రూపాయిల నల్ల డబ్బు మన దేశానికే పరిమితం కాదు. ప్రపంచ వ్యాపితంగా రహస్యంగా నల్ల డబ్బు దాచుకునే బడా బాబులకు స్విట్జర్లాండ్ స్వర్గధామం అన్న సంగతి అందరికీ తెలిసిందే. అలాంటి స్విట్జర్లాండ్ లో కూడా రూపాయి తన ‘నల్ల ప్రతాపాన్ని చాటుకుంటోంది.
ఆ దేశంలో చెలామణిలో ఉన్న విదేశీ మారక ద్రవ్యంలో నల్ల డబ్బు కూడా ఒక పాత్ర పోషిస్తోంది. స్విట్జర్లాండ్ కు విదేశీ మారక ద్రవ్యంగా ఉండే వివిధ విదేశీ కరెన్సీలలో యూరో డాలర్ల తర్వాత స్ధానాన్ని రూపాయి లలో ఉన్న నల్ల డబ్బే ఆక్రమించిందని తెలుస్తోంది. స్విస్ కి చెందిన ఫెడరల్ ఆఫీస్ ఆఫ్ పోలీస్ (ఫెడ్ ఫోల్) విభాగం వారు ఈ మేరకు ‘కౌంటర్ ఫీట్ స్టాటిస్టిక్స్’ పేరుతో విడుదల చేశారు.
ఫెడ్ పోల్ వెల్లడి చేసిన తాజా గణాంకాల ప్రకారం 2014 సం.ము లో ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న దొంగనోట్ల సంఖ్య 181 అని తెలిసింది. ఈ సంఖ్య గత సం.ము (2013లో) 403 గా ఉండడం విశేషం. అనగా 2013తో పోల్చితే 2014లో స్విట్జర్లాండ్ లో పట్టుబడిన రూపాయి దొంగ నోట్లు సగానికి పైగా తగ్గిపోయాయి. గత యేడు కంటే తగ్గినప్పటికీ ఇండియన్ రూపాయి తన మూడో స్ధానాన్ని మాత్రం కాపాడుకుంది. స్విస్ ఫ్రాంక్ లలో దొరికిన నల్ల డబ్బు కైతే లెక్కే లేదు.
నివేదిక ప్రకారం యూరోలలో నల్ల డబ్బు నోట్లు 2,660 వరకు పట్టుబడ్డాయి. ఇది నోట్ల విలువ కాదని, నోట్ల సంఖ్య అనీ పాఠకులు గ్రహించాలి. ఇక అమెరికన్ డాలర్లయితే 1,101 దొంగ నోట్లు పట్టుబడ్డాయని తెలుస్తోంది. స్విస్ ఫ్రాంక్ లలో పట్టుబడిన దొంగ నోట్లు ఏకంగా 16,054 గా తెలుస్తున్నది. స్విస్ ఫ్రాంక్ ల దొంగ నోట్లు కూడా గత యేడు కంటే రెట్టింపు తగ్గిపోయాయని వార్తా పత్రికల ద్వారా తెలుస్తోంది.
2014లో పట్టుబడిన రూపాయి దొంగ నోట్లలో రు. 500/- నోట్లు 145 కాగా, రు. 1000/- ల నోట్లు 35 అనీ రు. 100 నోట్లు ఒకటి దొరికిందని ఫెడ్ పోల్ తెలిపింది. అనగా దీని మొత్తం విలువ రు. 1,07,600.
2013లో తీసుకుంటే అధికారులు పట్టుకున్న రూపాయి దొంగ నోట్లలో రు 500/- నోట్లు 380, రు 1000/- నోట్లు 23 ఉన్నాయి. అనగా వీటి మొత్తం విలువ రు. 2,13,000 లు. ఇవి ప్రభుత్వ అధికారులకు పట్టుబడినవి మాత్రమే. పట్టుబడకుండా ఉన్న మొత్తం ఎంత ఉంటుందో ఎవరికి వారు ఊహించవలసిందే. దేశం కానీ దేశం కనుక అక్కడ ఉండేది కొద్ది మంది భారతీయులే కనుక పట్టుబడనివి భారీ మొత్తంలో ఉండకపోవచ్చు.
2012లో రూపాయి దొంగ నోట్లు 2,624 పట్టు బడగా అది 2014 నాటికి బాగా తగ్గిపోవడం గమనార్హం. బి.జె.పి నేతలు దీనిని కూడా తమ క్రెడిట్ ఖాతాలో వేసుకుంటారేమో చూడాలి.
[వెయ్యి రూపాయల దొంగ నోట్లు గుర్తించడం ఎలాగో ఈ కింది బొమ్మలు చూస్తే కొంత అవగాహన కలగవచ్చు.]