గత కొద్ది రోజులుగా పత్రికల్లో నానుతున్న వార్త ‘రాహుల్ ప్రకటించిన సెలవు (leave of absense).’ ఈ వార్త హెడ్ లైన్ మొదట చదివిన వారికి ఆయనిక శాశ్వతంగా రాజకీయాలకు సెలవు ప్రకటించారేమో అనిపించింది. వార్తలోకి వెళ్ళాక అదేమీ లేదని కొద్ది రోజుల పాటు ఆయన రాజకీయాల నుండి సెలవు పుచ్చుకుంటున్నారని అర్ధం అయింది. అంతలోనే ఆయన ప్రకటన హాస్యస్ఫోరకంగానూ తోచింది.
ఎందుకంటే, ఓ పాత కధ ఉండేది. ఒక పంతులు గారు పడవలో నది దాటుతూ పడవ నడిపే మనిషిని ‘నీకు గాయత్రీ మంత్రం వచ్చా?’ అని అడిగాట్ట. పడవ మనిషి తనకు రాదన్నాడు. దానికా పంతులు గారు పడవ మనిషిని అపహాస్యం చేస్తూ గాయత్రీ మంత్రం ప్రాశస్త్యం గురించి చెప్పి, అది తెలిసిన తన గురించి కూడా చెప్పుకుని ‘మంత్రం తెలియని నీ బతుకు శుద్ధ దండగ’ అని తేల్చిపారేశారు. ఇంతలో పడవ మనిషి ముందున్న ప్రమాదాన్ని చూశాడు. ‘పంతులు గారు తమకు ఈత వచ్చా’ అని అడిగాడు. పంతులుగారు రాదన్నారు. ‘ఎదురుగా సుడిగుండం ఉంది. ఈత రాదు గనక గాయత్రి మంత్రం చదువుకొండి’ అని సలహా పడేసి నదిలో దూకి ఈదుకుంటూ ఒడ్డు చేరాడు. ఈతరాని పంతులు గారు ఏం అవుతారో అదే అయ్యారు.
ప్రస్తుతం రాహుల్ గాంధీ గారు కూడా ఈత నేర్చుకుని తీరాలన్న గుణపాఠాన్ని ఎదురుగా పెట్టుకుని ఏ మంత్రం పని చేస్తుందో దీర్ఘాలోచనలో తెలుసుకునేందుకు ఈతకు సెలవు ప్రకటించారు. ఇటీవల ఎదురయిన పరిణామాల రీత్యా కారణాలు వెతికి పరిష్కారం కనుగునేందుకు కొద్ది రోజుల పాటు ఆయన తపస్సు లోకి వెళ్తారని కాంగ్రెస్ పార్టీ వందిమాగధులు చెబుతున్నారు. రాహుల్ రాసిన సెలవు చీటీ లోని అంశాలు కూడా కాస్త అటూ ఇటూగా ఇదే విషయాన్ని చెపుతున్నాయి.
ఇటీవల కాలంలో జరిగిన వరుస ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోవడం, అది కూడా తన నాయకత్వంలోనే జరగడం వల్ల సహజంగానే ఆయనకు మొఖం చెల్లని పరిస్ధితి. కానీ దానికి ఏమిటి పరిష్కారం. పోగొట్టుకున్న చోట వెతికితేనే పోయింది దొరుకుతుంది గానీ మరోచోట దొరకదు కదా! ప్రజా రాజకీయ రంగాన్ని వదిలి తలుపులు మూసుకుని ఎన్నాళ్లు తపస్సు చేస్తే రాహుల్ గాంధీకి గెలుపు మార్గాలు కనిపిస్తాయి? అందునా పార్లమెంటు సమావేశాలు! అవి కూడా బడ్జెట్ సమావేశాలు! భూసేకరణ చట్టం లాంటి యు.పి.ఏ తెచ్చిన చట్టాలను బలహీనపరిచి ధనిక వర్గాలకు అనుకూలంగా మార్చి వాటికి ఆమోదం కోసం మోడి/బి.జె.పి ప్రయత్నిస్తున్న సమావేశాలు. పోయిన పరువు తెచ్చుకునేందుకు, బి.జె.పి/ మోడి ప్రజా వ్యతిరేక రంగు బైటపెట్టేందుకు ఇది సరైన సందర్భం. అలాంటి బంగారు అవకాశాన్ని వదిలి ‘తపస్సు కోసం నాకు సెలవు కావాలి’ అని కోరడం బట్టి రాహుల్ ఆత్మ (కనీసం నటన కోసమైనా) భారత దేశ ప్రజల చెంత లేదని, ఆయన అసలు తాను ఉండకూడని చోట ఉన్నారని తెలియడం లేదా? పుట్టి మునిగి సహాయం కోసం కేకలు వేస్తున్న తన పార్టీని ఎదురుగా పెట్టుకుని కార్యరంగం లోకి దూకాలా లేక సెలవు చీటీ పంపి తలుపులు మూసుకుంటారా?
మీబ్లాగులో నేను కామెంట్ పెట్టలేకపోతున్నాను..గూగుల్ యూజర్ని అయినందువల్ల.
Nagasrinivasa