ఎన్నికలు జరిగిన 2 నెలలకు గాని జమ్ము & కాశ్మీర్ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడలేదు. రాష్ట్ర ప్రజలు ఏ పార్టీకి మెజారిటీ ఇవ్వకపోవడంతో, ముఖ్యంగా సెక్యులర్ ముద్ర కలిగిన కాంగ్రెస్ ప్రభ పడిపోవడంతో ప్రభుత్వ ఏర్పాటుకు విపత్కరమైన ఆటంకాలు ఎదురయ్యాయి. ఈ ఆటంకాలే కారణం అవునో కాదో ఇదమిద్ధంగా చెప్పలేం గానీ, ఓ వింత ప్రభుత్వం ఏర్పడిందన్న ఆలోచన మాత్రం పలువురికి కలుగుతోంది.
వింత ప్రభుత్వం అనడం ఎందుకంటే ‘ఒక అంగీకారానికి వచ్చాం, కనీస ఉమ్మడి కార్యక్రమం ఏర్పరుచుకున్నాం’ అని ప్రకటించిన పి.డి.పి, బి.జె.పిలు ఆ మరుసటి రోజునుండే తమ విభేదాంశాలపై పరస్పర విరుద్ధ ప్రకటనలు చేయడం ప్రారంభించారు. మొదటి రోజునుండే విరుద్ధ అభిప్రాయాలూ వ్యక్తం చేసేపనైతే ఇద్దరూ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఎందుకు, అధికారం పంచుకోవడం కోసం జనాన్ని మోసం చేయడం కాకపోతే?!
జమ్ము & కాశ్మీర్ రాష్ట్రానికి సంబంధించి అనాదిగా రగులుతున్న సమస్య ఆ రాష్ట్ర ప్రజల స్వతంత్ర ఆకాంక్షలకు చెందినది. తాము మొదటి నుండి ప్రత్యేక దేశమేననీ బ్రిటిష్ వాడు వెళ్తూ వెళ్తూ రగిల్చిన విభేదాల వల్ల మధ్యలో ఇండియా, పాక్ లు దూరి తమ దేశాన్ని ముక్కలు చేసి పంచుకున్నాయని అక్కడి ప్రజలు దృఢంగా భావిస్తున్నారు. వారి ఆకాంక్షలను సంతృప్తి పరచడానికి ఆర్టికల్ 370 ని రాజ్యాంగంలో పొందుపరిచి కూడా దానిని మృత సమానంగా మార్చివేశారు. వారి ఆకాంక్షలను అణచివేస్తూ దశాబ్దాల తరబడి రాష్ట్ర ప్రజలను సైనిక పాలనలో మగ్గేలా చేస్తూ AFSPA పేరుతో కర్కశ పాలనను సాగిస్తున్నారు. ఈ నేపధ్యంలో కాశ్మీర్ ప్రజల స్వతంత్ర జాతీయ ఆకాంక్షలు పునాదిగా కలిగిన ఆర్టికల్ 370, AFSPA లు అక్కడ వివాదాస్పద అంశాలుగా కొనసాగుతున్నాయి.
పి.డి.పి పార్టీ కాశ్మీరు లోయ ప్రజలకు ప్రతినిధిగా నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి ప్రత్యామ్నాయంగా అవతరించినందున ఆ పార్టీ అనివార్యంగా ఆర్టికల్ 370 కు మద్దతు ఇవ్వాలి. AFSPA ను ఎత్తివేయడానికి కృషి చేస్తున్నట్లు కనిపించాలి. బి.జె.పి పునాదే మత ప్రాతిపదికతో కూడినది. కారణాలు ఏవైనా జమ్ము & కాశ్మీర్ రాష్ట్రంలోని హిందు ప్రజలకు ప్రతినిధిగా ఆ పార్టీ ఆదరణ సంపాదించింది. కాశ్మీర్ లోయ నుండి పండిట్ లను తరిమివేశారని ఆరోపించే బి.జె.పి మొదటి నుండి ఆర్టికల్ 370 కి వ్యతిరేకం. దానిని రద్దు చేయాలన్నది బి.జె.పి డిమాండ్. అదే సమయంలో కాశ్మీర్ ప్రజల జాతీయ ఆకాంక్షలకు బి.జె.పికి ఇసుమంత గౌరవం ఇవ్వదు. కనుక వారి ప్రజాస్వామిక ఆకాంక్షలకు మతం రంగు పులుముతుంది. ఇక పాక్ పాలకులు ప్రోత్సహించే టెర్రరిస్టు గ్రూపుల చర్యలు బి.జె.పి మత రాజకీయ ధోరణికి మద్దతుగా రావడం కాశ్మీర్ ప్రజల దౌర్భాగ్యం.
ఈ నేపధ్యంలో పి.డి.పి, బి.జె.పి ల కూటమి ప్రభుత్వం ఒక వింత ప్రభుత్వం. తమ తమ రాజకీయ, సైద్ధాంతీక అభిప్రాయాలూ ఏ మాత్రం కలవకపోయినా అధికారం కోసం అవకాశవాదంగా ఏర్పడ్డ మోసకారి ప్రభుత్వం. అలాగని కాంగ్రెస్-ఎన్.సి ప్రభుత్వం మోసకారి కాదా అంటే కాదనీ అనలేము. కానీ కాంగ్రెస్ పార్టీకి కనీసం సెక్యులర్ ముద్రయినా ఉండడంతో ఎన్.సి తో దాని పొత్తు పైకి న్యాయబద్ధంగా కనిపించింది. (ఆ ముసుగులో కాంగ్రెస్ పాలకులు సైతం కాశ్మీర్ ప్రజల జాతీయ ఆకాంక్షలను అణచివేశారన్నది నిరాకరించలేని అంశం.) ఆర్టికల్ 370ని తెచ్చిందే కాంగ్రెస్ కనుక ఆ మేరకు ఆ పార్టీకి క్రెడిబిలిటీ ఉండడం సంబద్ధంగా కనిపిస్తుంది.
బి.జె.పి పరిస్ధితి అది కాదు. ఆర్టికల్ 370 ని పూర్తిగా రద్దు చేయాలని కోరే బి.జె.పి ప్రభుత్వాన్ని కాశ్మీరీలు ఎలా అంగీకరిస్తారు? అలాంటి పార్టీని కాశ్మీరీ ప్రజల నెత్తిపై రుద్దిన ఘనత పి.డి.పి కి దక్కుతుంది. వారి ప్రభుత్వం ఎలా సాధ్యమైంది అనంటే… ఇదిగో ఇలా కార్టూన్ లో చూపించినట్లుగా ఇరు పార్టీలు తమ తమ రాజకీయాలపై రాజీ పడడంతోనే సాధ్యం అయింది. ఈ పొత్తు పూర్తిగా అసంబద్ధం. కాశ్మీర్ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకమైనది. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ మోసాన్ని తిరస్కరించే క్రమంలో కాశ్మీరీలు అనివార్యంగా, మరో ప్రత్యామ్నాయం లేక పి.డి.పి కి ఓట్లు వేశారు. తమకు ఓట్లు వేసిన ప్రజల ఆశలను, ఆకాంక్షలను వల్లకాటికి పంపుతూ పి.డి.పి తానే స్వయంగా ఒక చెయ్యి వేసి కర్కశ AFSPA చట్టాన్ని మోయడానికి సిద్ధపడింది. మరోపక్క ఆర్టికల్ 370 ని మరో మాటకు తావు లేకుండా వ్యతిరేకించే బి.జె.పి దానిని మోసేందుకు తానూ ఓ చెయ్యి వేసేందుకు అంగీకరించింది.
ఈ విధంగా బి.జె.పి, పి.డి.పి లు ఇరువురూ అధికారం పంచుకోవడం కోసం, అధికారం ద్వారా సంక్రమించే ఆస్తులను పంచుకోవడం కోసం అనాదిగా తాము వినిపిస్తున్న రాజకీయ, సైద్ధాంతిక అభిప్రాయాలకు తిలోదకాలు ఇచ్చారు. ఇన్నాళ్లూ చేసిన నటనను సైతం విడనాడి అధికారం కోసం తాము ఏమైనా చేస్తాం అని నిరూపించుకున్నారు.
జమ్ము & కాశ్మీర్ రాష్ట్రంలోని హిందు ప్రజలకు ప్రతినిధిగా ఆ పార్టీ ఆదరణ సంపాదించింది.
జమ్మూ & కాశ్మీర్ రాష్త్రంలోని హిందూ ప్రజల ప్రతినిథిగా బి.జే.పి కొన్ని అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది!
ఆర్టికల్ 370 ని పూర్తిగా రద్దు చేయాలని కోరే బి.జె.పి ప్రభుత్వాన్ని కాశ్మీరీలు ఎలా అంగీకరిస్తారు?
కాశ్మీరీలలో హిందువులు భాగస్వాములుకారా? పరస్పర వ్యతిరేకవాక్యాలు,వాటి అర్ధాలను ఎలా సమర్ధిస్తారు?