బడ్జెట్ 2015-16: వృధా పధకాలకు బోలెడు నిధులు -(3)


Arun Jaitley

మోడి అమలు చేస్తున్న ‘స్వచ్ఛ భారత్’ ప్రధానంగా ప్రజలను ఏదో ఒక విధంగా బిజీగా ఉంచడానికి ఉద్దేశించిన గాలి కబుర్ల పధకం. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసే పధకం. ఆం ఆద్మీ పార్టీ గుర్తు చీపురును ఆ పార్టీ నుండి లాక్కొని తమ స్వంతం చేసుకునేందుకు మోడి వేసిన ఎత్తుగడ. ఆయన ఎత్తుగడ విఫలం అయింది. తాము అమలు చేసే ప్రజా వ్యతిరేక సంస్కరణలనుండి ప్రజల దృష్టిని మరల్చేందుకు కూడా ఉపయోగపడుతుందని గ్రహించి మరింతగా పొడిగించారు. ప్రభుత్వ విభాగాలన్నింటిని అందులోకి దించి టి.వి ఛానెళ్లు, రేడియోలలో ప్రశంసలు కురిపించుకుంటూ మోడి జనం కోసం ఏదో చేసేస్తున్నారని గాలిని పోగు చేస్తూ ఒక మాయను సృష్టిస్తున్నారు.

రెగ్యులర్ గా రోడ్లను ఊడ్చే శ్రామిక జీవులు పది నిమిషాల్లో చేసే పనిని డజన్ల మంది చీపురు కట్టలు చేతబట్టి చుట్టూ మూగి దేశం మొత్తాన్ని శుభ్రం చేసేస్తున్నట్లు కెమెరాలకు ఫోజులివ్వడం ఆ పేరుతో ప్రజల డబ్బును వృధా చేయడం ఎంత పనికిమాలిన కార్యక్రమమో వేరే చెప్పనవసరం లేదు. దానికి తగుదునమ్మా అంటూ కార్పొరేట్ వర్గాలు, కంపెనీల అధిపతులు, సినిమా యాక్టర్లు, జాతీయ ఆటగాళ్లు పొగడ్తలు దంచుతూ తెరల మీద కనిపిస్తున్నారు. జనం వివిధ రూపాల్లో ఈసడిస్తున్నా ‘అది గొప్ప కార్యక్రమం’ అన్న భావనను బలవంతంగా ప్రజల మెదళ్ళలోకి ఎక్కించడానికి ప్రయత్నిస్తున్నారు.

ఈ పధకం కోసం ఒక్కో గ్రామానికి ఏడాదికి రు. 20 లక్షల చొప్పున 6.5 లక్షల గ్రామాలకు ‘స్వచ్ఛ భారత్ అభియాన్’ కింద రు. 13,000 కోట్లు కేటాయిస్తామని గతేడు చెప్పిన మోడి ప్రభుత్వం ఈ బడ్జెట్ లో కొన్ని తాయిలాలు ప్రకటించారు. ‘స్వచ్చ భారత్’ పధకం కోసం దానం చేసేవారికి పూర్తి ఆదాయ పన్ను రాయితీ ప్రకటించారు. పేదల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వాలు దశాబ్దాలుగా కేటాయించిన లక్షల కోట్ల ధనం ఆ పార్టీ దళారులు భోంచేసినట్లే స్వచ్ఛ భారత్ నిధులు బి.జె.పి దళారులకు వరం కానున్నాయి. నల్ల డబ్బు తెలుపు చేసేందుకు రాచమార్గం కానుంది. బి.జె.పి అవినీతి ప్రక్షాళన నినాదానికి ‘మాన్యుమెంటల్ ఫెయిల్యూర్’ గా ఈ పధకం నిలిచిపోనుంది.

ప్రధాని మోడి ప్రకటించిన ‘మేక్ ఇన్ ఇండియా’ కోసం బడ్జెట్ లో పలు చర్యలను జైట్లీ ప్రకటించారు. చైనాను కాపీ కొడుతూ భారత శ్రామిక ప్రజల శ్రమను చౌకగా అమ్మకానికి పెడితే ఎఫ్.డి.ఐలు ప్రవాహం కడతాయని మోడి ప్రభుత్వం నమ్మకంగా కనిపిస్తోంది. అనేక పశ్చిమ కంపెనీలు తమ సరుకులను చైనాలో తయారు చేస్తూ ‘మేడ్ ఇన్ చైనా’ ముద్ర వేస్తున్నట్లే ‘మేడ్ ఇన్ ఇండియా’ ముద్రతో సరుకులు ప్రపంచాన్ని వెల్లువెత్తాలని ప్రధాని కలలు కంటున్నారు. ఈ నినాదం వల్ల ఇంతవరకు ఒక్క పైసా పెట్టుబడి రాలేదు. మాన్యుఫాక్చరింగ్ ఉత్పత్తి విలువ జి.డి.పి లో 18 శాతం నుండి 17 శాతానికి పడిపోగా, మాన్యుఫాక్చరింగ్ ఎగుమతులు ఎదుగూ బొదుగూ లేకుండా 10 శాతం వద్దనే స్తంభించి పోయాయి (ఎకనమిక్ సర్వే – 2015).

ఈ నేపధ్యంలో మాన్యుఫాక్చరింగ్ లో ఎఫ్.డి.ఐ ల కోసం మరిన్ని ప్రోత్సాహకాలను బడ్జెట్ లో ప్రకటించారు. విదేశీ కంపెనీలకు పన్ను రాయితీలు ప్రకటించారు. ఎకనమిక్ టైమ్స్ పత్రిక ప్రకారం ‘మాన్యుఫాక్చరింగ్’ అన్న పదాన్ని బడ్జెట్ లో 15 సార్లు ప్రస్తావించగా, ‘మేక్ ఇన్ ఇండియా’ పదాన్ని 10 సార్లు జైట్లీ ప్రస్తావించారు. ‘మేక్ ఇన్ ఇండియా’ వల్ల ఎఫ్.డి.ఐలకు మేలు జరుగుతుంది. అతి తక్కువ వేతనాలు కార్మికులకు దక్కుతాయి. దేశీయ చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు తీవ్ర హాని కలుగుతుంది.

‘మేక్ ఇన్ ఇండియా’ కల సాకారం కోసం 22 రకాల సరుకులపై కస్టమ్స్ సుంకాన్ని జైట్లీ బడ్జెట్ తగ్గించింది. దీనివల్ల విదేశీ సరుకులు పెద్ద మొత్తంలో దిగుమతి అయ్యి దేశీయ సరుకుల స్ధానం ఆక్రమిస్తాయి. ఈ సరుకులన్నీ మానుఫాక్చరింగ్ పరిశ్రమలకు ఇన్ పుట్స్ గా (ముడి మరియు పెట్టుబడి సరుకులుగా) ఉపయోగపడేవి. దేశీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించడానికి బదులు విదేశీ పరిజ్ఞానంపైనే దేశం మరింత ఆధారపడేందుకు ఈ విధానం దారి తీస్తుంది.

దీనికి కొనసాగింపుగా విదేశీ సాంకేతిక సేవలపై విధించే ఆదాయ పన్నును, రాయల్టీలను సగానికి తగ్గించి 10 శాతానికి చేర్చారు. తద్వారా దేశ ఆదాయాన్ని తగ్గించారు. టాబ్లెట్లు, లెదర్ బూట్లు లాంటి లగ్జరీ సరుకులు ఈ సరుకుల్లో ఉన్నాయి. ఇవి దేశ ప్రజల అవసరాలను తీర్చేవి కావు. ఆర్ధిక వ్యవస్ధను పటిష్టం చేసేవీ కావు. కేవలం సామ్రాజ్యవాద బహుళజాతి కంపెనీలకు చౌక శ్రమను అందించి వాటి మార్కెట్ చొరబాటు పెంచేవి. వాటి పెట్టుబడి సరుకులకు మార్కెట్ ను పెంచేవి.

బడ్జెట్ ప్రకటించిన ‘దీన్ దయాళ్ గ్రామీణ్ కౌసల్ యోజనా’ పధకం కూడా ‘మేక్-ఇన్-ఇండియా’ కోసమే. ఇందులో భాగంగా ‘మైక్రో యూనిట్స్ డెవలప్ మెంట్ రీఫైనాన్స్ ఏజెన్సీ బ్యాంక్ –ముద్ర బ్యాంక్ (MUDRA)’ అనే సంస్ధ ఏర్పాటు ప్రకటించారు. ‘మేక్-ఇన్-ఇండియా’ పధకంలో భారత దేశంలోని మైక్రో, చిన్న, మధ్య తరహా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల పాత్రను ప్రోత్సహించడానికి ముద్ర బ్యాంకును ఉద్దేశించారు. ఇది ప్రధానంగా రీఫైనాన్సింగ్ సౌకర్యం సమకూర్చుతుందని మోడి-జైట్లీ ప్రభుత్వం చెబుతోంది. కానీ ఈ తరహా బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇప్పటికే ఉన్నాయి. నాబార్డ్, సిడ్బి (స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్ మెంట్ బ్యాంక్), నేషనల్ హౌసింగ్ బ్యాంక్ లు అందులో కొన్ని. పార్లమెంటు చట్టాల ద్వారా 1980ల నుండి నడుస్తున్న ఈ బ్యాంకులు ఆచరణలో ఎంతవరకు ఘోరంగా విఫలం అయ్యాయని, రాజకీయ నిరుద్యోగులను మెపే సంస్ధలుగానే ఉన్నాయని, దళారులకు వడ్డించిన విస్తరిలా పని చేశాయని ఆచరణ చెబుతున్న సత్యం.

అయితే ఈ సంస్ధలపై కాంగ్రెస్ ‘ముద్ర’ ఉన్నది. కాంగ్రెస్ ముద్ర తొలగించి బి.జె.పి ముద్ర ఉన్న రీఫైనాన్సింగ్ బ్యాంకు ద్వారా తామూ జనానికి మేలు చేస్తున్నామని చెప్పుకునేందుకు ముద్ర బ్యాంకు ఉపయోగపడుతుంది. బి.జె.పి ని ఆశ్రయించిన దళారులకు ఇది భోజ్యం కానుంది. పేదలను పట్టి పీడిస్తున్న అనేక ప్రైవేటు, స్వచ్ఛంద మైక్రో ఫైనాన్స్ సంస్ధలకు కూడా ఇది రీఫైనాన్సింగ్ చేస్తుందట. ఇవన్నీ షాడో బ్యాంకింగ్ కిందికి వస్తాయి. షాడో బ్యాంకింగ్ రద్దు చేసి అన్నింటిని ప్రధాన స్రవంతి వాణిజ్య బ్యాంకుల్లో విలీనం చేయాలని ఆర్.బి.ఐ ప్రతిపాదించగా అందుకు కేంద్రం అంగీకరించింది. ఈ నేపధ్యంలో ముద్ర బ్యాంకు భవితవ్యం కూడా నామమాత్రం అయ్యే అవకాశం మెండుగా ఉంది. ముద్ర బ్యాంకుకు రు. 20,000 కోట్ల కార్పస్ ఫండ్ కేటాయించారు. రుణాల గ్యారంటీ కోసం మరో రు. 3,000 కోట్లు కేటాయించారు. మైక్రో ఫైనాన్సింగ్ లోకి వాల్ స్ట్రీట్ పెట్టుబడులు ఇప్పటికే చొచ్చుకువచ్చాయి. కనుక ఈ కార్పస్ ఫండ్ వాస్తవంలో భారతీయ కంపెనీలకు రీఫైనాన్సింగ్ చేస్తుందా లేక వాటి వెనుక దాగిన వాల్ స్ట్రీట్ కంపెనీలకా అన్నది పరిశీలించవలసిన అంశం.

వెరసి జైట్లీ బడ్జెట్ ప్రకటించిన ‘మేక్-ఇన్-ఇండియా’ నిధులు ఎఫ్.డి.ఐల ముసుగులో ఉన్న భారతీయ నల్లధనానికి, విదేశీ బహుళజాతి కంపెనీలకు వరం అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. నల్ల ధనాన్ని చట్టబద్ధంగా వెనక్కి రప్పించి దేశానికి ఉపయోగపెట్టడానికి బదులు మరిన్ని ప్రోత్సాహకాలు కల్పించడం గర్హనీయం. అది కూడా అవినీతి నిర్మూలన పేరుతో చేయడం ఇంకా ఘోరం.

4 thoughts on “బడ్జెట్ 2015-16: వృధా పధకాలకు బోలెడు నిధులు -(3)

  1. భాజపా వందిమాగధులకి పెట్టుబడిదారీ వ్యవస్థ అంటే ఏమిటో తెలిసినట్టు లేదు. TVలు, సెల్‌ఫోన్‌లూ తయారు చేసే పరిజ్ఞానం ఇందియా దగ్గర ఉంది. అయినా అమెరికా, దక్షిణ కొరియాల్లో తయారైన TVలూ, సెల్‌ఫోన్‌లూ దిగుమతి చేసుకుంటున్నాం. దిగుమతుల మీద ఇంత ఎక్కువగా ఆధారపడితే కరెన్సీ విలువ తగ్గిపోతుందనే మినిమమ్ సెన్స్ కూడా మనవాళ్ళకి లేదు. ఇంత జరుగుతున్నా అరుణ్ జైట్లీ అనే కళ్ళున్న దృతరాష్ట్రుడు మన కరెన్సీ విలువని మరింత తగ్గించి ఎగుమతులని ప్రోత్సహిద్దాం అంటున్నాడు. కరెన్సీ విలువ మరింత తగ్గితే అమెరికా, దక్షిణ కొరియాల నుంచి దిగుమతైన సెల్‌ఫోన్‌లు కొనడం మనకి మరింత కష్టమవుతుందనీ, నిత్యం సెల్‌ఫోన్‌లలో ఫేస్‌బుక్ చాటింగ్‌లు చేసే డబ్బున్న యువకులు కూడా అప్పుడు భాజపాకి దూరమవుతారనీ అరుణ్ జైట్లీకి తెలిసినట్టు లేదు.

  2. నాబార్డ్ ప్రతీ సం,, తన పని తీరుకు సంభందించి అంకెలతో సహా వివరాలను వెల్లడిస్తుంది-ఇవన్నీ అవాస్తవాలా?అంకెల గారడీ మాత్రమేనా?

  3. ఇందాకే రాజ్యసభలో ఒక శివసేన ఎం.పి. ఒక నిజం చెప్పాడు, ప్రభుత్వం పేదలకి అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటే stock markets పడిపోతాయని. పెందింగ్ రైల్వే ప్రాజెక్త్‌లు పూర్తి చెయ్యాలనే లక్ష్యంతో ఈ ఏడాది రైల్వే మంత్రి కొత్త ప్రాజెక్త్‌లు ప్రకటించలేదు. కొత్త ప్రాజెక్త్‌లు రాకపోతే పెట్టుబడిదారులకి కొత్త contracts రావని railway budget రోజు stock markets పడిపోయినాయి. ఈ విషయం కూడా ఆ ఎం.పి.యే చెప్పాడు. పెట్టుబడిదారుడు ప్రతి రూపాయికీ లాభం మాత్రమే చూస్తాడని తెలిసి కూడా అరుణ్ జైట్లీ లాంటివాళ్ళు పెట్టుబడిదారుల గురించి తప్ప ప్రజల గురించి ఆలోచించరు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s