‘నిన్ను ఎన్ కౌంటర్ చేసేస్తా’ ఇది పోలీసు సినిమాల్లో తరచుగా వినపడే పదం. ఎన్ కౌంటర్ చేయడాన్ని వీరోచితకార్యంగా సినిమాలు వాడుకలోకి తెచ్చాయి. ‘ఎన్ కౌంటర్ స్పెషలిస్టు’ అనే బిరుదు కొందరు పోలీసులకు పత్రికలు తగిలించడం మొదలై చాలాకాలమే అయింది. వీటన్నింటి మూలంగా ఎన్ కౌంటర్ చెయ్యడం పోలీసుల విధి, కర్తవ్యం, బాధ్యత… ఇత్యాదిలాగా పరిస్ధితి తయారయింది. ఆంద్ర ప్రదేశ్ మాత్రమే కాదు, దాదాపు పోలీసులు, సైన్యంలకు ఆధిపత్యం అప్పగించి పాలన సాగించే ప్రతి చోటా ఈ పరిస్ధితి నెలకొని ఉంది. ఉదాహరణకి: జార్ఖండ్, ఛత్తీస్ ఘర్, ఈశాన్య రాష్ట్రాలు, కాశ్మీర్ లోయ మొ.వి.
కానీ చట్టం ఇందుకు పూర్తి విరుద్ధంగా చెబుతుంది. ఎన్ కౌంటర్ అంటే ‘ఎదురు దాడి’ అని అందరికి తెలిసినా దానిని అన్వయించుకోవడంలోనే పొరబాటు దొర్లుతోంది. పోలీసులు విధి నిర్వహణలో ఉన్నపుడు నేరస్ధులు వారిపై ఆయుధాలతో దాడి చేస్తే ఆత్మ రక్షణ కోసం పోలీసులు ఎదురు దాడి చేయవచ్చని చట్టాలు చెబుతున్నాయి. ఈ ఎదురు దాడి అనేది అవతలి నుండి ఎదురయ్యే దాడి ఏ నిష్పత్తిలో ఉన్నదో ఆ నిష్పత్తిలోనే ఉండాలి తప్ప ప్రాణాంతకంగా ఉండరాదని చట్టాలకు సుప్రీం కోర్టు ఇచ్చిన అన్వయం చెబుతోంది.
ఉదాహరణకి మొన్న ఎర్ర చందనం కూలీలు రాడ్లు, రాళ్ళు, కొడవళ్ళు తమపైకి విసిరారని ఆత్మ రక్షణ కోసం తాము కాల్పులు జరిపామని పోలీసులు చెప్పారు. ఈ కాల్పుల్లో ఏకంగా 20 మంది చనిపోయారు. రాళ్ళు కొడవళ్ళు విసిరితే సంబంధిత గాయం అయిన పోలీసు ఒక్కరూ లేరు. కాగా రాళ్ళు, కొడవళ్ళు విసిరేవారిపై కాల్పులు జరపడం సమర్ధనియం కాజాలదు. ఇది సుప్రీం కోర్టు తీర్పులకు విరుద్ధం. ప్రాణాపాయం లేని దాడికి ప్రాణాపాయం కలిగించేలా కాల్పులు జరపడం ఇంకేదైనా అవుతుంది కానీ ఎన్ కౌంటర్ మాత్రం కాదు. ఆ ‘ఇంకేదైనా’ ఏమిటన్నది సుప్రీం కోర్టు వివిధ తీర్పుల సందర్భంగా స్పష్టంగా చెప్పింది.
పోలీసుల ఎదురు కాల్పుల్లో అవతలి వ్యక్తి చనిపోతే పోలీసులపై మొదట హత్య కేసు నమోదు చేయాలి. తన ప్రాణానికి ప్రమాదం వచ్చినందునే ఎదురు కాల్పులు జరపడం వలన మరణం సంభవించిందని పోలీసులు రుజువు చేసుకోవాలి. లేనట్లయితే అది శిక్షార్హమైన హత్యా నేరం అవుతుంది. ఈ అంశాన్ని సుప్రీం కోర్టు అనేకసార్లు చెప్పింది.
క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 46 ప్రకారం తన వ్యక్తిగత రక్షణ కోసం పోలీసులు బలప్రయోగం చేయడం నేరం కాదు. కానీ ఆ పేరుతో “మరణ శిక్ష లేదా జీవిత కాల శిక్ష వేయదగిన నేరానికి పాల్పడని వ్యక్తి చనిపోయెందుకు కారకులు కావడానికి పోలీసులకు హక్కు లేదు” అని సెక్షన్ 46 చెబుతుంది (ది హిందు, ఏప్రిల్ 9).
ఓం ప్రకాష్ వర్సెస్ స్టేట్ ఆఫ్ జార్ఖండ్ కేసులో సుప్రీం కోర్టు “ట్రిగ్గర్-హ్యాపీ” పోలీసులకు హెచ్చరిక జారీ చేసింది. “పోలీసు అధికారుల విధి నేరస్ధులను, వారు కరుడు గట్టిన నేరస్ద్ధులైనా సరే, చంపడం కాదు. పోలీసు విధి నిందితుడిని అరెస్టు చేసి విచారణకు తేవడం. ఇందులో అనుమానం అనేదే లేదు. అటువంటి హత్యలను నివారించి తీరాలి. మన నేర న్యాయ పాలనా వ్యవస్ధ వాటిని చట్టబద్ధమైనవిగా గుర్తించలేదు. అవి రాజ్యం ప్రోత్సహించే ఉగ్రవాదం అవుతుంది” అని సర్వోన్నత న్యాయ స్ధానం స్పష్టం చేసింది.
నేరస్ధులతో వ్యవహరించడం అంత తేలికైన పని కాదని అయినప్పటికీ వారిని చంపడానికి అది కారణం కారాదని ఇటీవల చెప్పిన తీర్పులోనూ సుప్రీం కోర్టు పేర్కొంది. ఎన్ కౌంటర్ హత్యలపై 2014 లో ఇచ్చిన తీర్పులో సుప్రీం ఇలా చెప్పింది, “భారత దేశంలో పోలీసులు కష్టమైన, సున్నితమైన కర్తవ్యం నిర్వహించాల్సి ఉంటుందన్న నిజాన్ని మేము విస్మరించడం లేదు. ముఖ్యంగా సంఘటిత ముఠాలు కలిగి ఉన్న అనేకమంది కరుడుగట్టిన నేరస్ధులు, తీవ్రవాదులు, ఉగ్రవాదులు, మాదకద్రవ్య అక్రమ రవాణాదారులు, స్మగ్లర్లు సమాజంలో శక్తివంతంగా పాదుకునిఉన్న పరిస్ధితిని మేము విస్మరించడం లేదు. అయినప్పటికీ అటువంటి నేరస్ధులను పట్టుకుని చట్టానికి అప్పగించే బాధ్యతను చట్టబద్ధ పద్ధతుల్లోనే సమర్ధవంతంగా, ప్రభావవంతంగా పోలీసులు నిర్వహించాలి” అని సెప్టెంబర్ 23, 2014 తేదీన వెలువరించిన తీర్పులో అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎం.లోధా, జస్టిస్ రోహింటన్ నారీమన్ లు పేర్కొన్నారు.
1995 నుండి 1997 వరకు ముంబైలో జరిగిన 99 ఎన్ కౌంటర్లలో 135 మంది మరణించిన ఘటనలపై పౌర హక్కుల సంస్ధ పియూసిఎల్ దాఖలు చేసిన వివిధ ప్రజా ప్రయోజనా వ్యాజ్యాలను విచారిస్తూ సుప్రీం ధర్మాసనం ఈ మాటలు చెప్పింది. మన రాష్ట్రంలోనైతే పౌర హక్కుల సంఘం నేతలను సైతం ఎన్ కౌంటర్ చేసేయడంలో పోలీసులు పేరెన్నికగన్నారు.
“తాము తమ పై అధికారులు లేదా రాజకీయ నాయకుల ఆదేశాలు మాత్రమే పాటిస్తున్నామన్న సాకుతో ‘ఎన్ కౌంటర్’ పేరుతో పోలీసులు హత్యకు పాల్పడడాన్ని క్షమించలేము. గౌరవంతో బ్రతికే హక్కు అందరికీ వర్తిస్తుంది. ప్రతి ఒక్క ఎన్ కౌంటర్ కేసునూ సంపూర్ణంగా విచారించి నిగ్గు దేల్చవలసిన అవసరం ఉంది” అని పై తీర్పు పేర్కొంది.
2003 నాటి జాతీయ మానవ హక్కుల సంఘం తీర్పును ఉటంకిస్తూ ఎన్ కౌంటర్ అనంతరం పాటించవలసిన ప్రక్రియను సుప్రీం కోర్టు తీర్పు నిర్దేశించింది. ఎన్ కౌంటర్ కు పాల్పడడంతోనే ఏ పోలీసు అధికారికీ వరుస తప్పి ప్రమోషన్ ఇవ్వడం గానీ, గ్యాలంట్రీ అవార్డు ఇవ్వడం గానీ జరగకూడదని ఎన్.హెచ్.ఆర్.సి స్పష్టం చేసిన సంగతిని సుప్రీం ఉటంకించింది. సి.బి.ఐ లాంటి స్వతంత్ర(!) సంస్ధతో ఎన్ కౌంటర్ పై విచారణ చేయించాలని నిర్దేశించింది. ఆ విచారణ కూడా శాస్త్రయుతంగా, ప్రతి అంశాన్నీ అక్షరబద్ధం చేస్తూ, నిర్ణయాత్మకంగా జరగాలని నిర్దేశించింది. సదరు విచారణ మళ్ళీ మేజిస్టీరియల్ ఎంక్వైరీకి అందుబాటులో ఉండాలని, విచారణ తీరుపై ఎలాంటి అసంతృప్తి ఉన్నా దానిని సెషన్స్ జడ్జి ముందు సవాలు చేసే అవకాశం ఉండాలని సుప్రీం పేర్కొంది.
గుజరాత్ లో అప్పటి ముఖ్యమంత్రి మోడి పాలనలో వరుసగా జరిగిన ఎన్ కౌంటర్లకు బాధ్యులుగా అనేక నెలలు జైలులో గడిపిన డి.జి.వంజార లాంటి ఉన్నత పోలీసు అధికారులు తాము రాష్ట్ర ప్రభుత్వ బాధ్యులు చెప్పినట్లుగానే నడుచుకున్నామని, ఆచరణలో ఉన్న ప్రక్రియలనే అనుసరించామని బహిరంగంగా చెప్పడం ఈ సందర్భంగా గుర్తుకు చేసుకోవచ్చు. నరేంద్ర మోడి ప్రధాని అయిన వెంటనే ఎన్ కౌంటర్ కేసుల్లోని నిందితులందరూ వరుసగా ఒకరి వెంట ఒకరుగా బెయిల్ పై విడుదల అయ్యారు.
సుప్రీం కోర్టు ఎన్ని సుద్దులు చెప్పి ఏమిటి ప్రయోజనం?!
స్వప్నిక, ప్రణీతలపై జరిగిన యాసిద్ దాడిలోని నిందితుల్ని ఎన్‌కౌంతర్ పేరుతో చంపినపుడు నేను ఆ ఎన్‌కౌంతర్‌ని వ్యతిరేకించాను. పది మంది నేరస్తుల్ని వదిలేసి ఒకరిద్దరు నేరస్తుల్ని చంపితే నేరాలు తగ్గవు. యాసిద్ దాడి నిందితుల ఎన్‌కౌంతర్ తరువాత రాష్ట్రంలో యాసిద్ దాడులు పెరిగినాయి తప్ప తగ్గలేదు.
మనది ఆచరణ లేని రాజ్యాంగం.
ఎన్ కౌంటర్ అనేది ప్రభుత్వానికి మాత్రమె ఉన్న చట్ట విరుద్ధమైన హక్కు