స్వామి గొంతు మారింది, బి.జె.పి నోరు జారింది


Modi Hollande

రాఫెల్ ఫైటర్ జెట్ విమానాల కొనుగోళ్లపై నిప్పులు చిమ్ముతున్న స్వామి తీరా ఒప్పందం కుదిరి ప్రధాని సంతకం అయ్యాక పాక్షికంగా వెనక్కి తగ్గారు.

ప్రధాని గనక ఒప్పందం కుదుర్చుకోవడంలో ముందుకు వెళ్తే కోర్టుకు వెళ్ళడం తప్ప తనకు మరో మార్గం లేదని కూడా ఆయన హెచ్చరించారు.

అలాంటిది ఫ్రాన్స్ పర్యటన మొదటి రోజే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంషా ఒలాండే తో కలిసి ‘పడవ పై చర్చ’ జరిపి 36 జెట్లను రెడీగా ఉన్నవి కొనుగోలు చేయాలని ప్రధాని ఒప్పందం కుదిరినా స్పందన లేదు. కేసు పెడతానన్న వ్యక్తి తాను ఇంకా ఆలోచించలేదని చెబుతున్నారు.

“కోర్టుకు వెళ్లాలా లేదా అన్న అంశంపై నేనింకా నిర్ణయం తీసుకోలేదు. రాఫెల్ డీల్ కు సంబంధించిన పత్రాల కోసం ఎదురు చూస్తున్నాను” అని కోర్టు కేసుపై తాను చేసిన ప్రకటనను తేలిక చేశారు.

అయితే కొనుగోళ్లను బహిరంగంగా విమర్శిస్తూ స్వామి ముందుకు వచ్చారు. మోడి ఒప్పందం ‘ఇష్టా రాజ్యం’గా చేసిన ఒప్పందంగా ఆయన అభివర్ణించారు.

“ప్రాధమిక పరిశీలనలో ఈ ఒప్పందం ఇష్టా రాజ్యంగా, పరిశీలన లేకుండా జరిగినదిగా కనిపిస్తోంది” అని స్వామీ విమర్శించారు. లిబియా, ఈజిప్టులలో రాఫెల్ యుద్ధ విమానాలు అత్యంత పనికిరానివిగా రుజువైందని ఆయన చెప్పారు.

మరోవైపు 36 జెట్ల కొనుగోలు తమ ప్రభుత్వం సాధించిన అతిపెద్ద విజయంగా ప్రధాని మోడి అభివర్ణించారు. భారత దేశ అమ్ముల పొదిలోని యుద్ధ విమానాలు బాగా తగ్గిపోతున్నాయని, అనేక విమానాలు పాతబడి విఫలం అవుతున్న పరిస్ధితుల్లో కొత్త విమానాల కోసం భారత్ ప్రయత్నిస్తోంది.

రాఫెల్ కొనుగోళ్ల ఒప్పందం వెనక్కి పోయి అది సాకారం అవుతుందా లేదా అన్న అనుమానాలు వ్యాపించిన నేపధ్యంలో కొనుగోలును మోడి ‘తమ విజయం’గా చెప్పుకున్నారు. ఒప్పందం చేసుకుంది యు.పి.ఏ కాగా అది ఎన్.డి.ఏ విజయం ఎలా అవుతుంది? అయితే గియితే, ఎన్.డి.ఏ-యు.పి.ఏ ల ఉమ్మడి విజయం అవుతుంది గాని!

యు.పి.ఏ, ఎన్.డి.ఏ పాలకవర్గాల విజయంతో పాటు ఇది ఫ్రాన్స్ విజయం కూడా. అమెరికా, బ్రిటన్, జర్మనీ, రష్యాల కంపెనీలతో పోటీపడి కాంట్రాక్టు గెలుచుకుంది గనుక అది ఫ్రాన్స్ కంపెనీకీ విజయం. పైగా పనికిరానివిగా స్వామి చెబుతున్న విమానాలను మనకు అంటగట్టడం నిజమే అయితే నిస్సందేహంగా అది ఫ్రాన్స్ విజయమే.

విజయం కానిది ఎవరికి అంటే భారత ప్రజలకే. జెట్ ల కొనుగోలుకు ఇచ్చే సొమ్ము భారత ప్రజలది. శ్రమ చేసి సంపదలను తీసే శ్రామికులది. ఆ సంపద కాస్తా వారికి దక్కకుండా ఎక్కడో ఫ్రాన్స్ ఆయుధ కంపెనీకి అప్పజెప్పడం భారత ప్రజల అపజయం.

మరి రక్షణ ఎలా, అంటారా? రక్షణ కోసమే ఆయుధాలు కొనుగోలు చేస్తే అది మంచిదే. కానీ రక్షణ కోసం ఆయుధాలు కొనుగోలు చేస్తే అది 15 యేళ్లుగా సాగుతూ పోతుందా? ఇప్పుడు వస్తుందని చెప్పిన ప్రమాదం 15 యేళ్ళ వరకూ, మనం ఆయుధాలు కొనుక్కునేవరకూ ఆగుతుందా? ఆయుధాల కొనుగోలులో దేశ రక్షణ లేదని తెలిసేందుకు ఈ మాత్రం చాలదా?

దేశ రక్షణ ప్రజల దేశ భక్తి, వారి జాతీయ భావాలు, నిబద్ధతలో ఉంటుంది తప్ప ఆయుధాలలోనూ సరిహద్దులోనూ కాదు. ఉదాహరణకి యెమెన్ చూడండి హౌతీల సైన్యం చాలా చిన్నది. వారి దెబ్బకు అమెరికాయే తన మిలట్రీ స్ధావరాన్ని ఖాళీ చేయాల్సి వచ్చింది.

పెట్రో డాలర్లతో తెగబలిసిన సౌదీ అరేబియా సరిగ్గా ఇలాంటి జెట్ ఫైటర్ల తోనే బాంబుల వర్షం కురిపిస్తున్నా హౌతీ సైన్యం పురోగమిస్తున్నదే గానీ వెనక్కి తగ్గలేదు. అమెరికా నమ్మిన బంటు అయిన యెమెన్ అధ్యక్షుడు దేశం విడిచి పారిపోయే పరిస్ధితి కూడా వచ్చింది. అమెరికా మద్దతుదారుడిని ఆడేన్ దాకా తరిమి తరిమి కొట్టారు. చివరికి ఆడేన్ ను కూడా హౌతీలు వశం చేసుకోవడంతో ఆయన దేశం విడిచి పారిపోయారు. ప్రజల్లో హౌతీలకు గల మద్దతు అమెరికాపై గల వ్యతిరేకత  యెమెన్ కు రక్షణ కవచం అయింది.

ఉక్రెయిన్ నుండి అటానమీ కోరుతున్న డాన్ బాస్ ఏరియా (తూర్పు ఉక్రెయిన్ ప్రాంతం) కూడా ఉక్రెయిన్ బలగాలను తరిమి కొట్టడంలో విజయం సాధించాయి. ఆ దేశాధ్యక్షుడే స్వయంగా ఓటమిని అంగీకరించాడు. ఈ యుద్ధం నిజానికి అమెరికా రేపినది. డాన్ బాస్ లోని పారిశ్రామిక ఆదాయంపై తన నియంత్రణ ఉండాలని, వూహాత్మకంగా కీలక ప్రాంతంలో ఉన్న తూర్పు ఉక్రెయిన్ రష్యా ప్రభావంలో ఉండకూడదన్న ప్రధాన లక్ష్యంతో రెండేళ్లుగా ఉక్రెయిన్ లో అమెరికా చిచ్చు పెట్టింది. ఉక్రెయిన్ సైన్యానికి ఆయుధాలు ఇచ్చింది. అత్యాధునిక శాటిలైట్ లతో గూఢచార సమాచారం అందజేసింది. మలేషియా విమానాన్ని కూల్పించి తూర్పు ఉక్రెయిన్ పై దుష్ప్రచారం చేయించింది. ఏ సాక్ష్యం లేకుండానే కూల్చింది రష్యానే అని నాటో సర్వ సైన్యాధ్యక్షుడు సైతం ఆరోపణలు చేశాడు. అయినా తూర్పు ఉక్రెయిన్ ప్రజల కృత నిశ్చయం, నిబద్ధతల ముందు అత్యాధునిక ఆయుధాలు ఏమీ చేయలేక తలవంచుకుని వెళ్ళాయి. లేదా కూలి మట్టిలో కలిశాయి.

ఇలాంటి ఉదాహరణలు చరిత్రలో చాలానే ఉన్నాయి. మనం తెలుసుకోవలసింది ఏమిటంటే ఆయుధాల కొనుగోళ్ళు జరిగేది దేశాల రక్షణ కోసం కాదు. అది ఆయుధ కంపెనీల లాభాల కోసం జరుగుతాయి. అవి కొంటే రాలి పడే ఎంగిలీ దళారీ మెతుకుల కోసం జరుగుతాయి. అనగా కమిషన్ల కోసం జరుగుతాయి. అగ్రరాజ్యాల భౌగోళిక రాజకీయ వ్యూహాలలో భాగంగా జరుగుతాయి. ఈ కొనుగోళ్లలో రక్షణ కోణం ఉండడం చాలా తక్కువ.

ఆ డబ్బు జనానికి పెడితే బోలెడు ప్రయోజనం. రైతుల ఆత్మహత్యలు తగ్గుతాయి. సొంతగా పరిశోధనలు జరిపి శాస్త్ర సాంకేతిక పురోగతి సాధించవచ్చు. కొత్త కంపెనీలు పెట్టి ఉపాధి పెంచవచ్చు. అప్పుల కోసం దేహీ అనడం తప్పుతుంది. పాలకులు ఎప్పుడూ చెప్పే ద్రవ్య లోటు అదృశ్యం అయిపోతుంది. బడ్జెట్ లో 20-25 శాతం రక్షణ పేరుతోనే ఖర్చు చేసేస్తారు. రక్షణ అంటే ఎవరూ నోరు తెరవరు కదా. పాక్ బూచిని చూపితే అసలే తెరవరు. ఆ విధంగా వేలాది కోట్లు వృధా అవుతుండగా కేవలం 4-5 శాతం ఉన్న ద్రవ్య లోటు పూడ్చడానికి సొంత కంపెనీల్ని అమ్మేస్తున్నాం. విదేశీ పెట్టుబడుల్ని ఆహ్వానిస్తున్నాం. బ్రిటిష్ వాడిని సాగనంపేందుకు ఆనాటి ప్రజలు చేసిన మహా ఉద్యమాలను, ప్రాణ త్యాగాలను అపహాస్యం చేస్తున్నాం.

ఈ రక్షణ మోసాన్ని ప్రజలు గుర్తెరిగి తగిన విధంగా స్పందించాలి.

7 thoughts on “స్వామి గొంతు మారింది, బి.జె.పి నోరు జారింది

  1. రక్షణ మోసాన్ని ప్రజలు గుర్తెరిగి తగిన విధంగా స్పందించాలి-ఇది పూర్తిగా తల,తోక లేని ఆశావాద దృక్పధం!
    ప్రజలెలా స్పందిస్తారు? మౌళికవసరాలెనెట్లా తీర్చుకోవాలో తిలియక సతమతమౌతుంటే ఇతరాత్రవిషయాలనెట్లా వారు గుర్తిస్తారు?
    వారినోటికాడ ఉన్న అన్నం తీసుకొనే రోజు వారు(ప్రజలు) తప్పక స్పందిస్తారు!అంతవరకు ఎదురుచూడడమే!కాదంటారా?

  2. రక్షణ ఖర్చు నిజంగా ఒక విధమైన redundancy(అతిరిక్తత). అమెరికా ఇందియాకి వ్యతిరేకంగా పాకిస్తాన్‌కి ఆయుధాలు అమ్ముతుంది, ఇందియాలో ఉద్రవాదం పెరిగితే అమెరికా ఇందియాకి ఆయుధాలు అమ్ముతుంది. పోర్తుగీస్‌వాళ్ళు ఒక వైపు విజయనగర రాజులకి తుపాకులు అమ్ముతూనే, అదే సమయంలో విజయనగర రాజుల శతృవులైన బీజాపుర్ సుల్తాన్‌లకి తుపాకులు అమ్మేవాళ్ళు. ఇప్పుడు యుద్ధ విమానాల వ్యాపారం తుపాకుల వ్యాపార స్థానాన్ని ఆక్రమించుకుంది.

  3. ఇది నా అవగాహన నుండి వచ్చిన అభిప్రాయాలు!ఎవరినీ ఉద్దేశించి(వ్యక్తిగతంగా) అన్నభావాలు కాదు!
    ఎన్నో కోలంలలో ఇటువంటి మాటలు చదివినతరువాత నాక ఏర్పడిన అభిప్రాయలు మాత్రమే!
    మౌలికంగా 50 ఏళ్ళనాటికీ ఇప్పటికీ పెద్దగా మార్పురాలేదని(ప్రజల ఆలోచనలలో) నా అభిప్రయం!
    ఈమద్యకాలంలో ఎమెర్జెన్సి కాలంలో మినహాయించి ప్రజలు తగిన విధంగా స్పంధించిన(దేశం మొత్తంకీ సంభందించి)సంధర్భం ఒక్కటీ లేదని నా అభిప్రాయం! అందుకే అలా స్పంధించాను!

  4. మాట్లాడితే మేక్ ఇన్ ఇండియా అంటారు కదా….యుద్ధ విమానాలు మన దగ్గర తయారు చేసేలా టెక్నాలజీ పెంచవచ్చు కదా…

  5. మూల గారు నిజమే జనం తమకిందకు నీళ్ళు వచ్చే దాకా స్పందించరు. బ్రిటీష్ వాళ్ళు దోపిడీకి మూడొందల ఏళ్ళ తర్వాత కాని ఉద్యమం రాలేదు. జనాలను నాయకులే కదిలించాలి. ఇప్పుడు కదలడం లేదంటే నాయకుల వైఫల్యమే…

  6. తులసి గారు, ఆంగ్లేయుల కాలంలో చాలా ప్రాంతాలు స్థానిక సంస్థానాధీశుల పాలనలో ఉండేవి. ఉదాహరణకి నిజాం హైదరాబాద్ సంస్థానంలో చాలా మందికి దేశం ఆంగ్లేయుల పాలనలో ఉండేదని తెలియదు. దేశంలో కరువు లాంటివి వచ్చినప్పుడు జనానికి సహజంగా పాలకులపై వ్యతిరేకత పెరిగేది. జనంలో ఆ వ్యతిరేకత లేకుండా చెయ్యడానికి ఆంగ్లేయులు కాంగ్రెస్‌ని స్థాపించడం, దక్షిణాఫ్రికా నుంచి గాంధీని తేవడం జరిగింది. కాంగ్రెస్‌నీ, గాంధీనీ అడ్డం పెట్టుకుని ఆంగ్లేయులు జనాన్ని అమాయకుల్ని చేసారు తప్ప అది సహజంగా లోపించిన చైతన్యం కాదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s