[Status quo in Israel శీర్షికన ఈ రోజు -20/03/2015- ప్రచురించబడిన సంపాదకీయానికి ఇది యధాతధ అనువాదం. -విశేఖర్]
2015 ఇజ్రాయెలీ చట్టసభ ఎన్నికల్లో మొత్తం 120 సీట్లకు గాను 30 సీట్లు గెలుచుకున్న లికుడ్ పార్టీ ప్రధమ స్ధానంలో నిలవడం, దరిమిలా బెంజమిన్ “బీబీ” నెతన్యాహు ప్రధాన మంత్రిగా తిరిగి ఎన్నిక కావడం ఒకింత ఆశ్చర్యకరం. లేబర్ పార్టీతో సహా వివిధ సెంట్రిస్టు-మోడరేట్ పార్టీల కూటమి జియోనిస్టు యూనియన్ కు మెరుగైన ఫలితాలు లభిస్తాయని ఎగ్జిట్ పోల్స్ సూచించగా, లికుడ్ పార్టీకి అంచనా వేసిన మొత్తం కంటే చాలా ఎక్కువ ఓట్లు లభించడంతో అది తప్పని తేలింది. లికుడ్ పార్టీకి సొంత మెజారిటీ లేనప్పటికీ ఇతర పార్టీలతో కలిసి కూటమి ప్రభుత్వం ఏర్పరిచే హక్కు దానికి లభించింది. నెతన్యాహు నాలుగోసారి ప్రధాన మంత్రి అవుతారని స్పష్టం అయిపోయింది.
అంచనాలను తారుమారు చేస్తూ లికుడ్ సాధించిన విజయం నెతన్యాహూ సాగించిన విభేదాత్మక ప్రచారం వల్ల సాధ్యపడిందని చెప్పవచ్చు. ఇజ్రాయెలీ అరబ్బులను నిందిస్తూ, దూషిస్తూ, పాలస్తీనీయుల ప్రత్యేక దేశ డిమాండ్ ను తిరస్కరిస్తూ ఎన్నికల ప్రచారంలో అత్యంత తీవ్రమైన జాత్యహంకార అవగాహనను నెతన్యాహు తీసుకున్నాడు. మితవాద పక్షాల విజయాన్ని బట్టి ఇజ్రాయెలీ సమాజంలో తీక్షణ మార్పులు వచ్చాయని అర్ధం అవుతోంది. పాలస్తీనీయులతో దృఢమైన శాంతికి అనుకూలంగా ఎలాంటి సంజ్ఞ చూపినా మిలిటెంట్ గా వ్యతిరేకించే విధంగా ఆ సమాజం తయారయింది. లెఫ్టిస్టులు మరియు అరబ్ పార్టీలతో కూడిన ‘జాయింట్ లిస్ట్’ అనే గ్రూపు 12 సీట్లతో మూడో పెద్ద గ్రూపుగా ఆవిర్భవించడమే ఈ ఎన్నికల్లో కాస్త చెప్పుకోదగ్గది. ఈ నెస్సెట్ లో ఇజ్రాయెలీ అరబ్బులకు గతంలో కంటే మెరుగైన, బిగ్గర గొంతు లభించింది.
ప్రపంచ స్ధాయిలో చూస్తే నెతన్యాహు విజయం ఇజ్రాయెల్ కు అత్యంత సన్నిహిత మిత్ర దేశమైన అమెరికాను కూడా నిస్పృహకు గురి చేయాల్సినది. 2014లో గాజాపై అత్యంత క్రూరంగా దాడి చేసిన ఇజ్రాయెలీలను ఆ పని చేయకుందా నిరోధించడంలో అమెరికా విఫలం అయింది. ఇస్లామిక్ స్టేట్ తో అమెరికా ఇప్పటికే యుద్ధంలో మునిగి ఉన్నందున ఇజ్రాయెల్ లో అతివాదుల విజయం, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను చల్లబరిచే వ్యూహాత్మక పధకానికి ఏమంత సహాయకారి కాదు. రెండు రాజ్యాల (పాలస్తీనా భూభాగంపై ఇజ్రాయెల్, పాలస్తీనా రాజ్యాలు పక్కపక్కనే ఉనికిలో ఉండగల) పరిష్కారానికి అమెరికా బహిరంగ మద్దతు ప్రకటించింది. ఎన్నికల ప్రచారంలో పాలస్తీనా రాజ్య ఆవిర్భావానికి బహిరంగంగా స్పష్టమైన వ్యతిరేకతను నెతన్యాహూ ప్రకటించడం అమెరికాకు సమస్య కానుంది. నెతన్యాహు తన అవగాహనను మార్చుకున్నందున 1967 పూర్వ సరిహద్దులతో కూడిన పాలస్తీనా రాజ్యాన్ని నిర్వచించే ఐరాస తీర్మానానికి అమెరికా మద్దతు ఇవ్వవచ్చు. కానీ బహుశా అది జరిగే పనికాదు.
ఇజ్రాయెల్ భౌగోళిక రాజకీయ ప్రత్యర్ధి అయిన ఇరాన్ తో అమెరికా క్లిష్టమైన చర్చలు నిర్వహిస్తోంది. ఇరాన్ తో అణు ఒప్పందం సాధించడానికి ఆమెరికా ఈ చర్చల ద్వారా ప్రయత్నిస్తోంది. కనుక ఇజ్రాయెల్ తో తనకు గల ప్రత్యేక సంబంధాన్ని చెరుపుకోజాలదు. అమెరికాలోని ఇరు పక్షాలలోనూ, ముఖ్యంగా పునరుజ్జీవం సాధిస్తున్న రిపబ్లికన్ పార్టీలో విస్తరించి ఉన్న శక్తివంతమైన ఇజ్రాయెలీ లాబీ మద్దతు తమకు ఉండడంతో నెతన్యాహూ మిత్ర పక్షాలు అమెరికా అధ్యక్ష భవనం, విదేశాంగ శాఖలను మించి వ్యవహరించగలవు. అయితే జియోనిస్టు జాత్యహంకారానికి నెతన్యాహు ఇస్తున్న బేషరతు మద్దతు, ఆచరణలో అమెరికాను దాటిపోయి చట్టవిరుద్ధ ఇజ్రాయెలీ సెటిల్మెంట్లు, పాలస్తీనా ఆధారిటీకి ఐరాస రాజ్య హోదా ఇవ్వడం లాంటి సమస్యలను పాలస్తీనా దృక్పధంలో వివిధ సమస్యలను చూసేందుకు ఇతర పశ్చిమ దేశాలను పురిగొల్పవచ్చు.