“ఏ సాకుతో అయినా సరే, ఏ మతానికైనా వ్యతిరేకంగా హింస జరగడం మనం ఆమోదించరాదు. అలాంటి హింసను నేను గట్టిగా ఖండిస్తాను. ఈ విషయంలో నా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది.”
“(మతపరమైన) విశ్వాసం కలిగి ఉండడంలో పూర్తి స్ధాయి స్వేచ్ఛ ఉండేలా నా ప్రభుత్వం చూస్తుంది. ఎలాంటి ఒత్తిడి లేకుండా, అవాంఛనీయ ప్రభావం లేకుండా అతడు/ఆమె తనకు ఇష్టమైన మతంలో కొనసాగేందుకు లేదా అనుసరించేందుకు, ఎవరూ నిరాకరించలేని హక్కు ప్రతి ఒక్కరూ కలిగి ఉన్నారని గుర్తిస్తుంది. బహిరంగంగా గానీ, రహస్యంగా గానీ ఇతరులపై విద్వేషం రెచ్చగొట్టేందుకు ఏ మత సమూహాన్నీ నా ప్రభుత్వం అనుమతించదు. నాది అన్ని మతాలకు సమాన గౌరవం ఇచ్చే ప్రభుత్వం అవుతుంది.”
“అన్ని విశ్వాసాలకూ సమాన గౌరవం ఇవ్వడం అన్నది మన రాజ్యాంగంలో సమగ్ర భాగంగా ఉంది. ప్రాచీన భారత సంస్కృతీ, సంప్రదాయాలలోనే దానికి మూలాలు ఉన్నాయి. సమస్త విశ్వాసాలకూ సమాన గౌరవం ఇచ్చే ఈ సూత్రం అనేక వేల యేళ్లుగా భారతీయ విలువలలో ఒక భాగంగా ఉంటూ వస్తోంది. అది రాజ్యాంగంలో సమగ్ర భాగంగా మారింది కూడా ఆ విధంగానే.”
ఎవరీ మాటలు అన్నది? భారత ప్రధాని నరేంద్ర మోడి గారు! ఓసారి ఏదో విధంగా దారి చేసుకుని ఢిల్లీ ఎన్నికలకు ముందరి రోజులకు వెళ్ళండి. ప్రధాని మోడి ఇలాంటి మాటలు చెప్పగలరని ఊహించగలరా? ఏమో, కష్టమే. ఇంకాస్త ధైర్యం చేసి లోక్ సభ ఎన్నికలకు ముందు రోజులకు వెళ్ళండి. అప్పుడు? ఊహించనే లేము. గుజరాత్ సి.ఎం గా మూడు రోజుల పాటు సద్భావనా మిషన్ పాటించినప్పటి ముందు రోజులకు?! సమస్యే లేదు. అస్సలు ఊహించలేము.
కానీ ఈ రోజు అది జరిగిపోయింది. నిన్న గాక మొన్న ఢిల్లీ చర్చిలపై దాడులపై స్పందించాలని, మత మార్పిడులపై ఆర్.ఎస్.ఎస్ తదితర మత సంస్ధల ప్రకటనలపై స్పందించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. కాస్త అటు ఇటూగా ఇదే తరహా హామీని దేశ ప్రజలకు ప్రధాని ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉభయ సభల్లో, ముఖ్యంగా రాజ్య సభలో కార్యకలాపాలను ప్రతిపక్ష పార్టీలు స్తంభింపజేశాయి. ఇన్సూరెన్స్ బిల్లు లాంటి ముఖ్యమైన బిల్లును పాస్ కాకుండా అడ్డుకున్నాయి. ఐనా సరే, ప్రధాని మోడి నోరు విప్పలేదు.
కానీ ఢిల్లీ ఎన్నికల ఫలితాలు రాజు గారికి ‘రాజ ధర్మం’ ఏమిటో గుర్తు చేశాయి. ఆ రోజున, గుజరాత్ ముస్లింలపై మత విద్వేష మారణహోమం సాగుతున్న రోజున ముఖ్యమంత్రిగా మోడి తన ‘రాజధర్మం’ నిర్వహించడంలో విఫలం అయ్యారని అప్పటి ప్రధాని వాజ్ పేయి తీర్మానించారు. ఆ మాటపై ఇన్నాళ్లూ నోరు మెదపని నరేంద్ర మోడి ఈ రోజు ఢిల్లీ సామాన్యుడు దిమ్మ తిరిగేలా కొట్టిన దెబ్బకి చచ్చినట్లు ‘రాజధర్మాన్ని’ గుర్తు చేసింది. జ్ఞాపకాల పొరల్ని శోధించి పెద్దల సద్ది మాటల సుద్దుల్ని స్ఫురణకు తెప్పించింది. లోక్ సభ ఎన్నికల్లో పూర్తి మెజారిటీ సాధించింది లగాయితు దేశంలో స్వదేశీ, విదేశీ పెట్టుబడిదారులకు సానుకూల వాతావరణం నెలకొల్పడం పైననే కేంద్రీకరించి ఎన్నో ఆశలతో గద్దెనెక్కించిన సామాన్యుడి వైపు కన్నెత్తి చూడని ప్రధాని నోట ఒక్కసారిగా పేదవాడి సంక్షేమం గురించిన మాటలు వచ్చేలా చేశాయి ఢిల్లీ ఎన్నికలు.
ఓ చిన్న రాష్ట్రంలో ఆం ఆద్మీలు ఐక్యం అయితేనే ఇంత తేడా! అదే దేశం అంతా ఐక్యం అయితే?! ఎవరికి వారు ఊహించుకోవచ్చు. అందుకే సంపన్న వర్గాలు సమస్త శక్తులు ఒడ్డుతాయి. తస్మాత్ జాగ్రత్త!