వెనుకబాటుతనం నిర్ధారణ -ది హిందు ఎడిటోరియల్


Caste and reservation

విద్య, ఉద్యోగ రంగాలలో నిర్దిష్ట కులాలకు కేటాయించిన రిజర్వేషన్ ఫలాల పంపిణీని ఒక్కోసారి సామాజిక-విద్యా వెనుకబాటుతనం కాకుండా రాజకీయ సమీకరణలు నిర్ణయిస్తుంటాయి. కేంద్ర ప్రభుత్వ ఒ.బి.సి (ఇతర వెనుకబడిన కులాలు) జాబితాలో జాట్ లను చేర్చుతూ చేసిన నిర్ణయాన్ని కొట్టివేస్తూ…, రిజర్వేషన్ కోటాల లబ్దిదారులను నిర్ణయించడంలో “తమను తాము సామాజికంగా వెనుకబడినవారిగా ప్రకటించుకోవడాన్ని” అనుసరించి రాష్ట్ర ప్రభుత్వాలు సైతం వెళ్ళే వైఖరిపై అనంగీకారం ప్రకటించింది. తొమ్మిది రాష్ట్రాల వ్యాపితంగా విస్తరించిన జాట్ లు ఉత్తర భారతంలోని అనేక ఇతర కులాల కంటే సాపేక్షికంగా ధనికులు. కానీ వారు తమను ఒ.బి.సి కోటా కులాల కింద గుర్తించేందుకు వీలుగా ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి ప్రభావితం చేసేందుకు సంఖ్యాపరంగా కలిగిన తమ ఆధిక్యతను ఉపయోగిస్తున్నారు. రాష్ట్రాలు రాజకీయ అవసరాల వల్ల ప్రభావితం కారాదు; వెనుకబాటుతనం యొక్క ప్రవర్ధమాన రూపాలను గుర్తించడంలో అత్యంత జాగరూకత వహించాలి.

గత తప్పులు లేదా రిజర్వేషన్ జాబితాలో జరిగిన “తప్పుడు చేర్పులు”, తీర్పు ప్రకారం, మరిన్ని తప్పులు చేసేందుకు ప్రాతిపదిక కారాదు. అయితే ఒ.బి.సిల జాబితాలో ఎటువంటి మార్పునైనా కొట్టిపారవేయకుండా కోర్టు జాగ్రత్త వహించింది. విరుద్ధ కోణంలో పరిశీలిస్తూ, తీర్పు రాసిన జస్టిస్ రంజన్ గొగోయ్ రిజర్వేషన్ ఫలితాల అందజేతకుగాను ట్రాన్స్ జెండర్లు లాంటి అత్యంత అణచివేతకు గురవుతున్నవారిని సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన సమూహాలుగా ప్రవర్ధమానమవుతున్న వారిగా గుర్తించాలని ప్రభుత్వాన్ని నిర్దేశించారు. రిజర్వేషన్ వ్యవస్ధకు ఆవల ఉంచవలసిన సమూహాలను -రాజకీయంగా ఆధిపత్యం ఆర్ధిక సంపన్నులు అయిన కుల సమూహాలను- గుర్తించడానికి తగిన హేతుబద్ధతను నిర్ధారించినందువల్ల మాత్రమే కాకుండా ట్రాన్స్ జెండర్లు లాంటి తీవ్ర స్ధాయి అణచివేతకు గురవుతున్న సమూహాలను రిజర్వేషన్ గ్రహీతలుగా గుర్తించేందుకు మద్దతు అందించినందువల్ల కూడా తీర్పుకు ప్రాముఖ్యత ఉన్నది. ఇలాంటివారిని సాధారణ దృష్టితో ఒక సామాజిక వర్గంగా వర్గీకరించలేని పరిస్ధితి!

రిజర్వేషన్ ఫలాల నిర్ధారణలో కులానికి ఉన్న ప్రాధాన్యతను కోర్టు తగ్గించడం అన్నది, రిజర్వేషన్ ఫలాలు పొందడానికి అర్హులుగా నూతన సమూహాలను గుర్తించడంతో దగ్గరి సంబంధం కలిగి ఉంది. దేశంలో చారిత్రకంగా అన్యాయం జరిగింది అనేందుకు కులం నిజంగానే ప్రాముఖ్యత కలిగిన కారణం. కానీ ఒక వర్గం వెనుకబాటుతనానికి  అదొక్కటే నిర్ణయదారు కాదు. అందుకు బదులుగా కులం కేంద్రంగా వెనుకబాటుతనాన్ని నిర్వచించడం నుండి దూరం జరుగుతూ సరికొత్త ఆచరణలు,  పద్ధతులు, కొలబద్దలు నిరంతరం ఆవిష్కృతం కావాల్సిన అవసరం ఉన్నదని కోర్టు తీర్పు చెప్పింది. వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్ విరుద్ధమైన సలహా ఇచ్చినప్పటికి గత యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ప్రభుత్వం జాట్ లకు రిజర్వేషన్ సౌకర్యం ప్రకటించింది. ఈ వాస్తవం, మారుతున్న సమాజంలో వెనుకబాటుతనం యొక్క ప్రవర్ధమాన రూపాలకు వ్యతిరిక్తంగా చారిత్రక అన్యాయాన్ని నిలబెట్టడంలో చిన్న పాత్ర ఏమీ పోషించలేదు. కానీ ఇక్కడ ఉత్పన్నం అవుతున్న ప్రశ్న ఏమిటంటే నిరంతరం పరిణామం చెందుతున్న సమాజంలో ఇప్పటికే రిజర్వేషన్ జాబితాలో ఉన్న కులాలను, సామాజిక సమూహాలను తప్పించడం గురించే. నూతన సామాజికార్ధిక వాస్తవాల వెలుగులో మొత్తం రిజర్వేషన్ లబ్దిదారుల జాబితాను పునర్దర్శనం కావించేందుకు ఒక చిన్న కిటికీని కోర్టు తీర్పు తెరిచి ఉండవచ్చు.

[భారత దేశంలో సామాజికార్ధిక తలంలో నిరంతరం మార్పులు వస్తున్నాయని, ఆ మార్పుల వల్ల కులం ప్రాతిపదికన రిజర్వేషన్ లు కల్పించే అవసరం తప్పిపోతున్నదని ఈ సంపాదకీయం చెబుతోంది. కానీ ఆ మార్పులు ఎలా వస్తున్నాయో, ఎందుకు వస్తున్నాయో, ఏ కారణాల వల్ల వస్తున్నాయో రేఖా మాత్రంగానైనా ఇది చెప్పలేకపోయింది. నిజానికి భారత దేశంలో కులం వివిధ రూపాలు మార్చుకుంటూ సరికొత్త ముసుగులు తొడుగుతున్నదే గాని ‘సామాజికార్ధిక మార్పులు వస్తున్నాయి’ అని నిర్ధారించేంతగా కులంలో మార్పులు రాలేదన్నది చేదు నిజం. ఆ మాటకొస్తే భారత దేశంలోని సామాజికార్ధిక నిర్మాణానికి కులం ఇప్పటికీ పట్టుగొమ్మగా కొనసాగుతోంది. ఉపరితల మార్పులను చూసి పునాదిలోనూ సారంలోనూ వస్తున్న మార్పులుగా తేలికగా నిర్ధారించేసే తప్పిదానికి పాల్పడడం నేటి రోజుల్లో పరిపాటి అయింది. ఆ కోవలో వచ్చినదే ఈ సంపాదకీయం. కులపరంగా రుద్దబడిన చారిత్రక అణచివేత నిజానికి ఆర్ధిక ప్రయోజనాల సాధన కోసమే. అలాంటిది ఆర్ధిక అసమానతల నిర్మాణం చెక్కుచెదరకుండా కొనసాగుతుండగా దాని ఆధారంగా నిలబడ్డ కుల నిర్మాణంలో మార్పులు ఎలా సాధ్యమన్నది ది హిందు సంపాదకులు చెప్పకుండా మిగిల్చిన అంశం. ఒక్క ‘ది హిందు’యే కాదు, లోతైన సామాజికార్ధిక పరిశీలన చేయగల సైద్ధాంతీక ఉపకరణం చెంత ఉంచుకున్న అనేకమంది కమ్యూనిస్టులు కూడా ఈ అంశాన్ని చెప్పకుండా వదిలేయడం ఒక వాస్తవం. -విశేఖర్]

8 thoughts on “వెనుకబాటుతనం నిర్ధారణ -ది హిందు ఎడిటోరియల్

  1. ఆర్.ఎస్.ఎస్.వాళ్ళు బహిరంగంగా రిహర్వేషన్లని వ్యతిరేకిస్తే కాంగ్రెస్ ఇలాంటి పనులు చేసి రిజర్వేషన్లని నీరుగారుస్తుంది. అందరూ వెనుకబడిన కులాలవాళ్ళైతే మరి అగ్రకులాలవాళ్ళు ఎవరు? ఇందియాలోని నిరుద్యోగుల్లో ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగం మాత్రమే చెయ్యాలనుకునేవాళ్ళు. వ్యాపారం చేసుకుని కూడా బతకొచ్చు కానీ బతకడానికి ఉద్యోగం ఒక్కటే మార్గం అనుకోవడం, అందులోనూ ప్రభుత్వ ఉద్యోగానికే ప్రిఫరెన్స్ ఇవ్వడం వల్ల సొంత ఆస్తులు ఉన్న కులాలకి చెందినవాళ్ళు కూడా రిజర్వేషన్లు అడుగుతున్నారు. మనిషిని కులం కంటే డబ్బే ఎక్కువ ప్రభావితం చేస్తుంది కనుక ఉద్యోగం కోసం తమది వెనుకబడిన కులం అని చెప్పుకోవడానికి వాళ్ళకి ఎలాంటి సంకోచం కలగదు. అన్ని కులాలకీ రిజర్వేషన్‌లు ఇచ్చేస్తే ఇక రిజర్వేషన్లు ఉన్నా లేనట్టే అవుతుంది.

  2. ఇంతకు ముందు ఓ బ్లాగ్‌లో ఈ వ్యాఖ్య వ్రాసాను. నేను శ్రీకాకుళంలో ఓ రోజు ఆటోలో వెళ్తునప్పుడు దారిలో వైశ్య కులస్తులు తమని బిసిలో చేర్చాలని ఆందోళన చేస్తూ కనిపించారు. నా పక్కనే కూర్చున్న ఒకాయన “ఈ కోమటోళ్ళకి ఏ రిజర్వేషన్లూ అవసరం లేదు, వీళ్ళు చేసే వ్యాపారాలపై పన్నులు పెంచుతామంటే తమకి రిజర్వేషన్లు వద్దు అని వీళ్ళే పారిపోతారు” అని నవ్వుతూ అన్నాడు. రిజర్వేషన్లు ఇప్పుడు అంత అపహాస్యమైపోయాయి. ఇప్పుడు మీ టపా చదివిన తరువాత నాకు మళ్ళీ దీని గురించి గుర్తొచ్చింది.

  3. ఏంటండి మరీనూ! మన కార్పోరేట్ రంగమంత అనేక ఏల్లుగా సామాజికంగా , ఆర్ధికంగా ఎంత వెనుక బాటు తనం అనుభవిస్తున్న ఎవరూ పట్టించు కున్న దాఖలాలేవు. మనదేశం లో రాజకీయనాయకులు, బ్యురాక్రట్లు పాపం ప్రజలకు సేవ చేయడమే తప్ప వారు ఏమి అనుభవిస్తున్నారు? వారిని ఎవరైనా పట్టించు కున్న పాపాన పోలేదు. వీళంతా (దొడ్డి దారిన అనుభవిస్తున్నారు లెండి, అయినా ఎంతకాలమిలా? అధికారికంఘా వస్తే ఆ మజానే వేరు) ఎవరైనా ప్రస్తవిస్తున్నారా? వీళ్లంతా రిజర్వేషనలు అడగడంలో తప్పేముంది?వాల్ల గోడు ఎవరూ అర్ధం చేసుకోరేం? ఇంకో మాట ఆర్ధిక వెనుక భాటు తనాన్ని అనుసరించి రిజర్వేషన్లు కావాలట! ఆ విధంగా మనదేశంలో అందరు అడుక్కు తినే వారే- భినామిలు ఉంటాయనుకోండీ. అవన్ని లెక్క లోకి వస్తాయా? ఇక్కడ నాకో సందేహం. అందరికి రిజర్వేషన్లు ఇచ్చేస్తే మరి రోడ్ల్లు ఊడ్చే వారు, స్కేవింజింగ్ పనులు చేసే వారు ఎవరుంటారు? – అటె ఆ విధంగా మనదేశంలో శోషలిజం వచ్చేస్తుధన్నమాట! చాలా మంచిది.

  4. ఇంకో మాట ఆర్ధిక వెనుక భాటు తనాన్ని అనుసరించి రిజర్వేషన్లు కావాలట!
    ఎందుకివ్వకుడదు? ప్రభుత్వం అనుకొంటే భినామిలను అదుపు చేయటం పెద్ద విషయమా? ఏ రోజుల్లో ఉన్నారు మీరు?

  5. 1933లో అమెరికాలో 20 నుంచి 30 శాతం నిరుద్యోగం ఉంటే 1940లో సోవియత్ సమాఖ్యలో ఒక్క నిరుద్యోగి కూడా లేడు. రిజర్వేషన్ అనేది పరిమితంగా ఉన్న ఉద్యోగావకాశాల్లో కొన్ని వర్గాలకి అవకాశాలు పెంచేది మాత్రమే కానీ అందరికీ అవకాశాలు కల్పించేది కాదు. పెట్టుబడిదారీ ఆర్థికవేత్తలలో జాన్ కీనెస్ లాంటివాళ్ళు నిరుద్యోగాన్ని తగ్గించాలనైనా అనుకుంటారు కానీ రిజర్వేషన్ విధానంలో ఆ లక్ష్యం కూడా ఉండదు. ఉన్న అవకాశాలని వివిధ వర్గాల మధ్య విభజించడమే రిజర్వేషన్ విధాబం యొక్క లక్ష్యం. ఈ విషయం అర్థమైతే వర్గీకరణ విషయంలో మాలమాదిగలు ఎందుకు కొట్టుకుంటున్నారో కూడా అర్థమవుతుంది.

  6. / ప్రభుత్వం అనుకొంటే భినామిలను అదుపు చేయటం పెద్ద విషయమా? /
    ఆ మాట నిజమే కానీ, అదుపు చేసే ప్రభుత్వం ఎప్పుడొస్తుందానేదే బాధ. ఒక వేల వస్తే గిస్తే రానిస్తారా అనేది ఇంకో బాధ. నేను ప్రస్తుతానికి నేను ఈ కాలం లోనే ఉన్నాను ద్వాపర యుగంలో మాత్రం కాదు. 🙂

  7. బినామిలను అదుపు చేయటంలో ప్రభుత్వం తలలు పట్టుకోవలసిన పని లేదు. లక్షల కోట్ల నల్లధనం విషయం లో చట్టం అమలు జరగడంలో అడ్డంకులు ఎదురవచ్చేమో గాని, సామాన్య ప్రజల విషయంలో చట్టం త్వరగా అమలౌతుంది. పట్టుబడితే డిగ్రి సర్టిఫికేట్ కేన్సెల్ అవుతందంటే ప్రజలు దొంగ సర్టిఫికేట్లు పెట్టే ధైర్యం చేయరు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s