రాజకీయ శాస్త్రవేత్త, ఆర్ధికవేత్త, న్యాయ నిపుణులు, సామాజిక సంస్కరణవేత్త, భారత రాజ్యాంగ నిర్మాత, ఓ పురుష నేత (a leader of men): డా. బి.ఆర్.అంబేద్కర్ వైవిధ్యభరిత ఆసక్తులతో, బహుళముఖ వ్యక్తిత్వంతో వర్గీకరణవాద మరియు విభజనవాద ప్రయత్నాలను ధిక్కరిస్తారు. అయితే పేద, బలహీన వర్గాల ప్రజలను ఉద్ధరించేందుకు ఒంటి చేతితో కృషి చేయడం ద్వారా ఆయన తన జీవితకాలంలో స్ఫూర్తిదాయక వ్యక్తిగా, జీవితానంతర దశాబ్దాలలో జాతీయ ఆదర్శ ప్రతిమగా అవతరించారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ తో అనంతర కాలంలో విభేదాలు తలెత్తినప్పటికీ, సామాజిక విద్వేషము మరియు కుల విభజనకు బద్ధ వ్యతిరేకి అయినప్పటికీ తమ తమ రాజకీయ సమీకరణ వ్యూహాలలో భాగంగా, అంబేద్కర్ వారసత్వాన్ని స్వాయత్తం చేసుకోవాలని కాంగ్రెస్, బి.జె.పిలు రెండూ కోరుకుంటున్నాయి. అంబేద్కర్ 125వ జయంతి సంవత్సరాన్ని పురస్కరించుకుని ఈ రోజు నుండి సంవత్సరం పాటు ఉత్సవాలు జరపాలని రెండు పార్టీలు పధకాలు రచించాయి.
అంబేద్కర్ వారసత్వం తమదే అని కాంగ్రెస్ చెప్పుకోవడం వివాదాస్పదమే అయినా కొత్తదేమీ కాదు. అయితే ఆయన జయంతి సందర్భంగా విస్తృతంగా సంబరాలు నిర్వహించాలని బి.జె.పి నిర్ణయించడం బట్టి ఆయన జీవితం, కృషిల పట్ల ఆ పార్టీ వైఖరిలో మార్పు వచ్చిందని స్పష్టం అవుతోంది. అయితే, తమ వైఖరిలో వచ్చిన మార్పును అంబేద్కర్ పట్ల తమ సొంత చూపులో వచ్చిన మార్పుగా ప్రదర్శించడానికి బదులుగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఎంపిక చేసుకున్న బోధనల ప్రకారం అంబేద్కర్ ను హిందూ జాతీయవాదిగా ముందుకు తెచ్చేందుకు ఉద్యుక్తం అయినట్లు కనిపిస్తోంది. 1956లో ఆయన బౌద్ధ మతాన్ని స్వీకరించడం, హిందూయిజం లోని కులాల నిచ్చెనల దొంతరల అణచివేతను ఆయన తీవ్రంగా వ్యతిరేకించడం… ఇవేవీ ఆర్.ఎస్.ఎస్ కు పట్టింపు ఉన్నట్లు కనిపించడం లేదు. సంస్ధ సహాయ కార్యదర్శి కృష్ణ గోపాల్, అంబేద్కర్ కూ, హిందూ జాతీయవాదానికి మధ్య ఉన్నాయని చెప్పే కొన్ని సాపత్యాలను ప్రధానం చేస్తూ ఒక పుస్తకాన్ని వెలికి తెచ్చారు. ఆర్యన్ దాడి సిద్ధాంతాన్ని, ఇస్లాం లోకి మారడాన్నీ ఆయన వ్యతిరేకించడాన్ని ఆయన ఎత్తి చూపారు.
అంబేద్కర్ రాజకీయ వారసత్వాన్ని స్వాయత్తం చేసుకునే ప్రయత్నాలన్నింటికీ, దళితుల ఓట్లను స్ధిరపరచుకునే ప్రయత్నమే కేంద్ర బిందువు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా లాంటి దళిత ప్రాతినిధ్య పార్టీలు బి.జె.పితో కూటములు కట్టాయి. కానీ ప్రస్తుతం బి.జె.పి కేంద్రీకరణ అంతా దళితులను నేరుగా తమ పార్టీ కిందికి తెచ్చుకోవడం లాగా కనిపిస్తోంది. అంబేద్కర్ జీవితం, కృషిలను ప్రతిబింబించే స్మారకాలు, విగ్రహాలు, స్మారక పుస్తకాలు… ఇవన్నీ ఈ ప్రయత్నంలో భాగంగా స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ విషయంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాల నిర్వహణ దళిత సమూహాల్లో ఆ పార్టీకి ఉన్న ఆదరణ తుడిచిపెట్టుకుపోకుండా కాపాడుకోవడానికే ఉద్దేశించబడ్డాయి. దళితులను ఒక రాజకీయ శక్తిగా సమీకరించే ప్రయత్నాలు (కొన్ని పార్టీలకు) విజయవంతమైనాయనడానికి రుజువులు ఉన్న దరిమిలా అంబేద్కర్ వారసత్వం కోసం పోటీ మరింతగా పెరిగింది. కానీ ఇవేవీ భారత రాజకీయ యవనికపై సామాజిక న్యాయము, సామాజిక ప్రజాస్వామ్యాలకు సంబంధించిన అంబేద్కర్ దృక్పధాలకు మరింత చోటు దక్కించే విధంగా లేవు. రాజకీయ వర్గాల్లో అంబేద్కర్ పట్ల ఆరాధన, దేశ నిర్మాణంలో ఆయన పాత్రకు గుర్తింపు మరింతగా పెరిగిపోతుండగా ఆయన భావాలు యధావిధిగా ఆమోదానికి నోచుకోకపోవడమే విచారకరం. ఈ విషయంలో ఆయన మహాత్మా గాంధీతో పాటే ఉన్నారు -ఆరాధిస్తారే గానీ వారి ఆలోచనలను అనుసరించేవారు ఉండరు.
అంబేద్కర్ వారసత్వానికి పోటీ పడడంద్వారా కాంగ్రేస్,బి.జె.పి లు మరోనాటకానికి తెరతీశాయి.
తరతరాలుగా పీడితజనబాహుల్యానికి ఎంతోకొంత న్యాయం చేయడానికి అంబేద్కర్ నేతృత్వంలోని ముసాయిదాకమిటి మరియు భారతరాజ్యాంగ నిర్మాతలు కృషిచేస్తే,తన ఏలుబడిలో కాంగ్రేస్ సమజ అంతరాలను తగ్గించవలసింది పోయి వారిని ఓటు బ్యాంకుగా చూస్తూ ఆనాటి భావజాలానే ఇంకా సమాజంలో కొనసాగడానికి ప్రత్యక్షంగా తోడ్పడింది.
ఆ కాంగ్రేస్ పార్టీ అంబేద్కర్ వారసత్వానికై పోటీపడడం ఏమిటి? ఇది నీచారాజకీయాలకు పరాకాష్టా.
వారు చెప్పుకొనే హిదుత్యభావజాల అజెండాయే ప్రధానాంశాలుగా రాజకీయాలు నడుపుతున్న బి.జె.పి,హిందూమతాన్ని/భావజాలాన్ని తిరస్కరించి భౌద్దమతాన్ని స్వీకరించడంద్వారా(తన జీవిత చరమాంకంలో) అంబేద్కర్ తనమతాన్ని భవిష్యత్తులో రాజకీయాలకు వాడుకొంటారన్న ఆలోచనలకు ముందేవచ్చారేమోనని అనిపిస్తూ ఉంటుంది!
అంబేద్కర్ వారసత్వాన్ని బి.జె.పి నెత్తినెత్తుకోవడం తన భావజాలాలలో దిగజారుడుతనానికి నిదర్శనం..