కారణం ఏదైతేనేం గత కొద్ది నెలలుగా ద్రవ్యోల్బణం తగ్గు ముఖం పడుతూ వచ్చింది. కృత్రిమంగా తగ్గించారా లేక అదే తగ్గిందా అన్నది బ్రహ్మ రహస్యం. ఆర్ధిక మంత్రి మాటలను బట్టి చూస్తే ద్రవ్యోల్బణం మళ్ళీ పెరగక తప్పదని ఆయన చెబుతున్నట్లుగా ఉంది.
ఆర్.బి.ఐ రెండేళ్లకు పైగా వడ్డీ రేట్లు తగ్గించకుండా కొనసాగించింది. అందుకు కారణం మొండిగా తగ్గుదల లేకుండా కొనసాగిన ద్రవ్యోల్బణం దాదాపు సంవత్సరం క్రితం ఇండియా ద్రవ్యోల్బణం 8.5 శాతం పైనే ఉంది. ఆరు నెలల క్రితం చూసినా 7 – 8 శాతం మధ్య కదలాడుతూ ఉంది.
బి.జె.పి అదృష్టమో దురదృష్టమో ఆ పార్టీ అధికారం చేపట్టిన నాటి నుండి స్వల్పంగా తగ్గుతూ వచ్చిన ద్రవ్యోల్బణం సెప్టెంబర్ 2014 నుండి బాగా తగ్గుతూ వచ్చింది. నవంబర్ 2014 నాటికి అత్యల్పంగా 4.38 శాతం ద్రవ్యోల్బణం నమోదయింది. (గణాంకాలు: ట్రేడింగ్ ఎకనమిక్స్)
అయితే డిసెంబర్ నుండి ద్రవ్యోల్బణం పెరగడం ప్రారంభం అయింది. డిసెంబర్ లో 5 శాతానికి చేతుకున్న ద్రవ్యోల్బణం ఫిబ్రవరి నాటికి 5.37 శాతానికి పెరిగింది. ద్రవ్యోల్బణం తగ్గుదల తమ చలవే అని, తమ పాలనా ప్రతిభ అనీ చాటుకున్న బి.జె.పి నేతలు తాజాగా కనిపిస్తున్న పెరుగుదలకు మాత్రం నెపాన్ని ప్రకృతిపై నెట్టేస్తున్నారు.
మార్చి మొదటి వారంలో ఉత్తర, మధ్య భారతంలోని కొన్ని రాష్ట్రాల్లో వర్షాలు కురిసాయి. గోధుమ పంటే రాష్ట్రాలివి. ఇవి అకాల వర్షాలని, వాటివల్ల ఆహార పంటలు దెబ్బ తిన్నాయని ఆర్ధిక మంత్రి సి.ఎన్.ఎన్-ఐ.బి.ఎన్ చానెల్ తో మాట్లాడుతూ చెప్పారు. దీనివల్ల రానున్న రోజుల్లో ద్రవ్యోల్బణం ఇంకా పెరగవచ్చని ఆర్ధిక మంత్రి సూచించారు.
“పంటలకు నష్టం జరిగింది. దాని పరిణామాలు కూడా మనం ఎదుర్కోక తప్పదు. ద్రవ్యోల్బణంపై ఆ ప్రభావం పడుతుంది. కొన్ని నిర్దిష్ట ఆహార పదార్ధాలు కూడా కొరత ఏర్పడవచ్చు. అయినప్పటికీ ఆహార ధాన్యాలకు సంబంధించినంతవరకు మనకు మిగులు నిల్వలు ఉన్నాయి. వాటి ద్వారా కొరత సమస్యను ఎదుర్కోవచ్చు” అని ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ చానెల్ తో అన్నారు.
మునుముందు ఆహార ధాన్యాల కొరత ఏర్పడితే గనక అందుకు తమ బాధ్యత ఏమీ ఉండబోదని కాలం కాని కాలంలో భారీ వర్షాలు కురిపించిన ప్రకృతిదే బాధ్యత అవుతుందని జైట్లీ ముందే చెప్పేస్తున్నారు. కేంద్ర ఆర్ధిక మంత్రి స్ధాయి వ్యక్తి ద్రవ్యోల్బణం గురించి, ఆహార కొరత గురించి ఆధారాలు లేకుండా ముందే మాట్లాడరు. అలా మాట్లాడితే మార్కెట్లలో విపరిణామాలు ఎదురవుతాయి. కనుక మంత్రి మాటలను కేవలం అంచనాలుగా కొట్టిపారేయడానికి వీలు లేదు. బహుశా నిజంగానే ఆహార ధాన్యాల కొరత ఏర్పడవచ్చు. దరిమిలా ధరలు పెరిగి ద్రవ్యోల్బణమూ పెరగవచ్చు.
ద్రవ్యోల్బణం నెమ్మదించిందన్న ధైర్యంతో కొద్ది వారాల వ్యవధిలోనే రెండు విడతలుగా వడ్డీ రేట్లను గవర్నర్ తగ్గించారు. 8 శాతం నుండి 7.5 శాతానికి వడ్డీ తగ్గించి పారిశ్రామికవేత్తలకు, కంపెనీలకు, సంపన్నులకు మరిన్ని నిధులు అందుబాటులో తెచ్చారు. ఈ తగ్గింపు వలన ఒకటి రెండు బ్యాంకులు రుణాలపై వడ్డీ రేట్లు కూడా తగ్గించాయి. దాదాపు బ్యాంకులన్నీ డిపాజిట్లపై చెల్లించే వడ్డీ రేటును వెంటనే తగ్గించేశాయనుకోండి!
ఇప్పుడు మళ్ళీ ధరలు పెరిగితే, దానివల్ల ద్రవ్యోల్బణం పెరిగితే వడ్డీ రేటు ఇంకా తగ్గించాలన్న సంపన్నుల డిమాండ్ ని ఆర్.బి.ఐ తీర్చగలదా అన్నది ఆసక్తికరమైన ప్రశ్న. వడ్డీ రేటు సంగతి అటుంచి ఆహార కొరత మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. దీనివల్ల తక్షణం ప్రభావితం అయ్యేది పేదలు, దిగువ మధ్య తరగతి ప్రజలే.