హుస్సేన్ ఒబామాది ఏ మతం?


అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా మతం ఏమిటన్నది అనేకమంది అమెరికన్లకు ఇప్పటికీ అంతు చిక్కని ప్రశ్న. ఆయన ముస్లిం అని నమ్మేవారు అనేకమంది ఉన్నారు. ముఖ్యంగా రిపబ్లికన్ పార్టీని అభిమానించే అమెరికన్ ఓటర్లలో మెజారిటీ ఒబామా ముస్లిం మతానికి చెందిన కుటుంబం నుండే వచ్చారని గట్టిగా నమ్ముతున్నారు. ఆయనది ఏ మతమో తెలియదు అని చెప్పేవారిని కూడా కలుపుకుంటే ఆయన క్రైస్తవులు అని నమ్మనివారి సంఖ్య ఇంకా అనేక రెట్లు ఉంటుంది.

బారక్ ఒబామా పూర్తి పేరు బారక్ హుస్సేన్ ఒబామా. ఆయన పేరులోని ‘హుస్సేన్’ అన్న పదం ఆయన ఖచ్చితంగా ముస్లిమే అని పలువురు నమ్మడానికి కారణం అవుతోందని, కానీ ఆయన ముస్లిం కాదని  ఒబామా అపాలజిస్టులు చెబుతారు. కానీ ఆయన పేరులో ఉన్న ‘హుస్సేన్’ అన్న పదం చాలు ఆయన ముస్లిం అని నిర్ధారించడానికి, అని ఆయన వ్యతిరేకులు(!) వాదిస్తున్నారు. చివరికి వాషింగ్టన్ టైమ్స్ పత్రిక (ఇది రిపబ్లికన్ పార్టీ మద్దతుదారు అని ఉవాచ) సైతం 2012లో ఒబామా ముస్లిమే అని చెప్పేందుకు ఐదు వరుస ఆర్టికల్స్ ప్రచురించింది. ఆయన కుటుంబం అంతా (పెళ్ళికి ముందరి కుటుంబం) ముస్లింలే అని నిర్ధారించే సాక్ష్యాలను అమెరికా ప్రజల ముందు ఉంచింది.

బారక్ ఒబామా తల్లిగారు తెల్ల అమెరికన్! ఒట్టి అమెరికన్ అని చెబితే బ్లాక్ అమెరికన్ అని పొరబడవచ్చు అన్న అనుమానంతో ఇలా ‘తెల్ల అమెరికన్ అని చెప్పడం (కింది ఫోటోలు చూడండి). ఆమె పేరు స్టాన్లీ ఏన్ దున్హమ్. ఆమె 1995లో కేన్సర్ వ్యాధితో చనిపోయారు. బారక్ తండ్రి కీన్యన్. ఆయన కీన్యాలోని లువో తెగకు చెందిన వ్యక్తి. ఈ తెగ ప్రజలు చర్చికి వెళ్తారు. కానీ విచిత్రం ఏమిటంటే ఈ చర్చి తన స్వంత ఆచారాలు పాటిస్తుంది. క్రైస్తవం, ఇస్లాం, స్ధానిక (ఆఫ్రికన్) మతాచార సిద్ధాంతాలు జమిలిగా కలిసిన ఆచారాలవి.

బహుశా బారక్ ఒబామా మతం ఏమిటన్న సందిగ్ధతకు పునాది ఈ ఆచారాలే అయి ఉండాలి. కానీ ఆయన ముస్లిం అని చెపితే రిపబ్లికన్ పార్టీకి లాభం. ఆయన తనను తాను క్రిస్టియన్ అని చెప్పుకుంటే ఆయనకూ, డెమోక్రటిక్ పార్టీకి లాభం. ఈ విరుద్ధ రాజకీయ ప్రయోజనాలే ఒబామా మతం ఏమిటన్న అంశంపై రగడ చెలరేగి, కొనసాగడానికి అసలు కారణం.  ఒబామా స్వయంగా తాను క్రిస్టియన్ ని అని చెప్పుకున్నా, పదవీ ప్రమాణ స్వీకారాన్ని బైబిల్ సాక్షిగా చేసినా, వివాదానికి, చర్చకు మాత్రం తెరపడలేదు.

ఒబామా తల్లిదండ్రులు హవాయ్ లో మొదట కలుసుకున్నారు. కానీ వారు ఎక్కువ కాలం కలిసి లేరు. తండ్రి కీన్యాకు తిరిగి వెళ్లిపోగా, తల్లి తన ఆంత్రోపాలజీ చదువు నిమిత్తం చాలా యేళ్ళు ఇండోనేషియాలో గడిపారు.

ఈ నేపధ్యంలో ఒబామా మతం ఏమిటన్న అంశంపై యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లో పోలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ అలెక్స్ ధియోదొరిడీస్ ఒక సర్వే నిర్వహించారు. కాంగ్రెషనల్ ఎలక్షన్ స్టడీలో భాగంగా నిర్వహించిన ఈ సర్వేలో ఒబామా మతం గురించిన ప్రశ్నలను కూడా చేర్చారు. ఆ సర్వే వివరాలను ఇటీవల పత్రికలు ప్రచురించాయి. తమ అధ్యక్షుడి మతం ఏమిటన్న ప్రశ్నపై అమెరికన్లు ఏమేమి అనుకుంటున్నారో వివరాలను ప్రచురించారు. ఇవి అనూహ్యంగా ఉన్నాయని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

సర్వే ఫలితాల ప్రకారం రిపబ్లికన్ పార్టీ అభిమానుల్లో మెజారిటీ, అనగా 54 శాతం మంది, ఒబామా ముస్లిం అని నమ్ముతున్నారు. 29 శాతం మంది ‘మాకు తెలియదు’ అని సమాధానం ఇచ్చారు. తెలియదన్నవారిని కూడా కలుపుకుంటే రిపబ్లికన్ అభిమానుల్లో 83 శాతం మంది బారక్ ఒబామా క్రైస్తవుడు అన్న అంశాన్ని నమ్మడం లేదని భావించవచ్చు. అధ్యక్షుడే స్వయంగా తాను క్రైస్తవుడ్ని అని చెప్పుకున్నా ‘మాకు తెలియదు’ అని అన్నారంటే అధ్యక్షుడి ప్రకటనను వారు నమ్మనట్లే అన్నది అధ్యయనవేత్తల అభిప్రాయం.

ఇక డెమొక్రాట్ పార్టీ అభిమానుల్లో 10 శాతం మంది ఒబామా ముస్లిం అని భావిస్తుండగా ఏ పార్టీకి చెందని స్వతంత్రులలో 26 శాతం మంది ఆయన ముస్లిం అని నమ్ముతున్నారని సర్వేలో తెలిసింది.

రానున్న అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్షుడుగా స్కాట్ వాకర్ పోటీ చేస్తారని అందరూ భావిస్తున్నారు. ఆయన ప్రస్తుతం విస్కాన్సిన్ రాష్ట్ర గవర్నర్. మన రాష్ట్ర ముఖ్యమంత్రితో సమానం. ఆయన కూడా బారక్ ఒబామా మతం ఏమిటో నాకు తెలియదు అని బహిరంగంగా ఓసారి ప్రకటించారు.

సర్వే ఫలితాలు అమెరికాలో మరింత చర్చను రేపాయి. వాదనలు, ప్రతివాదనలతో విశ్లేషకులు పత్రికల్లో వ్యాసాలు రాసేస్తున్నారు. ఫలితాలు ప్రకటించాక జొనాధన్ కేప్ హార్ట్ అనే జర్నలిస్టు వాషింగ్టన్ పోస్ట్ పత్రికలో విశ్లేషణ చేస్తూ ఇలా రాశారు, “ఒబామా క్రిస్టియన్ అని రిపబ్లికన్లు ఎప్పుడూ నమ్మలేదు. 2010లో జరిగిన ప్యూ రీసర్చ్ ప్రకారం వారిలో 31 శాతం మంది ఒబామా ముస్లిం అని నమ్ముతున్నట్లు తెలిసింది. మార్చి 2009లో ఇది 17 శాతం మాత్రమే కాగా సంవత్సరం లోనే 14 శాతం పెరిగింది. (2010లో) 39 శాతం మంది ‘నాకు తెలియదు’ అని సమాధానం ఇచ్చారు. 2009 కంటే ఇది 11 శాతం ఎక్కువ. అనగా 70 శాతం రిపబ్లికన్లు! స్కాట్ వాకర్ ‘నాకు తెలియదు’ అని చెప్పడం ద్వారా ఎలాంటి రాజకీయ నష్టం లేకుండా ఎలా బైటపడ్డారో ఇది తెలియజేస్తుంది.”

సర్వే ఫలితాలను బట్టి ఒబామా దేశభక్తి పట్ల కూడా అమెరికన్ ప్రజల్లో అంతగా నమ్మకం లేనట్లు అర్ధం అవుతోందని కొందరు విశ్లేషించారు. ఆయన ఆఫ్రికన్ నేపధ్యంతో పాటు ఆయన పేరులోని ‘హుస్సేన్’ పేరు కూడా ఆయన దేశభక్తిని శంకించడానికి కారణం అయిందని వారి అవగాహన. ఇదంతా ఎందుకు అంటే ముస్లిం మతంపై అమెరికా సాగిస్తున్న ప్రతికూల ప్రచారమే దానికి కారణం అని చెప్పక తప్పదు. ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటున్న దేశంలో ముస్లిం అయినంతనే దేశభక్తిపై అనుమానం కలిగే పరిస్ధితి వచ్చిందంటే ఆ దేశంలో నిజంగా ప్రజాస్వామ్యం ఉన్నదా అన్నది కూడా అనుమానమే మరి!

సర్వే ఫలితాలకు సంబంధించిన మూడు గ్రాఫ్ లు ఒబామా తల్లి దండ్రులకు సంబంధించిన ఫోటోలు కింద చూడవచ్చు.

5 thoughts on “హుస్సేన్ ఒబామాది ఏ మతం?

  1. ఒక వ్యక్తి ఏ మతాన్ని అనుసరిస్తున్నాడో అనే వ్యవహారం పూర్తిగా అతని వ్యక్తిగత విషయం.అన్యుల జోక్యం అనవసరం.విద్యావంతులందరికీ తెలిసిన ఈ విషయానికి ఇతరుల అభిప్రాయాలు సేకరించడమేమిటి?

  2. ఈ విషయాన్ని ఒబామా ఇతరులకి ముఖ్యంగా అరబ్, ముస్లిం దేశాల వాళ్ళకి వర్తింపజేయాలి. వాళ్ళ మత హక్కును అత్యంత దారుణంగా ఉల్లంఘిస్తున్న అమెరికాకు ఒబామా అధ్యక్షుడు. ఒబామా అధ్యక్షరికం లోనే ముస్లింలపై గతంలో ఏ అధ్యక్షుడు చేయనంత దారుణ హత్యాకాండలకు అమెరికా పాల్పడింది. ఈ నేపధ్యంలో చూస్తే ఒబామా తన మతానుసరణను తానే సమస్యగా, చర్చాంశంగా చేసుకున్నారు.

    మనలో మాట! ఈ చర్చ వల్ల తనకేదో నష్టం జరిగిందని ఒబామా అస్సలు పట్టించుకోరు. తన చర్యలు ఎంత అన్యాయమో, ఎంత ఘోరమో ఆయనకి తెలుసు. ఆ చర్యల పర్యవసానం కూడా ఆయనకి తెలుసు. ఆయనకి తన మత భావాల కంటే అమెరికా సంపన్నులను, ఎం.ఎన్.సి ల ప్రయోజనాలను సంతృప్తిపరచడమే ముఖ్యం. అనగా ఆయనకి డబ్బు తప్ప ఏ విలువనూ గౌరవించడు. కనుక మీ సానుభూతి అడవి గాచిన వెన్నెలే.

  3. సామ్రాజ్యవాదులు వేరే దేశాలపై దాడులు చేసేది వనరులని దోచుకోవడానికి కానీ మతం కోసం కాదు కదా. క్రైస్తవ మతం ముసుగు తీసేసినా అమెరికా స్వభావం ఏమీ మారదు.

  4. ఒక వ్యక్తి మతాన్ని….వ్యక్తిగత వ్యవహారంగా చూసే స్థాయికి చాలా మంది ఎదగలేదు. ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్న ప్రధాన శక్తుల్లో మతం ప్రధానమయింది. అందుకే ఈ చర్చ…

  5. ప్రపంచంలొ అతి ప్రాచిన ప్రజస్వామ్య(?) దేశంలొ , పౌరుల ప్రాదమిక హక్కైన మతం గురించి అభిప్రాయసేకరణ అనేది అనవసర విషయం . అమెరికా క్రితం ఎన్నికలు వర్ణ ప్రథిపదికన జరగగా ఇసారి మత ప్రతిపదికనా జరుగుతాయా?.ప్రజస్వామ్యం గురించి ,పౌర హక్కుల గురించి చెప్పె పెద్దన్న వాటిని అణచడానికి సదాసిద్దంగా ఉంటుంది కదా !. అద్యక్షుడు ఏ పార్టీ వాడైన ,ఎ మతస్థుడైన వైట్ హౌజ్(సమ్రాజ్యవాదుల) పాలన ఎప్పుడు ఒకెల ఉంతుంది కదా !

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s