అమెరికాకు అన్నపూర్ణగా పేర్కొనబడే కాలిఫోర్నియా రాష్ట్రం ప్రస్తుతం రికార్డు స్ధాయి కరువుతో తీసుకుంటోంది. వరుసగా 4 సం.ల పాటు వర్షాలు లేకపోవడంతో కరువు అమెరికా భారీ మూల్యం చెల్లిస్తోంది. కాగా ఇంతటి తీవ్ర స్ధాయి కరువు పరిస్ధితులకు గ్లోబల్ వార్మింగే కారణమన్న వాదనపై నాయకులు శాస్త్రవేత్తలు రెండు శిబిరాలుగా చీలిపోయి వాదులాడుకుంటున్నారు. నేల మాత్రం నెర్రెలిచ్చి వర్షపు చుక్క కోసం చేతకపక్షిలా ఎదురు చూస్తోంది.
కాలిఫోర్నియా రాష్ట్రంలో కరువు ఎంత తీవ్రంగా ఉన్నదంటే నగరాలకు, పట్టణాలకు 25 శాతం నీటి సరఫరాను తగ్గిస్తూ గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. చరిత్రలో ఎన్నడూ ఇలా నీటి కోత, కొరత ఎదుర్కోలేదని పరిశీలకులు చెబుతున్నారు. నీటి సరఫరా కోత ఫలితంగా ప్రజలు తమ నీటి వాడకం అలవాట్లను మార్చుకుని పొదుపు పాటించవలసి వస్తోంది.
కాలిఫోర్నియాకు ప్రధాన నీటి వనరులైన గ్లాసియర్లకు నిలయం సియర్రా నెవాడా పర్వత శ్రేణులు. ఈ పర్వతాలపై అత్యంత తక్కువ స్ధాయిలో మంచు కురవడంలో గ్లాసియర్లు నిండుకుని కిందికి వచ్చే నీటి ప్రవాహం బాగా తగ్గిపోయిందని నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ పర్వాతాల నుండి ప్రవహించే రెండు ప్రధాన నదులు కూడా ఈ కారణం వల్లనే నీరు లేక ఎండిపోయాయని తెలుస్తోంది. కాలిఫోర్నియాలో ఇప్పుడు అనేక చోట్ల రిజర్వాయర్లు ఎండిపోయి కనిపిస్తున్నాయి. నదులు, కాలవల్లో అతి తక్కువ నీరు మాత్రమే లభ్యం అవుతోంది.
ఈ నేపధ్యంలో గోల్ఫ్ కోర్సులకు నీటి సరఫరా తగ్గిస్తున్నారు. అనేక చోట్ల ఇండ్ల యజమానులు తమ ఇంటి ముందరి లాన్ లలో గడ్డి ఎండిపోవడంతో కృత్రిమ గడ్డి పరుచుకుని సంతృప్తిపడుతున్నారు. స్విమ్మింగ్ ఫూల్స్ నిర్మించుకున్నవారు అనిర్ధిష్ట పరిస్ధితిని ఎదుర్కొంటున్నారు. శ్మశానవాటికలలో పెంచే గడ్డికి సైతం రేషన్ విధిస్తున్నారు. కొండలపై శిబిరాలు నెలకొల్పి టూరిస్టులకు స్కీయింగ్ ఆనందాన్ని పంచే స్కై రిసార్టులు చాలా వారకు మూతపడ్డాయి. స్కీయింగ్ కి అవసరమైన మంచు కురవకపోవడం దానికి కారణం.
ఈ పరిస్ధితుల్లో పశ్చిమార్ధ గోళంలో అతి పెద్ద డీ శాలినేషన్ కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. డీ శాలినేషన్ కర్మాగారం సముద్ర నీటిని రివర్స్ ఆస్మాసిస్ ద్వారా మంచి నీటిగా మార్చుతుంది. ఇది 2015 చివరి నాటికి పూర్తయి పని ప్రారంభిస్తుందని తెలుస్తోంది. ఇది పూర్తయితే రోజుకు 50 మిలియన్ గ్యాలన్ల మంచి నీటిని ఉత్పత్తి చేస్తుందని చెబుతున్నారు. ఈ లోపు వివిధ క్యాంపస్ లు, గోల్ఫ్ కోర్సులు, పారిశ్రామిక పరిసరాలు, రిక్రియేషన్ పార్కులు, వ్యక్తిగత మరియు కుటుంబ నీటి వినియోగం పై రేషన్ విధిస్తున్నారు. అనేక కుటుంబాలకు నివాస వసతి కల్పించే హౌస్ బోట్ల భవితవ్యం ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది.
ఈ కింది ఫోటోలన్నీ కాలిఫోర్నియా కరువుకు సంబంధించినవి. బోస్టన్ పత్రిక వీటిని ప్రచురించింది.
స్విమ్మింగ్ ఫూల్స్ నిర్మించుకున్నవారు అనిర్ధిష్ట పరిస్ధితిని ఎదుర్కొంటున్నారు
అనిర్ధిష్ట పరిస్థితి అంటే ఏమిటి?