నిర్భయ డాక్యుమెంటరీ: నిషేధం సమంజసమేనా?


British filmmaker Udwin poses for a picture after addressing a news conference in New Delhi

British filmmaker Udwin poses for a picture after addressing a news conference in New Delhi

అద్దంలో ప్రతిబింబం

నిర్భయ మళ్ళీ పతాక శీర్షికలకు ఎక్కింది. బి.బి.సి ఆ పుణ్యం కట్టుకుంది. నిర్భయ ఎదుర్కొన్న అమానవీయ దుష్కృత్యం నేపధ్యాన్ని శక్తివంతంగా వీడియో కట్టిన డాక్యుమెంటరీని ప్రసారం చేయడం ద్వారా బి.బి.సి ఒక మంచి పని చేసింది.

కేసులో శిక్ష పడిన రామ్ సింగ్, ముఖేష్, అక్షయ్, వినయ్, జువెనైల్ లు భారత సమాజం తయారు చేసుకున్న నేరస్ధులన్న చేదునిజాన్ని ఈ డాక్యుమెంటరీ కళ్ళకు కట్టినట్లు వివరించింది.

పార్లమెంటులోనూ, వివిధ రాష్ట్రాల అసెంబ్లీల్లోనూ కూర్చొని ఉన్న గౌరవనీయ సభ్యుల్లో అనేకమంది రేపిస్టుల మనస్తత్వం కలిగి ఉన్నారన్న దిగ్భ్రాంతికర వాస్తవాన్ని కూడా డాక్యుమెంటరీ పట్టుకుంది. పార్లమెంటు సభ్యులు అనేకమంది డాక్యుమెంటరీపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడం సరిగ్గా ఈ కారణం వల్లనే.

చట్ట సభల సభ్యుల ఆలోచనా ధోరణిని, స్త్రీలపట్ల వారికి ఉన్న చులకన మనస్తత్వాన్ని అద్దంలో చూపినట్లుగా డాక్యుమెంటరీ చూపించడం వారికి నచ్చలేదు. తమ అంతః చేతన ముఖేష్ సింగ్ రూపంలో డాక్యుమెంటరీ తెరపై అంత స్పష్టంగా కనిపించడం వారిని తీవ్రంగా గాయపరిచింది; హతాశులను చేసింది; కలవరం కలిగించింది; పది మంది చూస్తారన్న సిగ్గు కలిగింది; తమ రాజకీయ అవకాశాలు కురచన కావచ్చని భయం పట్టుకుంది.

దాని ఫలితంగానే డాక్యుమెంటరీపై కోర్టు నుంచి నిషేధాజ్ఞలు తెప్పించారు. షరతులు ఉల్లంఘించారు కాబట్టి ఫిల్మ్ ప్రదర్శనపై నిషేధం ప్రకటించారు. ఏ రూపంలోనూ వీడియో బైటికి రాకూడదని ఆంక్షలు విధించారు. దానితో బి.బి.సి డాక్యుమెంటరీ ప్రసారాన్ని మార్చి 8 నుండి ముందుకు జరిపి మార్చి 4 తేదీనే ప్రసారం చేసింది. డాక్యుమెంటరీ ఇప్పుడు “BBC Storyville: India’s Daughter” శీర్షికన ఇంటర్నెట్ లో విస్తృతంగా లభ్యం అవుతోంది. భారత పార్లమెంటులో కూర్చొని ఉన్న బుద్ధి కురచన సభ్యులు ఆ విధంగా అపహాస్యానికి గురయ్యారు. భావాలకు, అభ్యుదయానికి సంకెళ్లు వేయలేమని రేఖామాత్రంగానైనా గ్రహించే అవకాశం వారికిలా దక్కింది.

డాక్యుమెంటరీని రూపొందించిన వ్యక్తి లెస్లీ ఉడ్విన్. నిర్భయ దుర్ఘటనపై భారత ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించడం చూసిన లేస్లీ ఉత్తేజితురాలయింది. స్వయంగా ఒకసారి అత్యాచారానికి గురయిన మహిళగా నిర్భయ ఘటన నేపధ్యాన్ని రికార్డు చేయాలని ఆమె తలపోశారు. అందుకు నేరానికి పాల్పడిన మనోభావాలను రికార్డు చేయడం ఉత్తమమైన మార్గంగా ఆమె భావించారు.

ఆ విధంగా ఆమె ఇండియాలో అడుగు పెట్టారు. భారతీయ జర్నలిస్టు సాయం తీసుకున్నారు. నిర్భయపై అత్యాచారానికి పాల్పడిన 6గురు నిందితుల తల్లిదండ్రులను కలిశారు. ప్రధాన నిందితుడు రామ్ సింగ్ ఆత్మహత్యగా పేర్కొనబడ్డ హత్యకు గురయినందున అతని తమ్ముడు, సహ నిందితుడు ముఖేష్ ను కూడా కలవాలని భావించి అందుకు అతని తల్లి దండ్రుల సహాయం తీసుకున్నారు. దానికి ముందు తీహార్ జైలు డైరెక్టర్ జనరల్ అనుమతి తీసుకుంది. వారి ద్వారా కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ అనుమతి కూడా తీసుకున్నారు. 

లేస్లీ 2012 నుండి దాదాపు 2 సంవత్సరాలు శ్రమించారు. అనేకమందిని ఇంటర్వ్యూ చేశారు. నిర్భయ తల్లి దండ్రుల ఇంటర్వ్యూలు కూడా తీసుకున్నారు. జైలు అధికారులు, ఇతర పోలీసు అధికారులు, దోషుల తల్లి దండ్రులు, దోషులు -ముఖ్యంగా ముఖేష్ సింగ్-, నిందితుల తరపున వాదించిన లాయర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, మహిళా సమస్యలపై అధ్యయనం చేసిన పలువురు ప్రముఖులు, మహిళా సంఘాల నేతలు… ఇలా అనేకమందిని కలిసి ఇంటర్వ్యూ తీసుకున్నారు. వారి అభిప్రాయాలను రికార్డు చేశారు.

డాక్యుమెంటరీలో ప్రధానంగా గమనించవలసింది ముఖేష్ మరియు నిర్భయ తల్లి దండ్రుల అభిప్రాయాలు. జరిగిన దుర్ఘటనలో నేరుగా సంబంధం కలిగిన వారు వారే. ముఖేష్ సింగ్ ఘటనకు ఒక చివర ఉంటే నిర్భయ తల్లి దండ్రులు మరో చివర ఉన్నారు. మిగిలినవారంతా మధ్యలో ఉన్నవారే. అందువల్ల వారి అభిప్రాయాలు ప్రముఖమైనవి. నిర్భయ జీవించి ఉంటే ఆమె అభిప్రాయాలు ప్రాధాన్యత కలిగి ఉండేవి. ఆమె ప్రతినిధులుగా నిర్భయ తల్లిదండ్రుల అభిప్రాయాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ఘటనానంతర పరిస్ధితిలో నిర్భయ తల్లి మరియు తండ్రిల అభిప్రాయాల మధ్య అంతర్లీనంగా వ్యక్తం అయిన తేడా ప్రత్యేకంగా గమనించదగ్గది. నిజానికి ఆ తేడా ఏమిటన్నది వీడియోలో ప్రత్యక్షంగా కనిపించదు. ఇరువురికీ తమ బిడ్డ అపురూపమైనదే. ఆడ పిల్ల పుట్టిందని ఇద్దరూ బాధపడలేదు. పైగా సంతోషంగా స్వీట్లు పంచారు, ఇద్దరూ. అలా తీపి పంచినందుకు ‘మగ పిల్లాడు పుట్టినట్లు ఆ సంతోషం ఏమిటి?’ అన్న సూటిపోటి మాటలు ఎదుర్కొన్నారు, ఇద్దరూ. ‘ఒక అమ్మాయి తలచుకుంటే ఏమైనా సాధించగలదు’ అని తన కూతురు చెబుతూ ఉండేదని ఆ తండ్రి మురిపెంగా చెప్పుకున్నాడు. తన చదువుకు సరిపడా డబ్బు సమకూర్చడం కోసం పొలాన్ని అమ్మేశాడు ఆ తండ్రి. అయినా డబ్బు సరిపోక రాత్రి పూట కాల్ సెంటర్ లో పని చేసి లోటు పూడ్చుకుందని రోజులో 3-4 గంటలు మాత్రమే నిద్రపోయేదని గర్వంగా చెప్పుకున్నాడు ఆ తండ్రి.

తల్లి – తండ్రి

అయినా సరే; చివర్లో ‘ఈ మొత్తం ఘటనలో మిమ్మల్ని తీవ్రంగా బాధించిన అంశం ఏమిటి?’ అన్న ప్రశ్నకు (వారి సమాధానాన్ని బట్టి ఈ ప్రశ్నను ఊహించాను. ఒక వేళ ఆడియోలో ప్రశ్న ఉన్నదేమో నాకు తెలియదు. నా పి.సికి ఉన్న ఆడియో పని చేయడం లేదు) వారిద్దరు ఇచ్చిన సమాధానంలో ఈ తేడా వ్యక్తం అయింది.

ప్రశ్నకు సమాధానంగా ఆ తండ్రి, “ఒకనాడు తనపైన పడుకుని నిద్రపోయిన పాప, ఆ పాపను తన చేతుల్లో పెట్టుకుని ఆడించిన తండ్రి, ఆ పాప వేలిని చేతులతో పట్టుకుని నడక నేర్పిన తండ్రి, తన చేతులతోనే ఆ పాపకు తలకొరివి పెట్టవలసి రావడం… చాలా చాలా కష్టం.” ఆ తండ్రి కళ్ళలో నీళ్ళ పొర కదలాడడం మనం చూడగలం.

ఇదే ప్రశ్నకు సమాధానంగా ఆ తల్లి, “నాకు గుర్తుంది ఇది. తన చివరి క్షణాల్లో మేమంతా ఆమె పక్కనే ఉన్నాం. కానీ ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్ధితిలో ఉండిపోయాం. నన్ను అత్యంత తీవ్రంగా బాధించేది ఇదే. నాకు ఎల్లప్పుడూ గుర్తుండిపోతుంది” ఆమె అదిమి పెట్టిన జలపాతం ఎంత ఉధృతితో ఉరికిపడిందో తెలియదు గానీ, ఆమె కంటి నుంచి మాత్రం రాలిపడింది ఒకే ఒక కన్నీటి బొట్టు. కానీ ఆమె ముఖం నిండా వ్యాపించిన కండరాలు, రక్త నాళాలు, నాడులు ఎంతటి తీవ్రమైన దుఃఖోద్వేగాన్ని ఆమె అదిమి పెట్టారో స్పష్టంగా చూపించాయి. “కానీ ఆమె కోలుకోలేదని నాకు తెలుసు. ఆమె పరిస్ధితి మెరుగుపడదని డాక్టర్ ముందే చెప్పారు” అనంతరం చెప్పారామె. ఈ ప్రశ్నకు ముందు ఆమె చెప్పిన మాటలు “ఆమె పరిస్ధితి క్షీణించిపోయింది. తను చాలా కష్టపడుతోంది. చాలా బాధను అనుభవిస్తోంది. కనీసం మాట్లాడలేని పరిస్ధితి.”

తండ్రి చెప్పిన మాటల్లో మనకు కనిపించేది సమాజం, ఆ సమాజం విధించిన సంప్రదాయాలు. కానీ తల్లి మాటల్లో కనిపించేది స్వాభావికమైన తల్లి హృదయం. తల్లి మాత్రమే మోసుకుంటూ తిరిగే గుండె. కూతురి హృదయ వేదనను, శరీర బాధను, 23 యేళ్ళ పాటు తాను చూసిన తన కూతురి ఆత్మ స్ధైర్యాన్ని తనకు తెలిసిన కొద్ది మాటల్లో, తన శరీరం స్వాభావికంగా వెల్లడించిన భావ కదలికల్లో ఆమె వ్యక్తం చేయడం మనం గమనించవచ్చు.

తలకొరివి పెట్టడం ఒక మత సంప్రదాయమే తప్ప మనిషికి అది స్వాభావికం కాదు. గుండెలపై నిద్రపోవడం, వేలు పెట్టి నడిపించడం ఒక తండ్రికి స్వాభావికమే గాని గుర్తుపెట్టుకుని ‘ఇలా చేశాను’ అని చాటుకోగల త్యాగం కాదు. కానీ ఈ రెండూ ఆ తండ్రి తనకు అత్యంత కష్టం కలిగించిన క్షణాల్లో భాగంగా చెప్పారు. ఆ తండ్రి అంతకంటే చెప్పలేరు. ఎందుకంటే ఆయనకు సమాజం నేర్పింది అదే మరి. తండ్రి పెద్ద అనీ, పోషకుడని, తల్లిది ఆ తర్వాత పొజిషన్ అనీ, ఆమె పోషించబడేది మాత్రమే అని నేర్పింది సమాజమే.

తాము ప్రాణప్రదంగా పెంచుకున్న కూతురు తన జీవితంలోనే అత్యంత క్రూరమైన, వేదనాభరితమైన, బాధతో కూడిన క్షణాల వెంబడి ప్రయాణిస్తుంటే ఆమె పక్కనే ఉన్న తండ్రి సమాజం విధించిన భావజాలాన్ని తన సొంతం చేసుకుని ప్రకటిస్తే, ఆ తల్లి మాత్రం తనకు తన చుట్టూ ఉన్న సమాజం కంటే తన కూతురి బాధే అత్యంత ముఖ్యం అని చాటారు. సమాజం విధించిన గర్భశోకం లాంటి అస్వాభావిక భావజాలాన్ని ఆమె తోసిపుచ్చారు. తన కూతురు అంత కష్టంలో ఉంటే తాము పక్కన ఉండీ ఏమీ చేయలేకపోయామే అన్నదే ఆమెను అత్యంత తీవ్రంగా కలిచివేసిన క్షణాలు. ఆమెకు ఎల్లప్పుడూ, జీవితాంతమూ గుర్తుండిపోయే క్షణాలు అవే. తండ్రికి తన గొప్పతనం గుర్తుకు వస్తే, తల్లికి తన చేతగానితనం గుర్తుకు రావడమె ఇక్కడ ముఖ్యమైన తేడా. తండ్రికి గుర్తుకొచ్చిన ‘గొప్పతనం’ సమాజం నేర్పింది కాగా తల్లిని బాధించిన ‘చేతగానితనం’ మనిషిగా ఆమె అనుభవించిన బాధ. అది ఒరిజినల్. స్వాభావికం.

ఇక డాక్యుమెంటరీ విడుదలపై భారత కోర్టులు, పార్లమెంటు వ్యక్తం చేస్తున్న అసహ్యకరమైన ఆగ్రవేశాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మేలు. భారత స్త్రీ పట్ల తమకున్న భావాలకు సంబంధించి తమ నిజస్వరూపం వెల్లడి చేయడమే వారికి కంటగింపుగా మారింది. అందుకే వారు డాక్యుమెంటరీ రూపకర్త లేస్లీ పైనా, దాన్ని ప్రసారం చేసిన బి.బి.సిపైనా కేసు వేయడానికి సిద్ధపడ్డారు. ఇది ముందే గమనించారో ఏమో తెలియదు గానీ మార్చి 3వ తేదీ వరకు న్యూ ఢిల్లీలోనే ఉన్న లేస్లీ హుటాహుటిన దేశం విడిచి వెళ్ళిపోయారు. కేసు పెట్టడంతో పాటు వీడియోను అప్ లోడ్ చేసిన యూ ట్యూబ్ కు సదరు వీడియోను తొలగించాలని తాఖీదులు పంపారు.

సభలో భిన్నాభిప్రాయాలు

అయితే డాక్యుమెంటరీ పట్ల సానుకూల అభిప్రాయాలు వ్యక్తం చేసిన ఎం.పిలు కూడా లేకపోలేదు. పాలక పార్టీ బి.జె.పి లో సైతం ఒకరిద్దరు ఎం.పిలు సైతం వీడియోను నిషేధించడం వల్ల ఉపయోగం లేదని, సరిగ్గా రేపిస్టు తరహాలోనే ఆలోచిస్తున్న సమాజాన్ని సంస్కరించాలని మాట్లాడడం విశేషమే. ఉదాహరణకి బి.జె.పి ఎం.పి కిరణ్ ఖేర్ “తమ శరీరాల పట్ల అవకాశం ఇచ్చే హక్కు ఒక్క మహిళకు మాత్రమే ఉంటుందని, ఆ హక్కును ఇతరులు ఎవరూ రద్దు చేయలేరని ప్రజలు గ్రహించాలి. ఆమె ఎలా ధరించేది, ఎలా మాట్లాడేది, ఎక్కడికి వెళ్ళేది అంతా ఆమె ఎంపికకు మాత్రమే సంబంధించినది” అని ప్రకటించారు.

రాజ్య సభలో నామినేటెడ్ సభ్యురాలు అను ఆగా “రేపిస్టులకు మరణ శిక్షలు, డాక్యుమెంటరీలపై నిషేధం ఇవేవీ సమస్యలు కావు. ఇండియాలో పురుషులు స్త్రీలను గౌరవించరు అన్న నిజంతో మనం ఘర్షణ పడాలి. ఇండియాలో అనేకమంది పురుషులు అభిప్రాయాల ఇవే (ముఖేష్, వారి లాయర్ వ్యక్తం చేసినవి). అంతా బాగానే ఉందని నటించడం మానుకుందాం” అని చెప్పారు.

రచయిత, ఎం.పి జావేద్ అఖ్తర్ మరింత నేరుగా విషయాన్ని చెప్పారు “మనం అలాంటి వ్యాఖ్యలను ఈ సభలోనే విన్నాం. [అత్యాచారానికి కారకురాలిగా బాధితురాలినే నిందించే వ్యాఖ్యలు] ఈ డాక్యుమెంటరీ నిర్మించడం శుభ పరిణామం. ఎందుకంటే తాము రేపిస్టుల లాగే ఆలోచిస్తున్నామని అనేక మంది పురుషులు తెలుసుకుంటారు.” అని ఆయన కుండ బద్దలు కొట్టారు.

(పాఠకులకు ఉచిత సలహా: ముఖేష్ వ్యక్తం చేసిన అభిప్రాయాలను అతని మాటల్లోనే వీడియో ద్వారా తెలుసుకోవడం అవసరం. భారత ప్రభుత్వం ఒత్తిడి వల్ల యూ ట్యూబ్ ఆ వీడియోను తొలగించకముందే దానిని చూడగలరు.)

 

25 thoughts on “నిర్భయ డాక్యుమెంటరీ: నిషేధం సమంజసమేనా?

  1. ముఖేశ్ ఇలాంటి వాడని తెలిస్తే కోర్త్ అతని మరణశిక్షనే సమర్థిస్తుంది. రేపో, ఎల్లుండో చావబోయేవాని మాటలు సెన్సార్ చెయ్యడం అవసరమా? ఆ వీదియో న్యాయమూర్తి చూస్తేనే అతనికి మరణశిక్ష కన్‌ఫర్మ్ చెయ్యాలనుకుంటాడు. ఆ వీదియోని నిషేధించడం వల్ల ఉపయోగం ఉండదు.

  2. తల్లిదండ్రులు తమకు కలిగిన బాధాకరమనోభావాలను వ్యక్తంచేసిన విధానం చూడండి.

    పెక్కుసంధర్బాలలో తన కుటుంబసభ్యులలో ఎవరికైనా ఏమైన భాదలు కలిగితే అవి తనకు కలిగినవిగా భావించి ఆ భావావేశాలను వ్యక్తం చేయగలగడం తల్లికిమాత్రమే సాధ్యం.

    మాతృమూర్తి నీకు శతకోటివందనాలు!!!

  3. Mental hospitalలో ఒక రోగి ప్రవర్తన బాగాలేదని అతన్ని ఎవరూ కొట్టరు, అలా కొట్టడం నిషిద్ధం కూడా. చెడు తిరుగుళ్ళు తిరిగే స్త్రీని రేప్ చేసే అధికారం కూడా ఎవరికీ లేదు. వీళ్ళు రేప్ మాత్రమే కాదు, మర్దర్ కూడా చేసారు. పైగా సిగ్గులేకుండా తమని తాము సమర్థించుకుంటున్నారు.

  4. నా ఆలోచనలు సరిగ్గా ఇలానే ఉన్నాయి.

    నేరస్తుడి అభిప్రాయం నాకు ఏమాత్రమూ నచ్చలేదు. But then I don’t think a ban should be imposed on the vedio. దశాబ్దాల కాలంగా ఫెమినిస్టులు సాధించలేనిదాన్ని (కొందరు పెద్దమనుషులు రేపిస్టులంత నీచంగా ఆలోచిస్తున్నారు అని లోకానికి ప్రతిభావంతంగా తెలియజెప్పడం) ముఖేష్ ఒక్కడే చేసిచూపాడు. ఇప్పటికైనా అలాంటి అభిప్రాయాలే గతంలో వెలిబుచ్చి ఉన్న మన సంస్కృతిరక్షకులు/బ్లాగర్లు/మంత్రులు/మతపెద్దలు కనీసం సిగ్గుపడతారని ఆశిస్తున్నాను.

    ‘ఫలానా విధంగా నడుచుకుంటేనే మేం నిన్ను గౌరవిస్తాం’ అన్నది మన సంస్కృతిలోని గొప్పవిషయం కాదని, ‘తల్లిలా గౌరవిస్తాం’ లాంటి పడికట్టుపదాలన్నీ వట్టిమాటలని భారతీయులు ఇప్పటికైనా ఒప్పుకోవడం మంచిది.

    ఈ మధ్యకాలంలో నాకు బాగా నచ్చిన వీడియో : https://www.youtube.com/watch?v=wwegkC3Z3V8

  5. శేఖర్ గారు,
    శాస్ర సాంకేతిక రంగాలలో భారతదేశ శాస్రవేత్తలు ఏదైనా ఆవిష్కరిస్తే కుళ్ళుకొని చచ్చే బిబిసి వాళ్లు ప్రసారం చేసిన సినేమ వెనుక ఎటువంటి ఉద్దేశం ఉంట్టుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఎన్నో వార్తలు చదివే మీరు వారిని మంచి తలవటం ఆశ్చర్యంగా ఉంది. బిబిసి వాళ్ళు భారతీయులకు అద్దం లో ప్రతిబింబం చూపే ముందు వాళ్ల ప్రతిబింబం చూసుకొవాల్సింది. వాళ్లు వచ్చి భారతీయులకు అద్దం చూపించనవసరం లేదు. ఆ సంఘటన జరిగిన తరువాత పోరాడింది అంతా భారత ప్రజలు. చట్టంలో సైతం మార్పులకు ఆ సంఘటన దారితీసింది. వీళ్లు చేసింది ఎమీ లేదు. సరికొత్త అయిడియాలతో సొమ్ముచేసుకొవటంలోఆరితేరి పోయిన తెల్లవాళ్లు, రేప్ సంఘటనలను సైతం సొమ్ము చేసుకొనే వచ్చని ఈ సినేమాతో చూపారు. వాళ్ళు మరి ఇంతకు దిగజారుతారని భారతీయుల ఊహకు అందకపోయి ఉండవచ్చు. మూడో ప్రపంచ దేశాలు వెనకబడిపోయాయని, అక్కడ ప్రజలకు యన్.జి.ఒ. ల ద్వారా వీళ్లు విదిలించే డబ్బులవలనే తెల్ల వారుతున్నాదని వారి అభిప్రాయం కావచ్చు. కాని వారిదేశంలో కూడా ఎన్నో రేప్ లు జరుగుతుంటే, వాటిని పట్టించుకోకుండా మనదేశంలో జరిగిన సంఘటనను, సినేమాగా తీసుకొని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసి సొమ్ము చేసుకోవటాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ముందర మారాల్సింది అంట్టు ఉంటే అది BBC మైండ్ సెట్. మరి అది ఎందుకు మారలేదో వాళ్లు ఆలోచించుకోవాలి. వాళ్లాపని చేయరు. అలా ఆలోచిస్తే వారికి సొమ్ము చేసుకొనే అవకాశాలు పోతాయి.

    Filmmaker and Plan ambassador Leslee Udwin is the creator of India’s Daughter, a powerful documentary recounting the story and aftermath of the gang rape and murder of 23-year-old student, Jyoti Singh in Delhi, India in 2012.

    On Monday 9 March, actresses Freida Pinto and Meryl Streep will attend a screening in New York, launching a worldwide India’s Daughter campaign against gender inequality and sexual violence against women and girls

    http://www.plan-uk.org/news/news-and-features/indias-daughter/

    https://storify.com/SenyorSandeep/hypocrisy-and-anti-india-campaign-of-bbc-and-ms-le

  6. శేఖర్ గారు,
    బిబిసి తీసిన కార్యక్రమాలను చూస్తూంటను. వాళ్లు ఎక్కువగా ఇతరదేశాలలో జరిగే సంఘటనలను మాత్రం హైలైట్ చేసి తీస్తారు. ఒకవేళ బిబిసి వాళ్ళు లండన్ లో జరిగిన వాటిపై కూడా డాక్యుమెంటరి తీసినట్లైతే , వ్యాఖ్యలను ఉపసoహరించుకొని క్షమాపణలు చెప్పటానికి సిద్దం.

    అత్యంత ఘోరమైన సంఘటన పైతీసిన డాక్యుమెంటరిని అతి పెద్ద సెలబ్రిటిలను పిలిచి ,గొప్పగా లాంచ్ చేయటం ఎమిటి? అదేమైనా రోమాంటిక్ లవ్ టైటానిక్ సినేమానా?

  7. ఆ లాయర్ మాటలు వింటే వీరేల్ లోకంలో ఉన్నారు, ఇంత మూర్ఖంగా ఎలా మాట్లాడుతున్నారు అని అనిపిస్తుంది. బార్ కౌన్సిల్ని తోటి లాయర్లు వాళ్ళ లైసెన్స్ రద్దు చేయాలని కోరారు.

    ML Sharma told NDTV on Thursday that his views have been misrepresented, alleging that the film-maker, Leslee Udwin, used only a part of what he said. “She took my interview for 10 days, showed only one line,” he said.

    The lawyer said if the bar council sends him a notice, he will respond to it. “I have committed no crime,” he said.

    http://www.ndtv.com/india-news/bar-council-meets-today-on-lawyers-comments-in-nirbhaya-documentary-744653

    ఆ డాక్యుమెంటరి ఉద్దేశమే ఇండియావాళ్లని ప్రపంచ దేశాల ముందు తక్కువగా చేసి చూపియటం.. ఈ డాక్యుమెంటరి పై ఎంత వివాదం రేగితే అన్ని నిజాలు బయటకు వస్తాయి. అది ఒకందుకు మంచిదే.

  8. ప్రేమ సందేశం గారు, BBC ఉద్దేశ్యం ఏదైనా ముఖేశ్ భాష మాట్లాడే లాయర్‌లని రాళ్ళతో కొట్టాలి. డబ్బుల కోసం అబద్దాలు చెప్పడం వేరు, అబద్దాలని నిజాయితీగా నమ్మడం వేరు. ముఖేశ్ నేరం చెయ్యలేదని వాదించడం వరకే అతని లాయర్ బాధ్యత. అతను చేసిన నేరాన్ని సమర్థించే అధికారం లాయర్‌కి లేదు. వృత్తి కోసం నేరస్తుని తరపున వాదించడానికీ, నేరాన్ని సమర్థించడానికీ మధ్య తేడా లాయర్‌లు తెలుసుకుంటే ఈ సమస్యలు రావు.

  9. లాయర్ల ను బార్ కౌన్సిల్ వాళ్ళు విచారిస్తారు. నిజాలు బయటికి వస్తాయి. పది రోజులు ఇంటర్వ్యు చేసి ఒక నిముషం చూపించారని ఆయన చెప్తున్నాడు కదా! రెండేళ్లు కష్టపడి తీశాను అని చెప్పే ఆవిడ. కనీసం రెండు మూడూ గంటల డాక్యుమెంటరి తీసి ఉంటే బాగుండేదేమో! ఒక గంట సినేమా కోసం రెండేళ్ళు సమయం కావాలా?నగీషిలు చెక్క టానికి అదే మైన శంకర్ “ఐ” సినేమానా? ఈ మొత్తం ఎపిసోడ్ లో న్యాయవ్యస్థ చేసే ఆలస్యం వలననే దేశంలో ఎంతో మందికి అన్యాయం జరుగుతున్నాదని భావిస్తున్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ నిర్ణయం పై హై కోర్ట్ నాలుగు నెలలో ఈ కేసుపై జడ్జ్మెంట్ ఇచ్చినా, సుప్రీం కోర్ట్ లో ఈ కేసు సంవత్సరం నుంచి మూలుగుతున్నాది. క్రికేట్ గొడవలపై మాత్రాం వెంటనే తీర్పులు ఇస్తారు. ఈ సంఘటన అనంతరం ప్రజలు రోడ్డుపైకి వచ్చి ఎలా ఆందోళనలు చేశారో అన్ని వర్గాల వారికి గుర్తు ఉన్నా, కోర్ట్ వారికి గుర్తే ఉన్నట్లు లేదు. కోర్ట్ వారికి ఇంకెంత సమయం కావాలో! సాధారణంగా ప్రజలు దుమ్మెత్తిపోసే రాజకీయ నాయకులన్నా త్వరగా స్పందించి చట్టంచేశారు. కోర్ట్ పనితీరు తీవ్ర నిరాశకు గురిచేస్తున్నాది.
    _______________________________
    బిబిసి, వాళ్ల దేశంలో జరిగిన సంఘటనలు కూడా తీసి మనకు నీతులు చెపితే బాగుంట్టుంది. అలా చేయకుండా అనవసరంగా ఇతర దేశాలవారి విషయాలలో వేలు పెట్టి, నీతులు చెపితే ఇండియా వారి కాలని కాదు. తెల్లవాళ్ల సంస్కృతి తో ఇతర దేశాల సంస్కృతి ని బేరిజు వేయటం, ప్రపంచంలో ఎన్నో సమస్యలకు మూల కారణం. ఒకసారి అరబ్బు దేశాలను చూడండి, వీరు వేలు పెట్టటం వలన ఎంత మంది అక్కడ చనిపోతున్నారో!

  10. ఇందియాలోని కోర్త్‌లలో రోజుకి పది కేసులు విచారిస్తారు. ఆ లెక్కనైతే క్రికెత్ గొడవలు విచారణకైనా రెండుమూడేళ్ళు పట్టాలి కదా, వాటికే ప్రిఫరెన్స్ ఎలా ఇస్తారు?

  11. ప్రవీణ్, మీరేసిన ప్రశ్నకు నాకు ఉంది. కాని జవాబిచ్చేది ఎవరు? ఐ పి యల్ క్రికేట్ టిం ల గురించి, శ్రీనివాసన్ స్కాం గురించి తీర్పులు వెంటనే ఎలా ఇస్తాయో అర్థం కాదు. అలాగే తీస్తా సేతల్వాడ్ బైల్ కి లాయర్ పోన్ లో వాదించి బైల్ ఇప్పించినట్లు చదివాను. కాని నిర్భయ కేసు సంవత్సరం పైగా ఎందుకు నానుస్తున్నారో దేవుడికే తెలియాలి. మనదేశంలో స్వాతంత్రం వచ్చిన తరువాత దాదాపు అన్ని రంగాలు, వ్యవస్థలు భుస్వామ్య వ్యవస్థ వాసనలు ఎంతోకొంత వదలించుకొనాయి. న్యాయవ్యవస్థ లో పెద్దగా మార్పులున్నట్లు చూడం. కోర్టు చుట్టు తీరగలేక ముసలి వారు,
    అయ్యా! నా కేసుకు త్వరగా జడ్జ్మెంట్ ఇవ్వండి, నేను రేపో మాపో పోయేటట్లు ఉన్నాను అని జడ్జ్ గారిని అడగటానికి కూడా వీలులేనట్లుంది. జడ్జ్ అడిగిన ప్రశ్నలకు సమాధానం తప్పించి ఇంకేమి మాట్లాడకుడదని అని లాయర్ ముందే చెప్తాడు. అలా నోరు జారి అడిగితే న్యాయమూర్తి పై వత్తిడి తెస్తున్నామని, ఇతరులు భావిస్తారాని అది సరి అయిన పద్దతి కాదని హెచ్చరిస్తారు.
    కోర్ట్ ల కి పండగలు, వింటర్, సమ్మర్ హాలిడేశ్ లంట్టు ఎన్నో శేలవులు ఉంటాయి. గంగా నది పరిశుభ్రత పై ప్రభుత్వ సంజాయిషి ఇవ్వాలంటు కొరడా ఝుళిపించి, ప్రభుత్వ అకౌంటబిలిటి ని ప్రశ్నించేవారు, వాళ్ల దగ్గర అన్ని పెండింగ్ కేసులుంటే ఇన్ని శేలవులెందుకని ప్రశ్నించుకొని తగ్గించుకొంటే ఎంత బాగుంట్టుంది. న్యాయవ్యవస్థ లో జరిగే ఆలస్యం వలన మనకు రాజకీయ నాయకుల మీద చాలా యక్స్ పెక్టేషన్ లు పెరిగిపోయాయి. ప్రజా నాయకులు సర్వశక్తిమంతులు, అన్ని సమస్యలను పరిష్కరించగలవారని ఊహించుకోవటం,ప్రజలలో పెరిగిన విపరీతమైన అంచనాలను అందుకోలేక వాళ్లు చతికిలపడడం జరుగుతున్నాది.

    చెన్నై కోర్ట్ ల పరిస్థితి ఎలా ఉందో, ఏగ్మూర్ కోర్ట్ లో డబుల్ బైల్ గురించి చదువు.
    Double bail
    A few months ago, *Velu was arrested on charges of misappropriation at a textile showroom. “He belonged to a poor family. His father was a road-side corn seller. When his family reached the court with a lawyer to file a bail petition, they were told that a bail petition had already been filed in his name. They found the other lawyer, who was nothing less than a goonda and wanted Rs 1 lakh to take the bail petition back,” a senior lawyer narrated on conditions of anonymity.
    And that is double bail, a nefarious system devised by some lawyers to threaten and loot those who turn up at the courts.
    The modus operandi as explained by *Radhakrishnan, another lawyer- “There are informants in the police department or brokers who are placed at police stations. As soon as someone is arrested, word is passed on. The mafia lawyer then files a bail petition in the arrested person’s name. An amount based on the family’s financial situation is demanded to take the petition back as they have no intention of appearing for the case.”
    Arul Raj, a former magistrate at the Egmore court says many lawyers make a living out of ‘double bail’ only. “In many cases, the magistrate is told that there are two bail petitions, and we obviously insist that one has to be withdrawn. Sadly, this is the way in which they extort money

    http://www.thenewsminute.com/news_sections/2989
    http://www.thenewsminute.com/news_sections/3009
    http://timesofindia.indiatimes.com/city/chennai/Drunk-lawyer-molests-court-employee-in-Chennai-HC-orders-probe/articleshow/46248548.cms

  12. 1920లో మన దేశ జనాభా ఇరవఒ కోట్లు. ఆంగ్లేయులు ఇరవై కోట్ల జనాభా కోసం కట్టిన కోర్త్‌లనే మనం ఇప్పుడు 120 కోట్ల జనాభా కోసం వాడుతున్నాం. శ్రీకాకుళం జిల్లాలో క్రిమినల్ కోర్త్‌లు మూడే. అవి శ్రీకాకుళం, పాలకొండ, సోంపేటల్లో ఉన్నాయి. ఆ మూడూ ఆంగ్లేయుల కాలంలో కట్టినవే. కోర్త్‌ల సంఖ్య పెంచకుండా, ఒక కోర్త్‌లో రోజుకి పది కేసులు విచారించి, ఒకడి కోసం మిగితా తొమ్మిది మంది కోర్త్ ఆవరణలో చెట్టు కింద కూర్చుని, కోర్త్ ఉద్యోగి పిలిచేంత వరకు ఎదురు చూడడం ఇందియాలో మాత్రమే జరుగుతుంది. చెట్టు కింద కూర్చోవలసి వస్తుందనే భయంతో ఒక్క వాయిదాకి కోర్త్‌కి వెళ్ళకపోయినా ఎందుకు రాలేదని న్యాయమూర్తి అడుగుతాడు. జ్వరం వచ్చి రాలేదని చెపితే మెదికల్ సర్తిఫికేత్ తెమ్మంటాడు. మన కోర్త్‌లలో ఒకటే పాజితివ్ పాయింత్ ఉంది. న్యాయమూర్తి చాంబర్‌లోకి బయటివాళ్ళని వెళ్ళనివ్వరు కనుక న్యాయమూర్తికి లంచం ఇవ్వడం కష్టం. అదొక్కటే మన కోర్త్‌ల పై జనానికి నమ్మకం కలిగిస్తుంది.

  13. కొన్ని మాటలు పంచుకోదలిచాను

    1. ఆ వీడియో ఇప్పుడు టొరెంట్స్‌ సైట్స్‌ ద్వారా విస్తృతంగా వ్యాప్తి నొందింది.
    <<>>

    2. ఈ విధంగా జరిగిందంటూ ఇతిహాసాలుగా చెప్పుకునే భారతంలో ఆడదాన్ని వివస్త్రను చేయబూని ఒకడు, రామయణంలో మరో ఆడదాన్ని ఎత్తుకెళ్లి వేరొకడు సర్వనాశనం అయ్యారు,
    <<>>
    <<>>

    3. ఆమె పేరు కూడా పలుకలేని [పలికితే ఏమౌతుందో అని] పరి పూర్ణ వాక్‌ స్వతంత్ర దేశంలో ఆమెపై డాక్యుమెంటరీ తీస్తే [పనికిమాలిన politicians] ఎవరైనా ఆక్షేపిస్తారు, అందులో ఆశ్చర్యమేమున్నది? అదే story ని కాస్త మసాలా add చేసి cinema తీస్తుంటే clap కొట్టేందుకో premiere show చూసేందుకో అయితే కచ్చితంగా తయ్యారవుతారు.

    4. ఇక శిక్షలంటారా ? ఈ మధ్యన నాగాల్యాండ్‌ లో ఏమైంది? 70’s లో వచ్చిన పాత హిందీ సినిమాలో మాదిరి ఊరంతా ఏకమై గుడ్డలూడదీసి sorry వివస్త్రను చేసి కొట్టి కొట్టి మరీ చంపారు కాదు కాదు punishment ఇచ్చారు.

    5. మరి శిక్షణ విషయానికో… శిక్ష నేరస్తులకైతే శిక్షణ మిగితా మొత్తం సమాజానికీను.
    నాగరికత/సంస్కృతి/విజ్ఞానం/లోకజ్ఞానం —- నగరం/పట్టణం/గ్రామం
    ఈ అంతరాలన్నీ చదువు సంస్కారలతో వీలైనంత తగ్గించడమే

    6. Bottom line: త్రేతాయుగంలో రాముడు & రావణుడు separate గా వున్నారు కానీ ఇప్పుడు కలియుగంలో పరిస్థితి అలా లేదు, వాళ్ళిద్దరూ ఒకడిలోనే వున్నారు, “పరిస్థితులు, అవకాశాలు” వాడు రాముడా రావణుడా అని నిర్దేశిస్తాయి.

    <<>>

  14. ఈ విషయంలో మనం బాధ పడవలసింది. తెల్లవాడిదైన BBC మనల్ని విమర్శించిందే అని కాదు. వాడికి అలా విమర్శించే అవకాశాన్ని మనం కల్పించామని బాధపడాలి. నేరస్థుల్లాంటి ఆలోచనధోరణితోనే ఉన్నప్పటికీ కొందర్ని సమాజం పెద్దమనుషులుగా గుర్తిస్తున్నందుకు బాధపడాలి. సంస్కృతి, సాంప్రదాయాల పేరుతో హద్దులు గీసి, ఆ హద్దులుదాటనంతవరకే మీకు రక్షణైనా, గౌరవమైనా అని చెబుతున్న కొద్దిబుధ్ధులాళ్ళను గౌరవ్చిస్తున్నందుకూ, మనమూ అలాంటి అభిప్రాయాలను కలిగిఉన్నందుకూ బాధపడాలి.

    మనలోపాల్ని ఎదుటివాడు చూపిస్తే మనం రాజకీయనాయకుల్లాగే “మీరుమాత్రం అవినీతిపరులుకారా?” తరహాలో జవాబివ్వడం సరికాదు. ఇంగ్లండ్ సమాజం ఆదర్శవంతమైనది కాకపోవచ్చు. కాకపోతే రేపుల్లాంతి నీచమైన నేరాలని శాశన సభ్యులుకూడా సమర్ధించేంతటి నీచస్థాయిలో అది ఉందనుకోవడంలేదు.

  15. నేరస్థుల్లాంటి ఆలోచనధోరణితోనే ఉన్నప్పటికీ కొందర్ని సమాజం పెద్దమనుషులుగా గుర్తిస్తున్నందుకు బాధపడాలి.
    సాంప్రదాయాల పేరుతో హద్దులు గీసి, ఆ హద్దులుదాటనంతవరకే మీకు రక్షణైనా, గౌరవమైనా అని చెబుతున్న కొద్దిబుధ్ధులాళ్ళను గౌరవ్చిస్తున్నందుకూ, మనమూ అలాంటి అభిప్రాయాలను కలిగిఉన్నందుకూ బాధపడాలి.

    completely agreeing with your statement viseshajna garu

  16. అలా విమర్శించే అవకాశాన్ని మనం కల్పించామని బాధపడాలి.
    మనం అవకాశాలు కల్పించేదేమిటి? మనదేశం కన్నా తక్కువ జనాభా, ఎన్నో దశాబ్దాల నుంచి, అత్యున్నత వ్యవస్థలు, (పోలిస్ కి పోన్ చేస్తే నిముషాలలో బాధితుడిని చేరుకొనే సౌకర్యం) కలిగి ఉన్న అమెరికా, లండన్ లలో రేపులు ఇంకా ఎందుకు జరుగుతున్నాయి? ఫెమినిస్ట్ అజెండాను అమలు చేసే ఆ పశ్చిమ దేశ ప్రభుత్వాలు ఇంతకాలమైన రేప్ లను ఎందుకు నిరోధించ లేకపోయారో? మీరు చెప్పండి.

    మనలోపాల్ని ఎదుటివాడు చూపించేది ఎమిటి? వాడు చూపించేలోపు, మనమే గుర్తించాము. ఈ కేసు లో రహస్యమేమిలేదు. జనం వీధులో కి వచ్చి చేసిన ప్రదర్శనలు ప్రపంచవ్యాప్తంగా అందరు చూశారు. ప్రజాగ్రహం చవిచూసిన ప్రభుత్వం, చట్టంలో మార్పులు కూడా చేసి, విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఏర్పాటు చేసింది. నిర్భయ కేసులో సుప్రీం కోర్ట్ ఆలస్యం తప్పితే ప్రజలు, రాజకీయ నాయకులు, ప్రభుత్వం అందరు స్పందించారు. ఈ డాక్యుమెంటరి వలన నిర్భయ కేసుకు జరిగిన మేలేమిటి? ఒక యన్.జి.ఒ. సంస్థ కమర్షియల్ డాక్యుమెంటరి తీసి ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసుకొని సొమ్ము సంపాదించుకొవటం తప్ప. జైలో కూచున్నవాడికి ఇంటర్వ్యు ఇచ్చినందుకు నలభైవేలు డబ్బులు ఇచ్చారట. శిక్ష పడినతరువాత కూడా వాడిలో ఏ మార్పు రాలేదు. వాడు ఇంటర్వ్యులో మాట్లాడాడు అని ఆశ్చర్య పడటానికి, శిక్ష పడ్డ క్రిమినల్ ఎమైనా బుద్దుడా? లేక అహింసావాదా?

  17. అలా విమర్శించే అవకాశాన్ని మనం కల్పించామని బాధపడాలి.

    మనలోపాల్ని ఎదుటివాడు చూపిస్తే

    ఈ మాటలనడంలోని నా ఉద్దేశ్యం అక్కడ ఇలాంటి నేరాలు జరగడంలేదనీ, అవి మనదగ్గరే జరుగుతున్నయనీ కాదు. ఈ వీడియో బాధితురాలిదే తప్పని వాదించడంలోని మన ఆలోచనా విధానాన్ని ప్రతిబింబిస్తున్నదనే నా అభిప్రాయం. అదే అభిప్రాయాన్ని నా వ్యాఖ్యలో చెప్పాలనుకున్నాను. ‘మనలోపాల్ని ఎదుటివాడు చూపిస్తే మనం రాజకీయనాయకుల్లాగే “మీరుమాత్రం అవినీతిపరులుకారా?” తరహాలో జవాబివ్వడం సరికాదు. ఇంగ్లండ్ సమాజం ఆదర్శవంతమైనది కాకపోవచ్చు. కాకపోతే రేపుల్లాంతి నీచమైన నేరాలని శాశన సభ్యులుకూడా సమర్ధించేంతటి నీచస్థాయిలో అది ఉందనుకోవడంలేదు.’ అన్నది ఆ ఉద్దేశ్యంతోనే. ప్రజలు ధర్నాలు చేశారు, ప్రభుత్వ అలసత్వాన్ని ఎదిరిస్తూ రోడ్లెక్కారు బాగుంది. మరి అదే సమయంలో మతపెద్దలు, రాజకీయనాయకులు ఈ నేరస్తుడిలాగానే మాట్లాడారు. అలా మాట్లాడినవారు ఈ నాటికీ సమాజంలో పెద్దమనుషుల్లా చెలామణి అవుతున్నారు. ఇదీ నేపధ్యం నేను మన సమాజాన్ని అధోస్థితిలో ఉందని అభిప్రాయపడడానికి. ఇప్పుడు నేరస్తుడన్న మాటలనే నిన్న ఇంకొకరన్నప్పుడు మనకు కోపం రాలేదెందుకు? ఒకేరకమైన అభిప్రాయాన్ని వేర్వేరు వ్యక్తులు వ్యక్తీకరించినప్పుడు ఎందుకు మనం ఒకరి వ్యాఖ్యలని ఖండింది ఇంకొకర్ని నెత్తినపెట్టుకుంటున్నాం? ఈ వీడియోని నిషేధించే భాగోతమంతా ఒక సమాజంగా మనం మన తప్పుని అంగీకరించి, సరిదిద్దుకోవడానికిగాక విదేశీరంగు పులిమి దాన్ని మరుగుపరచడానికేనని నా అభిప్రాయం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s