అమెరికా ఈశాన్య రాష్ట్రాలను వణికించిన హిమపాతం -బ్లిజ్జర్డ్- గురించి రెండు వారాల క్రితం తెలుసుకున్నాం. నిజానికి ఒక్క బ్లిజ్జర్డ్ మాత్రమే కాదు. గత కొద్ది వారాలుగా ఆ ప్రాంతాన్ని వరుస మంచు తుఫాన్లు చుట్టుముట్టి మోదుతున్నాయి. ఈ తుఫాన్ల తీవ్రత ఎంత అధికంగా ఉన్నదంటే గత నెల రోజులలో అక్కడ 100 అంగుళాల మంచు కురిసింది.
మరీ ముఖ్యంగా న్యూ ఇంగ్లండ్ గా పిలిచే 6 ఈశాన్య రాష్ట్రాలు (కనెక్టికట్, మైన్, మసాచూసెట్స్, న్యూ హ్యాంప్ షైర్, రోడ్ ఐలాండ్, వెర్మోంట్) మంచు తుఫాన్ల ధాటికి అనేక అడుగుల మంచు కింద కప్పబడిపోయాయి. మసాచూసెట్స్, మైన్ రాష్ట్రాల్లోని కొన్ని భాగాల్లో రికార్డు స్ధాయిలో 100 అంగుళాల మేరకు మంచు కురిసి జనాన్ని, పాలకులను సమాన స్ధాయిలో బెంబేలెత్తించింది. మసాచూసెట్స్ రాష్ట్ర రాజధాని బోస్టన్ లోనైతే 90.2 అంగుళాల మేర మంచు కురిసినట్లు రికార్డయింది.
ఇప్పుడు న్యూ ఇంగ్లండ్ రాష్ట్రాల ప్రజలు తమ తమ నగరాలు, గ్రామాల్లో తమ తలల ఎత్తును దాటి పేరుకుపోయిన ‘హిమ సమూహాల్ని’ తొలగించడంలో తలమునకలై ఉన్నారు. రోజుల తరబడి శ్రమించినా మంచు దిబ్బల్ని తప్పించడం వారి వల్ల కావడం లేదు. రోజువారీ కార్యక్రమాలకు ఆటంకంగా ఉన్నంత మేరకు తొలగించుకుని మిగిలిన మంచును కరిగించే ఎండల కాలం కోసం ఎదురు చూస్తున్నారు.
అనేక చోట్ల పరిస్ధితి ఎలా ఉన్నదంటే తొలగించిన మంచును ఎక్కడ పారవేయాలో తెలియడం లేదు; బెంగుళూరు వ్యర్ధాల్ని తొలగించడానికి హైకోర్టులు దిగివచ్చినట్లుగా (అయినా ఆ సమస్య తీరలేదనుకోండి!) అక్కడ కోర్టులు దిగివచ్చే అవకాశం లేదు. వారూ స్వయంగా మంచు దిబ్బల్ని తోలగించుకోవడంలో మునిగి పోయారు గనక! పట్టణ వాసులు అదేపనిగా తవ్వి తీస్తున్న మంచు మరోచోట ఇంకా ఇంకా ఎత్తుకు పేరుకుపోతోంది. సముద్రానికి సమీపంలో ఉన్న నగరాల్లో మంచు పొరల్ని తవ్వితీసి సముద్రంలో పారబోస్తున్నారు. ఈ మంచు కష్టాలు పర్యావరణ వైపరీత్య ప్రభావ ఫలితమే అని ప్రస్తుతానికి ఎవరూ అనడం లేదు.
న్యూ ఇంగ్లండ్ ప్రజల మంచు దిబ్బల కష్టాలను ఫొటోల్లో చూడడం ఇంకా బాగుంటుంది. వారి కష్టం మనకు ఇంపని కాదు గాని, మన అనుభవంలోకి వచ్చే అవకాశం లేని ఈ వింత కష్టాల్ని ఫొటోల్లో చూస్తే అదో ఉత్సుకత! ఫోటోల్ని అట్లాంటిక్ పత్రిక ప్రచురించింది.