చవకబారు వాగుడు -ది హిందు ఎడిటోరియల్


Giri raj singh

Giri raj singh

[బి.జె.పి పార్టీకి చెందిన కేంద్ర మంత్రులు, రాష్ట్రాల నేతలు తమ చవకబారు భావజాలాన్ని నిస్సిగ్గుగా ఆరబెట్టుకోవడం కొనసాగుతూనే ఉంది. రాజీవ్ గాంధీ తెల్లతోలు మహిళకు బదులు నైజీరియా మహిళను పెళ్లి చేసుకుని ఉంటే ఆమెను నాయకురాలిగా కాంగ్రెస్ నేతలు అంగీకరించి ఉండేవారా అని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ప్రశ్నించగా, ఆందోళనలో ఉన్న నర్సులు తమ ఆందోళనను విరమించకపోతే వారి చర్మం నల్లబడి మంచి భర్తల్ని వెతుక్కోవడం కష్టమై పోతుందని గోవా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. మొన్నటివరకు ఇలాంటి వ్యాఖ్యలకు పేరు మోసిన వ్యక్తి ఇప్పటి ప్రధాని నరేంద్ర మోడి గారే. శశి ధరూర్ భార్యను 60 కోట్ల బహుమతిగా అభివర్ణించడం దగ్గర్నుండి సోనియా గాంధీ క్రైస్తవ మత నమ్మకాన్ని సందర్భ రహితంగానూ, సహితంగానూ ఎత్తి చూపడం వరకూ అనేకమార్లు చవకబారు వ్యాఖ్యలకు దిగిన చరిత్ర మోడికి ఉన్నది. ఆయన శిష్య గణం, భక్త గణం అందుకు భిన్నంగా ఉంటేనే ఆశ్చర్యం గానీ మోడిని అనుసరిస్తే ఏమి ఆశ్చర్యం. గిరిరాజ్, పరేస్కర్ ల వ్యాఖ్యలపై ది హిందు పత్రిక ‘Cheap talk’ శీర్షికన ఏప్రిల్ 6 తేదీన సంధించిన విమర్శనాయుత సంపాదకీయానికి ఇది యధాతధ అనువాదం. -విశేఖర్]

*****************************

“రాజీవ్ గాంధీ నైజీరియా మహిళను పెళ్లి చేసుకుని ఉంటే కాంగ్రెస్ పార్టీ ఆమె నాయకత్వాన్ని అంగీకరించి ఉండేది కాదు” అంటూ కేంద్ర మంత్రి మరియు పార్లమెంటు సభ్యుడు అయిన గిరిరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్య సోనియా గాంధీని కించపరిచేందుకు చేసిన మరో జాతి విద్వేషక ప్రయత్నం. అలాంటి (నాయకత్వ) పాత్ర పోషించడానికి తన చర్మం రంగు తప్ప మరో అర్హత ఏమీ ఆమెకు లేదని ఆయన వ్యాఖ్య సూచిస్తోంది. అయితే తాను ఎంపిక చేసుకున్న ఉదాహరణ ద్వారా ఆయన ఒక భారతీయ వాస్తవాన్ని -తెల్ల తోలు పట్ల మనకున్న మనో పీడక ఆరాధన- వెల్లడించారు. సింగ్ తన జాతి విద్వేషక వ్యాఖ్యలను బీహార్ లో చేయగా, గోవా ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సెకర్ సమ్మెలో ఉన్న నర్సులను ఉద్దేశిస్తూ ఎండలో కూర్చుని సమ్మె చేయడం మానకపోతే చర్మం నల్లబడి భర్తల్ని వెతుక్కోవడం కష్టం అయిపోతుందని వ్యాఖ్యానించారు. సింగ్ లాగా అసహ్య్కరమైన రాజకీయ అంశాన్ని లేవనెత్తడం కాకుండా, పర్సెకర్ వ్యాఖ్య బహుశా కేవలం అపహాస్యం కోసం చేసినది కావచ్చు.

కానీ ఈ రెండు వ్యాఖ్యలను కలిపి పరిశీలిస్తే వివాహాది ప్రకటనలు సృష్టించడం వల్ల ఉనికిలో ఉన్న స్టీరియో టైప్ భావనలను అవి బలవత్తరం కావిస్తున్నాయి. తెల్ల చర్మం పెళ్లి కూతుళ్లే కావాలని వివాహ ప్రకటనలు కోరుతాయి. తెల్లగా ఇష్టంగా (ఫెయిర్ అండ్ లవ్లీ) లేదా తెల్లగా అందగా చర్మపు రంగును తయారు చేస్తాయని అనేక క్రీములు, లోషన్ల ప్రకటనలు మనకు చెబుతుంటాయి. తద్వారా వివాహంలోనూ, ఉద్యోగాల మార్కెట్ లోనూ అవకాశాలు మెరుగవుతాయని చెబుతాయి. ఇందులో నిందాస్తుతి కారకం ఏమిటంటే మహా పౌరాణిక గాధల్లోనూ, ఇతిహాసాల్లోనూ నలుపు రంగు స్త్రీలే గొప్పగా ప్రస్తుతించబడ్డ దేశంలోనే ఇలాంటివి చోటు చేసుకోవడం. మహాభారత కావ్యం ద్రౌపదిని ఉద్దేశిస్తూ నీలి చర్మ సౌందర్యవతిగా విస్తృతంగా పేర్కొంటుంది. నల్ల చర్మపు సౌందర్యరాశిగా పేర్కొనబడిన మరో స్త్రీ  టాగోర్ కీర్తించిన “కృష్ణకాళి”: ఆహ్, మీరామెను నల్లనిదిగా పిలుస్తారు; అయితే కానివ్వండి, నల్లని ఆమె జింక కళ్ళనే కదా నేను చూసింది.”

Lakshmikanth Parsekar

Lakshmikanth Parsekar

భారతీయ పురాణాలు, సంస్కృతి గురించి తమకు బాగా తెలుసని చెప్పుకునే పార్టీకి చెందిన ఈ ఇద్దరు పురుషులకు విద్యాభ్యాసం కావించవలసిన అవసరం ఉందని స్పష్టంగా కనిపిస్తోంది. ఇంకా ఘోరం ఏమిటంటే అత్యున్నత అధికార కార్యాలయాల్లో -సింగ్ కేంద్ర మంత్రి కాగా పర్సెకర్ ఒక రాష్ట్రాన్నే నడుపుతున్నారు- కూర్చుని కూడా తాము రోల్ మోడల్స్ అన్న సంగతే మర్చిపోయారు. సింగ్ విషయంలోనైతే ఆయన ఒక్క కాంగ్రెస్ పార్టీని మాత్రమే గాయపరచలేదు -ఆయన్ని పదవి నుండి తొలగించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది- నైజీరియన్ లను కూడా ఆయన గాయపరిచారు. ఆయన చేసిన అనామోదనీయ వ్యాఖ్యకు గాను క్షమాపణలు చెప్పాలని కోరుతూ నైజీరియన్లు తమ నిరసనను నమోదు చేశారు కూడా.

అయితే ఈ వివాదం చర్మం రంగుకు మించినది. మహిళల భద్రత దగ్గరి నుండి రాజకీయ నిర్ణయాలలో వారి భాగస్వామ్యాన్ని పెంచడం వరకూ అనేక అంశాలు కేంద్ర స్ధానాన్ని ఆక్రమించిన దశలో జాతీయ రాజకీయ ప్రయాణం చౌకబారు స్ధాయికి దిగజారుతున్న స్ధితిని అది ప్రతిబింబిస్తోంది. నిజానికి మహిళలకు సంబంధించిన అనేక ప్రగతిశీల చట్టాలు -చట్ట సభల్లో రిజర్వేషన్ల కల్పన నుండి లైంగిక వేధింపుల నుండి వారికి రక్షణ కల్పించడం వరకు- పురుష చట్టసభల సభ్యుల వ్యతిరేకత ఇప్పటికీ వెనుకపట్టు పట్టలేదు. మహిళలు మరింతగా విద్యావంతులు అవుతూ తమకు దక్కవలసిన చోటు, స్వతంత్రం దక్కాలని డిమాండ్ చేస్తుండగా, ఎం.పిలు, ఎమ్మేల్యేలతో సహా పురుషులు వారి వేగాన్ని అందుకోలేకపోతున్నారన్నది స్పష్టం.  ఇండియా అగ్రరాజ్య హోదా సాధించాలంటే ఈ దేశ ప్రగతిలో మహిళలు సమాన పాత్ర పోషించవలసిందే.

*****************************

[నలుపు రంగుపై ఉండే వ్యతిరేకత, తెలుపు రంగుపై ఉండే వ్యామోహం… వీటి గురించి మళ్ళీ ప్రస్తావించుకోనవసరం లేదు. పై ఆర్టికల్ లో నీలి రంగు అక్షరాల్లోని వాక్యాల్లో వ్యక్తం అయిన అవగాహన చాలా ప్రాముఖ్యత కలిగినది.

మొదటిది: ప్రస్తుతం కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న హిందూత్వ వల్ల భారత దేశ రాజకీయ ప్రగతి ముందుకు బదులుగా వెనుకకు ప్రయాణిస్తోందని సంపాదకీయం సరిగ్గా గుర్తించింది. ఇది చాలా ముఖ్యమైన పరిశీలన. ఏదో యధాలాపంగా చేసినట్లు కనిపించిన బి.జె.పి నేతల వ్యాఖ్యల వెనుక ఉన్న ఇంతటి విస్తృత అర్ధాన్ని వెలికి తీసిన ఆర్టికల్ కు జేజేలు చెప్పవలసిందే. హిందూత్వ సంస్ధల వల్ల (ఇప్పటికి, హిందూ మతం కాదు) భారత సమాజం ముందుకు బదులు వెనక్కు ప్రయాణిస్తోంది. ప్రజల ఆలోచలను మళ్ళీ మధ్య యుగాలకు ప్రయాణింపజేసేందుకు జాతీయ-అంతర్జాతీయ స్ధాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అవి ఊపుగా, ఉత్సాహంగా కొనసాగుతున్నాయి కూడా. ప్రగతిశీల శక్తులు అప్రమత్తమై ప్రతిఘటించకపోతే ప్రజలే వారికి ఆయుధం అయ్యే ప్రమాదం పొంచి ఉంది.

రెండవది: స్త్రీలు విద్యావంతులై ప్రగతి పధంలో వేగంగా సాగిపోతుండగా పురుషులు వారి వేగాన్ని అందుకోలేకపోతున్నారన్న పరిశీలన చాలా చాలా సున్నితమైనది. సునిశిత దృష్టితో కూడినది. స్త్రీలు విద్యావంతులై సమానత్వం కోసం, స్వతంత్రం కోసం డిమాండ్ చేస్తున్న పరిస్ధితుల్లో పురుషులు ఎలా స్పందిస్తే వారు స్త్రీల వేగాన్ని అందుకున్నట్లు? స్త్రీ పురుష సమానాత్వాన్ని ఒక అనివార్య వాస్తవంగా గుర్తించి తదనుగుణంగా సామాజిక, రాజకీయ, ఆర్ధిక జీవనాలన్నింటిలోనూ ఆహ్వాన గీతిక అందుకోగలగడమే ఆ వేగాన్ని అందుకున్నట్లు. అందుకు విరుద్ధంగా స్త్రీ సమానాత్వాన్ని తిరస్కరించి, ఉధృతం అవుతున్న స్త్రీ ప్రగతిని తొక్కి పెట్టాలని ప్రయత్నాలు ముమ్మరం చేస్తే పురుషులు మధ్య యుగాల వెనుకబాటుతనాన్ని దాటిరాలేని ప్రగతి వ్యతిరేకులుగా వ్యవహరించినట్లే. చారిత్రకంగా స్త్రీలపై అమలైన అణచివేత పరిస్ధితుల వలన పురుషులే ప్రగతి శీల భావాలకు ఆధారం అయ్యారు. ఇప్పుడు స్త్రీలు సైతం ఆ ప్రగతిని అందుకుంటున్నప్పుడు పురుషులు దానిని ఆహ్వానించి ఉమ్మడిగా సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలి. అలా కాకుండా స్త్రీల న్యాయమైన డిమాండ్లను తిరస్కరించడం అంటే వారు వెనుకబడి ఉన్నట్లే! స్త్రీలు సాధించిన వేగాన్ని అందుకోలేకపోతున్నట్లే!]

5 thoughts on “చవకబారు వాగుడు -ది హిందు ఎడిటోరియల్

  1. దీని గురించి ఫేస్‌బుక్‌లో కొంత మంది తెలంగాణావాదులు చర్చించుకున్నారు. భాజపాకి తెలుగు దేశంతో పొత్తు ఉండడం వల్ల చాల మంది తెలంగాణావాదులు భాజపాకి వ్యతిరేకమే. అక్కడ నేను ఇలా వ్రాసాను “తెలంగాణా వస్తే ఐ.ఎస్.ఐ. కార్యక్రమాలు పెరిగిపోతాయని చంద్రబాబు ప్రచారం చేసినప్పుడు వాళ్ళ నాయలుడు వాజపేయ్ దాన్ని నమ్మేసాడు కానీ ఆ తెల్లతోలు నాయకురాలు నమ్మలేదు కదా” అని. అప్పుడు భాజపా వ్యతిరేకులందరూ నవ్వుకున్నారు.

  2. Mohandas Gandhi had white skin but he was not from the white race. Therefore he was thrown out from the first class coach by the ticket collector when he was travelling in the South Africa. In this context, the remarks of BJP leaders are racist as they feel to be superior than Nigerians.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s