ప్రశ్న (రవిచంద్ర):
నేతాజీ మరణం నిజమేనా? ఆయన కుటుంబంపై మన ప్రభుత్వమే గూఢచర్యం నిర్వహించడం ఎందుకు? ఆయన దేశ భక్తుడు కారా?
సమాధానం:
యు.పి.ఏ, ఎన్.డి.ఏ ల కింద చేరిన పాలక వర్గ గ్రూపుల మధ్య వైరుధ్యం, వైరం కొత్త పుంతలు తొక్కుతున్నట్లు కనిపిస్తోంది. ఎన్నడో స్వతంత్రం వచ్చిందని చెప్పినప్పటి నాటి గూఢచార కార్యకలాపాలను పనిగట్టుకుని మరీ ఇప్పుడు వెల్లడి చేయడం, అది కూడా ఎంచుకున్నవి మాత్రమే వెల్లడి చేయడం వల్ల ఈ అనుమానాలు కలుగుతున్నాయి.
ఇండియా టుడే, న్యూస్ రూమ్ పోస్ట్ పత్రికల కధనం ప్రకారం నేతాజీ సుభాష్ చంద్ర బోస్ కుటుంబంపై ప్రధమ ప్రధాని నెహ్రూ ప్రభుత్వం రెండు దశాబ్దాల పాటు గూఢచర్యం నిర్వహించింది. 1948 నుండి 1968 వరకు ఈ గూఢచర్యం కొనసాగిందని నెహ్రూ ఆదేశాల ప్రకారమే ఇది జరిగిందని పత్రికలు వెల్లడించాయి. జవహర్ లాల్ నెహ్రూ 1964లో చనిపోయారు. ఆయన మరణం తర్వాత కూడా 4 యేళ్ళు గూఢచర్యం కొనసాగిందని అర్ధం అవుతోంది.
గూఢచర్యం ఎలా సాగింది? ఐ.బి (ఇంటలిజెన్స్ బ్యూరో) గూఢచారులు బోస్ కుటుంబ సభ్యులకు వచ్చే ఉత్తరాలు చదివేవారు. ఇంటికి చేరక మునుపే ఉత్తరాలు తెరిచి చదివే వారు. అవసరం అనుకుంటే కాపీ చేసుకునేవారు. ఆ తర్వాత యధావిధిగా ఉత్తరాలు ఇంటికి చేరవేసేవారు. బోస్ కుటుంబ సభ్యుల ప్రతి కదలికను అనుసరించేవారు. రహస్యంగా నీడలా వెంటాడేవారు. వారు ఎక్కడెక్కడికి వెళ్ళేదీ ఎప్పటికప్పుడు రికార్డు చేసేవారు.
కుటుంబ సభ్యులు ఇతర ప్రదేశాలకు వెళ్ళినా వారిని తప్పనిసరిగా అనుసరించేవారు. ఒక్క ఇండియాలోనే కాదు, వారు విదేశీ సందర్శనకు వెళ్ళినా వెంటాడేవారు. వారి కదలికలను, నివసించే చోట్లను, కలిసే మనుషులను, సంభాషణలను తెలుసుకునేవారు. విదేశాల్లోని వ్యక్తులతో జరిపిన సంభాషణలను రికార్డు చేసేవారు. వారి చర్చలపై ప్రత్యేకంగా కేంద్రీకరించేవారు. ప్రతి చిన్న వివరాన్ని కూడా వారు నమోదు చేసేవారని ప్రభుత్వం వెల్లడి చేసిన పత్రాల ద్వారా తెలుస్తోంది.
మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటన్, జపాన్ లు వైరి శిబిరాల్లో ఉన్న సంగతి తెలిసిందే. బ్రిటిష్ ఆక్రమణ నుండి దేశాన్ని విడ్పించడానికి బ్రిటన్ శత్రువైన జపాన్ తో చేతులు కలపడం ఒక మార్గం అని సుభాష్ చంద్ర బోస్ నమ్మారు. ఆ మేరకు అప్పటికే ఏర్పడి కొనసాగుతున్న ఇండియన్ నేషనల్ ఆర్మీ సంస్ధ నాయకత్వాన్ని స్వీకరించారు. ఆజాద్ హింద్ ఫౌజ్ గా నామకరణం కావించి జపాన్ సహాయంతో సైనిక శిక్షణ గరిపారు.
అయితే సోవియట్ సోషలిస్టు రష్యా చేతిలో జర్మనీ, మావో జెడాంగ్ నేతృత్వంలోని ఎర్ర సైన్యం చేతిలో జపాన్ చావు దెబ్బలు తినడంతో అక్షరాజ్యాలు కుప్ప కూలాయి. నేతాజీ నేతృత్వంలోని ఆజాద్ హింద్ హౌజ్ సేనలు వేలమంది బ్రిటిష్ సేనలకు లొంగి పోవలసి వచ్చింది. ఆ విధంగా పట్టుబడి ఎర్ర కోటలో విచారణ ఎదుర్కొన్న ఫౌజ్ నేతల తరపున వాదించినవారిలో ఆనాటి జాతీయోద్యమ నేత జవహర్ లాల్ నెహ్రూ కూడా ఒకరు.
ఉద్దండులు వాదించినప్పటికి ఫౌజ్ నేతలకు దేశబహిష్కార శిక్షను బ్రిటిష్ ప్రభుత్వం విధించింది. అయితే ఈ విచారణ ప్రక్రియ దేశంలో జాతీయోద్యమాన్ని మరింతగా రగలడానికి దోహదం చేసింది. ఫలితంగా దేశ బహిష్కార శిక్షను బ్రిటిష్ ప్రభుత్వం అమలు చేయలేకపోయింది. పట్టుబడినవారందరిని విడిచి పెట్టింది. ఆ సందర్భంలో నెహ్రూ-మౌంట్ బాటన్ ల మధ్య జరిగిన అధికార మార్పిడి ఒప్పందంలో ఆజాద్ హింద్ ఫౌజ్ సేనలను స్వతంత్ర భారత జాతీయ సైన్యంలో చెరకుండా నిషేదించాలన్న అంశాన్ని చేర్చారు. స్వతంత్రానికి ముందు బ్రిటిష్ విధించిన షరతుల్లో ఇది ఒకటి.
అప్పటికే బోస్ ఒక విమాన ప్రమాదంలో చనిపోయారు. ఆగస్టు 18 1945 తేదీన తైవాన్ (అప్పటికి అది జపాన్ ఆక్రమణలో ఉంది. ఫార్మోసా ద్వీపం అని పీచేవారు) ద్వీపకల్పం లోని తైపి నగరంలో ఓ మిలట్రీ స్ధావరం నుండి సోవియట్ రష్యాకు ఒక విమానం బయలుదేరింది. అది ప్రయాణ విమానం కాదు. బాంబర్ విమానం. దానినిండా సరుకులు నింపుకుని ప్రయాణిస్తున్నవారిలో బోస్ ఒకరు. ఆయనతో పాటు ఆయన సహాయకులు కూడా ఒకరిద్దరు ఉన్నారు.
బాంబర్ విమానం ఎగురుతుండగానే ఒక ఇంజన్ విమానం నుండి విడివడి కిందికి పడిపోయింది. దానితో విమానం కుడి పక్కకు ఒరిగి మరి ఎగరలేక కూలిపోయింది. బోస్ ఆయన సహాయకులు హాబీబూర్ రహమాన్ ప్రాణాలతో విమానంలో ఇరుక్కుపోయారు. వెనుక గేటు నుండి తప్పించుకోవడానికి చూస్తే అది లగేజీతో మూసుకు పోయింది. దానితో వారిద్దరు తగలబడిపోతున్న ముందు భాగంలోని మంటల గుండా పరుగెట్టుకుని వెళ్ళి బైటపడాలని నిశ్చయించారు. తమ నిర్ణయాన్ని అమలు చేశారు కూడా. అప్పటికే అప్రమత్తమైన గ్రౌండ్ సిబ్బంది మండుతున్న విమానంలో నుండి ఇద్దరు పరుగెట్టుకు రావడం చూశారట. వారిలో ఒకరు బాగానే ఉంటే మరొకరు ఒంటినిండా గాసోలిన్ తో తడవడం వల్ల వెంటనే మంటలు అంటుకుని తగలబడిపోతూ వచ్చారు. సిబ్బంది మంటలార్పి ఒక ట్రక్కునే అంబులెన్స్ గా మార్చి సమీప ఆసుపత్రికి చేర్చారు. అక్కడ డాక్టర్లు ప్రధమ చికిత్స, స్టెరిలైజేషన్ తదితర చర్యలు తీసుకుంటుండగానే బోస్ కోమాలోకి వెళ్ళి అనంతరం చనిపోయారు.
బోస్ మరణం గురించిన అధికారిక సమాధారం ఇది. అయితే ఈ సమాచారంను బోస్ అనుయాయులు నమ్మ లేదు. ఏదో కుట్ర జరిగిందని వారు గట్టిగా నమ్మారు.
బోస్ వాస్తవానికి విమానంలో సోవియట్ రష్యాకు వెళ్ళే ప్రయత్నంలో ఉన్నారు. స్టాలిన్ చేతుల్లో జర్మనీ ఫాసిజం చావు దెబ్బలు తినడం, సోవియట్ రష్యా బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేయడంతో తమ స్వాతంత్రం కోసం సోవియట్లు సాయం చేస్తారని ఆయన భావించారు. ఆ విషయమై సోవియట్ తో చర్చలు చేయడానికి బోస్ బయలుదేరగా ఆయనకు సాయం చేసేందుకు జపాన్ జనరల్ కూడా అందులో ఉన్నారు. సదరు జనరల్, పైలట్, కో పైలట్, మరొక అధికారి కూలిపోవడంలోనే చనిపోగా బోస్, హాబీబూర్ లు బతికి బైడపడ్డారు.
ఈ కధనంలో అనుమానించే ఘటనలు అనేకం ఉన్నాయి. అన్నింటికంటే ముఖ్యమైనది బాంబర్ విమానం ఎందుకు కూలింది? విమాన టేకాఫ్ అవుతుండగానే ఒక ఇంజన్ విమానం నుండి ఊడిపడిపోవడం ఎలా జరుగుంది, ఏదో విద్రోహ చర్య జరిగితే తప్ప? అన్నది అభిమానుల అనుమానాలు. ఇవి న్యాయబద్ధమైనవే కూడా.
ఎందుకంటే హిట్లర్ వైపు పని చేసినా సమ్మతమే గానీ సోవియట్ వైపు మొగ్గు చూపడం మహాపాపంగా పశ్చిమ సామ్రాజ్యవాద వలస రాజ్యాలు భావించేవి. బోస్ ప్రయాణాన్ని విఫలం చేయడానికి తద్వారా భారత దేశం ఈ దేశ జాతీయ బూర్జువాల చేతుల్లోకి పోకుండా చేయాలన్నది బ్రిటిష్-ఇతర పశ్చిమ-ఇండియన్ కుట్రదారుల కుట్ర కావచ్చు. కమ్యూనిజాన్ని పెను భూతంగా అప్పటికి పెట్టుబడిదారీ సామ్రాజ్యవాదులు విపరీతమైన దుష్ప్రచారాన్ని అప్పటికే ప్రారంభించారు.
సుభాష్ బోస్ మొదట కాంగ్రెస్ లోనే పని చేశారు. గాంధీ తదితర దళారీ ప్రతినిధులు డొమినియన్ స్వతంత్రం, పాక్షిక స్వతంత్రం లాంటి డిమాండ్లు పెడుతున్నప్పుడే సంపూర్ణ స్వరాజ్యాన్ని బోస్ లేవనెత్తారు. గాంధీతో తగవు పడ్డారు. అతి చిన్న వ్యయసులోనే రెండు సార్లు వరుసగా కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు కూడా. గాంధీతో విభేదాల వల్ల రాజీనామా చేసిన బోస్ ను బ్రిటిష్ హౌస్ అరెస్టు చేశారు. ఆయన తప్పించుకుని జర్మనీ వెళ్లారు. ఇండియాకు వచ్చి బ్రిటిష్ ను వెళ్లగొట్టాలని కోరారు. అందుకు మొదటి అంగీకరించినప్పటికీ యుద్ధంలో మారుతున్న పరిస్ధితుల రీత్యా జపాన్ వెళ్లాలని ఇరువురు (బోస్, జర్మనీ వ్యూహకర్తలు) తలంచారు. హిట్లర్ సమకూర్చిన సబ్ మెరైన్ లో మడగాస్కర్ వరకు వచ్చి అక్కడి నుండి జపనీస్ సబ్ మెరైన్ లోకి మారి మూడు నెలల పాటు జరిగిన సముద్ర ప్రయాణంలో బోస్ జపాన్ చేరారు. అక్కడికి వెళ్లడంతోనే ఆయన ఉతేజాపూర్వక ఉపన్యాసాలకు స్ఫూర్తి పొందిన ఐ.ఎన్.ఏ సైనికులు ఆయన నాయకత్వం ఉంటేనే తాము పనిచేస్తామని పట్టుబట్టారు.
బోస్ తాను అనుకున్నట్లుగా సోవియట్ కు సజీవంగా చేరి ఉంటే పరిస్ధితి ఇందుకు భిన్నంగా ఉండేది. ఒకవేళ సోవియట్ మద్దతుతో దళారీ బూర్జువాలకు బదులు జాతీయ బూర్జువాలు అధికారం చేపడితే అది నిజమైన జాతీయ స్వతంత్రం అయి ఉండేది కావచ్చు. కానీ చరిత్రలో వెనక్కి వెళ్ళి జరిగిన పరిణామాలు ఇంకోలా జరిగితే ఇప్పటి పరిస్ధితి ఎలా ఉండేది అని ఊహలకు దిగడం ఎప్పుడూ సమస్యలతో కూడి ఉంటుంది. అది వాదనానందానికి, తాత్కాలిక సంతృప్తికి ఉపయోగపడవచ్చు గాని ప్రయోజనం చాలా తక్కువ. మహా అయితే అధ్యయన పూరిత చర్చకు సహాయపడవచ్చు.
ఈ నేపధ్యంలో బోస్ చనిపోయారా లేదా అన్నది సమస్య కాజాలదు. ఆయన చేసిన కృషిని మాత్రమే మనం చూడాలి. ఆయన పట్ల కాంగ్రెస్ నాయకత్వం వ్యవహరించిన తీరును చూడాలి. మన దేశ స్వతంత్రానికి పాటుబడిన నేతను, ఆయన సైనికులను జాతీయ సైన్యంలో చేర్చుకోకుండా ఉండేందుకు అంగీకరించిన కాంగ్రెస్ పెద్దల దివాలాకోరుతునాన్ని గుర్తించాలి. భగత్ సింగ్ విషయంలో ఎలా అయితే గాంధీ ద్రోహం చేశారో అదే రీతిలో బోస్-ఐ.ఎన్.ఏ విషయంలో కాంగ్రెస్ నేతలు ద్రోహం చేశారు.
నేతాజీ నిన్న మొన్నటివరకు బ్రతికే ఉన్నారన్న ఆలోచన కంటే ఆయన కోరిన సంపూర్ణ స్వరాజ్యం మనం అనుభవిస్తున్నామా అన్నది ఆలోచించాలి. ఆయనను చంపేందుకు బ్రిటిష్ సామ్రాజ్యవాదం చేసిన కుట్రలను మనం గుర్తించాలి. కాంగ్రెస్ కు బోస్ నాయకత్వం వహించడం కంటే, గాంధీ-నెహ్రూల బృందమే నాయకత్వం వహించడం మేలని బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఎందుకు కోరుకున్నారో విచికిత్స చేయాలి. బోస్ కుటుంబ సభ్యులపై ఐ.బి గూఢచారులు సేకరించిన సమాచారాన్ని బ్రిటిష్ గూఢచార సంస్ధ MI6 తో నెహ్రూ ప్రభుత్వం పంచుకోవడం ఎవరి ప్రయోజనాల కోసమో నిలదీయాలి.
బోస్ దేశభక్తులు కారా అన్న ప్రశ్నకు గాంధీ ఒక స్నేహితురాలిని రాసిన ఉత్తరంలో తన సమాధానం చెప్పారు. “ఆయన నిస్సందేహంగా దేశభక్తుడే. కాకపోతే దారి తప్పారు.” అని. దారి తప్పారు అన్నది నిజమైతే ఏ దారి తప్పారు? అన్నది ప్రశ్న. కాంగ్రెస్ ఒక దారి ఎంచుకుంది. ఆ దారిలో దేశభక్తి సుతరామూ లేదు. పేరులోనే జాతీయత తప్ప స్వభావంలో లేనే లేదు. వారు చేసిందల్లా భారత ప్రజల బ్రిటిష్ వ్యతిరేక ఆగ్రహం వారు గీసిన హద్దు దాటకుండా చల్లబరచడం. ప్రజల ఉద్యమాన్ని, ఆగ్రహాని చూపి అధికారం తమ చేతికి ఇవ్వాలని బేరాలు ఆడడం. దేశ ఆర్ధిక మూలాలను బ్రిటిష్, ఇతర సామ్రాజ్యవాదుల చేతుల్లోనే కొనసాగింపజేస్తూ అధికార నిర్వహణను మాత్రమే స్వీకరించడం. ఇది సంపూర్ణ స్వతంత్రం కాదు. కనీసం అర్ధం స్వతంత్రం కూడా కాదు. కేవలం అధికార మార్పిడి మాత్రమే. అలాంటి వారు బోస్ కుటుంబం పైన గూఢచర్యం నెరపడంలో ఆశ్చర్యం ఏముంది?
పూర్వం భగవాన్‌జీ (గుమ్‌నామీ బాబా) అనే సన్యాసి ఉండేవాడు. గెడ్డం తీసేస్తే ఆయన సుభాష్ చంద్రబోస్‌లాగే ఉంటాడు. ఆయన హస్తలిపి సుభాష్ చంద్రబోసె హస్తలిపిని పోలి ఉండేది.(నాకు తెలిసినంత వరకు హస్తలిపిని ఫోర్జరీ చెయ్యడం సులభం కాదు) కానీ ఆయన DNA సుభాష్ చంద్రబోస్ కుటుంబ సభ్యులతొ మేచ్ అవ్వలేదు.
http://www.outlookindia.com/news/article/Gumnami-Baba-was-not-Netaji-DNA-test-report/230380
హాబీబూర్ రహమాన్ బ్రతికే ఉన్నారని(అప్పటికి) తెలిసినపుడు అతనివద్ద ఉన్న సమాచారాన్ని ఎందుకు రికార్డ్ చేయలేదు? ప్రత్యక్ష్యసాక్షి అతనే కదా!
సుభాష్ చంద్ర బోస్ చాలా కాలం పాటు బతికే ఉన్నాడని నేను నమ్ముతాను. గుమ్నామీ బాబా హస్తలిపిలో ఇంగ్లిష్‌ది మాత్రమే సుభాష్ చంద్ర బోస్ హస్తలిపిని పోలింది కానీ బెంగాలీది అతని హస్తలిపితో పోలలేదు. అయితే moodని బట్టి కూడా హస్తలిపి మారుతుంది కనుక గుమ్నామీ బాబాయే సుభాష్ చంద్ర బోస్ అయ్యుంటాడని నేను నమ్ముతాను.
Intha manchi vyaasam raasinandhuku meeku naa kruthagnathalu….
హాబీబూర్ సాక్ష్యం, డాక్టర్ సాక్ష్యాలే అధికారిక నిర్ధారణకు పునాది. కానీ హాబీబూర్ నేతాజీ మిత్రుడు, తప్పు సాక్ష్యంతో ఆయన్ని కాపాడేందుకు హాబీబుర్ ప్రాత్నించి ఉండవచ్చు. లేదా కాంగ్రెస్ లోనే ఉన్న దేశభక్త నేతాజీ అనుకూల సెక్షన్ ఆయన తప్పించుకుపోవడానికి సహకరించి ఉండవచ్చు. హాబీబుర్, డాక్టర్ ల సాక్ష్యం నిజమూ కావచ్చు. ఆ డాక్టర్ జపనీస్ డాక్టర్. ఇండియన్ కాదు. తైవాన్ అప్పటికి జపాన్ ఆధీనంలో ఉందని రాశాను, చూడండి.
ఇంకో సంగతి. సోవియట్ లు తెలంగాణ పోరాటంకు సహకరించకుండా నేతాజీకి సహకరిస్తారా అన్నది అనుమానం. ఒకవేళ నేతాజీ సోవియట్ కు చేరి సాయం అడిగి ఉంటే వారు నిరాకరించడానికే అవకాశం ఎక్కువ ఉంది.
Stalin didn’t even support Chinese strugle. He concentrated only on USSR and and Eastern Europe. Stalin installed his ally governments in Eastern Europe to avert attacks from the west.
Regarding Gumnami Baba, I still believe that he was Subash Chandra Bose. No one attempts to forge another’s handwriting for fun.
“Stalin didn’t even support Chinese strugle. He concentrated only on USSR and and Eastern Europe. Stalin installed his ally governments in Eastern Europe to avert attacks from the west.”
This is completely wrong statement. Both sentences are false. This is why I am telling you repeatedly to relenquish your name. If you are sympathiser of Marxist-Leninist outlook that doesn’t automatically qualify you to utter such nonsense. Beware of history. Please stop writing half-facts and full-lies.