చైనా రియల్ రాబందుల భూదాహానికి ప్రతిఘటన ఈ మేకు ఇళ్ళు -ఫోటోలు


చైనా అత్యంత వేగంగా అమెరికా జి.డి.పి పరిమాణాన్ని సమీపిస్తోంది. ప్రస్తుతం అమెరికా వార్షిక జి.డి.పి 16.8 ట్రిలియన్ డాలర్లు ఉంటే చైనా జి.డి.పి 9.2 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. మూడేళ్ళ క్రితం జపాన్ ను మూడో స్ధానానికి నెట్టి రెండో స్ధానానికి చేరేనాటికి చైనా జి.డి.పి 4.5 ట్రిలియన్లు. ఇప్పుడు అంతకు అంతా జి.డి.పి ని పెంచుకుని అమెరికాని వెనక్కి నేట్టేందుకు దూసుకుపోతోంది.

చైనా విశృంఖల అభివృద్ధిలో ‘రియల్ ఎస్టేట్ బూమ్’ ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది. నగరాలు అడ్డూ ఆపూ లేకుండా విస్తరిస్తూ గ్రామాలకు గ్రామాలనే కబళిస్తున్నాయి. పంట చేలు కూడా రియల్ బూమ్ కి దాసోహం అంటున్నాయి. 2008 నాటి ప్రపంచ ఆర్ధిక సంక్షోభం దరిమిలా అమెరికా, ఐరోపాలు కనా కష్టంగా నెట్టుకు వస్తుంటే చైనా స్ధిరంగా జి.డి.పి వృద్ధిని నమోదు చేస్తూ పశ్చిమ దేశాలు తల తిప్పి చూసేలోపు మేరు నగమై వారి చెంత నిలవడమే కాక ప్రపంచ ఆర్ధిక కేంద్రం పశ్చిమం నుండి తూర్పుకు జరగడానికి ప్రధాన కారకంగా నిలిచింది.

చివరికి బ్రిటిష్ ప్రభుత్వం సైతం చడీ చప్పుడు కాకుండా, అమెరికా అనుమతి లేకుండానే, నిజానికి అభ్యంతరం చెబుతున్నా వినకుండా చైనా స్ధాపించిన ‘ఆసియా ఇన్ఫ్రా స్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్ (ఏఐఐబి) లో వ్యవస్ధాపక సభ్య దేశంగా చేరిపోయింది. బ్రిటన్ చేరికతో ఊపు తెచ్చుకున్న జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ లు తాము కూడా ఏఐఐబి వ్యవస్ధాపక సభ్య దేశాలుగా చేరుతామని ప్రకటించాయి. చైనాతో సహకారానికి బ్రిటన్ ఎంత దూరం వెళ్ళిందంటే చైనీయ కరెన్సీ రెన్ మిన్ బి (యువాన్) లలో సార్వభౌమ ఋణ పత్రాలు (ట్రెజరీ బాండ్స్) జారీ చేసిన మొదటి పశ్చిమ దేశంగా అది ముందుకు వచ్చింది.

చైనా వృద్ధికి ప్రధాన హేతువు ఆ దేశ శ్రామిక ప్రజలే. తమ ప్రజల శ్రమను కారు చౌకగా అంతర్జాతీయ విపణిలో అమ్మకానికి పెట్టిన చైనా ఇబ్బడి ముబ్బడిగా ఎఫ్.డి.ఐలు ఆ దేశానికి ప్రవహించాయి. విస్తారంగా స్ధాపితం అయిన పరిశ్రమల కోసం మరిన్ని భూముల్ని ప్రజల నుండి లాక్కున్నారు. పరిశ్రమలలో పని చేసేందుకు గ్రామాల నుండి తరలి వచ్చిన జనాన్ని ఇముడ్చుకునేందుకు నగరాలు మరింతగా విస్తరిస్తూ భూముల డిమాండ్ ను పెంచాయి. ఇలా వచ్చి చేరిన సంపదలో భూముల సొంతదారులకు కూడా భాగం ఉంటే అది వేరే సంగతి. కానీ ఇండియాలో మల్లెనే అక్కడ కూడా జనం భూములను, ఇళ్లను బలవంతంగా లాక్కుని కనిష్ట మొత్తంలో నష్టపరిహారం చెల్లించాయి చైనాలోని వివిధ స్ధాయిల్లోని ప్రభుత్వాలు. భూములు లాక్కోవడం డెవలపర్ల పేరుతో రియల్ ఎస్టేట్ తిమింగలాలకు అప్పజెప్పడం! ఒక ఉద్యమం తరహాలో సాగిన ఈ భూముల పందేరంలో ప్రజలు బలిపశువులు అయ్యారు.

అయితే వివిధ గ్రామ, నగర, మెట్రోపాలిటన్ ప్రభుత్వాలతో పాటు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను ఎదిరించి నిలబడ్డవారికి తక్కువ ఏమీ లేదు. చుట్టూ ఉన్న వారంతా ప్రభుత్వం ఇచ్చింది తీసుకుని ఇళ్ళు, భూములు అప్పగించిపోగా ‘ఏక్ నిరంజన్’ తరహాలో తమ ఇంటికి, కొద్ది పాటి నేలకు అంటి పెట్టుకున్నవాళ్లూ ఉన్నారు. ప్రభుత్వ పరిహారం చాలా తక్కువ అంటూ వాళ్ళు కోర్టుకు ఎక్కడం వారి ఇళ్ళు, సమాధి, స్ధలం వరకు నిర్మాణం జరగకుండా కోర్టు నిరోధించడం జరిగింది. కానీ ఇది తాత్కాలికమే. కోర్టు కేసుల్లో గెలిచినవారి కంటే ఓడినవారే ఎక్కువ.

ఈ విధంగా రాకాసి ప్రభుత్వాలకు ఎదురోడ్డి తమ ఇళ్లను కాపాడుకున్న చోట ఆ ఒక్క ఇల్లు లేదా సమాధి లేదా చోటు ను వదిలిపెట్టిన కాంట్రాక్టర్లు/డెవలపర్లు వాటి చుట్టూ నిర్మాణాలను యధావిధిగా కొనసాగించారు. దానితో అలా మిగిలిపోయిన ఇళ్ళు ఒంటి స్తంభం మేడల తరహాలో అనేక యేళ్ళు దర్శనం ఇచ్చాయి. రాకాసి రాజ్య బలాన్ని నిలువరించిన ఒంటరి యోధులుగా అవి అవతరించాయి. సామాన్యుల ప్రతిఘటనా శక్తికి ప్రతీకలుగా నిలబడ్డాయి. ఇలాంటి ఇళ్లను ‘నెయిల్ హౌస్’ గా పిలవడం అక్కడ పరిపాటి. అనగా ‘మేకు ఇళ్ళు’ అన్నమాట! గోడ అంతా చదరంగా ఉంటే ఆ గోడకి కొట్టిన మేకు పైకి పొడుచుకుని కనిపించినట్లుగా ఈ ఇళ్ళు కనపడడం వల్ల వాటికి ఆ పేరు పెట్టి ఉండవచ్చు.

ఈ ఫోటోలను అట్లాంటిక్ పత్రిక అందించింది.

5 thoughts on “చైనా రియల్ రాబందుల భూదాహానికి ప్రతిఘటన ఈ మేకు ఇళ్ళు -ఫోటోలు

 1. శేఖర్ గారు,
  ప్రచ్చన్న యుద్ద సమయం లో యు ఎస్ ఎస్ ఆర్ ను ‘ సోషియల్ సా మ్రాజ్య వాది’ అన్నారు. దాని ‘ సోషియల్’ ముసుగు తీసేసి పెట్టు బడిదారు (గ్లాస్ నోవ్, పెరస్త్రోయక) గా బయట పడ్డపుడు కమ్యునిజం ఓడి పోయిందని అది ఇక ఎంత మాత్రం పెట్టు బడి దారి వ్యవస్తకు ప్రత్యామ్నాయం కాదని బాకా వూదారు.ఆ క్రమం లో చైనా కూడా మేక తోలు కప్పుకున్న పులి గా కమ్యూనిష్టు ముసుగులోనే శ్రామిక వర్గమ్ మూలుగాలు పీలుస్తూనే ఉంది. మరి అది ముసుగు తొలగిమ్చక పోవటానికి కారణమేమంటారు? అది ప్రత్యక్షంగా ఎందుకు రాదు ?
  ఇంతకు మునుపే ఒక సారి అడిగి ఉన్నాను. వీలు చూచు కొని వివరించ గలరు.

 2. చైనదేశ ప్రజల శ్రమను కారు చౌకగా అంతర్జాతీయ విపణిలో అమ్మకానికి పెట్టిన చైనా ఇబ్బడి ముబ్బడిగా ఎఫ్.డి.ఐలు ఆ దేశానికి ప్రవహించాయి
  చైన ప్రపంచంలోనే అత్యదిక జనాభాగల దేశం అక్కడి ప్రజలకు పని కల్పించడం,వారికొనుగోలు శక్తిపెంచడం సరైన చర్యేకదా!
  ఇప్పుడు చౌకగా లభిస్తున్న వారి శ్రమ రాబోయే రోజులలో ఖరీదైనదిగా మారవచ్చునుకదా!
  విస్తారంగా స్ధాపితం అయిన పరిశ్రమల కోసం మరిన్ని భూముల్ని ప్రజల నుండి లాక్కున్నారు
  ఇది అన్నిచోట్ల జరిగేతంతుకదా!రాజ్యం ఎప్పుడూ భూమిపై హక్కులను కలిగే ఉంటుంది కదా!ఇది పూర్తిగా ఆదేశ అంతర్గత వ్యవహారం(భూములు కోల్పోయిన వారికి ఎటువంటి పరిహారం కల్పించాలో మనం ఎలా నిర్నయిస్తాం!)

 3. మూల గారు

  * మంచిదా, చెడ్డదా అని చూడ్డానికి పని కల్పించడం ఒక్కటే ప్రాతిపదిక కాదు. ఆ పనికి జాతీయ స్వభావం ఉండాలి. అంటే జాతికి మేలు జరగాలి. కానీ జరుగుతున్న మేలు విదేశీ కంపెనీలకు, చైనా పెట్టుబడిదారులకు మాత్రమే. పశ్చిమ సామ్రాజ్యవాదులతో సర్దుబాట్లు చేసుకుంటూ చైనాలో దోపిడి వర్గం అభివృద్ధి అయింది. ఈ సర్దుబాట్ల సారాంశం చైనా కార్మికవర్గ దోపిడి మాత్రమే.

  తమ కొనుగోలు శక్తి పెరిగిందని చైనా ప్రజలు భావించడం లేదు. అక్కడ ప్రతి యేడు లక్షల సంఖ్యలో కార్మికుల ఆందోళనలు వివిధ రూపాల్లో జరుగుతున్నాయి. వాటిలో అధికం విదేశీ కంపెనీల్లోనే జరుగుతున్నాయి. అనేకమంది ఒత్తిడి భరించలేక ఆత్మహత్యలకు పాల్పడడమూ అక్కడ పరిపాటి అయింది.

  * మన ఊహల్ని బట్టి శ్రమల ఖరీదు ఆధారపడి ఉండదు. ఒక దేశంలో శ్రమ ఖరీదును నిర్ణయించేది అక్కడ ఉన్న సామాజికార్ధిక పరిస్ధుతులే. ఆధిపత్యంలో ఉన్న ఆర్ధిక వర్గాలు (అనగా చైనా పెట్టుబడిదారీ వర్గం) ఆర్ధిక గతిని నిర్ణయిస్తాయి. వారి అవసరాల మేరకే వివిధ అంశాలు నిర్ణయం అవుతాయి. కార్మికవర్గం అధికారం చేజిక్కించుకుంటే (సోషలిస్టు, నూతన ప్రజాస్వామిక విప్లవాలు విజయవంతం అయితే) పరిస్ధితి దీనికి భిన్నం అవుతుంది. చట్టాలు, నియమాలు, సంస్కృతి అన్నీ కార్మికవర్గం (అనగా శ్రమ చేసేవారు) కోసమే తయారవుతాయి. మరొకరి శ్రమను దోచుకునే అవకాశాలు రద్దవుతాయి.

  ఈ అంశాలను ఇప్పుడు ఇండియాలో ఉన్న సామాజిక పరిస్ధితుల నేపధ్యంలో చూస్తే ‘అది సాధ్యమా?’ అనిపిస్తుంది. చైనా, రష్యాలు సాధ్యం చేసి చూపాయి. కార్మికవర్గ అధికారం స్ధిరపడే లోపు పార్టీ, ప్రభుత్వాలలోకి వివిధ రూపాల్లో బూర్జువా ధోరణి ప్రవేశించి ఏకు మేకై పార్టీని, ప్రభుత్వాన్ని వశం చేసుకున్నాయి. వీటిని వివరించడానికి మన మధ్య కామన్ గ్రౌండ్ లేకపోవడం సమస్య.

  * అంతర్గత వ్యవహారం ఏమిటండీ? వాళ్లెం చేస్తే మనకెందుకు అనా మీరడగడం? రాజ్యం అనే శక్తి యూనివర్సల్. ఏ దేశంలోనైనా అది ఒకటే. అలాగే కార్మికవర్గం కూడా యూనివర్సల్. వారి ప్రయోజనాలు అన్నీ దేశాల్లో ఒకటే. సార్వజనీన అంశాలను అంతర్గతం అన్న దృష్టితో చూడడం ఏమిటో నాకు అర్ధం కాలేదు.

 4. చైనా, రష్యాలు సాధ్యం చేసి చూపాయి. కార్మికవర్గ అధికారం స్ధిరపడే లోపు పార్టీ, ప్రభుత్వాలలోకి వివిధ రూపాల్లో బూర్జువా ధోరణి ప్రవేశించి ఏకు మేకై పార్టీని, ప్రభుత్వాన్ని వశం చేసుకున్నాయి. వీటిని వివరించడానికి మన మధ్య కామన్ గ్రౌండ్ లేకపోవడం సమస్య.
  ఇది నిజం నేను అభ్యాసకుడుని(లెర్నర్).నేను అడిగే విషయాలలో చాలామటుకు తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతో అడుగుతున్నవే.విషయంపై పూర్తీ అవగాహనతో నిర్నయాలు తీసుకొని అడుగుతున్నవికాదు!బహుశా భవిష్యత్తులో ఆదశకు రావచ్చును!విషయావగాహనకు మీబ్లాగ్ చాలా ఉపయోగపడుతుంది!
  నేనడిగే ప్రశ్నలకు మీరు ఓపికగా సమాధానాలు ఇస్తున్నందుకు కృతజ్ఞతలు!!
  మరోసారి అడుగుతున్నందుకు మీరు మన్నించాలి!
  రాజ్యం ఎప్పుడూ భూమిపై హక్కులను కలిగే ఉంటుంది కదా!ఇది పూర్తిగా ఆదేశ అంతర్గత వ్యవహారం(భూములు కోల్పోయిన వారికి ఎటువంటి పరిహారం కల్పించాలో మనం ఎలా నిర్నయిస్తాం!)
  పరిహారం ఎలా కల్పించాలనేది ఈ దేశవ్యవహారంకదా!ఇది ఒక్కోదేశంలో ఒక్కోవిధముగా ఉండొచ్చు!అందులో కొన్ని సారూప్యతలు ఉండొచ్చు!మరికొన్ని వ్యషమ్యాలు ఉండొంచ్చు.అంతమాత్రాన అది ఇలానే ఉండాలని మనం ఇక్కడకూర్చోని ఎలా చెప్పగలం?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s