రాహుల్ గాంధీ సెలవు కాలం ముగించుకుని కలుగులోంచి వెలికి వచ్చారు. వచ్చీ రావడంతోనే రైతుల (కోసం) ర్యాలీ నిర్వహించి తన పునరాగమనాన్ని ఘనంగా చాటారు (లేదా చాటానని ఆయన అనుకున్నారు). ఆయన మాట్లాడినంత సేపూ జనం (ఎలాగో) ఉన్నారని, ఆయన ముగించి సోనియా గాంధీ మాట్లాడడం ప్రారంభించగానే జనం వెళ్లిపోవడం మొదలు పెట్టారని పత్రికలు గుస గుస రాశాయి.
పునరాగమనం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడి తెచ్చిన భూ సేకరణ చట్ట సవరణ బిల్లుపై ఆయన నిప్పులు చెరిగారని పత్రికలు, ఛానెళ్లు కోడై కూశాయి. సదరు కోడి కూతలు ఇంకా అక్కడక్కడా కొనసాగుతున్నాయి. నిఝంగానే మోడి చట్ట సవరణపై రాహుల్ గాంధీకి అంతగా ఆగ్రావేశాలు పూనాయా? అది ఉత్తుత్తి పూనకమే అన్న సంగతిని ఈ కార్టూన్ చక్కగా చెబుతోంది.
యు.పి.ఏ ప్రభుత్వం తెచ్చిన భూ సేకరణ చట్టం -2013 రైతులపై ఆ ప్రభుత్వానికి ప్రేమ ఉండడం వల్ల వచ్చింది కాదు. గత్యంతరం లేక, రైతుల ప్రతిఘటనను ఏదో మేరకు చల్లబరచడానికి, భూముల త్యాగానికి వారికి నచ్చజెప్పడానికి తెచ్చిన ఒక మాయా చట్టం అది.
ఉండడానికి కొన్ని రైతు అనుకూల అంశాలు అందులో ఉన్న మాట నిజమే కానీ అవి యు.పి.ఏ దయా దాక్షిణ్యాల వల్ల చట్టంలో వచ్చి చేరలేదు. బ్రిటిష్ వాడు తన వలస పాలనను సుస్ధిరం చేసుకోవడానికి, రైతుల భూముల్ని లాక్కుని సంపదల్ని తరలించుకుపోవడానికి తెచ్చిన ఒక అప్రజాస్వామిక, నియంతృత్వ, దోపిడీ చట్టం స్వతంత్రంగా చెప్పినదేదో వచ్చి 65 యేళ్ళు దాటినా కొనసాగడం బట్టే రైతుల పట్ల మన ప్రభుత్వాల వైఖరి ఏమిటో తెలుసుకోవచ్చు. బ్రిటిష్ వాడు ఏ దోపిడీ దృష్టితోనైతే ఆ చట్టాన్ని తెచ్చాడో సరిగ్గా అదే దృష్టితో మన పాలకులు దానిని కొనసాగించి అమలు చేశారు.
అప్రజాస్వామిక చట్టాలను ప్రజలు సహించి ఊరుకోరు. ఒకనాడు కాకపోతే మరొకనాడైనా ప్రతిఘటిస్తారు. ప్రతిఘటించారు కూడా. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున జాతీయోద్యమంలో పాల్గొనడానికి ప్రేరేపించిన కారణాల్లో ఈ చట్టం కూడా ఒకటి. తెల్లవాడితో పాటే వాడు తెచ్చిన నల్ల చట్టాలు కూడా పోతాయన్న ఆశతో జాతీయోద్యమంలో రైతులు పాల్గొన్నారు. అనేక త్యాగాలు చేశారు. తెల్లవాడి కాల్పులకు పిట్టల్లా రాలిపోయారు.
అది ఒక ఖిలాఫత్ ఉద్యమం కావచ్చు. బెంగాల్ లో తెభాగా రైతుల పోరాటం కావచ్చు. బిర్సా-ముండా గిరిజన ఉద్యమం (1899), 1772 సన్యాసి తిరుగుబాటు, 1830-40 ల నాటి పాగల్ పంతి ఉద్యమం, 1855 లోని సంతాల్ ఉద్యమం, 1860 నాటి ఇండిగో (నల్ల మందు పంట వ్యతిరేక ఉద్యమం), భిల్ (1817), రైత్వారీ (1820), రామోసి(1822), మోప్లా (1922), వీరోచిత తెలంగాణ రైతాంగ ఉద్యమం (1940లు)… ఇత్యాది ఉద్యమాలన్నీ భూమి కేంద్రంగా రైతులు చేసిన పోరాటాలే.
1947 లో స్వాతంత్రం వచ్చిందని చెప్పాక కూడా బ్రిటిష్ నల్ల చట్టం కొనసాగింది. ఆ చట్టం కింద యధేచ్ఛగా భూములు లాక్కోవడం కూడా కొనసాగింది. దాని ఫలితంగానే నగ్జల్బరి రైతాంగ పోరాటం, శ్రీకాకుళం గిరిజన రైతుల సాయుధ తిరుగుబాటు పురుడు పోసుకుని నల్ల దొరల్ని వణికించాయి. ఈ పోరాటాల వల్ల ఇందిరా గాంధీ ప్రభుత్వం భూ సంస్కరణల చట్టం పేరుతో నాటకాలు రచించి ప్రదర్శించింది. వినోబా భావే నేతృత్వంలో భూదాన ఉద్యమం నడిపి భూస్వాముల్ని కాపాడారు. ఇటీవల కాలంలో జరిగిన కాకరాపల్లి పోరాటం, పోస్కో వ్యతిరేక ఉద్యమం, వేదాంత వ్యతిరేక ఉద్యమం, గోదావరి లోయ గిరిజన రైతుల ప్రతిఘటన…. ఇవన్నీ భూమి కేంద్రంగా, విచ్చలవిడి భూసేకరణకు వ్యతిరేకంగా జరిగినవే. తెల్ల దొరలు దోపిడి కోసం పచ్చిగా భూములు, రాజ్యాలు లాక్కుంటే నల్లదొరలు అభివృద్ధి పేరుతో లాక్కుంటున్నారు. ఏ విదేశీ దోపిడీకి వ్యతిరేకంగా ఆనాడు రైతులు జాతీయోద్యమంలోకి వెల్లువగా దూకారో అదే విదేశీ కంపెనీలకు కట్టబెట్టేందుకు నేటి ప్రభుత్వాలు రైతుల భూముల్ని లాక్కుంటున్నారు.
ఈ విధానాలపై ఒరిస్సా, ఛత్తీస్ ఘర్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఆంద్ర ప్రదేశ్, బీహార్, మధ్య ప్రదేశ్… ఇలా దాదాపు అనేక చోట్ల రైతులు తిరుగుబాట్లకు పాల్పడ్డారు. వాటిని పోలీసుల సాయంతో మన ప్రభుత్వాలు కర్కశంగా అణచివేసి రక్తం పారించాయి. అణచివేత పెరిగేకొంది రైతుల ప్రతిఘటన తీవ్రం అయింది. అభివృద్ధిలో దేశ ప్రజలకు భాగం లేదన్న నిజం బైటపడడం తీవ్రమయింది. ఫలితంగా విదేశీ, స్వదేశీ ప్రైవేటు కంపెనీల దోపిడీ ప్రయోజనాలకు రైతుల నుండి భూములు లాక్కోవడం నానాటికీ కష్టంగా మారింది. ఈ నేపధ్యంలోనే రైతులను మభ్యపెట్టడానికి, వారి ఆగ్రహాన్ని చల్లార్చడానికి, తామూ రైతుల పక్షమే అని చెప్పుకోవడానికీ భూసేకరణ చట్టం – 2013ను హడావుడిగా తెచ్చారు. ఈ చట్టానికి బి.జె.పి సైతం మద్దతు ఇచ్చింది.
ఈ రోజు బి.జె.పి ప్రభుత్వం అధికారం చేపట్టాక తాము మద్దతు ఇచ్చిన చట్టమే హఠాత్తుగా ‘అభివృద్ధి వ్యతిరేకం’ గానూ, ‘మతిలేని పాపులిస్టు విధానం’ గానూ, ‘పెట్టుబడి కంపెనీల వ్యతిరేకం’ గానూ, ‘పెట్టుబడి వాతావరణాన్ని చెడగొట్టే చట్టం’గానూ కనిపించడం మొదలయింది. ఆనాడు చట్టం తేవడం వెనుక ఉన్న ఉద్దేశ్యం కంపెనీలకు భూములు పంపిణీ చేసే పనిని రైతుల ఆమోదంతో చేయడమే. ఈ కాస్త రాయితీ కూడా రైతులకు ఇవ్వడం కంపెనీలకు మహా ఘోరంగా కనపడింది. విదేశీ బహుళజాతి కంపెనీలకు కాంగ్రెస్ ప్రభుత్వం వదిలించుకోవలసిన ప్రభుత్వం అయింది. బి.జె.పి నేతలు, ముఖ్యంగా నరేంద్ర మోడి, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన నామమాత్రపు రైతు అనుకూల అంశాలను కూడా అడ్డు తొలగిస్తామని కంపెనీలకు హామీ ఇచ్చారు. దానితో నిధులు వరదలా పారాయి. వాల్ స్ట్రీట్ కంపెనీలు తమకు అనుకూలమైన ప్రభుత్వం కోసం సలహాదారులను నియమించాయి. అమెరికన్ బహుళజాతి బ్యాంకుల ఉద్యోగులు ఇక్కడ రాజకీయ పార్టీ విజయానికి వ్యూహాలు రచించారు. ఆ విధంగా కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టింది. రావడంతోనే భూసేకరణ చట్టంలోని రైతు అనుకూల అంశాలను నిర్దాక్షిణ్యంగా తొలగించేందుకు సవరణల చట్టం తెస్తోంది. రైతులకు పచ్చి వ్యతిరేకమైన చర్యలు తీసుకుంటూ రైతుల ప్రయోజనం కోసమే అవి తెస్తున్నామని బి.జె.పి, ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు.
కాబట్టి భూ సేకరణ చట్టం, సవరణల కేంద్రంగా కాంగ్రెస్, బి.జె.పి లు చెబుతున్న రైతు అనుకూల కబుర్లు ఒట్టి మోసం మాత్రమే. ప్రతిపక్షంలో ఉన్నవారు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తుంటే, పాలక పక్షంలో ఉన్నవారు రైతుల్ని దగా చేస్తున్నారు. పొరపాటున బి.జె.పి ప్రభుత్వం కూలిపోయి ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తే, అది కూడా సవరణలు చేయకుండా ఉండదు. వారి విదేశీ మాస్టర్ల ఒత్తిడి ఆ స్ధాయిలో ఉంది మరి!
రాహుల్ గాంధీ పునః రంగ ప్రవేశం సందర్భంగా ఆయన చూపుతున్న రైతు ప్రేమ కోల్పోయిన వైభవాన్ని తిరిగి పొందేందుకు ఉద్దేశించినది మాత్రమే. రైతుల భూములను సేకరించే విషయంలో (అనగా స్వాధీనం చేసుకునే విషయంలో) బి.జె.పి, కాంగ్రెస్ ల మధ్య మౌలికంగా విభేదం లేదు. విభేదమే ఉంటే ఆ చట్టానికి బి.జె.పి మద్దతు ఇచ్చి ఉండేది కాదు. మళ్ళీ అదే పార్టీ ఈ రోజు సవరణలు తేవడం జరగదు. రాహుల్/కాంగ్రెస్ లు రైతులపై చూపుతున్నది కపట ప్రేమ. రైతుల ఆగ్రహాన్ని సొమ్ము చేసుకొని ఓట్ల బలం పెంచుకునే ప్రేమ. రైతుల ఆగ్రహాన్ని నిర్దిష్ట ఉద్యమం లోకి సమీకరించే బాధ్యతను తీసుకోవలసింది ఇంకొకరు కావచ్చు గానీ కాంగ్రెస్ అయితే ఖచ్చితంగా కాదు.
అవును కాంగ్రెస్ కు అర్హత లేదు-కమ్యూనిస్టులకు ఓపిక లేదు. అదే మన దురదృష్టం