పసి బిడ్డ నిండు ప్రాణాల కంటే కాంట్రాక్టులో మిగిలే రూపాయి నోట్లకే ఎక్కువ విలువ కట్టిన ఓ పాషాణ హృదయుడి కఠినత్వం ఇది. మానవ విలువలు అడుగంటిన లోకం విధించిన డబ్బు బంధనాలలో తల్లి బందీ అయిందని తెలియక పాల కోసం గుక్క పట్టి ఏడ్చి ఏడ్చి విసుగెత్తి కానని లోకాలకు తరలి వెళ్ళిన పసి బిడ్డ విషాదాంతం ఇది.
మెదక్ జిల్లాలో హత్నూర మండలలో హృదయాల్ని పిండి వేసే ఈ ఘోర ఉదంతం చోటు చేసుకుంది. దుర్ఘటనను కప్పి పెట్టటానికి కాంట్రాక్టర్ ప్రయత్నించడంతో ఆలస్యంగా వెలుగు చూసింది. ఫిబ్రవరి 7 తేదీన తుర్కల ఖానాపుర గ్రామంలో ఈ దుర్ఘటన జరగ్గా కాంట్రాక్టర్ ఒత్తిడి తెచ్చి బాధితుల స్వగ్రామంలో బిడ్డ శవాన్ని పూడ్చిపెట్టించాడు.
బాధిత మహిళ, బిడ్డ తల్లి అయిన మల్లేశ్వరి కుటుంబం మహబూబ్ నగర్ జిల్లాలోని నవాబ్ పేట నుండి పనుల కోసం మెదక్ జిల్లాకు వలస వచ్చింది. ఒక లేబర్ కాంట్రాక్టర్ సహాయంతో ఒక ఫ్యాక్టరీలో జరుగుతున్న విస్తరణ పనుల్లో పని సంపాదించుకున్న మల్లేశ్వరి తన రోజుల బిడ్డను సమీపంలోని చిన్న గుడిసెలో వదిలి పెట్టి పనిలోకి వస్తుంది.
మల్లేశ్వరికి అప్పటికే ముగ్గురు ఆడ పిల్లలు. ముగ్గురూ మైనర్ బాలికలే. ముగ్గురు ఆడ పిల్లల తర్వాత నాలుగో సంతానంగా ఆమె 20 రోజుల క్రితం మగ బిడ్డను ప్రసవించింది. మన సమాజంలో మగ పిల్లాడికి ఉండే ప్రాధాన్యత తెలియనిది కాదు. అందునా అనేక యేళ్ళ ఎదురు చూపుల అనంతరం పుట్టిన మగబిడ్డ కావటాన మల్లేశ్వరి కుటుంబానికి ఆ బిడ్డ చాలా ముఖ్యం. అలాంటి బిడ్డ కాస్తా కాంట్రాక్టర్ క్రూరమైన డబ్బు దాహానికి అర్పించవలసి రావడంతో మల్లేశ్వరి కంటికి మింటికి ధారగా విలపిస్తోంది.
ఫ్యాక్టరీకి సమీపంలోని గుడిసెలో ఫిబ్రవరి 7 తేదీన ఎప్పటి లాగా బిడ్డను వదిలి పెట్టిన మల్లేశ్వరి పనిలో నిమగ్నం అయింది. కొంత సేపటికి ఆమె బిడ్డ ఆకలికి గుక్క పెట్టి ఏడ్వడం మొదలు పెట్టింది. చాలా సేపటివరకు అలా ఏడుస్తూనే ఉంది. మల్లీశ్వరి బిడ్డకు పాలివ్వడానికి వెళ్తానని కాంట్రాక్టర్ ని అనుమతి కోరింది. ఆమె వెళ్ళిపోయినంత సేపు జరగవలసిన పని, ఆ పని వల్ల తాను కోల్పోయే డబ్బు కాంట్రాక్టర్ కి గుర్తు వచ్చి ఆమె వెళ్లడానికి వీలు లేదని తెగేసి చెప్పాడు. పనికోసం తమది కానీ చోటుకు వలస వచ్చిన మల్లేశ్వరి కాంట్రాక్టర్ కాఠిన్యానికి భయపడిపోయింది. గట్టిగా అడిగితే పని పోతుందని భావించిందేమో బిడ్డ ఆకలిని గుర్తించి కూడా తీర్చలేని నిస్సహాయ స్ధితిలో ఉండిపోయింది.
కొంత సేపటికి ఆ బిడ్డ ఏడుపు ఆగిపోయింది. తల్లి హృదయం కీడు శంకించింది. పరుగెత్తుకుంటూ వెళ్ళి బిడ్డకు పాలిచ్చేందుకు ప్రయత్నించింది. కానీ బిడ్డ కదల్లేదు మెదల్లేదు. దానితో తల్లి హతాశురాలై ఆందోళనతో ఇరుగు పొరుగుకి చెప్పింది. వారంతా కలిసి సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి పరుగు పరుగున బిడ్డను తీసుకెళ్లారు. ఆ బిడ్డ అప్పటికే చనిపోయిందని డాక్టర్లు నిర్ధారించారు.
బిడ్డ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలుసుకున్న కాంట్రాక్టర్ ఆ తల్లిని, ఆమె బంధువులను బిడ్డ మృత దేహాన్ని అక్కడి నుండి తీసుకెళ్లిపోవాలని ఒత్తిడి తెచ్చాడు. ఒత్తిడికి లొంగిపోయి, వాళ్ళు బిడ్డ దేహాన్ని నర్సాపూర్ శివార్లకు తీసుకెళ్లారు. అక్కడే ఖననం చేశారు.
విప్లవ పార్టీల కార్యకర్తలు ఉ.సాంబశివరావు గారు రాసిన ఒక పాటను గతంలో పాడేవారు. ‘జోలాలి… పాడాలి… ఈ జోల పాటతో పాపాయి, ఆపాలి నీ గోల పాపాయి’ అంటూ ఆ పాట మొదలవుతుంది. ఒక చరణం “అమ్మను రమ్మని, పాలిచ్చి పొమ్మని, కాకితో కబురంపాను, ఆ కాకి చేరలేదో, కామందు పంపలేదో, మన అమ్మ రాలేదు, ఏడుపెక్కువయ్యే, అది వెక్కి వెక్కి ఏడ్చే…” అంటూ సాగుతుంది. సమాజంలో మార్పులు వచ్చాయని, ఈ పాటలోని పరిస్ధితులు ఇప్పుడు లేవని చెబుతూ పార్టీల నేతలు కొందరు ఈ పాటను పాడనివ్వడం లేదు. కామందులు లేరని, భూస్వామ్య వ్యవస్ధ అంతరించిపోయిందని కనుక ఈ పాటకు సందర్భం లేదని వారు సిద్ధాంతీకరించారు.
వాస్తవంలో అలాంటి కామందులు కొనసాగుతున్నారని కాకపోతే వారి రూపమే మారిందని మల్లీశ్వరి దుర్ఘటన తెలియజేబుతోంది. అర్ధ వలస-అర్ధ భూస్వామ్య వ్యవస్ధ లక్షణమే అంత. ఇటు పాత సమాజం లక్షణాలు కలిగి ఉంటూనే కొత్త సమాజం వచ్చిన లక్షణాలు కనబరుస్తూ సమాజంలో తీవ్ర మార్పులు వచ్చిన భ్రమలను కలుగజేస్తుంది. కానీ పైపైన ఎన్ని మార్పులు కనపడినా, అవి ఎంత తీవ్రతతో కనపడినా అది సంకర వ్యవస్ధ లక్షణాలు తీవ్రం కావడంగానే గుర్తించాలి తప్ప సమాజం మార్పుగా గుర్తించడం సరికాదని మల్లేశ్వరి ఘటన స్పష్టం చేస్తోంది. కాంట్రాక్టర్ గా అవతరించిన భూస్వామ్య లక్షణాల కామందు, తన పాత సమాజ స్వభావంతో కూడిన పెత్తనం ధోరణి వల్లనే బిడ్డకు పాలివ్వడానికి సైతం తల్లికి అనుమతి ఇవ్వలేకపోయాడు. పొలం గట్టు మీద చెట్టుకి కట్టిన గుడ్డ ఊయలలోని బిడ్డకు పాలిస్తానంటే పాలు వస్తున్నాయో లేదో పిండి చూపించాలని డిమాండ్ చేసే భూస్వామ్య పెత్తందారుకీ, మెదక్ జిల్లా కాంట్రాక్టర్ కామందుకీ మధ్య వచ్చిన తేడాకు ఏ స్వభావం ఉన్నదో గుర్తించలేని పరిస్ధితుల్లో విప్లవ పార్టీల నాయకులుగా కొనసాగుతున్నవారు ఉన్నందున అనేక అనర్ధాలు విప్లవోద్యమంలో నెలకొనడం విచారకరమైన విషయం.
తెలంగాణ సాయుధ పోరాట కాలంలో…దొరలు చేసే ఆగడాలు విన్నాం….ఇపుడు స్వయంగా చూస్తున్నాం…
సంకరవ్యవస్థ లక్షణాలనూ,సమాజం మార్పులను వివరంగా తెలియజేయగలరా?