“అబ్బే అలాంటిదేమీ లేదు- డెలివరీ ఇవ్వాల్సిన చిన్న పార్సిల్, అంతే…”
హిందూత్వ బ్రిగేడ్ లో ఫ్రింజ్ గ్రూపులది ప్రత్యేక స్ధానం. సదరు గ్రూపులు మతపరమైన అల్లర్లు రెచ్చగొట్టి ప్రజల్లో విభేదాలు సృష్టిస్తే ఆ విభేదాలు ఆసరాగా గంభీర వదనాలతో ఓట్లు నంజుకు తినడం బి.జె.పి నేతల పని. బాబ్రీ మసీదు కూల్చివేత నుండి గుజరాత్ హత్యాకాండ మీదుగా ముజఫర్ నగర్ అల్లర్ల వరకు జరిగింది ఇదే.
అయితే కేంద్రంలో అధికారం చేపట్టిన తర్వాత ఈ పరిస్ధితిలో కొద్దిగా (కొద్దిగానే సుమా!) మార్పు వచ్చింది. ఆ మార్పు కూడా మారిన పరిస్ధితులకు అనుగుణంగా అప్రతిష్ట పాలు కాకుండా ఉండేందుకే. అల్లరి మూకలు నానా అల్లరీ చేసి పోగా పరిస్ధితిని చక్కదిద్దే పని తమదే అన్నట్లుగా బి.జె.పి నేతలు ఇప్పుడు వ్యవహరిస్తున్నారు. అప్పుడప్పుడూ భారత దేశ లౌకిక వస్త్రం (secular fabric) చిరిగి పోకుండా కాపాడే బాధ్యతను కూడా వారు మాటల్లో మోస్తున్నారు.
ఇదంతా ఎందుకు అంటే పశ్చిమ కంపెనీలు కోరిన అభివృద్ధి చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక తప్పదు మరి! రాష్ట్ర స్ధాయిలో అయితే ఏదో విధంగా తప్పుకోవచ్చు గానీ జాతీయ స్ధాయిలో అది కుదరదు. ఐరాస, మానవ హక్కుల సంస్ధలు లాంటి అంతర్జాతీయ సంస్ధలు రంగంలోకి దిగి పరువు తీసినా తీస్తాయి. పశ్చిమ కంపెనీలకు కావాల్సింది ఏదో విధంగా అధికారం చేపట్టి తమ ప్రయోజనాలు తీర్చడం. అధికారంలోకి వచ్చాక కూడా అల్లరి మూకలతో చెరుపు చేస్తే అవి ఒప్పుకోవు. మరొకరిని చూసుకుంటాయి.
అలాగని మూకల్ని వదులుకునే సాహసానికి పూనుకోలేరు. వారితో ఎప్పటికీ పని ఉంటూనే ఉంటుంది. అందువలన వారిని ఎప్పటికీ వెంటబెట్టుకుని వెళ్తూనే ఉండాలి. అయితే అభివృద్ధిని గమ్యంగా పెట్టుకుని చేసే ప్రయాణంలో ఫ్రింజ్ గ్రూపులు సహాయకారి కాజాలవని, అవి ఆటంకం మాత్రమేనని కార్టూనిస్టు సూచిస్తున్నారు. అవి ఫ్రింజ్ గ్రూపులు కావని, అభివృద్ధి లక్ష్యం చేరుకునే క్రమంలో డెలివరీ ఇవ్వాల్సిన పార్సిల్ మాత్రమేననీ బి.జె.పి అధ్యక్షుడు అమిత్ షా నమ్మ బలుకుతున్నప్పటికీ అది నిజం కాదని కూడా కార్టూనిస్టు చెబుతున్నట్లే ఉంది.
హై వే పైన ఎట్టంటే అట్లా ప్రయాణం కుదరదు. టూ, త్రీ, వీలర్ లకు రోడ్డుకు అడ్డంగా విస్తరించి ఉండే సరుకుల్ని కట్టుకుని ఇతర వాహనాలకు మహా ఇబ్బంది పెట్టేవారిని మనం నిత్యం చూస్తుంటాము. ఇలాంటివి హై వే లపై చస్తే కుదరదు. నాలుగు, ఆరు లైన్ల హైవే రోడ్లపై దారి పొడవునా గీతలు గీసి ఉంటాయి. వాహనాలు ఆ గీతల మధ్యనే వెళ్ళాలి తప్ప గీతకు అటూ ఇటూ చక్రాలు నడిచేలా నడపరాదు. అలా చేస్తే వేగంగా వెళ్ళే వాహనాలు ప్రమాదాలకు గురవుతాయి. మోడి చెప్పిన అభివృద్ధి గమ్యం వైపు చేసే ప్రయాణంలో ఫ్రింజ్ గ్రూపులను వాహనానికి ముందు కట్టుకుని మరీ బి.జె.పి నేతలు వెళ్తున్నారని వాటి వల్ల బి.జె.పి ప్రయాణంలో ప్రమాదాలు తప్పవని కార్టూనిస్టు హెచ్చరిస్తున్నారు.
బి.జె.పి నాయకత్వం అధికారం చేపట్టినదే ఫ్రింజ్ గ్రూపుల మూక చేష్టలపై ఆధారపడి! కానీ ఆ అధికారం నిలబెట్టుకోవాలంటే వారిని వదిలించుకోవాలి. వదిలించుకుంటేనేమో ఓటు బ్యాంకుకు గండి తప్పదు. కింకర్తవ్యం?
ఈ వైరుధ్యాన్ని బాధ్యతల విభజన ద్వారా గతంలో బి.జె.పి పరిష్కరించుకుంది. ఒకరు అతివాద స్ధానంలో నిలబడి రెచ్చగొడుతూ ఉంటే మరొకరు మోడరేట్ స్ధానంలో నిలబడి నచ్చజెప్పే బాధ్యత తీసుకునేవారు. ఇప్పుడు బి.జె.పి లో ఇలాంటి బాధ్యతల విభజన లేదా అధికార పంపిణీ కనపడడం లేదు. మోడరేట్ స్ధానంలో నిలబడేందుకు మోడి చేస్తున్న ప్రయత్నం స్వ శిబిరంలో అసంతృప్తిని రేపవచ్చు. మోడి-అమిత్ ల అభివృద్ధి ప్రయాణం ఈ విధంగా ఆసక్తికరంగా మారింది.
భాజపా & దాని వందిమాగధులకి విదేశీ పెట్టుబడులు తప్ప ఏదీ అవసరం లేదు. నరేంద్ర మోదీ హిందూత్వ విషయంలో కొంచెమైనా వెనక్కి తగ్గుతాడు. FIIల వల్ల stock marketsలో షేర్‌ల ధరలు పెరిగి కొంత మంది భారతీయులు కూడా వేల కోట్లు సంపాదించారు కనుక కొంత మంది స్వదేశీ పెట్టుబడిదారుల సపోర్త్ కూడా భాజపాకి ఉంటుంది. హిందూత్వం లేకపోయినా, అంబానీ లాంటివాళ్ళ సపోర్త్‌తో భాజపా గెలవగలదు. 2014 ఎన్నికల్లో అందరి కంటే ఎక్కువగా భాజపా కోసం ఖర్చు పెట్టింది అంబానీలే.