[Violence in law enforcement శీర్షికన ఈ రోజు (ఏప్రిల్ 8) ది హిందు ప్రచురించిన ఎడిటోరియల్ కు ఇది యధాతధ అనువాదం. -విశేఖర్]
ఆంద్ర ప్రదేశ్ కు చెందిన యాంటీ-స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది 20 మంది చెక్కకోత పనివాళ్లను -ఎర్ర చందనం స్మగ్లింగ్ మాఫియాతో సంబంధం ఉందని భావిస్తూ- చంపివేయడం వల్ల పోలీసుల జవాబుదారీతనం పట్లా, అసమతుల్య బలప్రయోగం పట్లా వ్యాకులపూరితమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చెక్కకోత పనివాళ్లను లొంగి పొమ్మని టాస్క్ ఫోర్స్ బలగాలు కోరినప్పటికీ లొంగిపోవడానికి బదులు కొడవళ్ళు, రాళ్ళు తమపై విసిరారని పోలీసులు చెబుతున్నారు. దాదాపు చీకటి అలుముకున్న శేషాచలం అడవుల్లో టాస్క్ ఫోర్స్ బలగాలు ఆత్మరక్షణార్ధం లక్ష్య రహితంగా కాల్పులు జరపడంతో రెండు చోట్ల ఉన్న 100 మంది చెక్కకోత పనివాళ్లలో 20 మంది చనిపోయారని పోలీసుల కధనం.
ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తున్నవారిపై కాల్పులు జరిపేందుకు అనుమతి ఇవ్వాలని కొద్ది రోజుల క్రితమే రాష్ట్ర డిప్యూటీ ఇనస్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎం.కాంతారావు గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగారు. అందువల్ల కాల్పులు జరిపేందుకు ఉన్నత స్ధాయిలోనే నిర్ణయం జరిగిందన్నది స్పష్టం అవుతోంది. ప్రాసిక్యూషన్ నుండి పోలీసులకు పూర్తి స్ధాయి రక్షణ ఉంటుందన్న పూర్తి అవగాహనతోనే చంపడానికే కాల్పులు జరపాలన్న నిర్ణయం చేశారని కూడా స్పష్టం అవుతోంది. అడవిలో రెండు చోట్ల, రెండు భిన్న గ్రూపులకు చెందిన టాస్క్ ఫోర్స్ బలగాలు సరిగా ఏక కాలంలోనే చెక్కకోత పనివాళ్లపై కాల్పులు జరగడం తీవ్రంగా కలతపరిచేదిగానూ, అనుమానాస్పదంగానూ ఉన్నది.
ఇతర చెక్కకోత పనివాళ్లను ఎవరినీ టాస్క్ ఫోర్స్ బలగాలు అరెస్టు చేయలేకపోయారు. అలాగే కాల్చి చంపబడిన చెక్కకోత పనివాళ్లు తప్ప మరే ఇతర పనివారు గాయపడినట్లుగా సమాచారం లేదు. ఆత్మ రక్షణ కోసమే కాల్పులు జరిపామన్న పోలీసుల సమర్ధనను విశ్వసించే విధంగా ఏ ఒక్క పోలీసుకు కూడా తీవ్ర గాయాలు అయిన జాడ లేదు. బాగా స్ధిరపడి పాతుకుపోయిన చెట్ల కూల్చివేత స్మగ్లింగ్ మాఫియాలో చెక్క కోత పనివాళ్లది కేవలం ఒక చిన్న పాత్ర మాత్రమే. చెట్ల కూల్చివేతదారులు సంపన్న స్మగ్లర్లు మరియు శక్తివంతమైన రాజకీయ నాయకుల అండదండలు పుష్కలంగా కలిగి ఉన్నారు. చెక్కకోత కూలీల సొంత రాష్ట్రం అయిన తమిళనాడులోని రాజకీయ పార్టీలు, పౌరహక్కుల సంస్ధలు ఇందులో లోతైన కుట్ర ఉన్నదని అనుమానిస్తూ మొత్తం వ్యవహారంపై విచారణ జరపాలని కోరడంలో ఆశ్చర్యం ఏమీ లేదు.
శేషాచలం అడవుల హత్యలు ఒక లోతైన జబ్బుకు సంబంధించిన ఒకానొక లక్షణంగానే కనిపిస్తోంది. పొరుగునే ఉన్న తెలంగాణలో విచారణలో ఉన్న ఐదుగురు ఖైదీలను కోర్టుకు తీసుకెళ్తుండగా పోలీసులు కాల్చి చంపేశారు. మృతుల్లో ఒకరు తమ వెంట వస్తున్న పోలీసు పార్టీలో ఒకరి నుండి తుపాకి లాక్కుని కాల్పులు జరపబోగా ఆత్మరక్షణార్ధం కాల్చి చంపామని పోలీసులు యధావిధిగా చెప్పారు. ఐదుగురు ఖైదీలలో ఒకరు మాత్రమే తుపాకి లాక్కుంటే సదరు ప్రమాదం నుండి తప్పించుకోవడానికి అయిదుగురినీ కాల్చి చంపామనడం వ్యర్ధ వాదన మాత్రమే.
నిజానికి ఈ హత్యలను స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్ మెంట్ ఆఫ్ ఇండియా (సిమి) కార్యకర్తలయిన ఇద్దరు విద్యార్ధులు పోలీసులపై దాడి చేసిన సందర్భం నేపధ్యంలో చూడకుండా ఉండడం చాలా కష్టం. వారిని ఆ తర్వాత నల్లగొండలో పోలీసులు కాల్చి చంపేశారు. తమ విధుల నిర్వహణ క్రమంలో తమను తాము కాపాడుకునే హక్కు పోలీసులకు ఉన్నదనడంలో సందేహం లేదు. కానీ ఏక కాలంలో జడ్జి గానూ, శిక్ష అమలు చేసేవారు గానూ వారు పని చేయజాలరు. ఈ హత్యలన్నింటిపైనా నిస్పాక్షిక పరిశోధన లేకున్నట్లయితే పోలీసుల పైనా, నేర న్యాయ అమలు వ్యవస్ధ పైనా ప్రజల నమ్మకం ఘోరంగా దెబ్బతింటుంది.
కూలీలను ఎన్ కౌంటర్ చేయడంలో పోలీష్ వారి లక్ష్యాలేమిటి? అందరికీ తెలిసిన విషయమేమిటంటే కూలీలేమీ స్మగ్లర్లు కాదు!
కానీ,అంతకుమునుపు అటవీ సిబ్బందిని చంపింది ఎవరు? కూలీలా?స్మగ్లెర్లా?కానీ,అప్పుడెందుకు ప్రజాపౌరసంఘాలు ఇంతలా గొంతుచించుకోలేదు?
కూలీలను చంపినంతమాత్రాన ఎర్రచందన దొంగరవాణా ఆగిపొతుందని బ్రమలేవీలేవు? వారివెనుక ఉన్న అసలుసూత్రదారుల ఆటకట్టించేదెవరు? ఏమిటాప్రక్రియ?
ఆ కూలీలలో ఏడుగురిని బస్సులో పట్టుకుని తెచ్చి కాల్చి చంపారు తప్ప వాళ్ళ దగ్గర ఆయుధాలు లేవు. నిజంగా ఆయుధాలు ఉన్నవాళ్ళపై కాల్పులు జరపడానికి ఎవరి అనుమతీ అవసరం లేదు. ISI ఏజెంత్‌లని సత్‌ప్రవర్తన పేరుతో విడుదల చేసిన చరిత్ర ఉన్న ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూలీల మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించడం నమ్మశక్యంగా లేదు.
ఎన్‌కౌంతర్‌ల వల్ల నేరాలు తగ్గవు. మావోయిస్త్‌లు & SC/ST Atrocities Act కింద అరెస్త్ అయినవాళ్ళు తప్ప ఎవరినైనా సత్‌ప్రవర్తన కింద విడుదల చెయ్యొచ్చని మన రాష్ట్ర పోలీస్ మాన్యువల్‌లోనే వ్రాసి ఉంది. ఇందువల్ల అనేక మంది ఫాక్షనిస్త్‌లు, ISI ఏజెంత్‌లు కూడా సత్‌ప్రవర్తన పేరుతో బయటకి రావడం జరిగింది. ఆంగ్లేయులు తయారు చేసిన కాలం చెల్లిన చట్టాల పేరుతో నేరస్తుల్ని వదిలేస్తూ, ఎన్‌కౌంతర్‌ల వల్ల నేరాలు తగ్గుతాయని భ్రమపడుతున్నారు.