సామ్రాజ్యవాదుల కోసం తయారు చేసిన శ్వేతపత్రం, బడ్జెట్ 2015-16 -(1)


Budget 2015-16

స్వదేశీ, విదేశీ ప్రభువర్గాలు ఏరి కోరి తెచ్చుకున్న మోడి ప్రభుత్వం తమపై ఉంచిన విశ్వాసాన్ని కాపడుకుంటూ మొట్ట మొదటి పూర్తి స్ధాయి సాధారణ బడ్జెట్ 2015-16 ను ప్రవేశపెట్టింది. బి.జె.పి/ఎన్.డి.ఏ ప్రభుత్వం మెజారిటీ సాధించినట్లు వార్తలు వెలువడుతుండగానే పశ్చిమ బహుళజాతి కార్పొరేట్ కంపెనీలు కొత్త ప్రభుత్వం నెరవేర్చవలసిన తమ డిమాండ్లు ఏమిటో విస్పష్టంగా తమ కార్పొరేట్ మీడియా ద్వారా ప్రకటించాయి. ఆ డిమాండ్లను త్రికరణశుద్ధిగా నెరవేర్చుతూ మోడి ప్రభుత్వం నిర్ణయాత్మకంగా వేసిన అడుగు ‘బడ్జెట్ 2015-16’. ఒకవైపు తమది పేద ప్రజల ప్రభుత్వం అని ప్రకటిస్తూనే, మరోవైపు ఆ ప్రజల ప్రయోజనాలను తీవ్రంగా దెబ్బకొట్టే విధంగా పలు నయా ఉదారవాద ఆర్ధిక చర్యలను బడ్జెట్ 2015-16 లో మోడి ప్రభుత్వం ప్రకటించింది. తమ బడ్జెట్ చర్యలు కార్పొరేట్లకు అంకితమన్న సంగతిని దాచి ఉంచడానికి ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ తీవ్రంగా శ్రమించినప్పటికీ స్వదేశీ, విదేశీ కార్పొరేట్ పత్రికలు, షేర్ మార్కెట్లు ప్రకటించిన సంతోషాతిరేకాలు ఆయన శ్రమను బూడిదలో పోసిన పన్నీరుగా మార్చాయి.

“జైట్లీ బడ్జెట్ ‘బిగ్ బ్యాంగ్’ బడ్జెట్ కానప్పటికీ వృద్ధి దృక్పధంతో (గ్రోత్-ఓరియెంటెడ్) రూపొందించిన బడ్జెట్” అని రాయిటర్స్ వార్తా సంస్ధ సంతృప్తి ప్రకటించింది. ఇప్పటి పాదార్ధిక విశ్వం ఒక చిన్న అణువు పెద్ద పెట్టున పేలిపోవడం వల్ల ఉద్భవించిందని గ్రహశాస్త్రంలోని ‘బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం’ చెబుతుంది. అణువు పేలి విశ్వం ఆవిర్భవించినట్లుగానే, బహుళజాతి ప్రైవేటు కంపెనీలకు మేలు చేసే విధంగా, మోడి-జైట్లీ బడ్జెట్ పెద్ద పెట్టున పేలి లాభాలు రాల్చాలని బడ్జెట్ కు ముందే పశ్చిమ కార్పొరేట్ పత్రికలు డిమాండ్ చేశాయి. ఫైనాన్షియల్ టైమ్స్, వాల్ స్ట్రీట్ జర్నల్, బిజినెస్ స్టాండర్డ్, రాయిటర్స్ లాంటి పత్రికలు మోడి ప్రభుత్వం తమ బడ్జెట్ లో ‘బిగ్ బ్యాంగ్’ సంస్కరణలు తేవాలని డిమాండ్ చేశాయి. ప్రభుత్వ ఖర్చు బాగా తగ్గించాలని కోరాయి. ఖర్చులు తగ్గించడం అంటే ప్రజలకు ఇచ్చే సబ్సిడీలు తగ్గించాలని వారి అర్ధం. కంపెనీలకు విచక్షణా రహితంగా ఇచ్చే పన్ను రాయితీలు మాత్రం ఇంకా పెంచాలని కోరాయి. ఈ మేరకు సంపాదకీయాలు రాశాయి. ప్రత్యేక విశ్లేషణలు ప్రచురించాయి. ఈ డిమాండ్లన్నింటిని జైట్లీ బడ్జెట్ చక్కగా నెరవేర్చింది. జనానికి మాత్రం ఎందుకు పనికిరాని మాటల మూటలు అప్పజెప్పింది.

పశ్చిమ కార్పొరేట్ పత్రికలు గానీ భారత దేశంలోని వ్యాపార పత్రికలు గానీ అంతర్జాతీయ బహుళజాతి పెట్టుబడులకు వారి ప్రయోజనాలను నెరవేర్చే దేశీయ బడా పెట్టుబడులకు బాకాలు ఊదేవి. కంపెనీల అవసరాలకు అనుగుణంగా ప్రజల అభిప్రాయాలను తయారు చేయడంలో, కంపెనీల దోపిడీకి ప్రజల సమ్మతిని తయారు చేయడంలో అవి నిత్యం మునిగి ఉంటాయి. అలాంటి పత్రికలు సహజంగానే తమ యజమానుల అవసరాలను నెరవేర్చే విధానాలను నెత్తిన పెట్టుకుని ఊరేగుతాయి. తదనుగుణమైన విధానాలను తెచ్చే పాలకులకు బహుళ ప్రచారం కల్పిస్తాయి. టైమ్ లాంటి పత్రికలు కవర్ పేజీలో మోడి బొమ్మ ముద్రిస్తే దాన్ని కూడా వార్తను చేసేస్తాయి. తద్వారా బహుళజాతి కంపెనీల పక్షం వహించే భారత పాలకులను హీరోలను చేస్తాయి. గొప్ప దార్శనికుడిగా, దేశ ప్రజల భాగ్యవిధాతగా కీర్తిస్తాయి. ఆ కీర్తనలు చదివిన మిడిమిడి జ్ఞానపు మేధో జీవులు అదే గొప్ప జ్ఞానంగా ప్రచారం చేసి పెడతారు.

ఈ పద్ధతిలోనే, వాల్ స్ట్రీట్ కంపెనీలు రచించిన ఎన్నికల వ్యూహాల ద్వారా అధికారాన్ని చేజిక్కించుకున్న మోడి గణం తమకు అప్పజెప్పిన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ బడ్జెట్ 2015-16 ను భారత ప్రజల నెత్తిపై రుద్దారు. భారత ప్రజలు దశాబ్దాలపాటు శ్రమించి నిర్మించుకున్న ‘కమాండింగ్ హైట్స్’ (లెనిన్ చెప్పిన కీలక రంగాలు) ను నయా ఉదారవాద పునర్నిర్మాణంలో భాగంగా సామ్రాజ్యవాదులకు అప్పగించడంలో బడ్జెట్ 2015-16 కీలక అడుగులు వేసింది. ప్రపంచ బ్యాంకు 1991లో నిర్దేశించిన ‘వ్యవస్ధాగత సర్దుబాటు కార్యక్రమాన్ని’ మరింత వేగవంతం చేసే చర్యలు ప్రకటించింది. సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ విధానాలకు గట్టి ఊతం సమకూర్చింది.

ఈ బడ్జెట్ సారాంశం కొద్ది మాటల్లో చెప్పాలంటే: సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ అనుకూల పన్నులు మరియు రాయితీల వ్యవస్ధ నిర్మాణం, అంతర్జాతీయ క్రెడిట్ రేటింగ్ సంస్ధలు డిమాండ్ చేసే ఫిస్కల్ కన్సాలిడేషన్ (కోశాగార స్ధిరీకరణ – దుబారా ఖర్చు నివారించి ఉపయోగకర ఖర్చులు మాత్రమే చేయడం) కోసం ప్రజలపై ఖర్చును భారీ మొత్తంలో తగ్గించడం, ముఖ్యంగా శ్రామికవర్గ ప్రజలకు అత్యవసరమైన ఆహార-ఇంధన-విద్య-ఆరోగ్య సబ్సిడీలను రూపుమాపే మార్గాన్ని సిద్ధం చేయడం, కీలక ద్రవ్య వనరులను బహుళజాతి కంపెనీల ఆరగింపుకు సిద్ధం చేయడం, సదరు కంపెనీల వినియోగానికి భారత దేశపు చౌక శ్రమను అప్పగించేందుకు ఆటంకంగా (ఈ ఆటంకాలను బాటిల్ నెక్స్ గా పత్రికలు పేర్కొంటాయి) ఉన్న రోడ్డు, రైలు రవాణా వ్యవస్ధలను దేశ ప్రజల సొమ్ముతో ఆధునీకరించడం.

జైట్లీ బడ్జెట్ కార్పొరేట్ పన్నును తగ్గించింది. ఆర్ధిక వ్యవస్ధకు కీలకమైన ప్రభుత్వరంగ కంపెనీలలో పెట్టుబడుల ఉపసంహరణను (పాక్షిక ప్రైవేటీకరణ) పెంచింది. కోశాగార స్ధిరీకరణ భారం మొత్తాన్ని శ్రామిక ప్రజలపైననే మోపింది. అనగా దుబారా ఖర్చు నివారించే పేరుతో ప్రజలకు అత్యంత అవసరమైన ఖర్చులు తగ్గించి, కంపెనీల కోసం పెట్టే పరమ దుబారా ఖర్చును ఇంకా తీవ్రం చేసింది. ప్రజల సొమ్మును దారి మళ్లించి బహూళజాతి కంపెనీలకు అవసరమైన మౌలికరంగ నిర్మాణాలకు తరలించింది. ప్రజలపై పరోక్ష పన్నులు పెంచి ప్రైవేటు కార్పొరేట్ కంపెనీలకు రాయితీలు ప్రకటించింది.

బడ్జెట్ లో ప్రధాన అంశం రోడ్డు రైలు రవాణా, విద్యుత్ ఉత్పత్తి, ఇతర మౌలిక రంగాల నిర్మాణాలకు భారీ నిధులను కేటాయించడం. గత సంవత్సరం కంటే ఏకంగా రు. 70,000 కోట్లు అధికంగా ఈ రంగానికి కేటాయించారు. విదేశీ కంపెనీలను బాగా సంతోషపరిచిన కేటాయింపు ఇది. తమ సరుకుల రవాణాకు, తమకు చౌక శ్రామికులను అందించడానికి భారత ప్రభుత్వం తమ ప్రజల సొమ్మును భారీగా ఖర్చు పెడతానంటే సంతోషించని వాజమ్మ కంపెనీ ఏముంటుంది గనక? భారత దేశంలోని ప్రాచీన రోడ్డు, రైలు రవాణా మార్గాల గురించి బహుళజాతి కంపెనీలు రెండున్నర దశాబ్దాలుగా ఫిర్యాదు చేస్తున్నాయి. ప్రజలపై పెట్టే సబ్సిడీలు తగ్గించి, అన్నీ రంగాల్లో యూజర్ ఛార్జీలు వసూలు చేసి రోడ్డు, రైలు మార్గాలను ఆధునీకరించాలని సరుకు రవాణాను వేగవంతం చేసే సౌకర్యాలను వృద్ధి చేయాలని అవి అనేక యేళ్లుగా డిమాండ్ చేస్తున్నాయి. చివరికి ప్రపంచ బ్యాంకు చేత అప్పులు ఇప్పించి మరీ స్వర్ణ చతుర్భుజి, ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ హైవేలను నిర్మింపజేసుకున్నాయి. ఆ కాంట్రాక్టులు కూడా తామే గుంజుకుని లబ్ది పొందడమే కాక, ముక్కు పిండి వడ్డీలు గుంజుతూ, రుణాలతో పాటు విధించిన విషమ షరతుల ద్వారా భారత మార్కెట్ ను కూడా క్రమంగా ఆక్రమించేస్తున్నాయి పశ్చిమ బహుళజాతి కంపెనీలు!

రోడ్డు, రైలు రవాణా మార్గాలు తమ వేగానికి తగినట్లుగా లేకపోవడాన్ని ‘సప్లై సైడ్ బాటిల్ నెక్స్’ గా వ్యాపార పత్రికలు ప్రస్తావిస్తాయి. బాటిల్ నెక్ అంటే సీసా గొంతు (లేదా మూతి) అని అర్ధం. సీసా అంతా వెడల్పుగా ఉంటుంది. గొంతు దగ్గర మాత్రం మార్గాన్ని ఇరుకు చేసి చిన్న మూతి పెడతారు. తద్వారా సీసాలో ఉన్న ద్రవం ఒక్కసారిగా బైటికి రాకుండా నియంత్రించడం దాని ఉద్దేశ్యం. భారత దేశంలోని విస్తారమైన (మధ్య తరగతి) మార్కెట్ అవకాశాలను కొల్లగొట్టకుండా, భారీ శ్రమను అత్యంత తక్కువ వేతనాలకు సొమ్ము చేసుకుండా ఇండియాలోని పాడైపోయిన రవాణా మార్గాలు, ఆధునీకరణకు నోచుకోని ఇతర మౌలిక సౌకర్యాలు ఆటంకంగా ఉన్నాయని కంపెనీల ఫిర్యాదు.

సప్లై సైడ్ బాటిల్ నెక్స్ అన్న ప్రయోగాన్ని తెలుగులో ‘సరఫరా ఆటంకాలు’ అని అనువదించుకోవచ్చు. పరిశ్రమల నుండి, ప్రధాన మార్కెట్ల నుండీ సరుకులు వేగంగా వినియోగదారులను చేర్చడంలో కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఎవరు త్వరగా వినియోగదారుడి చెంతకు సరుకును చేర్చితే వారి అమ్మకాలు అంత పెరుగుతాయని వాటి నమ్మకం. ఈ దృష్టి వల్ల రవాణా మార్గాలకు ఎనలేని ప్రాధాన్యత ఏర్పడింది. బులెట్ రైళ్ల పట్ల మన పాలకులు వంటబట్టించుకున్న పిచ్చి కూడా ఇలా ముదిరినదే. కనుక మోడి ప్రకటించిన 70,000 కోట్లతో భారత దేశ రైలు, రోడ్డు మార్గాలను అభివృద్ధి చేస్తే మంచిదేగా అని అమాయకులు ప్రశ్నిస్తారు. ఎందుకు మంచిది కాదు? మంచిదే. కానీ అది ప్రజల అవసరం కోసం కాకుండా విదేశీ కంపెనీల అవసరం కోసం ఎందుకు చేస్తున్నట్లు? పోనీ అభివృద్ధి చేసే మార్గాలు ప్రజలకు చేరువగా ఉన్నాయా? రోడ్లు నిర్మించి దానిపైన ప్రైవేటు వారికి టోల్ గేటు రుసుము వసూలు చేసే కాంట్రాక్టు ఇవ్వడం ఏ దృష్టితో? అన్నది ఆలోచించాలి.

సరఫరా ఆటంకాల వల్ల ఏర్పడే ద్రవ్యోల్బణం గురించి కూడా వాణిజ్య పత్రికలు తరచుగా చెబుతాయి. రోడ్లు, రైళ్లు బాగులేకపోవడం వలన రవాణా ఆలస్యం అవుతుంది. ఇంధనం ఎక్కువ ఖర్చవుతుంది. ఇవి అనివార్యంగా సరుకుల ధరలను పెంచుతాయి. తద్వారా అంతర్జాతీయ మార్కెట్ లో సరుకులు పోటీ ఇవ్వకుండా వెనకబడతాయి. అమ్మకాలు పడిపోయి ఉత్పత్తి తగ్గించుకోవాల్సి వస్తుంది. అంతిమంగా కంపెనీలకు నష్టాలు వస్తాయి. ఇదంతా సరఫరా ఆటంకాల వల్ల పెరిగే ధరల కారణంగా ఏర్పడే పరిస్ధితి. ఇది నివారించాలంటే రోడ్లను ఎక్స్ ప్రెస్ హైవేలు చేయాలని, బులెట్ రైళ్లు ప్రవేశపెట్టాలని పశ్చిమ కంపెనీలు ఒత్తిడి తెస్తున్నాయి. సమయం వచ్చినప్పుడల్లా ‘ప్రాచీన రవాణా మార్గాలు’ అని ఎద్దేవా చేస్తున్నాయి. ద్రవ్యోల్బణం టార్గెట్ ను చేరుకోలేని కేంద్ర ప్రభుత్వాన్ని చూపిస్తూ ఈసడిస్తున్నాయి. ఈ ఒత్తిడికి తల ఒగ్గిన మోడి ప్రభుత్వం ఏక బిగిన రు. 70,000 కోట్ల పెంపుదలను మౌలిక రంగాల నిర్మాణానికి కేటాయించింది. ఈ రోడ్లనే ఇన్నాళ్లూ భారత ప్రజల అవసరాలను తీర్చడానికి కొనసాగించిన పాలకులు విదేశీ కంపెనీల పెట్టుబడుల కోసం పరుగులు పెడుతూ ప్రజల సొమ్మును కంపెనీల అవసరాలకు తరలిస్తున్నారు.

………………………. ఇంకా ఉంది.

 

One thought on “సామ్రాజ్యవాదుల కోసం తయారు చేసిన శ్వేతపత్రం, బడ్జెట్ 2015-16 -(1)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s