ఎఎపి గెలుపుకు కారణం ఏమిటన్న ఒకే ఒక్క అంశంపై పుంఖాను పుంఖాలుగా వ్యాసాలు, విశ్లేషణలు, నివేదికలు, అధ్యయనాలు వెలువడుతున్నాయి. అవన్నీ ఎలా ఉన్నాయో ఈ కార్టూన్ చక్కగా వివరిస్తోంది.
ప్రజల ప్రయోజనమే రాజకీయాల లక్ష్యం అన్న ప్రాధమిక సూత్రం తెలిసిన వారికి ఎఎపి గెలుపు ఎలా సాధ్యం అయిందో తెలియడానికి పెద్దగా సిద్ధాంతాలతో పని లేదు. బూటకపు వాగ్దానాలు కురిపించడానికి ఏ మాత్రం సిగ్గుపడని, స్వార్ధ ప్రయోజనాలే పరమావధిగా పని చేసే పార్టీలు నిండా వ్యాపించిన గంజాయి వనంలో పని చేసిన నాలుగు రోజులు కాస్త నిజాయితీతో పని చేసిన ఎఎపి తులసి మొక్కగా జనం భావించారు.
అలాంటి చిన్న గడ్డిపోచకోసం ఆబగా చూస్తున్న ప్రజలు అంతే ఆబగా ఎఎపి అనే గడ్డిపోచను అందుకున్నారు. ఎఎపి విజయంలో ఇంతకంటే బ్రహ్మాండమైన రహస్యం ఏమీ లేదు.
కానీ అడ్డగోలు రాజకీయ సిద్ధాంతాలతో కలుషితమైన రాజకీయాలకు అలవాటు పడిన ‘సిద్ధాంతకర్తల’ కంటికి ఈ చిన్న వాస్తవం ఆనటం లేదు. అందుకే తమ సిద్ధాంతాల్లో ‘ఆచూకీ’ కోసం ‘ఏనుగు-నలుగురు గుడ్డోళ్ళు’ సామెత లోని అంధుల వలె తవుళ్లాడుకుంటున్నారు.
ఏనుగు ఎలా ఉంటుందో తెలుసుకోవాలని నలుగురు అంధులకు ఆసక్తి కలిగిందిట. అనుకున్నదే తడవుగా ఏనుగు చుట్టూ వారు మూగారు. ఒకాయన చేతికి తోక వచ్చింది. ఏనుగు అంటే సన్నని, పొడవైన శరీరం కలిగినది, దాని చివర వెంట్రుకలు ఉంటాయి’ అని ఆయన తేల్చేశారు. మరొకాయనకి కాలు తగిలింది. ‘ఏనుగు అంటే ఒక లావాటి స్తంభం లాంటి శరీరం కలిగినది అని ఆయన తేల్చారు. ఇంకోకాయన చేతికి చెవి వచ్చి తగిలింది. ‘ఏనుగు అంటే ఓ పెద్ద చేట లాంటి శరీరం ఉన్నది’ అని ఆయన తేల్చేశారు. నాలుగో ఆయన చేతికి దంతం వచ్చి తగిలింది. ‘ఏనుగు అంటే పొడవైన, పదునైన, దృఢమైన, ఒక పక్క వాడిగా ఉండే శరీరం కలిగినది’ అని ఆయన తేల్చారు.
కానీ ఇవన్నీ ఏనుగు యొక్క ప్రధాన శరీరంలో భాగాలు. అవన్నీ కలిస్తేనే ఏనుగు.
ఎఎపి గెలుపుకూ ఈ తరహా కారణాలు ఉన్నాయి. ప్రజల ప్రయోజనాలను తరతమ భేదం లేకుండా నెరవేర్చుతుందని ఎఎపి పైన ప్రజలు నమ్మకం పెట్టుకున్నారు. ఈ నమ్మకం కేంద్రంగా వివిధ రకాల ప్రజల్లోని వివిధ ఆకాంక్షలకు ఆ పార్టీ హామీ ఇచ్చింది. ధరలు, అవినీతి, నిజాయితీ, అవతలి పార్టీల మోసాలు, 49 రోజుల పాలనలోని దమ్ము, కొండల్ని సైతం ఢీకొట్టగల ధైర్యం…. ఇవన్నీ ఎఎపి గెలుపుకి కారణాలే.
చాలా మంది ఈ ‘ప్రజా కేంద్రకాన్ని’ వదిలి కారణాలు వెతుకుతున్నారు. ప్రధానితో సహా కేంద్ర మంత్రులు అంతా దిగి ప్రచారం చేయడంతో సానుభూతి పెల్లుబుకిందని కొందరు. ఇది అరవింద్ కేజ్రీవాల్ పాలనపై రిఫరెండం అని కొన్ని పత్రికలు. ఇది మోడి పాలనపై వ్యతిరేకత అనే ఆశాజీవులు. ‘కేజ్రీవాల్ ఢిల్లీ జనానికి ఒక ఊహా లోకాన్ని చూపించగలిగాడు’ అని తీర్మానించే మేధావులు.
సామాన్య మానవుడి సామాన్య ఆకాంక్షలను వదిలితే ఎన్నో అర్ధం లేని సిద్ధాంతాలు, విశ్లేషణలు పుట్టుకొస్తాయి. ఒక్కొక్క సామాన్యుడి/కుటుంబపు ఒక్కొక్క చిన్ని చిన్ని కోర్కెలన్నీ కలిస్తేనే ఈ దేశ ఆర్ధిక వ్యవస్ధ. వారి కోర్కెల తీరాన్ని చేరే ప్రయాసలో చేసే శ్రమలే ఆర్ధిక వ్యవస్ధలోని మొత్తం చమురు. అదంతా సామాన్యులదే. వారి చమురు వారికి దక్కకుండా చేస్తూ కొద్ది మంది స్వాయత్తం చేసుకోవడం నేటి వాస్తవం. దీనిని యధాతధంగా కొనసాగించడం కోసం అర్ధం లేని సిద్ధాంతాలు. అందువల్ల ఆ సిద్ధాంతాల్ని పట్టుకుని ఎన్నేళ్లు ఈదినా వాస్తవ తీరం చేరడం, ఏనుగు అసలు స్వరూపం తెలుసుకోవడం సాధ్యపడదు.