బి.జె.పి బీమా బిల్లుకు కాంగ్రెస్ మద్దతు!


MoS for Finance Jayant Sinha introducing Insurance bill

MoS for Finance Jayant Sinha introducing Insurance bill

విదేశీ బహుళజాతి ద్రవ్య కంపెనీలు ఎంతగానో ఎదురు చూస్తున్న బీమా బిల్లు బుధవారం లోక్ సభలో ఆమోదం పొందింది. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ సైతం ఈ బిల్లుకు మద్దతు ఇవ్వడం విశేషం. దేశ ద్రవ్య వనరులను విదేశీ ప్రైవేటు బహుళజాతి కంపెనీలకు అప్పగించడంలో కాంగ్రెస్, బి.జె.పిల మధ్య ఎలాంటి విభేదము లేదని భీమా బిల్లు ఆమోదంతో మరో సారి స్పష్టం అయింది. భారతీయ జనతా పార్టీ/హిందూత్వ సంస్ధల స్వదేశీ నినాదాలు ఒట్టి బూటకమేనని మరోసారి తేటతెల్లం అయింది.

“ఇది మా బిల్లు. అందుకే మేము మద్దతు ఇచ్చాం” అని కాంగ్రెస్ నేత వీరప్ప మొయిలీ పత్రికలకు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ విధానాలు దేశాన్ని వెనక్కి తీసుకెళ్ళాయని తనకు అవకాశం ఇస్తే ముందుకు తీసుకెళ్తానని హామీలు కురిపించిన మోడీ, బి.జె.పిలు తిరిగి కాంగ్రెస్ విధానాలనే అనుసరిస్తున్నారని చెప్పేందుకు ఇంకా సాక్ష్యాలు కావాలా?

కాంగ్రెస్ పార్టీ వెళ్తూ వెళ్తూ రైలు ఛార్జీల పెంపును ప్రతిపాదించి పోయింది. అధికారానికి వచ్చీ రాగానే కాంగ్రెస్ ప్రతిపాదనను బి.జె.పి/మోడి ప్రభుత్వం ఆ ప్రతిపాదనను ఆమోదించి జనంపై భారం మోపింది. అదేమని అడిగితే అది కాంగ్రెస్ నిర్ణయం అన్నారు. కాంగ్రెస్ నిర్ణయాలను రద్దు చేస్తారనే కదా బి.జె.పికి అధికారం ఇచ్చింది? అని ప్రశ్నిస్తే ‘ఆకుకు అందని, పోకకు పొందని’ సిద్ధాంతాలు వల్లించడం తప్ప సమాధానం ఇచ్చింది లేదు.

ఆధార్ కార్డు (UIDAI) అమలు చేయబోతే అది దేశ భద్రతకు ప్రమాదం అని విమర్శించిన పార్టీలలో బి.జె.పి ఒకటి. ఇప్పటికే అనేక కార్డులు ఉండగా ఆధార్ కార్డు ఎందుకని అడిగారు. ప్రజా ధనం దుర్వినియోగం అన్నారు. గ్యాస్, రేషన్ తదితర సబ్సిడీలకు ఆధార్ సీడింగ్ వద్దే వద్దని తీర్మానించారు. తీరా అధికారానికి రావడంతోనే ప్రతి సౌకర్యంలో ఆధార్ ని చొప్పిస్తున్నారు. యు.పి.ఏ పాలనలో ఊహించని అనేక రంగాల్లో ఆధార్ సీడింగ్ ని తప్పనిసరి చేసి అన్ని రంగాల ప్రజలను వేధిస్తున్నారు.

హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ లను ప్రతిపాదించింది యు.పి.ఏ ప్రభుత్వమే. ఈ ప్లేట్ల తయారీని కొద్ది మంది పారిశ్రామికవేత్తలకు కాంట్రాక్టుకు ఇచ్చి నెంబర్ ప్లేట్ల తయారీపై ఆధారపడి బ్రతుకుతున్న వేలాది స్వయం ఉపాధిదారుల పొట్టగొట్టడం సరికాదని ఆనాడు ప్రతిపక్షాలు విమర్శించాయి. యు.పి.ఏ పాలన ఉన్నన్నాళ్లూ దానిని అమలు చేయలేదు. ఎన్.డి.ఏ ప్రభుత్వం వచ్చిన తోడనే నెంబర్ ప్లేట్ల తయారీని బలవంతంగా జనం నుండి లాక్కుని ఒకరిద్దరు పారిశ్రామికవేత్తలకు అప్పగించారు.

ఈ రోజు వేలాది మంది స్టిక్కర్ల తయారీదారులు కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఉపాధి కోల్పోయారు. ఉపాధి ఎలాగూ ఇవ్వరు, స్వయంగా కల్పించుకున్న ఉపాధి వనరులను కూడా సంపన్నవర్గాలకు కట్టబెట్టడం, అందుకు ప్రభుత్వ యంత్రాంగాన్ని వినియోగించడం ఏ కోవలోనిది? జనం ఉపాధిని లాక్కుని సంపన్నులకు ఇచ్చేయడం కాదా? కాంగ్రెస్ విధానాన్నే బి.జె.పి అమలు చేయడం కాదా?

ఉపాధి హామీ పధకం మతిలేని పాపులిస్టు విధానం అన్నారు. క్రమంగా వెనక్కి తీసుకుని రద్దు చేస్తాం అన్నారు. ఢిల్లీ ఎన్నికల దెబ్బకు జడిసి మరిన్ని నిధులు కేటాయించారు. ఈ పెంచిన నిధులు నిజంగా పధకానికే ఖర్చు చేస్తారా లేక దారి మళ్లిస్తారా అన్నది అనుమానమే. వేరే పద్దులకు తరలించి ఖర్చు మాత్రం MGNREGS పద్దులో చూపినా అడిగే నాధుడు లేడు.

బి.జె.పి అట్టహాసంగా హామీ ఇచ్చిన నూతన ఆర్ధిక విధానాల సంస్కరణలు కాంగ్రెస్ ఏలుబడిలో తెచ్చినవే. పి.వి.నరసింహారావు, మన్మోహన్ సింగ్ ల హయాంలో ఆరంభం అయిన ఈ విధానాలే నిన్నటి వరకు యు.పి.ఏ అమలు చేసింది. యు.పి.ఏ పాలన (విధానాలు) దేశాన్ని వందేళ్లు వెనక్కి తీసుకెళ్ళాయని విమర్శించిన ఎన్.డి.ఏ/బి.జె.పి/మోడి మళ్ళీ అవే విధానాలను ఎందుకు తెస్తున్నట్లు?

ఇప్పుడు “ఇది మా బిల్లు” అని కాంగ్రెస్ నేతలు సగర్వంగా ప్రకటిస్తున్న బీమా బిల్లును మోడి ప్రభుత్వం ప్రవేశపెట్టి లోక్ సభలో కాంగ్రే మద్దతుతో ఆమోద ముద్ర వేయించుకుంది. ప్రైవేటు బీమా కంపెనీలలో విదేశీ పెట్టుబడుల వాటాను 26 శాతం నుండి 49 శాతానికి పెంచే ఈ బిల్లు వల్ల దేశ ద్రవ్యరంగంలోకి విదేశీ బహుళజాతి కంపెనీలు మరింత లోతుగా చొచ్చుకు వస్తాయి. 2008 నాటి ప్రపంచ ద్రవ్య-ఆర్ధిక సంక్షోభం బారిన పూర్తిగా పడకుండా దేశాన్ని కాపాడిన భారత ద్రవ్య సంస్ధలను సదరు సంక్షోభానికి కారణం అయిన కంపెనీలకే అప్పగించడం ఎలా సమర్ధించుకుంటారు?

బీమా రంగంలో పెట్టుబడులు లేవని బి.జె.పి నేతలు చెపుతున్నారు. 26 శాతం వాటాతో వచ్చిన పెట్టుబడులు ఏ కంపెనీలవి? ఏ కంపెనీలైతే అత్యంత ఘోరంగా పాలసీదారుల క్లయిమ్ లను ఎగవేసి, వారి సొమ్మును మెక్కి, మళ్ళీ చెల్లించలేక దివాళా తీసాయో ఆ కంపెనీలే ఇప్పుడు భారత బీమా రంగంలోకి వచ్చాయి. వారి పెట్టుబడులు మన దేశాన్ని రక్షిస్తాయట! ప్రపంచం నెత్తి మీద ఇప్పటికీ తేరుకోలేని తీవ్ర సంక్షోభాన్ని రుద్దిన ద్రవ్య కంపెనీలు భారత దేశాన్ని ఎలా ఉద్ధరిస్తాయి? తమ తమ దేశాల్లో ప్రజల డబ్బును దారి మళ్లించి భోంచేసిన కంపెనీలు ఇండియాలో మాత్రం అభివృద్ధికి పూనుకుంటాయా? అబద్ధాలు చెప్పడానికీ ఒక పద్ధతి ఉండొద్దా? పాత బిచ్చగాడు పోయి కొత్త బిచ్చగాడు వచ్చి జనం మొత్తాన్ని, వారి మానాన వారిని బతకనివ్వకుండా, బిచ్చగాళ్లుగా మార్చే బిల్లులను కాంగ్రెస్ తెస్తే వ్యతిరేకించి తిరిగి అదే బిల్లును తేవడం బట్టి ప్రజలను నిలువునా మోసగించేందుకు బి.జె.పి తెగించిందని స్పష్టం అవుతోంది.

బీమా బిల్లుకు లోక్ సభలో ఓటు వేసిన కాంగ్రెస్ సభ్యులు రాజ్య సభలోనూ బిల్లుకు అనుకూలంగా ఓటు వేస్తారు. తద్వారా కాంగ్రెస్, బి.జె.పి లు ఉమ్మడిగా ఈ దేశ ప్రజల కష్టార్జితాన్ని విదేశీ కంపెనీలకు అప్పగించబోతున్నారు. విదేశీ కంపెనీలు పెట్టుబడులు తేవడం, దేశాన్ని అభివృద్ధి చేయడం కలలోని మాట. పెట్టుబడులు లాభాలు తరలించుకెళ్లడానికి వస్తాయి గానీ తమను త్యాగం చేసుకుని ఇతర దేశాలను ఉద్ధరించడానికి ఏమీ రావు. ఈ నిజాన్ని కాంగ్రెస్, బి.జె.పి లు పదే పదే, అవే మాటలతో, అవే చిలక పలుకులతో, అవే అడ్డదిడ్డమైన కారణాలు చెబుతూ అబద్ధంగా మార్చి చెబుతున్నాయి. విదేశీ కంపెనీలు చెప్పే అబద్ధాల్ని నిజాలుగా చేసి భారతీయులకు చెప్పే బాధ్యతను తమ భజస్కంధాలపై వేసుకున్నాయి.

కాంగ్రెస్, బి.జె.పి లు రెండూ ఒకటే. అవి ధరించిన ముసుగులే తేడా. విదేశీ బహుళజాతి గుత్త సంస్ధల ప్రయోజనాలు నెరవేర్చదమే వారికి పరమావధి. ఆ కంపెనీలు విదిలించే ఎంగిలి కమీషన్ మెతుకుల కోసం కక్కుర్తి పడడం వారి నైజం. వారికి దేశం పట్టదు. ప్రజలు పట్టరు. జాతీయ ప్రయోజనాలు అసలే పట్టవు. ఈ నిజం జనం తెలుసుకోవాలి.

5 thoughts on “బి.జె.పి బీమా బిల్లుకు కాంగ్రెస్ మద్దతు!

  1. ఇన్సూరెన్స్ రంగాన్ని బహుళజాతి కంపెనీలకి అప్పగించడాన్ని నేను వ్యతిరేకిస్తాను. British East India Company కూడా ఇలాగే వ్యాపారం పేరుతో వచ్చి వామనావతారంలా మన దేశాన్ని ఆక్రమించుకుంది కదా. రైలు చార్జిల పెంపుని దీనితో పోల్చడం సరికాదు. మన దేశంలో inflation వచ్చిన ప్రతిసారి రైల్వే ఉద్యోగుల జీతాలు పెరుగుతాయి. రైలు చార్జిలు పెంచకపోతే ఆ ఆదాయం ద్రైవర్, TTEలకి జీతాలు ఇవ్వడానికి కూడా సరిపోదు. రైల్వేవాళ్ళ లెక్కల ప్రకారమే 2014లో passenger traffic తగ్గింది. ప్రయాణికులు రైలు పెట్టెల్లో పరిశుభ్రత లాంటివి కూడా చూస్తారు. కేవలం చార్జిలు తగ్గించినంత మాత్రాన passenger traffic పెరగదు.

  2. మీరు,ఈ బ్లాగ్ ద్వారా ఎన్నో సార్లు కాంగ్రేస్,బి.జె.పి ల అసలు స్వరూపాన్ని వెల్లడించారు.(మీరు వామపక్షభావాలను ప్రచారం చేస్తున్నారని కొందరు విమర్శలు చేస్తున్నప్పటికీ,ప్రజలకు ఉపయోగపడేభావజాలాన్ని-అది ఏ భాజాలమైనప్పటికీ మీరు తెలియజేస్తున్నారు)
    ఈ కఠోర వాస్తవాలను 543+250 మంది పార్లమెంటు సభ్యులలో అదే పార్లమెంటు సాక్షిగా లోకానికి తెలియజేయరెందుకు?

  3. భారత దేశంలోని సామాజికార్ధిక వ్యవస్ధను కాపాడే రాజకీయ పరికరం పార్లమెంటు. తమకు అప్పగించిన పనిని నిర్వహించేవారినే పార్లమెంటుకు పంపుతారు. డబ్బుతో ఓట్లు కొనడం, తాగబోయించడం, కులాల వారీగా ఓట్లను చీల్చడం, మతోన్మాద భావజాలాన్ని రెచ్చగొట్టి విభేదాలు సృష్టించి ఓట్లు గుంజుకోవడం ఇవన్నీ అలా పంపడంలో భాగమే. ఒకరిద్దరు పొరపాటున నిజం మాట్లాడినా అవి బైటికి రావు. పత్రికలు సైతం వారి నియంత్రణలోనే ఉన్నందున వారి గొంతులు వినబడనీయవు. అందుకే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం నిజమైన ప్రజాస్వామ్యం కాదని అనడం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s