జీవజాలంలో అన్నింటికంటే అభివృద్ధి చెందిన జీవి మనిషి. సృష్టిలోకెల్లా అత్యంత అభివృద్ధి చెందిన పదార్ధం అయిన మెదడు మనిషి సొంతం. అందుకే మనిషి ఆ అభివృద్ధి సాధించగలిగాడు.
బోరింగ్ పంపు, చేతితో తిప్పే ట్యాపు, బర్రెల్ని మందలు మందలుగా కట్టివేసే ఇనప కొక్కేలు… ఇవన్నీ మనిషి ఇటీవల తయారు చేసుకున్నవి. ఇటీవల అంటే పదుల సంవత్సరాలని కాదు. వందల సంవత్సరాలని ఇక్కడ అర్ధం. మానవ పరిణామం పదుల వేల యేళ్ళ తరబడి జరిగింది కనుక ‘ఇటీవల’ అన్న పదాన్ని కూడా ఆ ఒరవడిలోనే చూడాలి.
మనిషి ప్రకృతి సిద్ధంగా లభించే వివిధ వస్తువులు, పదార్ధాలపై శ్రమ చేసి కొత్త వస్తువులు తయారు చేసుకున్నాడు. శ్రమ చేయడం మనిషికి మాత్రమే తెలిసిన విద్య. ఆ శ్రమలనే అనుభవాలుగా పేర్చుకుని శాస్త్రాలుగా మలుచుకున్నాడు మనిషి. శాస్త్ర పరిజ్ఞానంతో తయారు చేసుకున్న వస్తువులు కనుక మనిషి మాత్రమే వాటిని ఉపయోగించగలడు… అని అనుకుంటుంటాం కదా. దానిని అబద్ధం చేసేశాయి ఈ బర్రెలు, ఆవులు.
ఒక ఎద్దు గోళ్ళెం తీసుకుని కొట్టం నుండి బైట పడితే ఒక ఆవు స్విచ్ వేసుకుని మరీ కొట్టంకి అమర్చిన స్లైడింగ్ తలుపు తెరిచి లోపలికి వెళ్తోంది. రెండు ఆవులు బోరింగ్ పంపు కొట్టుకుని నీళ్ళు తాగితే ఒక బర్రె తన కొక్కెంతో పాటు పక్క బర్రె కొక్కేలను కూడా ఊడదీసి తనకు తన యజమాని వేయని ఆహారాన్ని అందుకునేందుకు ప్రయత్నించింది.
మనిషి మచ్చిక చేసుకున్న జంతువులు తమ యాజమానుల చర్యలను ప్రతి రోజూ చూసి చూసి తామూ అలా చేయడం నేర్చుకున్నాయని ఈ వీడియోను బట్టి అర్ధం అవుతోంది.
తెలివి హీనులని కొన్ని కులాల ప్రజల్ని సహస్రాబ్దాల తరబడి అణచివేసిన పుణ్య భూమి మనది. ఒక పక్క సాటి మనిషిని హీనపరిచి దూరం పెడుతూ అదే పాటున ఆవు లాంటి జంతువుల్ని నెత్తిన పెట్టుకుని పూజించిన ఘనత ఈ పుణ్య భూమిదే.
తెలివి మనుషుల్లో కొందరి సొత్తు మాత్రమేనని శాస్త్రాలు రాసుకున్న పెద్దలను వెక్కిరిస్తున్నట్లు లేవా ఈ మూగ జీవాలు!? తెలివి మనుషుల్లో కొద్ది మంది సొత్తు మాత్రమే కాదని, అది అందరి సొత్తు అనీ, అది తమ సొత్తు కూడా అని ఈ ఎద్దు, బర్రె, ఆవు చెప్పడం లేదా?
కాకపోతే అవకాశాలు లేక కొందరు వెనకబడితే భూములు, పరిశ్రమలు లాంటి ఉత్పత్తి సాధనాలని తమ గుత్త సొత్తు చేసుకున్న కొద్ది మంది అపరిమిత అవకాశాలతో కాస్త జ్ఞానాన్ని లేదా శ్రమల అనుభవాన్ని కూడా సొంతం చేసుకున్నారు. ఈ వివక్షే లేనట్లయితే తెలివి/ప్రతిభ అందరి సొత్తు అని అందని అవకాశాలే దాన్ని అనేకమందికి దూరం చేశాయని కమ్యూనిస్టులు కాదు, ఈ జంతువులే చెబుతున్నాయి.
బాగున్నాయి. అవసరమే ఎవరికైనా అసలైన గురువు. జంతువులకైనా……