రాఫెల్ ఫైటర్ జెట్లు తక్షణ ప్రాతిపదికన ఏకంగా 36 కొనుగోలు చేసేందుకు ప్రధాని మోడి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఫ్రాన్స్ బయలుదేరుతూనే రాఫెల్ ఒప్పందం కుదురుతుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తూ వెళ్ళిన ప్రధాని చెప్పినట్లుగానే ‘పడవపై చర్చలు’ జరిపి భారీ కొనుగోలుకు తలూపారు.
మనం ఇప్పుడు ఆర్డర్ ఇస్తే రాఫెల్ ఫైటర్ జెట్లు తయారు చేయడం కాదు. ఇప్పటికే తయారై ఎగరడానికి సిద్ధంగా ఉన్న ఫైటర్ జెట్ విమానాలనే ఇండియా కొనుగోలు చేయనుంది.
జెట్ ఫైటర్ విమానాల కొనుగోలు చర్చలు అనేక యేళ్లుగా సాగుతూ వచ్చాయి. గత యు.పి.ఏ ప్రభుత్వం అమెరికా, రష్యా, జర్మనీ, బ్రిటన్ తదితర దేశాల ఫైటర్ జెట్ లను పక్కనబెట్టి ఫ్రాన్స్ రాఫెల్ జెట్లకు ఓ.కె చేసింది. 125 జెట్ లు కొనుగోలు చేయాలని భారత్ అభిలాష.
రాఫెల్ కు ఓ.కె చెప్పినప్పుడే అనేక విమర్శలు వచ్చాయి. నిజానికి ఏ దేశపు ఫైటర్ జెట్ లకు ఓ.కె చేసినా విమర్శలు తప్పవు. ఎందుకంటే ఆయా దేశాల కంపెనీలు తమ తమ ఫైటర్ జెట్ ల కొనుగోలు ముందుకు సాగేలా చూసేందుకు ఇండియాలోనే దళారులను పోషిస్తాయి. వాళ్ళు అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, లాబీయిస్టులు కావచ్చు, చివరికి మంత్రులే కావచ్చు. కాబట్టి ఒక దేశం కాంట్రాక్ట్ గెలిస్తే ఇతర దేశాల తరపున డబ్బు పుచ్చుకున్నవారు సహజంగానే విమర్శలు చేస్తారు.
రాఫెల్ ఫైటర్ జెట్ల కొనుగోళ్ల ఒప్పందాన్ని తీవ్రంగా విమర్శించినవారిలో బి.జె.పి నాయకులు సుబ్రమణ్య స్వామి ఒకరు. తమిళనాడుకు చెందిన ఆయన ఇటీవల వరకు జనతా పార్టీ నడిపి (ఆయన ఒక్కరే పార్టీ అని చెబుతారు) దానిని బి.జె.పి లో విలీనం చేశారు. మోడీని ప్రధాని అభ్యర్ధిగా బి.జె.పి ప్రకటించాక ఆయన ఆ విలీనం చేశారు.
ఇప్పుడు ప్రభుత్వం మారింది. బి.జె.పి ప్రభుత్వం ఏర్పడి పని చేస్తోంది. సుబ్రమణ్య స్వామికి ఇష్టులే అయిన మోడి ప్రధానిగా ఉన్నారు. ఆయనే స్వయంగా ఫ్రాన్స్ వెళ్ళి 36 ఫైటర్ జెట్లను రెడీగా ఉన్నవి కొనుగోలు చేయాలని ఒప్పందంపై సంతకం చేసేశారు.
అయినా సుబ్రమణ్య స్వామి విమర్శలు మానలేదు. రాఫెల్ ఫైటర్ జెట్ కొనుగోలుకు నిర్ణయించిన గత ప్రభుత్వ నిర్ణయం నుండి వెనక్కి మళ్లాలని ఆయన ప్రధాన మంత్రిని కోరారు. రాఫెల్ జెట్లు అనేక వైఫల్యాలు ఎదుర్కొంటున్నాయని ప్రపంచంలో ఎవరూ వాటిని కొనడం లేదని, కొన్ని దేశాలైతే ఒప్పందం చేసుకుని కూడా రద్దు చేసుకున్నారని ఆయన ప్రకటించారు. రాఫెల్ కొనుగోలులో ముందుకు వెళ్తే తాను కోర్టుకి వెళ్తానని కూడా హెచ్చరించారు.
“ఇతరత్రా ఒత్తిళ్ళ వల్ల ప్రధాన మంత్రి ఒప్పందం పై ముందుకు వెళ్ళినట్లయితే ‘ప్రజా ప్రయోజన వ్యాజ్యం’ ద్వారా కోర్టుకు వెళ్ళడం తప్ప నాకు మరో గత్యంతరం ఉండదు” అని స్వామి హెచ్చరించారు. అయినా లెక్క చేయకుండా, బహుశా స్వామి గారు చెప్పిన ఇతరత్రా ఒత్తిళ్ళ వల్లనేనేమో, ప్రధాని మోడి గారు సంతకం పెట్టేశారు.
శుక్రవారం రాత్రి 36 రాఫెల్ ఫైటర్ జెట్ల ఒప్పందంపై భారత ప్రధాని నరేంద్ర మోడి, ఫ్రాన్స్ అధ్యక్షులు ఫ్రాంషా ఒలాండేలు సంతకం చేశారు సుబ్రమణ్య స్వామి చేసిన హెచ్చరిక అంతకు ముందుది. విచిత్రం ఏమిటంటే 36 జెట్ల కొనుగోలు ఒప్పందం ఫైనలైజ్ అయిపోయినప్పటికీ కోర్టుకు వెళ్తానని చెప్పిన స్వామి ఇప్పటికీ నోరు విప్పలేదు.
రాఫెల్ జెట్ల కు రెండు పెద్ద సమస్యలు ఉన్నాయని స్వామి గారి అభ్యంతరం. ఒకటి: అవి మెరుగైన ఇంధన సామర్ధ్యం కలవి కావు. అంటే తక్కువ పనికి ఎక్కువ ఇంధనం అవసరం అవుతుంది. రెండు: ఏ ఇతర దేశమూ దానిని కొనడానికి ముందుకు రాలేదు. రాఫెల్ కొనుగోలు చేస్తే “బి.జె.పి ప్రభుత్వానికి అవమానం తప్పదు” అని స్వామి హెచ్చరించారు. రాఫెల్ విమానాల్ని కొనే బదులు దాన్ని తయారు చేసే డస్సాల్ట్ కంపెనీనే కొనుగోలు చేయమని ఓ సలహా కూడా ఆయన ఇచ్చారు.
స్వామి ప్రకారం విమానాల కొనుగోలు కంటే ఆ కంపెనీని కొనేస్తేనే ఎక్కువ లాభకరం. “ఏ దేశమూ రాఫెల్ కొనకపోతే డస్సాల్ట్ కంపెనీ దివాళా తీయడం ఖాయం. ఒకవేళ ఫ్రెంచి వారితో వెళ్లదలుచుకుంటే కంపెనీని కొనండి” అని స్వామి హితబోధ చేశారు.
అయినా స్వామి మాట మోడి వినలేదు. సంతకం అయ్యాక స్వామి నోటి నుండి మాట లేదు. వస్తుందేమో చూడాలి. బి.జె.పిని (పిఐఎల్) ద్వారా అవమానం చేస్తారో లేక నోరు మూసుకుని తానే అవమానం దిగమింగుకుంటారో వేచి చూడాల్సిన సంగతి.
[ఫైటర్ జెట్ల కొనుగోలు పోటీ వివరాలకు కింది లంకెలోకి వెళ్లగలరు.]
అమెరికా జెట్‌ఫైటర్ల కొనుగోలుకు ఇండియా తిరస్కరణ
[రాఫెల్ ఫైటర్ జెట్ విమానాల స్వరూపం, విన్యాసాలపై అవగాహన కోసం కొన్ని ఫోటోలు కింద ఇవ్వడమైనది. ఇవన్నీ ఇంటర్నెట్ నుండి తీసుకున్నవే. ]
కేవలం అన్నా హజారే చేసిన అవినీతి వ్యతిరేక ఉద్యమం వల్ల గెలిచిన మోదీ కాంగ్రెస్ కంటే ఏమి గొప్పగా పరిపాలిస్తాడు?
కంపనీ కొనుగోలుకీ,వాటి ఉత్పత్తుల కొనుగోళ్ళకీ తేడా ఉన్నది! స్వామి ప్రతిపాదించిన డీల్ అర్దరహితం.బహుశా విమానాలు నాణ్యమైనవి కాకపోవచ్చును.పిల్ వేస్తాననడం,వేరే విమానలు కొనుగోలుచేయాలని ఆశించడం ద్వారా తను కూడా ఏజెంట్ నని తెలియజేస్తున్నారేమో!
మోడీకి వీటినేకోనాలనే పట్టింపు ఎందుకో?