చైనీయ సంప్రదాయాలకు పెద్ద పీట వేసే చైనా కొత్త సంవత్సరం -ఫోటోలు


అతి పురాతన నాగరికతలు విలసిల్లిన దేశాల్లో చైనా కూడా ఒకటి. ప్రాచీన నాగరికతలు పరిఢవిల్లిన ప్రతి చోటు లోనూ కాలాన్ని కొలిసే సాధనాలు అనివార్యంగా అభివృద్ధి అయ్యాయి. ఇండియాలోని వివిధ సంప్రదాయాలకు మల్లె చైనాలోనూ కొత్త సంవత్సరం ఆరంభం-ముగింపులు సూర్య, చంద్రుల కదలికలపై ఆధారపడి నిర్ధారించబడ్డాయి.

ఇప్పుడంటే క్రీస్తు పూర్వమూ, శకమూ అంటూ యూదు/పాశ్చాత్య కాలాన్ని పాటిస్తూ అర్ధరాత్రి తాగి గెంతుతున్నాం గానీ భారత దేశంలోనూ వివిధ ప్రాంతాలు, వివిధ భాషీయులు తమ తమ కొత్త సంవత్సరాలను భారతీయులు కలిగి ఉన్న సంగతి విదితమే. ఉగాది మల్లె ఇతర భాషల్లోనూ కొత్త సంవత్సరాలు ఉన్నాయి. రాను రానూ భారత దేశంలో వీటికి ప్రాధాన్యత తగ్గిపోతుండగా చైనా ప్రజలు తమ కొత్త సంవత్సర సాంప్రదాయాన్ని వదలకుండా కాపాడుకుంటూ వస్తున్నారు. చైనాలో అత్యధిక కాలం పాటు కొనసాగే పెద్ద పండగ చైనీయ కొత్త సంవత్సరమే.

చలికాలం ముగుస్తుండగా ప్రారంభం అయ్యే చైనీయ కొత్త సంవత్సరాన్ని చైనా ప్రజలు 15 రోజుల పాటు జరుపుకుంటారు. పాత సంవత్సరం చివరి రోజు సాయంత్రం నుండి వేడుకలు ప్రారంభించి 15 రోజులూ విందులు-వినోదాలు, ఆటలు-పాటలతో గడుపుతారు. చైనా డ్రాగన్ చిందులతో ఉత్సవాలు నిర్వహిస్తారు.

చైనీయ కొత్త సంవత్సరంలో ఎరుపు రంగుకు ప్రాధాన్యత ఉంటుంది. ఉత్సవానికి సంబంధించిన ప్రతి ఘటనలోను ఎరుపు రంగు ఏదో విధంగా ఇమిడి ఉంటుంది. ఎరుపు రంగుతో ఇళ్లను అలంకరిస్తారు. ముఖ్యంగా కిటికీలు, తలుపులు ఎర్రగా అలంకరిస్తారు. ఇలా చేస్తే సంపదలు ఇంట్లోకి వస్తాయని వారికి నమ్మకం. (అది ఎర్ర దేశం అయినందుకు కాదు!)

కొత్త సంవత్సరానికి ముందు చైనీయులు తమ ఇళ్లను శుభ్రంగా కడుగుతారు. తద్వారా పాత సంవత్సరం మిగిల్చిన దురదృష్టాలు దూరం అవుతాయని, కొత్త అదృష్టాలు తమ ఇంట్లోకి వస్తాయని వారు నమ్ముతారు. ఎక్కడెక్కడి దూర ప్రదేశాలకు తరలి పోయిన కుటుంబ సభ్యులందరూ ఇంటికి వచ్చి కలుసుకునే పండగ రోజు కూడా చైనీయులకు తమ కొత్త సంవత్సరమే. అనగా చైనీయ కొత్త సంవత్సరం కేవలం తేదీల మార్పుకు సంబంధించినది కాదు. అది వారి జీవన సంబంధాలకు, సంప్రదాయాలకు సంబంధించినది; మన సంక్రాంతికి మల్లే.

కొత్త సంవత్సరం వేడుకల్లో, “మంచి అదృష్టం కలగాలి”; “సంతోషంగా ఉండాలి”; “సంపదలతో తులతూగాలి”; “దీర్ఘాయువుతో బతకాలి”… ఇత్యాది నినాదాలను ఎర్ర కాగితాల పైనా, తోరణాలపైనా, పోస్టర్ల పైనా ప్రదర్శిస్తారు. ఎవరికైనా డబ్బులు ఇవ్వదలిస్తే ఎర్ర కవర్లలో పెట్టి ఇస్తారు. మన దీపావళి లాగా టపాసులు కూడా కాలుస్తారు. మన దీపావళి ప్రమిదలను పోలిన దీపాలను కూడా వెలిగిస్తారు.

చైనా కాలం క్రీస్తు పూర్వం 3వ మిలీనియం అనగా దాదాపు 5000 యేళ్ళ క్రితం ప్రారంభం అయింది. అనగా అప్పటి నుండి వారు కాలాన్ని కొలుస్తున్నట్లే. ఇప్పటి 2015 సంవత్సరం చైనీయ కాలంలో 4713 సంవత్సరంతో సమానం అని తెలుస్తోంది. చైనాలోనే ఇది కొన్ని చోట్ల 4712 సం.కీ, ఇంకొన్ని చోట్ల 4652 సం.కీ సమానం అని కూడా తెలుస్తున్నది. అంటే చైనా లోపలే ప్రాంతానికి, ప్రాంతానికి మధ్య సంప్రదాయాల్లో తేడాలు ఉన్నాయి; మన దేశంలో ఉన్నట్లుగానే.

చైనా కొత్త సంవత్సరం వేడుకలకు సంబంధించిన మరో విశేషం: అవి ప్రపంచం అంతటా జరగడం. చైనీయులు ఉన్న ప్రతి ఛోటా ఈ వేడుకలు జరుగుతాయి. పాశ్చాత్య దేశాల్లోని ప్రతి ప్రధాన నగరంలోనూ జరుగుతాయి. చైనా పొరుగు దేశాలు కూడా ఈ కొత్త సంవత్సర సంప్రదాయ వేడుకలను పాటిస్తాయి.

ఈ యేడు చైనా నూతన సంవత్సరం ఫిబ్రవరి 19 తేదీన మొదలైంది. కొత్త సంవత్సర నామం, చైనా జోడియాక్ ప్రకారం, గొర్రె. ప్రారంభ దినాన కుటుంబ సభ్యుల కలయికతో మొదలై 15వ రోజున లాంతర్ల పండగతో వేడుకలు ముగుస్తాయి. ఈ వేడుకలకు సంబంధించి ఈ సంవత్సరం ఫోటోలను బోస్టన్ గ్లోబ్ పత్రిక ప్రచురించింది. ఈ ఫోటోలు చూస్తే చైనా సంప్రదాయాలపై కాసింత దృశ్యపూరిత-అవగాహన కలుగుతుంది.

 

3 thoughts on “చైనీయ సంప్రదాయాలకు పెద్ద పీట వేసే చైనా కొత్త సంవత్సరం -ఫోటోలు

  1. కొత్త సంవత్సరం(రోమన్ కేలండెర్ ప్రకారం) వేడుకలు జరుపుకోకపోతే మిగతా ప్రపంచం నుండి ఎక్కడ దూరమైపోతామోననే ఆత్మన్యూనతా భావం ఎక్కువమందికి ఉంటుంది. అందుకని కొత్తసంవత్సర వేడుకలు జరుపుకొంటున్నారు.
    ఉగాది అనేది అదో దైవంశ సంభూత మైనదిగా పెక్కుమంది దురాభిప్రాయంతో ఉన్నారు అందుకని అల్లరిచిల్లరిగా తెలుగువాళ్ళ నూతన సంవత్సర వేడుకలను తెలుగు ప్రజలు జరుపుకోరు.

  2. మీరు తిరగేసి ఆలోచిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆత్మన్యూనత న్యూ ఇయర్ వేడుకలను జరుపుకోవడంలో ఉంది గానీ జరుపుకోకపోవడంలో ఎలా ఉంది? సొంత సంస్కృతిని తక్కువ చేసి పాశ్చాత్య సంస్కృతిని అనుకరించడం అంటే ఆది ఆత్మ న్యూనతే కదా. అలాంటి ప్రభావాలకు లోను కాకుండా తిరస్కరించడం సొంత సంస్కృతిని గౌరవించుకోవడం ఆత్మన్యూనత కాదు. అది సొంత సంస్కృతిపై ఉండే ఇష్టం. (అయితే ఆ సంస్కృతి భావనల నుండి మతాన్ని తప్పించాల్సి ఉంటుంది.)

  3. సర్, నా ఉద్దేశ్యం కూడా అదే!మనకు తెలిసిన మిగత ప్రపంచమంతా నూతన సం,, వేడుకలు జరుపుకొంటుంటే తాము ఎందుకు జరుపుకోకూడదు?(వాళ్ళ తరహాలో) అని ఆలోచిస్తుంటారు.ఇది కేవలం అనుకరణ మాత్రమే.
    అదే,ఉగాది వేడుకలను ఆంగ్ల సంవత్సరాది జరుపుకొన్నట్లు జరుపుకోవడం మనమెన్నడూ చూసి ఎరుగము.అంతకు మునుపు తెలుగు వాళ్ళు జరుపుకొన్నట్లే ఇప్పుడు ఉగాది జరుపుకొంటారు గానీ,మతపరమైన విషయాలను దూరం చేసుకొని జరుపుకోరుకదా!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s