ఎవరి గౌరవమీ ట్రయల్ రూముల రహస్య కెమెరాలు?


Smriti Irani

Union HRD Minister Smriti Irani comes out of the FabIndia showroom at Calangute, Goa

సాక్ష్యాత్తు కేంద్ర మంత్రి గారే విపత్కర పరిస్ధితిని ఎదుర్కొన్నారు. లేదా ఎదుర్కొన్నానని మంత్రి గారు లోకానికి చాటారు. అదేమీ లేదని ఫాబ్ ఇండియా వారు వివరణ ఇచ్చుకున్నప్పటికీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేసిన ఆరోపణ విస్తృత వ్యాప్తిలో ఉన్న ఒక అసహ్యకరమైన వ్యాధిని వెలుగులోకి తెచ్చింది. ఈ వ్యాధి ఉన్నదని అందరికీ తెలుసు. కానీ అదేమీ ఎరగనట్లు నటించడమే వ్యాధి విస్తరణకు ప్రధాన పోషకురాలు. ఈ రీత్యా స్మృతి ఇరానీ చిన్నపాటి సాహసం చేశారని చెప్పవచ్చు. కానీ ఆమె సాహసం వట్టిపోయిందని అర్ధం అయ్యాక బాధితులకు మరింత ఆగ్రహం తప్పని పరిస్ధితి!

చర్చాంశం ఏమిటో పాఠకులకు అర్ధం అయి ఉండాలి. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ కొద్ది రోజుల క్రితం (ఏప్రిల్ 3 తేదీన) గోవాలో ప్రముఖ బట్టల దుకాణానికి వెళ్లారు. రెండు రోజుల సెలవులో ఉన్న మంత్రి తన కుటుంబ సభ్యులతో కలిసి ఫ్యాబ్ ఇండియా కంపెనీకి చెందిన దుకాణాన్ని సందర్శించారు. ట్రయల్ రూమ్ కి వెళ్ళి దుస్తులను మార్చుకునే ప్రయత్నంలో ఉండగా సిసిటివి కెమెరా తనవైపు ఫోకస్ చేసి ఉండడాన్ని ఆమె గమనించారు. ఆమె వెంటనే స్ధానిక బి.జె.పి ఎమ్మెల్యే మైఖేల్ లోబో కు ఫోన్ చేసి చెప్పడంతో ఆయన హుటాహుటిన పోలీసులతో సహా వచ్చి దుకాణాన్ని తనిఖీ చేశారు.

సిసిటివి కెమెరా ట్రయల్ రూమ్ లో జరిగే తతంగాన్ని రికార్డు చేస్తున్నట్లు తమ తనిఖీలో రుజువు అయిందని లోబో విలేఖరులకు చెప్పారు. “ట్రయల్ రూమ్ లో చెక్కతో చేసిన వెంటిలేటర్లు ఉన్నాయి. కొన్ని ఘన చతురస్రం రూపుతో మరికొన్ని చతురస్రం రూపులో ఉన్నాయి. ఇవి ఎయిర్ కండిషనింగ్ కోసం ఉద్దేశించినవి. వీటి ద్వారా ట్రయల్ రూమ్ దృశ్యాలను సిసిటివి కెమెరా చక్కగా రికార్డు చేస్తోంది. కెమెరా ఫుటేజీని మేము ఓ 20 నిమిషాలు వెనక్కి తిప్పి చూసాము. అందులో (స్త్రీలు దుస్తులు మార్చుకుంటున్న) అభ్యంతరకర దృశ్యాలు ఉన్నాయి” అని మైఖేల్ లోబో పత్రికలకు స్పష్టంగా చెప్పారు.

లోబో ఫిర్యాదు మేరకు గోవా పోలీసులు కేసు నమోదు చేశారు. దుకాణంలో సిసిటివి కెమెరాలను నిర్వహిస్తున్న సిబ్బంది నలుగురిపైన వివిధ సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. ప్రశాంత్ నాయక్, కరీం లఖాని, రాజు పయాంచే, పరేశ్ భగత్ అనే నలుగురు ఉద్యోగులు కేసులో ఉన్నారు. వారిని కోర్టులో హాజరు పరచగా వారికి బెయిలు మంజూరయింది. క్రైమ్ బ్రాంచి పోలీసులు వారి కష్టడీ కోరినప్పటికి కోర్టు ఇవ్వలేదు. ప్రాసిక్యూషన్ వారు కస్టడీ కి అప్పగించడానికి ‘తగిన సాక్ష్యాలు’ ఏవీ ఇవ్వలేదని కోర్టు చెప్పింది.

ఈ లోపు ఫ్యాబ్ ఇండియా వాళ్ళు ఓ ప్రకటన జారీ చేశారు. తమ దుకాణంలో రహస్య కెమెరాలు ఏవీ లేవని వారి ప్రకటన తెలిపింది. కేంద్ర మంత్రి చెప్పిన కెమెరా వాస్తవానికి అందరికీ కనిపించే విధంగానే అమర్చామని, అది ట్రయల్ రూమ్ కోసం ఏర్పాటు చేసిన కెమెరా కాదని దుకాణంలో జరిగే వ్యాపార వ్యవహారాలను, కస్టమర్లను పరిశీలించడానికి ఉద్దేశించినది మాత్రమేనని ఆ ప్రకటన తెలిపింది. అయినప్పటికీ మంత్రి గారికి జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని విచారం ప్రకటించింది.

ఫ్యాబ్ ఇండియా వారి ప్రకటన వెలువడ్డాక స్మృతి ఇరానీ నుండి ఎలాంటి ప్రకటన రాలేదు. విలేఖరులు కూడా ఆ విషయాన్ని మళ్ళీ ఆమె వద్ద ప్రస్తావించినట్లు వార్తలు వెలువడలేదు. గోవా ప్రతిపక్ష పార్టీల ఖండన మండనలు, నిలదీతలు, వెక్కిరింపులు, అధికార బి.జె.పి నాయకుల వివరణలు, హామీలు, అధికారులపై ఆగ్రహాలు మొ.వి మాత్రం భారీ మోతాదులోనే వెలువడ్డాయి.

స్మృతి ఇరానీ నుండి మళ్ళీ ఏ మాటా ఎందుకు రాలేదు? ఒక్క పోలీసులు మాత్రమే ఎందుకు మాట్లాడుతున్నారు? ఇరానీ ఆరోపణ అనంతరం గోవా పోలీసులు నగరంలోని దుకాణాలన్నీ తనిఖీ చేసి ఎక్కడా ఎలాంటి చెడ్డ వ్యవహారం జరగడం లేదని నిర్ధారించడానికి ఎందుకు తొందర పడ్డారు? ఈ ప్రశ్నలకు సమాధానం నేరుగా చెప్పేవారు లేరు. అయితే ఈ వ్యవహారం వల్ల గోవా టూరిస్టు ఆకర్షణ కేంద్రంగా ఎక్కడ వెనుకబడి పోతోందో అన్న ఆందోళన కూడా అధికారంలో ఉన్న బి.జె.పి ప్రభుత్వ పెద్దల మాటల్లో వ్యక్తం ప్రత్యేకంగా కావడం గమనార్హం.

ఉదాహరణకి గోవా ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సెకర్ ఏమన్నారంటే “ఈ ఘటన దురదృష్టకరం. ఇది గోవా రాష్ట్ర ఇమెజీని మసిబార్చుతుంది. కానీ గోవా భద్రమైన టూరిస్టు కేంద్రం. ఇలాంటి ఘటనలు జరిగితే అది నిజంగా బాధాకరం” అని.

ట్రయల్ రూములలో దుస్తుల మార్పిడిని రికార్డు చేసే వ్యవహారం చాలా తీవ్రమైనది. ఒక పక్క స్త్రీలపై అత్యాచారాలు జరుగుతుంటే వాటికి కారణం ఆడవాళ్ళ వస్త్రధారణే అని పార్లమెంటు, అసెంబ్లీల సభ్యులు గగ్గోలు పెడుతుంటారు. ఖాఫ్ పంచాయితీ నుండి పార్లమెంటు సభ్యుల వరకు స్త్రీల కదలికలపైనా, సెల్ ఫోన్ల వాడకం పైనా, వస్త్రధారణ పైనా సవా లక్షా ఆంక్షలు విధించేందుకు, అలా విధించేవారిని వెనకేసుకు వచ్చేందుకు పోటీలు పడతారు. మరో పక్క అదే స్త్రీలు దుకాణాలు ఏర్పరిచిన మాటుగా ఏర్పరిచిన ట్రయల్ రూమ్ ల దృశ్యాలను రహస్యంగా, నిజానికి దర్జాగా, రికార్డు చేస్తుంటేనేమో ఆ వార్త బైటికి పొక్కడమే పెద్ద తప్పు అన్నట్లుగా ప్రకటనలు గుప్పిస్తున్నారు. భారత సమాజం భూస్వామ్య పురుషాధిక్య భావజాలంతో క్రిక్కిరిసిపోయి పురుషుల మర్యాదలు, ఉందో లేదో తెలియని రాష్ట్ర, దేశ గౌరవ మర్యాదలు కాపాడుకోవడంలోనే నిండా మునిగి ఉందని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం కావాలా?

ఇక్కడ ఫ్యాబ్ ఇండియా గురించి కొంత తెలుసుకోవాలి. పేరు చూస్తే భారతీయ కంపెనీలాగా ధ్వనించే ఫ్యాబ్ ఇండియా నిజానికి అమెరికన్ వ్యాపారి స్ధాపించినది. ప్రధమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ హయాం లోనే భారత దేశంలో నిఘా వేసే బాధ్యత నిర్వహించిన ఫోర్డ్ ఫౌండేషన్ కంపెనీలో ఉద్యోగిగా పని చేసిన జాన్ బిస్సెల్ ఈ కంపెనీ స్ధాపకుడు. నాయనమ్మ నుండి సంక్రమించిన 20,000 డాలర్ల (అప్పట్లో అది పెద్ద మొత్తమే) పెట్టుబడితో ఫ్యాబ్ ఇండియా కంపెనీని బిస్సెల్ స్ధాపించాడు.

కంపెనీ వ్యాపారం అంతా భారత దేశంలోని చేతి వృత్తుల తయారీదారుల ఉత్పత్తుల అమ్మకం పైనే ఆధారపడి సాగినా కంపెనీ కేంద్రం మాత్రం అమెరికా కనెక్టికట్ రాష్ట్రం లోని కాంటన్ లో నెలకొల్పారు. అనగా ఇది అమెరికా కంపెనీయే తప్ప భారతీయ కంపెనీ కాదు. కంపెనీ అమ్ముకునే దుస్తులు మాత్రం అచ్చంగా భారత చేనేతలు తయారు చేసే అమూల్యమైన వస్త్రాలు. దేశంలో మంచి మంచి పనిమంతుల నుండి సేకరించి నగరాలలో అద్దాల వెనుక ప్రదర్శనకు పెట్టి భారీ లాభాలు ఆర్జిస్తుంది ఫ్యాబ్ ఇండియా. ఇందులో చేతివృత్తిదారులకు వాటాలు (షేర్లు) ఇచ్చినట్లు కంపెనీ చెప్పుకుంటుంది. కానీ వారు వాస్తవానికి కంపెనీ తరపున పనిచేసే భారతీయ దళారులు మాత్రమే.

న్యూయార్క్ లో మరో కంపెనీలో పని చేస్తూ ఉన్న జాన్ బిస్సెల్ హఠాత్తుగా తన పదవి వదులుకుని ఫోర్డ్ ఫౌండేషన్ తరపున సలహాదారుగా ఇండియా వచ్చాడు. ఆయన వచ్చి చేసిన పని ఏమిటో తెలిస్తే ఆశ్చర్యం వేయక మానదు. ఫోర్డ్ ఫౌండేషన్ తరపున భారత ప్రభుత్వ సంస్ధ ‘కేంద్ర కుటీర పరిశ్రమల కార్పొరేషన్’ కు సలహా ఇచ్చే బాధ్యతతో ఆయన ఇండియా వచ్చారు!

ఫోర్డ్ కంపెనీ కార్లు తయారు చేస్తుంది. జాన్ పని (ఉద్యోగం) చేసిన మేకిస్ (Macy’s) కంపెనీ యేమో డిపార్ట్ మెంటల్ చెయిన్ స్టోర్లకు సంబంధించినది. అలాంటి వ్యక్తి-కార్ల కంపెనీ కలిసి భారతీయ కుటీర పరిశ్రమల అభివృద్ధికి ఏమి సలహాలు ఇచ్చారో ఊహకు అందని విషయం. చివరికి (ఇప్పటికి) మనకు కనిపిస్తున్న దృశ్యం ఏమిటయ్యా అంటే భారత ప్రభుత్వానికి సలహాలు ఇచ్చేందుకు వచ్చిన ఒక అమెరికన్ తానే ఇక్కడి కుటీర పరిశ్రమల నుండి సేకరించిన  దుస్తులను అమ్ముకుని సొమ్ము చేసుకునే ఒక పెద్ద కంపెనీగా అవతరించడం. 0.02 మిలియన్ డాలర్లతో ప్రారంభించబడినన ఫ్యాబ్ ఇండియా 2008లో 65 మిలియన్ డాలర్ల రెవిన్యూ ఆదాయం (మాత్రమే సుమా) పొందే స్ధాయికి ఎదిగింది.

పాఠకులకు గుర్తుంటే బ్రిటిష్ పాలకులు తమ కంపెనీల దుస్తుల అమ్మకాన్ని పెంచుకోవడానికి భారతీయ చేనేతలపై అనేక రెట్లు పన్నులు వేసి దేశీయ చేనేతల నడ్డి విరిచాడు. ఈ ఘోరానికి వ్యతిరేకంగా అని చెబుతూ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని గాంధీ/కాంగ్రెస్ నడిపారు. ఉద్యమంలో విదేశీ దుస్తులను జనం పెద్ద ఎత్తున  తగలబెట్టారని తన్మయంగా చెప్పుకుంటాం. అలాంటిది స్వాతంత్రం వచ్చేసిందని చెప్పాక బ్రిటిష్ వాడి బాబుగా మారిన అమెరికన్ ను పిలిచి మరీ సలహాలు ఇప్పించుకోవడం, వాడు దినదినాభివృద్ధి చెంది కోట్ల సొమ్ము పోగేసుకోవడానికి సహకరించడం బట్టి మనకి స్వాతంత్రం వచ్చినట్టా, రానట్టా?

మళ్ళీ ఫ్యాబ్ ఇండియా విషయానికి వస్తే స్మృతి ఇరానీ తరపున ఒక బి.జె.పి ఎమ్మెల్యే ఫిర్యాదు చేసిన రెండు రోజులకే కొల్హాపూర్ లో అదే ఫ్యాబ్ ఇండియాకు చెందిన దుకాణంలో ట్రయల్ రూమ్ లో దుస్తులు మార్చుకుంటున్న ఒక స్త్రీని సెల్ ఫోన్ కెమెరాతో చిత్రీకరిస్తూ దుకాణం సిబ్బంది ఒకరు పట్టుబడ్డాడు. ట్రయల్ రూమ్ లోని అద్దం లో కనిపించే దృశ్యాలను సిబ్బంది చిత్రీకరించడాన్ని ఆమె గమనించి సమీపంలోనే ఉన్న తన భర్తను కేకవేసి పిలిచారు. వారిద్దరు కలిసి నిందితుడి వెంటపడితే ఏ ఒక్క సిబ్బందీ వారి సహాయానికి రాలేదు. పైగా ఇలా చేశాడని చెబుతుంటే దంపతులకే నచ్చజెప్పడానికి ప్రయత్నించారు తప్ప చిత్రీకరణకు పాల్పడిన వ్యక్తిని పట్టుకుని నిలదీసే ప్రయత్నమే చేయలేదు. పైగా కేసు ఏమీ పెట్టవద్దని దంపతులను బతిమిలాడారు. ఏం జరిగిందో బాధితురాలి భర్త మాటల్లో చూడండి:

“ఓ 10-15 సెకన్ల తర్వాత అద్దంలో కెమెరా మెరుస్తుండడం తను (నా భార్య) గమనించింది.  వెంటనే అరుస్తూ నన్ను పిలవడంతో నేను ట్రయల్ రూమ్ లోకి పరుగెత్తుకు వెళ్ళాను. అతని చేష్టల గురించి నిలదీశాను. అసలు తనవద్ద ఫోనే లేదని అతను బుకాయించాడు. మేము అరిచి గోల చేస్తున్నా షోరూం లో ఎవరూ పట్టించుకోలేదు. ఈ లోపు అతను స్టాఫ్ రూమ్ లోకి పరుగెత్తుకు వెళ్తున్నా ఆపేందుకు ప్రయత్నించలేదు. కొద్ది సేపటికి బైటికి వచ్చి తన ఫోన్ ని చూపించాడు. అసభ్య దృశ్యాలు ఉన్నందున ఫోన్ ఇవ్వలేదని చెప్పాడు. సిసిటివి రికార్డు చూపాలని మేము కోరగా కోరగా చాలాసేపటికి చూపారు. ట్రయల్ రూమ్ దగ్గర అతను తచ్చాడుతున్నట్లు స్పష్టంగా కనిపించినప్పటికీ ఫ్యాబ్ ఇండియా సిబ్బంది ఎవరూ అతన్ని మందలించలేదు. పైగా అక్కడి నుండి సాగనంపి కేసు పెట్టొద్దని మమ్మల్ని అడగడం మొదలుపెట్టారు.”

దీన్ని బట్టి చూస్తే ట్రయల్ రూమ్ లలో స్త్రీలు దుస్తులు మార్చుకుంటున్న దృశ్యాలను చిత్రీకరించడం ఫ్యాబ్ ఇండియా దుకాణాల్లో మామూలు విషయంగా అనుమానించవలసి వస్తోంది. ఇదంతా సిబ్బందికి తెలిసే జరుగుతుందని స్పష్టం అవుతోంది. స్టోర్ యాజమాన్యం కూడా ఇందులో భాగస్వామ్యం వహించకపోతేనే ఆశ్చర్యపడాలి. ఎందుకంటే సిసిటివి కెమెరాలు ఉన్నాయని తెలిసీ సిబ్బంది అలాంటి చర్యకు ఎలా పాల్పడగలడు, తనకు ఏమీ కాదని ముందే అవగాహన ఉంటే తప్ప?

అమ్మాయిలను ప్రేమ పేరుతో మోసగించి లోబరుచుకోవడం, ఆ బలహీన క్షణాల దృశ్యాలను రికార్డు చేసి బ్లాక్ మెయిల్ చేయడం, ఇంటర్నెట్ లో అప్ లోడ్ చేయడం, బలాత్కారానికి పాల్పడి దానిని కూడా నిస్సిగ్గుగా రికార్డు చేసి బ్లాక్ మెయిల్ చెయ్యడం… ఇవన్నీ ఇప్పుడు పల్లెల్లో కూడా మామూలుగా మారాయని వరుసగా వెలుగులోకి వస్తున్న సంఘటనలు తెలియజేస్తున్న సత్యం. ఇదంతా ఒక పెద్ద వ్యాపారం. ఇలాంటి దృశ్యాలను సి.డిలకు ఎక్కించి అమ్ముకోవడం ఇప్పుడు భారీ లాభసాటి వ్యాపారం అయిందని అనేక విశ్లేషణలు చెబుతున్నాయి. మాఫియా గ్యాంగులు సైతం ఇందులో పాత్ర పోషిస్తోందని సామాజిక విశ్లేషకులు గగ్గోలు పెడుతున్నారు. ఈ దుర్మదాంధ యజ్ఞంలో పెడదారి పట్టిన యువకులు ఉపకరణాలుగా మారుతుండగా అమాయక యువతులు బలిపశువులు అవుతున్నారు. అనేకమంది అమ్మాయిలు బ్లాక్ మెయిలింగ్ కి లొంగి పోయి చివరికి శరీర వ్యాపారంలో తేలుతున్నారు.

ఇటువంటి అసభ్య, అసహ్యకర, నీతిమాలిన వ్యాపారం సొ కాల్డ్ అభివృద్ధి చెందిన పశ్చిమ దేశాల్లో చాలావరకు చట్టబద్ధం చేయబడింది. బూతు బొమ్మలు, బూతు వీడియోలు, బూతు నృత్యాలు, బూతు కేబరేలు, క్లబ్బులు ఒక జీవన విధానంగా పశ్చిమ దేశాల వ్యవస్ధలు అంగీకరిస్తున్నాయి. దీనిని కూడా భావ ప్రకటనా స్వేచ్ఛగానూ, వ్యాపార స్వేచ్ఛగానూ, పరిఢవిల్లుతున్న ప్రజాస్వామ్యం గానూ అమెరికా లాంటి దేశాలు సిగ్గు లేకుండా చాటుకుంటాయి. ప్లే బాయ్ లాంటి పత్రికలకు ఫోజులు ఇవ్వడానికి అక్కడి యువతులు ముందుకు రావడం సరే, భారతీయ నటిలు కూడా ప్లే బాయ్ లో తమ బొమ్మ కనిపిస్తే అది తమ కెరీర్ కి సోపానంగా భావించడం ఇప్పటి ఒక వాస్తవం.

ఇటువంటి సిగ్గుమాలిన, నీచ సంస్కృతిలో భాగమే ట్రయల్ రూమ్ లలో రహస్య కెమెరాలు. ఈ కెమెరాలు ఫ్యాబ్ ఇండియా లాంటి అమెరికా కంపెనీలోనే మొదటిసారి బయటపడడం యాదృచ్ఛికం కాదు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సాహసం చేసి గోవా ఫ్యాబ్ ఇండియా ఉదంతాన్ని బైటపెట్టినందువల్లనే కొల్హాపూర్ ఫ్యాబ్ ఇండియా ఉదంతాన్ని బైటపెట్టె సాహసానికి దంపతులు పూనుకుని ఉండవచ్చు. ఇలాంటి వాటిని బైటపెడితే తమ పరువే పోతుందని భావిస్తూ అనేకమంది నోరుమూసుకుని వెళ్లిపోవడమే తరచుగా జరుగుతుంది. ఈ దుష్కృత్యాలకు పాల్పడే వ్యక్తులకు, వ్యవస్ధలకు కూడా ఈ భయపూరిత లొంగుబాటు శక్తివంతమైన ఆయుధం అవుతోంది. వ్యక్తుల పరువు భయాలకు వెరవని శక్తివంతమైన వ్యక్తిత్వంలోనే ఉంటుంది తప్ప తమ ప్రమేయం లేకుండా శరీర భాగాలు వెల్లడి అవడంలో ఉండనే ఉండదన్న తెలివిడిని జనానికి ఇచ్చే సమాజంలో మనం లేము. కనుకనే ఈ దౌర్భాగ్యం.

ఫ్యాబ్ ఇండియా ఉదంతాల గురించి ఏ ఒక్క హిందూ స్వామి వారు, ఏ ఒక్క ఖాఫ్ పంచాయితీ పెద్దా, ఏ ఒక్క చట్ట సభల సభ్యుడూ/రాలూ బహిరంగ నీతి బోధలకు దిగకపోవడం సిగ్గు చేటైన విషయం. 2012 ఫిబ్రవరి 16 తేదీన నిర్భయ ఉదంతం జరిగాక టీ.విల ముందు, చర్చా గోష్టుల్లో ప్రత్యక్షమై ఎంతమంది స్వాములు అమ్మాయిలకు నీతి బోధలు చేయలేదు. సాక్షాత్తూ పార్లమెంటు సభల్లోనే ‘అంతరాత్రి బైటికి రావాల్సిన అవసరం ఏమిటి?’ అని ప్రశ్నించిన పెద్దలు మన ప్రతినిధులు! ఆంధ్ర శాసన సభ్యుడు సత్యం గారి సంగతి సరే సరి! ప్రస్తుతం ఊచలు లెక్కిస్తున్న అసరం బాపూ గారయితే ‘అన్నా నన్ను వదులు’ అని నిర్భయ వేడుకుని ఉంటే ఆమె ప్రాణం నిలిచేదని కూశాడు. ‘అబ్బాయిలు అబ్బాయిలే’ అని మన ప్రధాని పదవి అలంకరించాలని ఆశించిన ములాయం మరొక సందర్భంలో హుంకరించారు. ‘నిర్భయ శీలం పోయిందే, అయ్యో ఏమిటి గతి?’ అంటూ ఇప్పటి విదేశీ మంత్రి ఆనాడు నిండు సభలో వాపోయారు. అంతెందుకు? నిన్నటికి నిన్న నిర్భయపై అత్యాచారం జరిపిన ముఖేష్ మనోభావాలను వెలికి తెచ్చినందుకు తమ మనోభావాలు గాయపడ్డాయని పార్లమెంటు సభ్యులు కట్టగట్టుకుని విలపించారు. డాక్యుమెంటరీపై నిషేధం సైతం విధించారు.

వీళ్ళంతా ఇప్పుడు మైకులు పట్టుకుని ‘ఒరే అబ్బాయిలూ వెధవ పనులు మానండి’ అని ఒక చిన్న ఉపదేశం చేయాలని భావిస్తే అదేమన్నా పెద్ద కోరిక కాదు కదా. ఛానెళ్ల చర్చా గోష్టుల్లో కూర్చుని ఇలాంటి పనుల వల్ల మన హిందూ సంస్కృతి నాశనం అయిపోతోందని స్వాములవార్లు వాపోవలసిన సందర్భం కాదా? వేలంటైన్స్ డే రోజున డ్యూటీలు వేసుకుని మరీ పార్కుల్లో నిఘాలు వేసే హిందూ సంస్కృతీ పరిరక్షక ముఠాలు ఫ్యాబ్ ఇండియా గల్లా పట్టుకుని నిలదీయాల్సిన ఘోరం కాదా స్మృతి ఇరానీకి జరిగింది?

వాస్తవం అందుకు విరుద్ధంగా సాగుతోంది. ఎలాగో గొంతు పెగుల్చుకుని గంట మోగించిన స్మృతి ఇరానీ ఇప్పుడు, ఏయే శక్తులు, ఇంకేయే అధినేతల ఆదేశాలు పని చేసాయో గానీ ఆమె మూగ బోయారు. కేసు పెట్టారు కదా అని కొందరు అడగబోవచ్చు. కేసు నిర్భయ ఉదంతంలోనూ పెట్టారు. కేసుతో ఆపేశారా ఆనాడు? పైన చెప్పినట్లు ఎన్నెన్నో నీతి బోధలు, హెచ్చరికలు, మందలింపులు తిరిగి అమ్మాయిలకే చెప్పలేదా? ఆ హెచ్చరికలే ఇప్పుడు ఎందుకు లేవు? ఫ్యాబ్ ఇండియా దుకాణాల్లో మూడు రోజుల వ్యవధిలో రెండు దుర్మార్గాలు వెల్లడి అయినా ఆ కంపెనీకి ఒక్క హెచ్చరికన్నా ఎందుకు చేయలేకపోయారు? మనతో పాటు నివసించే భారతీయ ముస్లింలపైకి కత్తి పట్టుకుని లేచ్చే హిందూ పరిరక్షక బృందం మన సొమ్ము భోంచేస్తూ మన స్త్రీలనే, మన మహిళా మంత్రినే అవమానపరిచిన ఫ్యాబ్ ఇండియా దుకాణాల ముందు ఎందుకు ప్రత్యక్షం కాలేదు? అలా చేస్తే పెట్టుబడులు రావనే కదా భయం! ఈ మాట ఎవరో అన్నది కాదు. సాక్ష్యాత్తూ గోవా ముఖ్యమంత్రి గారే అనలేక అనలేక ‘ఇది దురదృష్టకరం’ అంటూనే, ‘కానీ గోవా టూరిస్టులకు మంచిదే సుమా’  అని సన్నాయి నొక్కులు నోక్కారు. ఆయన కూడా హిందూ సంస్కృతీ పరిరక్షక బి.జె.పి నాయకులే మరి!

నిజం ఏమిటంటే హిందూ సంస్కృతీ పరిరక్షకత్వం ఒట్టి బూటకం. ఆ పేరుతో కాసులు పండించుకోవడమే అసలు సంగతి. ఒకరు సెక్యులరిజం ముసుగులో కాసులకు కక్కుర్తి పడితే మరొకరు హిందూ సంస్కృతి ముసుగులో కాసులకు కక్కుర్తి పడతారు. ఇది దేశాన్ని పట్టి పీడిస్తున్న రెండు దోపిడీ ముఠాలు జనం కోసం, వారి ఓట్ల కోసం ఆడే జగన్నాటకంలో ఒకానొక లీల మాత్రమే.

6 thoughts on “ఎవరి గౌరవమీ ట్రయల్ రూముల రహస్య కెమెరాలు?

  1. తమ కొలువులో పని చేస్తున్న ఒక మహిళా మంత్రి ఇంతటి ఆవ మానం జరిగితే దాన్ని కూడా ‘ పరువు ” ముసుగులో daచేస్తున్నారంటే ఇక సామాన్యులకు ఎం పట్టిమ్సుకుమ్తారు? జతీయవాది వాదానికి ఉన్న ముసుగు కాస్త కాస్త తొలిగి పోవడం కనిపిస్తున్న వాస్తవం. స్మృతి ఇరాని కూడా ‘ సగటు ఆడదే’ ననిరుపిస్తూన్న పాలకుల్ని ‘ సంస్కృతిక రక్షక భటులు ఏమేరకు నిలదీస్తున్నారు? ఏరు దాటే తెప్ప తగలేయాదాన్ని ప్రజలు గుర్తించారా? స్త్రీల చేత ‘ నా చాయిస్ నాఇష్టం ‘ అనిపించే దుర్మార్గులకు సాగిరిల్లారా ?

  2. సర్ సంధర్భమో,అసంధర్భమో నాకొక సందేహం!–ఎవరి ప్రమేయం(బలవంతం)లేకుండా[స్వతహాగా] పత్రికలకు నగ్నంగా పోజులిస్తే,తద్వారా డబ్బులు సంపాధించుకోవడం అనైతకమా?
    ఆడవారుగానీ,మగవారుగానీ తమ ఆశలను/కోరికలను దేశ,కాల,మాన పరిస్తితులననుసరించి తీర్చుకోకూడదా?

  3. దేశ కాల, మాన పరిస్ధితులు వాటంతట అవే ఉనికిలో ఉండవు. అవి అప్పటి ఆధిపత్య వర్గాల ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటాయి. సమాజం పరస్పర విరుద్ధ ప్రయోజనాలు కలిగిన వర్గాలుగా విడిపోయి ఉన్నదంటే దానర్ధం ఒక వర్గానికి ప్రయోజనం కలిగించేది అవతలి వర్గానికి వ్యతిరేకంగా ఉంటుందనే.

    సమాజంలో ఉన్న పరిస్ధితులకు అనుగుణంగా స్త్రీలు సంపాదించుకుంటే తప్పేంటి అన్నది మీ ప్రశ్న. కానీ అలా సంపాదించుకోగల అవకాశాలు స్త్రీల ప్రయోజనాల కోసం ఏర్పడవు. స్త్రీల శరీరాలతో వ్యాపారం చేసే ఆధిపత్య వర్గాల లాభాల కోసం అవి ఏర్పడి ఉంటాయి.

    విచ్చలవిడితనం నేరంగా ప్రవచించే సమాజమే ఆ నేరాన్ని ప్రోత్సహించి లబ్ది పొందే అవకాశాలు కల్పించుకోవడంలో వైరుధ్యం లేదా? ఈ వైరుధ్యం దోపిడి వర్గాలకు లేదా వ్యాపారం చేసి లాభాలు పొందే వర్గాలకు ప్రయోజనం. కానీ స్త్రీలకు నష్టకరం.

    ఎందుకంటే తాత్కాలిక లాభం కనిపించినా సమాజపు సగటు విలువలైన గౌరవప్రదమైన జీవితం, ఆరోగ్యం, ఇరుగు-పొరుగు, సామాజిక ఆనందాలు…. ఇత్యాదివి వారికి నిషిద్ధం అవుతాయి. చివరికి వృద్ధాప్యంలో ఏ దిక్కూ లేక, ఆదరించేవారు కరువై దీనంగా చనిపోవలసిన పరిస్ధితి వస్తుంది. కొన్ని మెరుపులు ఉంటే ఉండవచ్చు. కానీ ఆ వెనుక దాగిన కటిక చీకటిని విస్మరించడం క్షంతవ్యం కాదు. అంతిమ పరిశీలనలో స్త్రీలకు స్వేచ్ఛగా కనిపించే ఇలాంటి బూటకపు స్వేచ్ఛలు వారిపైకే ఎక్కుపెట్టబడి ఉంటాయి.

  4. ప్రైవేత్ స్కూల్‌లో కార్పరల్ పనిష్మెంత్ వల్ల విద్యార్థికి గాయమైతే స్కూల్ పరువు పోతుందని యాజమాన్యంవాళ్ళు ఉపాధ్యాయుణ్ణే వెనకేసుకొస్తారు. ఇక్కడ కూడా ఇలాగే బట్టల షాప్ యాజమాన్యంవాళ్ళు కామాంధుల్ని వెనకేసుకురావడం జరుగుతోంది. పెట్టుబడిదారునికి తక్కువ జీతానికి పని చేసే కార్మికులు అవసరం. వాళ్ళ ప్రవర్తన గురించి పట్టించుకోవాల్సిన అవసరం పెట్టుబడిదారులకి లేదు.

  5. దేశ కాల, మాన పరిస్ధితులు వాటంతట అవే ఉనికిలో ఉండవు. అవి అప్పటి ఆధిపత్య వర్గాల ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటాయి–ఈ విధముగా ఆలోచిస్తే నిత్యం ఉనికిలో ఉండే ఎన్నో విషయాలు వారిప్రయోజనార్ధమే(ఆధిపత్యవర్గాల) కొనసాగుతున్నాయి!అంతమాత్రంచేత మనము ఆ కార్యాలను కొనసాగించకుండా ఉండలేము కదా!
    ఇక్కడ మీకు చిన్న ఉదాహరణ చెబుతాను–నాకు గత సంవత్సరం నిశ్చితార్ధం జరింగింది కట్నాలు,కానుకలు అన్నీటినీ పెద్దవాళ్ళు మాట్లడుకున్నారు.కానీ,అన్నిటికన్నా ముఖ్యమైన విషయం–ఆ అమ్మయిని బలవంతం మీద ఒప్పించారు అందుకు కారణం ఏమిటంటే ఆ అమ్మాయి అప్పటికే ఒక అబ్బాయిని ప్రేమించింది. కానీ,కులాలు వేరవడంతో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు(ఎందుకంటే ఇలా జరిగితే వాళ్ళకుంటుంబాన్ని ఆ కులంవాళ్ళు వెలివేస్తారు) కానీ,ఆ అమ్మాయి విషయం అంతానాకు చెప్పి నా సహయాన్ని అడిగింధి.పెద్దలందరినీ పిలిపించి నేనే ఆ సంభందాన్ని రద్దుచేయించడం జరిగింది.
    ఈ సామాజిక విలువలు అనేవి సాపేక్షికాలు పైవర్గాళ్ళవారు బ్రేక్ చేస్తే సమాజం ఒకరకమైన ట్రేట్మెంట్ విధిస్తుంది,కింది వర్గాళ్ళవాల్లు బ్రేక్ చేస్తే మరో రకమైన ట్రీట్మెంట్ విధిస్తుంది.
    ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నో సంఘటనలు,అన్నిటినీ వ్యాపార ప్రయోజనాల కోణంలో చూడలేము కదా!
    దాదాపుగా విలువలన్నీ సాపేక్షికాలే!ఏది నైతికము?ఏది అనైతకము? ఈ సంఘర్షణ నిత్యనూతనం.

  6. విశేఖర్ గారు, మీరు చర్చిస్తున్నది ఆకర్షణ కోసం పైపై కబుర్లు చెప్పుకునే భావజాలం గురించి. ఈ మధ్యనే సినిమా నటి దీపికా పడుకొణే “తాను పెళ్ళికి ముందు సెక్స్ చేస్తానా లేదా పెళ్ళైన తరువాత పరాయి మగాడితో సెక్స్ చేస్తానా” అనేది తన వ్యక్తిగత విషయం అని చెప్పింది. వివాహం బయట శృంగారం తప్పు కాదని ఒక సినిమా నటి నమ్మితే దాన్ని ఎవరూ విచిత్రంగా చూడరు కానీ అదే భావజాలాన్ని ఒక సాధారణ స్త్రీ నమ్మితే ఆమెని పతిత లేదా కులట అంటారు. వక్షోజాల మీద ఏమీ కప్పుకోకుండా పోజులు ఇచ్చిన మందిరా బేడీని కూడా ఒక నటిగా గౌరవిస్తారు కానీ ఒక కుటుంబ స్త్రీ అలా ఒళ్ళు చూపించుకుంటే ఆమె పతిత అవుతుంది. అదీ ఈ సమాజంలోని paradox. ఈ paradoxes గురించి తెలియకే కొంత మంది పార్నోగ్రఫీ వల్ల స్త్రీ స్వేచ్ఛ వస్తుందనుకుంటారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s