ఢిల్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించడం ద్వారా అరవింద్ కేజ్రీవాల్/ఎఎపి ఒక పెద్ద మెట్టు ఎక్కి వచ్చారు. ఇప్పుడిక పూర్తి స్ధాయి పాలన అనే మరో పెద్ద మెట్టు ఎక్కాలి.
ఆయన, ఆయన పార్టీ అన్నీ రకాలుగా విఫలం కావాలని సంపన్న వర్గాలు, వారి పార్టీలు తీవ్రంగా కోరుకుంటున్నందున ఢిల్లీ రాష్ట్ర పాలన ఎఎపికి నల్లేరుపై నడక ఏమీ కాదు.
పార్టీ వయసు, అనుభవం… ఇత్యాది అంశాల రీత్యా ఎఎపి సైజు చాలా చిన్నదని కార్టూనిస్టు సూచిస్తున్నారు. అందువల్ల ఆయన ఎక్కవలసిన మెట్లు భారీ పరిణామంలో ఉన్నాయని ఆయన ప్రయాణం కూడా కష్టభరితం కానుందని కార్టూనిస్టు భావన.
అయితే ఎఎపి ప్రయాణం కష్టమే కానీ దానికి కారణం ఆ పార్టీ చిన్నది అయినందువల్ల కాదు. చిన్న, అనుభవం లేని పార్టీయే అయినా ప్రజల ప్రయోజనాల పట్ల నిబద్ధత ఉంటే గనక ప్రజల మద్దతుతో తేలికగానే పాలన సాగించవచ్చు.
ప్రస్తుత వ్యవస్ధ లోని నిర్మాణాలన్నీ సంపన్నుల కోసం ప్రభుత్వాలు నడపడానికే అలవాటు పడి ఉన్నాయి. అందువల్ల ఒక్కసారిగా సామాన్యుల కోసం పని చేయాలని అడిగితే మొరాయిస్తాయి. నిరాకరిస్తాయి. ఆటంకాలు సృష్టిస్తాయి. శత్రువుకు సహకరిస్తాయి. కుట్రలు కూడా చేస్తాయి. ఈ కారణం చేతనే ఎఎపికి పాలన కష్టం అవుతుంది.
ఎఎపి పాలనకు కేంద్రం సహకరిస్తే గనుక అందులో అనుమానించడానికి ఖచ్చితంగా ఏదో ఉన్నట్లే అర్ధం.అది సహకారం ద్వారా పొగ పెట్టడానికి కేంద్రం చేసే ప్రయత్నం కావచ్చు. లేదా ఎఎపి పాలకులే రాజీ పడి ఉండవచ్చు.
ఎఎపి నిజాయితీ నిజమే అయితే ఎఎపికి పాలన కంటక ప్రాయమే.