్రెస్ పార్టీ గానీ, ఆ పార్టీని పోషించే ధనిక వర్గాలు గానీ పత్రిక పెట్టుకున్న ఆశలు నెరవేర్చేది ఎంతమాత్రం కాదు. మహా అయితే, పత్రిక సంపాదకీయం చెప్పినట్లు, ఎన్నికల్లో తన రాతను తిరిగి రాసుకునే పాత్రనే కాంగ్రెస్ పోషించగలదు గానీ రైతులు, గ్రామీణ పేదల ఆశలను నెరవేర్చేది కానేరదు. -విశేఖర్]