WW II: డ్రెస్డెన్ పై బ్రిటన్-అమెరికా పైశాచిక బాంబింగ్ కి 70 యేళ్ళు


 

రెండవ ప్రపంచ యుద్ధం చివరి రోజుల్లో అమెరికా, బ్రిటన్ లు సాగించిన మారణహోమం అంతా ఇంతా కాదు. వరల్డ్ వార్ II అనగానే యూదులపై నాజీల దుష్కృత్యాలు, హిట్లర్ ఫాసిజం గుర్తుకు వస్తాయి. అలా గుర్తుకు వచ్చేలా చరిత్ర రచన జరిగింది. కానీ జర్మనీ, ఇటలీ ల్లోని ఫాసిస్టు నియంతృత్వాలను సాకుగా చూపిస్తూ ఆ దేశాలు ఓడిపోతూ వెనక్కి పారిపోతున్న కాలంలో అమెరికా, బ్రిటన్ లు తెగబడి అనేక మారణహోమాలు సృష్టించాయి.

హీరోషిమా, నాగసాకి నగరాలపై అమెరికా చేసిన అణు దాడి చరిత్రలోనే అత్యంత అమానుషమైన, అవసరం లేని, ఎలాంటి యుద్ధ ప్రయోజనం లేని దాడిగా నిలిచిపోతుంది. ఇది కాకుండా జర్మనీ నగరంపై వేటకుక్కల వలె విరుచుకుపడి వేలాది జర్మనీ పౌరులను (సైనికులను కాదు) ఊచకోత కోసిన చరిత్ర అమెరికా, బ్రిటన్ దేశాలది.

ఒక పక్క సోవియెట్ సేనల ధాటికి జర్మనీ సైన్యం కకావికలై పరుగులు తీస్తూ తాము ఆక్రమించిన ఒక్కొక్క తూర్పు యూరప్ దేశాన్ని ఖాళీ చేస్తుండగా మరో పక్క సోవియట్ సేనలకు సహాయం చేసే పేరుతో అమెరికా, బ్రిటన్ సేనలు, ముఖ్యంగా వాయు బలగాలు, జర్మనీ నగరాలపై భారీగా బాంబుదాడులు నిర్వహించి నేలమట్టం చేశాయి. ఈ దారుణ హననకాండలో వేలాది మంది జర్మన్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు.

అలాంటి దాడుల్లో ఒకటి డ్రెస్ డెన్ నగరంపై అమెరికా, బ్రిటన్ ల వాయు సేనలు సాగించిన ఊచకోత! బ్రిటిష్ రాయల్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్, యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ లకు చెందిన బలగాలు తూర్పు జర్మనీ లోని డ్రెస్ డెన్ నగరంపై ఫిబ్రవరి 13, 1945 నుండి నాలుగు రోజుల పాటు బాంబుల వర్షం కురిపించాయి.

ఇరు దేశాలకు చెందిన 1200 కు పైగా భారీ బాంబర్ విమానాలు ఈ హత్యాకాండలో పాల్గొన్నాయి. 4,000 టన్నులకు పైగా అతి భీకర పేలుడు పదార్ధాలను బాంబర్లు ప్రయోగించాయి. ఈ దాడుల్లో 25,000 మందికి పైగా చనిపోయారని అమెరికా, బ్రిటన్ లు చెబుతాయి. జర్మనీ లెక్క మాత్రం 2 లక్షలకు పైమాటే. హిట్లర్ ప్రభుత్వం తప్పుడు లెక్కలు ప్రచారం చేసుకుందని అమెరికా, బ్రిటన్ లో ఆరోపిస్తాయి. కానీ కింది ఫోటోలు చూసినట్లయితే జర్మనీ లెక్క సత్యదూరం కాకపోవచ్చని అనిపిస్తుంది.

75,000 కు పైగా నివాస గృహాలను తమ బాంబర్ దాడుల్లో అమెరికా, బ్రిటన్ లు ధ్వంసం చేశాయి. డ్రెస్ డెన్ నగరం పారిశ్రామిక ప్రాంతం అనీ, హిట్లర్ యుద్ధానికి సరంజామా ఇక్కడి నుండే సరఫరా అయ్యాయని కనుక తమ దాడి సమంజసమే అని అమెరికా, బ్రిటన్ లు సమర్ధించుకుంటాయి. వాస్తవంలో డ్రెస్ డెన్ నగరం శివార్లలో ఉన్న పరిశ్రమలపై అమెరికా, బ్రిటన్ బాంబర్లు తమ దాడులకు కెంద్రీకరించలేదు. నగరంలోని ప్రధాన కూడలి, నివాస గృహాలను లక్ష్యం చేసుకుని దాడులు చేశాయి. అనేక చారిత్రక భవనాలను, సాంస్కృతిక కేంద్రాలను ధ్వంసం చేశాయి. పౌరులు ఎంత భారీ సంఖ్యలో చనిపోయారంటే శవాలను గుర్తించే సమయం, అవకాశం, వసతి లేక గుర్తించకుండానే గుట్టలు గుట్టలుగా పేర్చి కాల్చివేశారు లేదా భారీ గొయ్యిలు తవ్వి పూడ్చి పెట్టారు.

ప్రపంచ యుద్ధం ముగిసి అనేక యేళ్ళ తర్వాత కూడా డ్రెస్ డెన్ నగరంలో అమెరికా, బ్రిటన్ లు సాగించిన నరమేధం పైన విస్తృత చర్చ నడిచింది. ఇరు దేశాల చర్యలను యుద్ధ నేరాలుగా పరిగణించాలన్న డిమాండ్లపై ఐరాసలో చర్చలు నడిచాయి. కానీ యుద్ధంలో విజేతలే యుద్ధానంతర పరిణామాలను శాసిస్తాయి. ఓడినవారిపై విజేతలు బలవంతపు ఒప్పందాలను రుద్దుతాయి. ఆ విధంగా అమెరికా, బ్రిటన్ లు యుద్ధ నేరాల విచారణ నుండి తప్పించుకున్నాయి.

అమెరికా, బ్రిటన్ ల భీభత్సకాండలు, మానవ హననాలు, యుద్ధ నేరాలు అప్పటి నుండీ కొనసాగుతూనే ఉన్నాయి తప్ప ఆగలేదు. వియత్నాంపై దురాక్రమణ దాడికి తెగబడడం దగ్గర్నుండి ప్రపంచంలో అనేక మంది నియంతృత్వ పాలకుల హత్యాకాండలకు మద్దతు ఇవ్వడం దగ్గర్నుండి ఇటీవల ఆఫ్ఘన్, ఇరాక్, లిబియాల దురాక్రమణ యుద్ధాల వరకు అమెరికా, బ్రిటన్ ల పాపాల భాగస్వామ్యం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఉక్రెయిన్ లో తాము వ్యతిరేకించే నాజీ గ్రూపులనే అధికారంలోకి తేవడం ద్వారా తూర్పు ఉక్రెయిన్ రాష్ట్రాలపై ఊచకోతలను అమలు చేస్తున్నాయి.

కింది ఫోటోలను ది అట్లాంటిక్ పత్రిక ప్రచురించింది. ఫొటోల్లో కొన్ని డిజిటల్ కాంపోజిట్ ఇమేజిగా గుర్తించాలి. ఒకే ఫోటోలో అప్పటి, ఇప్పటి దృశ్యాలను కలగలిపి నాటికీ నేటికీ ఉన్న తేడా చూపే ప్రయత్నం జరిగింది.

 

 

One thought on “WW II: డ్రెస్డెన్ పై బ్రిటన్-అమెరికా పైశాచిక బాంబింగ్ కి 70 యేళ్ళు

  1. నిజంగా అమెరికా, బ్రిటన్ల అకృత్యాలపై విచారణ జరిపితే వారికి వేయడానికి శిక్షలే లేవనుకుంటా.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s