పరస్పర విరుద్ధ ధృవాలుగా అనదగ్గ రాజకీయ అవగాహనలు కలిగి ఉన్న బి.జె.పి, పి.డి.పి లు కాశ్మీర్ లో ప్రభుత్వం ఏర్పరిచాయి. ఈ ప్రభుత్వం ఎకాఎకిన ఏర్పడిందేమీ కాదు. రెండు నెలలపాటు చర్చలు జరిపి ‘కనీస ఉమ్మడి కార్యక్రమం’ రూపొందించుకుని ఏర్పడిన ప్రభుత్వం. కనుక ఇరు పార్టీలు తమ వైరుధ్యాల కంటే ప్రజా పాలన పైనే ఎక్కువ దృష్టి పెడతారని ఆశించడం సహజం.
కానీ ప్రభుత్వం ఏర్పడింది లగాయితు పాలన కంటే వైరుధ్యాల కారణంగానే పాలక పక్షాలు రెండూ వార్తలలో నిలుస్తున్నాయి. ఆర్టికల్ 370, AFSPA లపై ఉమ్మడి అవగాహనకు వచ్చామని చెప్పినప్పటికీ ఆ రెండింటికి అనుబంధంగా ఉండే అంశాలపై ఇరువురు విరుద్ధ ప్రకటనలు గుప్పిస్తూ జనాన్ని అయోమయంలో ఉంచుతున్నారు.
ఆర్టికల్ 370 కి గట్టి మద్దతుదారుగా చెప్పుకునే పి.డి.పికి ఆ ఆర్టికల్ ను పూర్తిగా రద్దు చేయాలని బి.జె.పి అనాదిగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలుసు. AFSPA ని ఎత్తివేయాలన్నది పి.డి.పి డిమాండ్ అని బి.జె.పికీ తెలుసు. రాజకీయ ఖైదీలను వెంటనే విడుదల చేస్తామని, ముఖ్యంగా పి.డి (ప్రివెంటివ్ డిటెన్షన్) యాక్ట్ కింద జైళ్ళలో మగ్గుతున్న మిలిటెంట్లను విడుదల చేస్తామని పి.డి.పి ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన సంగతి కూడా బి.జె.పి కి తెలుసు. అయినా ఇరు పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం అవకాశవాదంతోనే. ఆర్ధిక ప్రయోజనాల కోసం తాము చెప్పే సిద్ధాంతాలను పక్కన పెట్టేందుకు అవి వెనుకాడవని బి.జె.పి, పి.డి.పిల పొత్తు చెప్పే సత్యం.
కానీ ఈ వాస్తవం జనానికి తెలియకూడదు. తెలిస్తే ఆర్ధిక ప్రయోజనాలను నెరవేర్చే రాజకీయ ఓటు ప్రయోజనాలు దూరం అవుతాయి. అందుకే ఉద్దేశ్యపూర్వకంగానే ఒక అయోమయ వాతావరణాన్ని సృష్టిస్తున్నారని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరువురు విరుద్ధ దిశల్లో నడుస్తున్నట్లు తమ తమ ఓటర్లకు కనపడాలి. కానీ ఇద్దరూ కలిసి అధికారాన్ని, తద్వారా ఒనగూరే వ్యాపార, ఆస్తి ప్రయోజనాలను పంచుకోవాలి. పైకి కనపడే కనపడే తగవులాట జనానికి. లోపల కొనసాగే బంధం స్వార్ధ ప్రయోజనాలకు. ఇదే కాశ్మీర్ లో నడుస్తున్న నాటకం. మసరత్ ఆలం విడుదలపై సాగుతున్న రగడ ప్రధానంగా అసలు సమస్యల నుండి కాశ్మీరీల దృష్టి మరల్చేందుకు ఉద్దేశించినదే.
ఒక హిందూత్వ పార్తీ ఒక ముస్లిం పార్తీతో పొత్తు పెట్టుకోవడం విచిత్రం కాదు. డబ్బు సంపాదించడం కంటే virtue ఏమి ఉంటుంది? ఉత్తరాది రాష్ట్రాల్లో భాజపా కార్యకర్తలు గ్రామాల్లోకి వెళ్ళి ఆడవాళ్ళు మంచి భార్యలుగా ఎలా ఉండాలో చెపుతుంటారు. కానీ పట్టణాల్లో భాజపా నాయకుల కూతుళ్ళూ, కోడళ్ళూ వ్యాపారాలు చేసి లక్షలూ, కోట్లూ సంపాదిస్తారు.
దొంగలు దొంగలు వూళ్ళు పంచుకోవటం అంటే ఇదే