“నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించడం” అనే సామెత వింటుంటాం. భారత రైతుల పట్ల ప్రధాని మోడి వ్యవహరిస్తున్న తీరు అలాగే ఉంది.
“వేలాది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాటిని ఆపలేమా?” అని ఆయన బహిరంగ సభల్లో ప్రశ్నిస్తారు. ఆత్మహత్యలు ఆపండి మహా ప్రభో అని ఆయనని అందలం ఎక్కిస్తే, ఆ అందలం మీద కూర్చొని ఆత్మహత్యల్ని ఆపలేమా అని తిరిగి జనాన్ని ప్రశ్నించడం ఏమిటి, జనాన్ని వెక్కిరించడం కాకపోతే!
నిన్నో మొన్నో ఆయన బ్యాంకర్ల సమావేశంలో మాట్లాడారు. ‘మీకు పారిశ్రామికవేత్తలకు రుణాలు ఇచ్చే శ్రద్ధ రైతులకు ఇవ్వడంలో ఎందుకు ఉండదు. “ప్రైవేటు రుణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతుల్ని రుణాలు ఇచ్చి ఆదుకోలేరా?” అని ఆయన వారిని ప్రశ్నించారు.
నరేంద్ర మోడి గారు భారత దేశానికి ప్రజలు ఎన్నుకున్న ప్రధాన మంత్రి. దేశంలో దాదాపు బ్యాంకులన్నీ ప్రభుత్వ బ్యాంకులే. అవన్నీ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే నడవాలి. అలాంటి బ్యాంకుల్ని రైతులకు నిర్దిష్టంగా ఇంత మొత్తంలో రుణాలు ఇవ్వాల్సిందే అని చెప్పగల అధికారం ప్రధాని మోడి గారికి ఉన్నది. ఆదేశాలు ఇవ్వడానికి బదులు బ్యాంకర్ల సమావేశంలో ‘ఆదుకోలేరా?’ అంటూ భావోద్వేగ స్వరంతో అడగడం ఏమిటి? ‘ఇవ్వాల్సిందే’ అని ఆదేశించాలి గాని!
విచిత్రాతి విచిత్రం ఏమిటంటే భూ సేకరణ చట్ట సవరణ బిల్లు రైతులకు ప్రయోజనం కలిగించేదే అని ప్రధాని ప్రచారం చేయడం. ఈ మాట చెప్పడానికి నిజానికి చాలా గుండెలు కావాలి. అబద్ధాన్ని నిజం చేయగల సామర్ధ్యం ఉండాలి. యు.పి.ఏ చేసిన చట్టంలోని కాసిన్ని రైతు అనుకూల చర్యలను కూడా కాలరాసిన మోడి తన సవరణలు రైతులకు అనుకూలమే అని చెప్పడానికి ఎంత సామర్ధ్యం ఉండాలి? నిజానికది సామర్ధ్యం కాదు. గోబెల్స్ తరహాలో అబద్ధాన్ని పదే పదే చెప్పి నిజం చేయాలని ప్రయత్నించే స్వార్ధపర కౌటిల్యం.
భూముల సేకరణకి 85 శాతం భూ యాజమానుల అనుమతి కావాలని చట్టం చెబితే దాన్ని 60 శాతానికి మోడి తగ్గించేశారు. ప్రభుత్వ, మిలట్రీ, బధ్రతా అవసరాల కోసం చట్టం నుండి రాయితీలు ఇస్తే వాటిని సమస్త ప్రైవేటు కంపెనీలకు విస్తరింపజేశారు మోడి. నష్టపరిహారం చాలా ఎక్కువగా ఉన్నదని చెబుతూ దాన్నీ తగ్గించారు. మోస పూరితంగా సైక్లిక్ రేటు నిర్వచనాన్ని కప్పి పెట్టి అధిక పరిహారం అని ప్రచారం చేస్తున్నారు. పైగా నష్టపరిహారం పెంచామ్ అని చెప్పడం మహా తుంటరితనం.
ఇదంతా సంపన్నుల కోసమే. పెట్టుబడులు పెట్టి ఫ్యాక్టరీలు, కంపెనీలు స్ధాపిస్తామని చెప్పే బడా పెట్టుబడిదారీ, సామ్రాజ్యవాద సంస్ధల కోసమే. గత 25 యేళ్ళ సంస్కరణల అమలులో స్వాధీనం చేసుకున్న భూములను సెజ్ లకు అప్పగించి ఎంత ఉత్పత్తి తీశారో, ఎంత అభివృద్ధి సాధించారో కళ్ల ముందు ఉన్న సత్యం. కంపెనీలు పెట్టడం మాని ఇచ్చి భూముల్ని తనఖాలు పెట్టి వందలు, వేలాది కోట్లు బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న ఉదాహరణలు కోకొల్లలు.
భూములిని రియల్ ఎస్టేట్ ఆస్తుల కింద బదలాయించి అక్రమంగా మ్యూటేషన్ కావించి వేల కోట్లు కొల్లగొట్టిన దోపిడీదారుల ఉదాహరణలు ఎన్ని లేవు. ఓ పక్క కేసులు నడుస్తున్నా ఈ తతంగం నిరాఘాటంగా కొనసాగడం బట్టి బి.జె.పి/మోడిలు యు.పి.ఏ/కాంగ్రెస్ ల కంటే ఏ మాత్రం భిన్నం కాదని నిర్ధారించుకోవచ్చు. వీరంతా రాజకీయ పార్టీల పోషకులు. వారిచ్చిన డబ్బును ఓటర్లకు పంచి అధికారం చేపట్టాక వారు ఎవరి ప్రయోజనాల కోసం పని చేస్తారో తెలియడానికి రాజకీయ జ్ఞానం ఏమన్నా కావాలా?
ఇది మోడి ద్వంద్వ స్వరూపం. ఒక పక్క మైనారిటీలూ భారతీయులే అంటారు. వారిని అక్రమ కేసుల్లో ఇరికించి ఎన్ కౌంటర్లు చేస్తారు. ముస్లిం పెట్టుబడులకు ప్రోత్సాహం అంటారు. వారి ఆస్తుల్ని లాక్కుని తరిమి కొడతారు. కాస్తో కూస్తో రైతులకు అనుకూలంగా ఉన్న అంశాలను రద్దు చేసి కార్పొరేట్ల భూ దాహానికి దాసోహం అంటారు, రైతుల కోసమే అదంతా చేశానంటారు. అరక పట్టి పొలం దున్నినట్లు కనిపిస్తారు. ఆ వెనుకనే దున్నిన పొలాన్ని ఫ్యాక్టరీలకు అప్పగిస్తారు.
నిజంగా రైతులపై ప్రేమ ఉంటే….బడ్జెట్ లోనే ప్రత్యేకంగా కేటాయింపులు చేయొచ్చు కదా….