పాలస్తీనా ప్రజలకు శాంతి మరింత దూరం జరిగింది. వారి జాతీయ పోరాటం మరిన్ని కష్టాల పాలు కానున్నది. సొంత ఇంటికి తిరిగి వచ్చే 60 యేళ్ళ కలకు భంగం కలిగిస్తూ ఇజ్రాయెల్ ఎన్నికల్లో యుద్ధోన్మాద బెంజిమిన్ నెతన్యాహూ పార్టీ అతి పెద్ద పార్టీగా అవతరించింది. ఆయన నేతృత్వం వహించే లికుడ్ పార్టీ ఇతర మితవాద, జాత్యహంకార పార్టీలను కూడగట్టి ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.
ఇరాన్, గాజాలపై అలుపు లేకుండా యుద్ధాలకు, ఏకపక్ష దాడులకు, యుద్ధ నేరాలకు, శాస్త్రవేత్తల హత్యలకు, రాజకీయ నాయకుల హత్యలకు నెతన్యాహు ప్రభుత్వం పాల్పడింది. అలాంటి ప్రభుత్వం మళ్ళీ ఏర్పాటు కావడం అంటే పాలస్తీనా ప్రజల జాతీయ పోరాటానికి అంతర్జాతీయ స్ధాయిలో మరింత కాలం పాటు ప్రతిష్టంభన ఎదురు కావడమే.
120 స్ధానాలున్న ఇజ్రాయెల్ పార్లమెంటు నెస్సెట్ లో 30 స్ధానాలను లికుడ్ పార్టీ గెలుచుకుంది. అభిప్రాయ సేకరణ సర్వేల్లో చివరి నిమిషం వరకు లికుడ్ పార్టీ వెనుకబడి ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయి. దానితో లికుడ్ అతి పెద్ద పార్టీగా అవతరించడం పరిశీలకులను ఆశ్చర్యపరిచింది.
సర్వేలు తమకు వ్యతిరేక ఫలితాలు వస్తాయని తెలియజేయడంతో లికుడ్ నేత నెతన్యాహు చివరి రోజుల్లో తీవ్రవాద ప్రచారానికి లంకించుకున్నాడు. పాలస్తీనా ప్రజలకు స్వతంత్ర రాజ్యం ఇచ్చేది లేదని యూదు ప్రజలకు హామీ ఇచ్చాడు. పాలస్తీనా రాజ్యం ఆవిర్భావం కావడం అంటే ఇజ్రాయెల్ పొరుగునే ఇస్లామిక్ ఉగ్రవాదులకు స్ధావరం కల్పించడమే అని ప్రచారం చేశాడు. వాస్తవానికి ఇసిస్ ఉగ్రవాదులకు ఆయుధ శిక్షణ, సహాయం ఇస్తున్న దేశాలలో ఇజ్రాయెల్ ఒకటి కావడం గమనించవలసిన సంగతి.
నేతన్యాహు 6 సం.ల పాలనపై 2015 ఎన్నికలు రిఫరెండం కానున్నాయని ఎన్నికల ముందు పలువురు అభివర్ణించారు. ఎన్నికల సర్వేలు కూడా ప్రధానంగా ఆయన చుట్టూనే కేంద్రీకృతం అయ్యాయి. ఆయన ప్రభ క్షీణించిందని సదరు సర్వేలు తెలిపాయి. సర్వేలను సీరియస్ గా పరిగణించిన నేతన్యాహు ప్రజల్లో ఆమోదం పెంచుకోవడం కోసం వ్యూహం మార్చుకుని మరింత తీవ్రమైన మితవాద ప్రచారానికి దిగాడు. ఆయన వ్యూహం ఫలించిందని ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయి.
లికుడ్ పార్టీకి 30 సీట్లు దక్కగా ప్రత్యర్ధి పార్టీల కూటమి అయిన జియోనిస్టు యూనియన్ 24 సీట్లు గెలుచుకుంది. యధావిధిగా ఇతర మితవాద పార్టీలు, మతవాద పార్టీలతో కలిసి కూటమి ప్రభుత్వాన్ని లికుడ్ పార్టీ ఏర్పాటు చేస్తుందని భావిస్తున్నారు. అనగా ఇజ్రాయెల్ లో యధాతధ రాజకీయ పరిస్ధితి కొనసాగనుంది. అతి పెద్ద పార్టీగా అవతరించినందున మరింత తేలికగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లికుడ్ కి దక్కింది. ఇతర పార్టీల ఒత్తిళ్లకు తల ఒగ్గే పరిస్ధితి కాస్త తగ్గింది.
నేతన్యాహు మళ్ళీ ప్రధాన మంత్రిగా కొనసాగనున్న పరిస్ధితుల్లో మధ్య ప్రాచ్యంలో శాంతి దుర్లభం కానున్నదని అంతర్జాతీయ పరిశీలకులు భావిస్తున్నారు. సిరియాలో ఇస్లామిక్ తీవ్రవాద గ్రూపులు భూభాగాలు ఆక్రమించుకోవడంలో నేతన్యాహు ప్రభుత్వం సహాయ సహకారాలు అందించింది. సెక్యులరిస్టు అస్సాద్ ప్రభుత్వం తమ ప్రాంతీయ ఆధిపత్యానికి ఎప్పటికైనా ముప్పేనని ఇజ్రాయెలి పాలకవర్గాల అంచనా. అమెరికా సామ్రాజ్యవాదులకు జూనియర్ భాగస్వాములుగా వ్యవహరించే యూదు జాత్యహంకార పాలకులు ఒక్కోసారి అమెరికాని సైతం ఆడిస్తున్నట్లు కనిపిస్తారు. అమెరికాలో అత్యంత శక్తివంతమైన యూదు లాబీ సంస్ధ AIPAC (American Israeli Public Affairs Committee) వల్లనే ఇది సాధ్యపడిందన్నది అందరికీ తెలిసిన విషయం.
నేతన్యాహు విజయం అమెరికాకు కూడా సమస్య కానుందని కొన్ని పత్రికలు, ముఖ్యంగా పశ్చిమ మీడియా వ్యాఖ్యానిస్తోంది. పాలస్తీనా స్వతంత్రానికి సహకరించడం ద్వారా మధ్య ప్రాచ్యంలో శాంతికి అమెరికా ప్రయత్నిస్తోందని దానికి నేతన్యాహు విజయం ఆటంకం అనీ పశ్చిమ మీడియా నమ్మబలుకుతోంది. కానీ ఇది వాస్తవం కాదు. ఇలా ప్రచారం చేయడం కూడా అమెరికా ఎత్తుగడలో భాగమే. మధ్య ప్రాచ్యంలో ఇజ్రాయెల్ సాగించే పాపాలకు, యుద్ధ నేరాలకు, జాతి అణచివేతలకు అమెరికాకు బాధ్యత లేదని చెప్పుకునేందుకె ఈ ప్రచారం.
నిజానికి ఇజ్రాయెల్ పాపాలకు అంతిమ లబ్దిదారులు అమెరికా సామ్రాజ్యవాద బహుళజాతి కంపెనీలే. ఇజ్రాయెల్ దేశం అరబ్బు రాజ్యాలపై సాగించే అణచివేత, పెత్తనాల వల్లనే అరబ్బు చమురుపై అమెరికా కంపెనీలకు, గుత్తాధిపత్యం లభిస్తోంది. ఇజ్రాయెల్ ప్రయోగించే అత్యాధునిక ఆయుధాలన్నీ అమెరికా సరఫరా చేసినవే. అమెరికా తయారు చేసే మానవ విధ్వంసక మారణాయుధాలకు అరబ్బు దేశాలు ప్రయోగశాలగా ఉపయోగపడేందుకు ఇజ్రాయెల్ సహకరిస్తుంది. అలాంటి అమెరికాకు ఇజ్రాయెల్ సమస్య కానే కాకపోగా మధ్య ప్రాచ్యంలో ఒక శక్తివంతమైన వ్యూహాత్మక ఆస్తి (అసెట్).
అమెరికా సామ్రాజ్యవాద పెత్తనం నానాటికీ కష్టాలు ఎదుర్కొంటున్న నేపధ్యంలో, లికుడ్-నెతన్యాహు ప్రభుత్వం తిరిగి ఎన్నికైనందున, రానున్న రోజుల్లో మరిన్ని గాజా యుద్ధాలను మనం చూడవలసి రావచ్చు. మరిన్ని పాలస్తీనా ప్రజల ఊచకోతలకు మనం సాక్షులుగా మిగలవచ్చు.