“ప్రతి పౌరుని యొక్క హక్కులను, స్వేచ్చను మేము రక్షించి కాపాడతాం. ప్రతి ఒక్క మతము, సంస్కృతి, నమ్మకాలకు చెందిన ప్రతి ఒక్క పౌరుడికి మా సమాజంలో సమాన స్ధానం ఉండేలా చూస్తాము. మా భవిష్యత్తులో నమ్మకాన్ని కల్పిస్తాము. ఆ భవిష్యత్తు సాధించేందుకు విశ్వాసం ఇస్తాము.”
ఇవి ఫ్రెంచి గడ్డపై ప్రధాని నరేంద్ర మోడి పలికిన పలుకులు. ఫ్రెంచి నేల మనది కాదు. కనీసం మన పాత వలస ప్రభువు కూడా కాదు. ప్రధాని అక్కడికి వ్యాపార ఒప్పందాల పనిపై వెళ్లారు. ఫ్రెంచి కంపెనీలకు కాంట్రాక్టులు కట్టబెట్టారు. పలు ఒప్పందాలు చేసుకున్నారు. కానీ అవే మాటలు మన గడ్డపై, మన దేశ చట్ట సభల్లో చెప్పడానికి ప్రధాని నరేంద్ర మోడి ఎందుకు నిరాకరించారు?
చర్చిలపై దాడులు, ముస్లింలను బలవంతంగా హిందూమతంలోకి మార్చడం… ఈ అంశాలపై పార్లమెంటు ఉభయ సభలను ప్రతిపక్ష సభ్యులు స్తంభింపజేశారు. భారత దేశం అనాదిగా అనుసరిస్తున్న పరమత సహనం పట్ల ఒక్క ప్రకటన చేయాలని గట్టిగా అడిగారు. బి.జె.పి ప్రవేశపెట్టిన బిల్లుల్ని ఆమోదం పొందకుండా అడ్డుకున్నారు. అయినా సరే, ప్రకటన చేసేందుకు మోడి సభకు రాలేదు. ఆ తర్వాత ఢిల్లీలో ఓటమి చవి చూశాక ఢిల్లీలోనే ఒకచోట చర్చిలపై దాడిని ఖండించి తమ ప్రభుత్వం అందరిని సమానంగా చూస్తుందని హామీ ఇచ్చారాయన.
ఇండియా పర్యటించిన బారక్ ఒబామా తిరిగి వెళ్తూ “సూపర్ పవర్ కావాలంటే ఇండియాలో మత స్వేచ్చ తప్పనిసరి. అల్లరి మూకల చర్యలకు అనుమతి ఇవ్వరాదు” అని హితబోధ చేసి వెళ్లారు. బహుశా ఒబామా బోధ పనిచేసిందో ఏమో ఫ్రెంచి వ్యాపార పెట్టుబడుల కోసం మరోసారి భారత దేశపు బహుళ సంస్కృతుల మూలాల్లోకి మోడి వెళ్ళిపోయారు.
“ఒక దేశ శక్తి పౌరులందరూ చేతులు కలపడంలోనే ఉంది. అత్యంత బలహీనులకు సాధికారత సాధించడం ద్వారా నిజమైన ప్రగతిని కొలవాలి. మేము ఓ పురాతన గడ్డపై ఒక ఆధునిక రాజ్యాన్ని నిష్కపటత్వం మరియు సహజీవనాలకు సంబంధించిన అనంతమైన సంప్రదాయాలతో నిర్మించాము. సంవత్సరం క్రితం అధికారం చేపట్టినప్పటి నుండి ఇదే మా సమ్మతంగా ఉంటూ వచ్చింది” అని ప్రపంచానికి చెప్పారు ప్రధాని మోడి.
కానీ ఆర్.ఎస్.ఎస్ భావజాలం ఇది కాదు. లవ్ జిహాద్ అంటూ వారు ముస్లింలను నిందించడం ఎప్పటి వార్తో కాదు. మత మార్పిడిని రద్దు చేస్తూ చట్టం తేవాలన్నది ఆర్.ఎస్.ఎస్ డిమాండ్. ఆ డిమాండ్ నుండి వెనక్కి మళ్లలేదని ఆర్.ఎస్.ఎస్ నేత ఇటీవల చెప్పారు కూడా. ఇది మోడి చెప్పిన మత స్వేఛ్చకు బద్ధ విరుద్ధమే కదా! పురాతన భారతం ఎలాగూ సహనంతోనే ఉంది. ఒక్కసారి అద్వానీ రధయాత్ర అనంతర పరిస్ధితిని తలచుకుంటే మోడి చెప్పిన సహజీవనం అబద్ధం అని తేలుతుంది. గుజరాత్ మారణకాండను తలుచుకుంటే ఆయన మాటలు అసత్యాలని తెలుస్తుంది.
కానీ వీటిని ప్రస్తావించిన పత్రిక ఒక్కటీ లేదు. బహుశా ‘పోన్లే, ఇప్పటికన్నా….’ అని సంతోషించి ఊరుకున్నారేమో తెలియదు.
ఒక సంఘ సంస్కర్త బయట విధవా వివాహాల గురించి మాట్లాడుతాడు. తన కుటుంబానికి చెందిన స్త్రీకి భర్త చనిపోతే మాత్రం ఆమెకి రెండో పెళ్ళి చెయ్యకుండా పిల్లల్ని చూసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలని నీతులు చెపుతాడు. నరేంద్ర మోదీ పరమత సహనం గురించి మాట్లాడినా కూడా అలాగే ఉంటుంది.
ఢిల్లిలో బిజెపి ఓడిపోయింది చర్చ్ ల పై దాడుల వలన కాదు. ఢిల్లిలో క్రైస్తవుల జనాభ ఒక శాతం కూడా లేదు. ఢిల్లిలో ఓటమి చవి చూడటం వలన, మోడి ఆ స్టేట్మెంట్ లు ఇవ్వలేదు. చర్చ్ దాడుల పై మీడీయా చేసిన గోల ఎప్పుడో బోగస్ అని తేలిపోయింది. టైంస్ నౌ లో అర్ణబ్ గోస్వామి గంటకు పైగా ప్రోగ్రాం చేశాడు. దేశమంతా చూశారు. మీరు ట్రాన్స్ ఫర్ అవుతూ చూసి ఉండకపోవచ్చు.