విదేశీ కంపెనీల లాభాలు పడిపోకుండా ఉండడానికీ, వీలయితే ఇంకా ఇంకా పెంచడానికీ స్వదేశీ భాజపా మంత్రుల పాట్లు అన్నీ ఇన్నీ కాకుండా పోతున్నాయి. ‘ఊరంతా ఒకదారయితే ఉలిపిరి కట్టెది మరోదారి’ అన్నట్లుగా కేంద్ర మంత్రులు ప్రకటనలు చేస్తూ తమ బుద్ధి మాంద్యాన్ని చాటుకుంటున్నారు. కాగా పొగాకు లాబీకి లొంగి ప్రధాని నరేంద్ర మోడి ఆరోగ్య మంత్రిగా హర్షవర్ధన్ ను తప్పించారని ప్రతిపక్షాలు ఆరోపించడం ప్రజలు గమనించవలసిన విషయం.
లేకపోతే ధూమపానం వల్ల/సిగరెట్ తాగడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ నేతగారే చెప్పడం ఏమిటి? ధూమపానం వల్ల ఊపిరితిత్తుల కేన్సర్ వస్తుందని తేల్చిన సర్వేలన్నీ ఇప్పటివరకు విదేశాల్లో జరిగినవి మాత్రమేనని, భారత దేశంలోనూ ధూమపానం వల్ల కేన్సర్ వస్తుందని తేల్చిన సర్వేలు ఒక్కటీ జరగలేదని కనుక సిగరెట్ ప్యాకెట్ పై 85 శాతం చోటును కవర్ చేస్తూ ప్రచురించాలని భావిస్తున్న హెచ్చరిక ముద్రణను ఆపేయాలని మోడి ప్రభుత్వం నియమించిన కమిటీ నేత ఎం.పి దిలీప్ గాంధీ ప్రకటించారు.
ఈ కమిటీ సిఫారసు మేరకు ఏప్రిల్ 1 తేదీ నుండి అమలు కావలసిన మాజీ ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ నిర్ణయం నిరవధికంగా వాయిదాపడింది. పొగాకు ఉత్పత్తులు అమ్మే ప్యాకెట్లపై పొగాకు వల్ల సంభవించే జబ్బుల గురించి బొమ్మలతో సహా వివరించాలని, ఆ హెచ్చరిక ప్యాకెట్లపై 85 శాతం చోటు ఆక్రమించేలా ఉండాలని అప్పటి ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలతో పొగాకు కంపెనీలు గగ్గోలు పెట్టాయి. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో ఉధృతంగా లాబీయింగ్ నడిపాయి. దాని ఫలితంగానే హర్షవర్ధన్ తన ఆరోగ్య మంత్రిత్వ పదవి పోగొట్టుకున్నారని ప్రతిపక్షాలు వెల్లడించాయి.
ఆరోగ్య మంత్రిగా ఉండగా హర్షవర్ధన్ పొగాకుకు వ్యతిరేకంగా కఠిన చర్యలు ప్రకటించారు. స్వయంగా డాక్టర్ అయిన ఆయన పొగాకు ఉత్పత్తులపై పన్ను కూడా పెంచారు. పన్నులు తగ్గించాలని బహుళజాతి కంపెనీలు ఒత్తిడి తెస్తున్న సమయంలో పన్నులు ఇంకా పెంచడం నిజానికి సాహసమే. ఆయన ఆ సాహసానికి పూనుకున్నందునే నెల తిరిగే లోపు ఆరోగ్య శాఖ నుండి తప్పించి సైన్స్ & టెక్నాలజీ శాఖకు బదిలీ చేసేశారు. “అభిజ్ఞవర్గాల భోగట్టా ప్రకారం బి.జె.పి అధ్యక్షుడు అమిత్ షా నుండి అర్ధరాత్రి వచ్చిన ఫోన్ కాల్ తో హర్ష వర్ధన్ జాతకం నిర్ణయం అయిపోయింది” అని కాంగ్రెస్ ప్రతినిధి సూరజ్ వాలా పత్రికలకు తెలిపారు.
మోడి ప్రభుత్వం హామీ ఇచ్చిన అచ్చే దిన్ ఇలా తగలడ్డాయి. సంవత్సరానికి 70,000 మందికి పైగా చంపేస్తున్న లంగ్ మరియు దవడ కేన్సర్ లకు కారణమైన పొగాకు ఉత్పత్తులను లేకుండా చేస్తే జనానికి అచ్చే దిన్ వచ్చినట్లా లేక కఠిన చర్యలు తీసుకుంటున్న మంత్రిని తప్పించడమే కాక ఆయన చేసిన నిర్ణయాన్ని తిరగదోడడం అచ్చే దిన్ ఇచ్చినట్లా? మోడి వందిమాగధులు ఈ అంశంపై ఏమన్నా సమాధానం ఇవ్వగలరా?
స్వదేశీ సంస్కృతి పరిరక్షణే తమ ధ్యేయమని, స్వదేశీ విధానాలే తమకు ఆక్సిజన్ అని గప్పాలు కొట్టుకునే బి.జె.పి పార్టీ నాయకులు వారి ఎం.పి లు అధికారం వచ్చీరావడంతోనే స్వరం మార్చి విదేశీ కంపెనీల రాగాలకు అనుగుణంగా తైతక్కలాడుతున్నారని పొగాకు ఉదంతం స్పష్టం చేస్తోంది. దిలీప్ గాంధీ గారి పొగాకు అనుకూల వాదనలు వింటే ఆయన గారి తైతక్కలు శివ తాండవాన్ని మించిపోయాయని అర్ధం అవుతుంది.
“పొగాకు వల్ల కలిగే ప్రమాదకర ప్రభావాలపై అందరూ అంగీకరిస్తున్నారు. కానీ పొగాకు వినియోగం కేన్సర్ కు దారి తీస్తుందని చెప్పే భారతీయ సర్వే ఒక్కటీ లేదు. జరిగిన సర్వేలన్నీ విదేశాల్లో జరిగినవే. కేన్సర్ ఒక్క పొగాకు వల్ల మాత్రమే వస్తుందా? మనం భారతీయ నేపధ్యంలో కూడా అధ్యయనం చేయాలి. ఎందుకంటే మధ్య ప్రదేశ్, ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్ ఘర్ రాష్ట్రాలలోని 4 కోట్ల ప్రజలు పొగాకుపై ఆధారపడి బతుకుతున్నారు” అని దిలీప్ గాంధీ ఓ లెక్చర్ దంచేశారు. ఆ తర్వాత ఆయన తన మాటల్ని పత్రికలు వక్రీకరించాయని చెబుతూనే తన వాదనకు కట్టుబడి ఉన్నారు. ‘ఆ మాట నేను అనలేదు. కానీ నా ఉద్దేశ్యం అదే’ అని ఆయన పరోక్షంగా చెబుతున్నారు.
ఈ అవగాహన కలిగి ఉన్న దిలీప్ గాంధీ కమిటీ హర్షవర్ధన్ హయాంలో చేసిన నిర్ణయాన్ని వాయిదా వేయాలని గట్టిగా సిఫారసు చేసింది. సదరు సిఫారసు మేరకు నిర్ణయం అమలును స్వదేశీ మోడి ప్రభుత్వం నిరవధికంగా వాయిదా వేసింది. ఒక పక్క తాను 85 శాతం పిక్చోరియల్ వార్నింగ్ కి అనుకూలం అని చెబుతూనే మరోపక్క నిర్ణయాన్ని వాయిదా వేశారు ప్రధాని మోడి. వాయిదా వేస్తూ సమస్య సాధకబాధకాలను అధ్యయనం చేసి తగిన సిఫారసు చేయాలని మరో కమిటీ (సబార్డినేషన్ కమిటీ) ని నియమించారు.
విచిత్రం ఏమిటో తెలుసా? ఈ కమిటీలో బీడీ కింగ్ ఒక సభ్యుడుగా ఉండడం. బీడీ బ్యారన్ గా పేరు మోసిన శ్యామ్ చరణ్ గుప్తా పొగాకు ఉత్పత్తుల ప్యాకెట్లపై హెచ్చరిక సంకేతాల నిడివిని నిర్ణయించే కేంద్ర కమిటీలో సభ్యుడిగా నియమించారు. ఇంతకు మించి మోడీ మార్కు హిపోక్రసీ ఏమన్నా ఉంటుందా? తన ఉత్పత్తి ఎంత ప్రమాదకరమో ప్రజలకు చెప్పే బాధ్యతను ఏ పారిశ్రామికవేత్త అయినా సక్రమంగా, రాగద్వేషాలకు అతీతంగా నిర్వహించగలడా?
ఇలాంటి నియామకాలను కోర్టు మరియు పరిపాలనా పరిభాషలో ‘Conflict of Interest’ అంటారని అందరికీ తెలిసిందే. ఇలాంటి పరిస్ధితి వస్తే జడ్జిలు సంబంధిత కేసుల నుండి తప్పుకుంటారు. ఉదాహరణకి కోల్ గేట్ కంపెనీలో భారీ షేర్లు కలిగిన జడ్జి ముందుకు కోల్ గెట్ కి వ్యతిరేకంగా వేసిన కేసు వస్తే ఆయన విషయం చెప్పి తప్పుకుంటారు. ప్రైవేటు ఆసుపత్రులను నిర్వహించే వ్యక్తిని ఆరోగ్య మంత్రిగా నియమించకుండా ప్రజాస్వామిక ప్రభుత్వాలు సూత్రం పాటించాలి. కానీ ప్రైవేటు ఆసుపత్రి, మెడికల్ కాలేజీలకు సొంతదారు అయిన కామినేనిని చంద్రబాబు గారు ఆరోగ్య మంత్రిగా నియమించారు. కామినేని వారు బి.జె.పి పార్టీకి చెందిన ఎమ్మెల్యే కావడం ఇక్కడ గమనించవలసిన విషయం.
కనుక పొగాకు ఉత్పత్తుల అమ్మకాలతో నిండా ముడిపడి ఉన్న శ్యామ్ చరణ్ గుప్తా పొగాకు ప్రమాద నివారణకు సంబంధించిన కమిటీలో ఎలా ఉండగలరు? మోడి చెప్పిన అచ్చే దిన్ ఎవరికి? జనానికా లేక వారి ఉసురు తీస్తున్న ప్రైవేటు సంపన్న వర్గాలకా?
గమనార్హమైన సంగతి ఏమిటంటే భారతీయ సర్వేలు ఏమీ లేవని దిలీప్ గాంధీ చెప్పినది కూడా ఒట్టి అబద్ధం. ఉదాహరణకి 2011 సంవత్సరం లోనే భారత ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ, ప్రపంచ ఆరోగ్య సంస్ధ రెండూ కలిసి ఉమ్మడిగా ఒక అధ్యయనం నిర్వహించాయి. పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఫర్ ఇండియా ఈ అధ్యయనానికి కర్త కాగా WHO, MoHFWలు సహకారం ఇచ్చాయి. ఈ అధ్యయనం కళ్ళు బైర్లు కమ్మే నిజాల్ని నిర్ధారించింది కూడా.
భారత దేశంలో పొగాకు వల్ల కలిగే వ్యాధుల చికిత్స కోసం అవుతున్న ఖర్చు ఒక్క 2011లోనే 1,04,500 కోట్ల రూపాయలని భారత సర్వే తెలిపింది. మొత్తం రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం అన్నీ కలిసి ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టే మొత్తం కూడా ఇంత లేదు. రాష్ట్రాలు, కేంద్రం 2011 లో ప్రజల ఆరోగ్యం కోసం పెట్టిన ఖర్చు కంటే పొగాకు జబ్బుల చికిత్సకు జనం పెట్టిన ఖర్చు 12 శాతం ఎక్కువగా ఉందని సర్వే తేల్చింది.
ఈ సర్వే ఫలితాల వల్లనే ప్రభుత్వాలలో కాసింత కదలిక వచ్చింది. మెల్ల మెల్లగా నిర్ణయాలు చేస్తూ ఫైళ్ళు కదిలిస్తూ చివరికి 2014లో హర్షవర్ధన్ మంత్రిత్వంలో ఒక నిర్ణయం చేశారు. ఆ నిర్ణయమే పొగాకు ఉత్పత్తుల (సిగరెట్, బీడీ, గుట్కా మొ.వి) ప్యాకెట్లపై ప్రమాదాలు సూచించే బొమ్మలను 85 శాతం చోటు కవర్ చేసేలా ముద్రించడం. ఇది చాలా చిన్న నిర్ణయం. ప్రమాద హెచ్చరికల్ని చూసి పొగ తాగడం మానుకునే వారు ఎందరు ఉంటారు గనక? ఆ చిన్న నిర్ణయాన్ని కూడా భారత దేశ స్వతంత్ర, గణతంత్ర, సార్వభౌమ ప్రభుత్వాలు చేయలేకపోతున్నాయంటే…. ఎక్కడుంది స్వతంత్రం?
దిలీప్ గాంధీ వాదనలను ఒకసారి చూడాలి. విదేశాల్లో చేసే సర్వేలు భారతీయుల ఆరోగ్యాన్ని ఎలా నిర్ణయిస్తాయన్నది ఆయన ప్రశ్న. అంటే ఆయన ఉద్దేశ్యంలో భారతీయుల శరీర నిర్మాణం, అవయవాల పనివిధానం, ఆరోగ్యం అన్నీ విదేశీయులతో భిన్నంగా ఉంటుందనా? ఇంతకంటే తెలివి తక్కువ వాదన మరొకటి ఉంటుందా? ఆ మాటకొస్తే ఎన్ని విదేశీ ఆవిష్కరణలను దిగుమతి చేసుకుని భారతీయులు వాడడం లేదు? దిలీప్ గాంధీ లాంటి సంపన్నుల ఇళ్లకు వెళ్ళి చూస్తే నేలపై పరిచిన బండరాయి నుండి, భోజనం చేసే బల్ల, సోఫా సెట్ పై కప్పు షాండ్లియర్ ల వరకూ ఎన్నెన్ని దేశాల దిగుమతి ముద్ర వేసుకుని ఠీవిగా నిలబడి ఫోజులు ఇస్తాయో తెలుస్తుంది. ఒక్కటన్నా దేశీయ మొబైల్ ఫోన్ ఉనికిలో ఉన్నదా భారతీయులు కల్లకద్దుకుని వాడుకునేందుకు?
నవరత్నాలుగా చెప్పుకునే అత్యంత ప్రతిష్టాత్మక మైన ప్రభుత్వరంగ పరిశ్రమలలో వాటాలు అమ్మేస్తూ విదేశీ పెట్టుబడులకు అంగలార్చుతున్న బి.జె.పి ప్రభుత్వం ఆరోగ్య సర్వేకి వచ్చేసరికి స్వదేశీ-విదేశీ తేడా కనిపిస్తుందా? విదేశీ పెట్టుబడి కోసం ప్రధాని మోడి కాలికి బలపం కట్టుకుని మరీ దేశ దేశాలు తిరిగొస్తున్నారే?! దిలీప్ గాంధీ గారికి ఇదేమీ కనపడదా? పెట్టుబడులకు పనికొచ్చే విదేశీ, స్వదేశీ ప్రజల ఆరోగ్య రక్షణకు వచ్చేసరికి ఎందుకు పనికిరాకుండా పోవడం?
జనం ఆలోచించి తేల్చుకోవలసిన ప్రశ్నలివి!
The risk of tobacco is same in all geographies. However, smoking is not against Indian culture. In olden days kings and feudatories used to inhale ganja smoke through hukka. These people were not aware about health risks then, and so even now.
http://indianexpress.com/article/india/politics/you-are-cleaning-streets-what-about-the-dirty-mouths-of-bjp-leaders-sena-asks-pm-modi/