అత్యధిక సీట్లను గెలుచుకోవడం బట్టి ఎఎపికి ధనిక, పేద అన్న తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలూ ఎఎపికి ఓటు వేసి ఉంటారని భావించవచ్చు. కానీ కాస్త లోతుకు వెళ్తే ఈ పరిశీలనలో లోపం కనిపిస్తుంది.
ఎందుకంటే బి.జె.పికి వచ్చిన ఓట్ల శాతం తక్కువేమీ కాదు. 32.2 శాతం ఓట్లు సీట్ల సంఖ్యను పెంచడంలో సహాయపడి ఉండకపోవచ్చు గాని ఒక పార్టీకి అన్ని ఓట్లు పడడాన్ని తక్కువ చేసి చెప్పలేము. అందుకే మరింత లోతుకి వెళ్ళి పరిశీలన చేయాల్సి ఉంది.
పత్రికల్లో వచ్చే వార్తలు, ఎన్నికల కమిషన్ ప్రకటించే గణాంకాలు తప్ప లోతుకి వెళ్ళి పరిశీలన చేసే అవకాశం జనానికి ఉండదు. అందువల్ల తమకు అందుబాటులోకి వచ్చిన వార్తల ద్వారానే పరిస్ధితిని అంతటినీ అంచనా వేసే ప్రయత్నం చేస్తారు. దానివల్ల వాస్తవానికి దగ్గరగా, కనీసం అవసరమైనంత దగ్గరగా అయినా వెళ్ళడం సాధ్యం కాదు.
ఫిబ్రవరి 13 తేదీన ది హిందు పత్రిక కాస్త లోతైన అంశాలను ప్రచురించింది. బహుశా ఈ అంశాల ద్వారా సాధారణ దృష్టికి అందుబాటులోకి రాని పరిశీలనలు చేయగల అవకాశం ఉండవచ్చు.
సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ స్టడీస్ (సి.ఎస్.డి.ఎస్) అనే సంస్ధలో లోక్ నీతి అనే విభాగం ఢిల్లీ ఎన్నికలను అధ్యయనం చేసింది. సదరు అధ్యయనం ద్వారా వెల్లడి అయిన అంశాలనే ది హిందు ప్రచురించింది.
ఆ వివరాల ప్రకారం ఎఎపికి అన్నివర్గాల ప్రజల నుండి ఓట్లు వచ్చినప్పటికీ భారీ విజయం సాధించడానికి కారణం మాత్రం ఆ పార్టీ వైపుకు దళితులు, పేదలు, యువకులు భారీగా మొగ్గు చూపడమే. ఏ పార్టీ కూడా పట్టించుకోని అతి పేదలైన ప్రజలకు కూడా ఎఎపి చేరువ అయింది. సమాజంలో వివిధ రకాలుగా వివక్షకు గురవుతున్న ప్రజలందరిని ఎఎపి ఆకర్షించింది.
సమాజంలో అన్ని రకాలుగా వివక్షలకు గురయ్యేది దళితులు, పేదలే. దళితులు అంటే ఎస్.సి, ఎస్.టి లే కానవసరం లేదు. సామాజికంగా వెనుకబడి ఉన్న కులాల ప్రజలందరూ, ముఖ్యంగా అల్పాదాయ వర్గాల వారు ఎఎపి పైన అమితమైన విశ్వాసంతో, ఆశతో ఆ పార్టీకి ఓట్లు వేశారని సి.ఎస్.డి.ఎస్ అధ్యయనం అంచనా వేసింది.
ఫిబ్రవరి 7 తేదీన ఓటింగు ముగిసిన వెంటనే ఈ సంస్ధ తన సర్వే నిర్వహించింది. 24 అసెంబ్లీ నియోజకవర్గాలలో వివిధ వర్గాల ప్రజలను ఎంచుకుని 120 చోట్ల అభిప్రాయాలను సేకరించి వాటిని క్రోడీకరించింది సి.ఎస్.డి.ఎస్.
ఢిల్లీ నగర ప్రజల వ్యాప్తి ఏ విధంగా ఉన్నదో దానికి అనుగుణంగా శాంపిల్స్ ను సి.ఎస్.డి.ఎస్ ఎంచుకుంది. తద్వారా ఢిల్లీ సమాజంలోని ఏ ఒక్క సెక్షన్ నూ వదిలి పెట్టకుండా జాగ్రత్త తీసుకుంది. తాము సేకరించిన అభిప్రాయాలూ, ఎన్నికల ఫలితాలు సరిపోయాయని నిర్ధారించుకున్నాకనే అధ్యయన ఫలితాలు వెల్లడి చేసింది.
ఈ విధంగా జరిపిన అధ్యయనంలో ఎఎపికి వచ్చిన ఓట్లలో అత్యధిక భాగం యువకుల నుండి వచ్చాయని తేలిందని, ముఖ్యంగా 18-22 సం.ల వయసు యువకులలో అత్యధికులు ఎఎపి వైపు మొగ్గు చూపారని తేలిందని సంస్ధ తెలిపింది.
అధ్యన ఫలితాల ప్రకారం యువకుల్లో కూడా దళిత యువకులు ఇంకా ఎక్కువగా ఎఎపికి ఓట్లు వేశారు. వయసు పెరిగే కొందీ ఎఎపికి ఓట్లు వేసినవారి సంఖ్య తగ్గుతూ పోయింది. 56 సం.ల వయసు పైబడినవారిలో 45 శాతం మంది ఎఎపికి ఓట్లు వేశారు.
అయితే ఏ వయసు గ్రూపులో చూసినా ఎఎపికే ఎక్కువ ఓట్లు పడ్డాయి. బి.జె.పికి ఎఎపికి మధ్య ఓట్ల తేడా అన్ని వయసుల్లోనూ ఎక్కువగానే ఉంది. అత్యంత తక్కువ తేడా ఉన్నది అనుకుంటే ఆ తేడా 9 శాతంగా ఉండడం గమనార్హం. ఈ విషయంలో పురుషులకు, స్త్రీలకు మధ్య తేడా ఏమీ వ్యక్తం కాలేదు.
వివిధ సామాజిక గ్రూపుల వారీగా చూస్తే ముస్లింలు, దళిత ప్రజల్లో అత్యధికులు ఎఎపికి ఓట్లు వేశారు. ముస్లిం ప్రజల్లో 77 శాతం మంది దళితుల్లో 68 శాతం మంది ఎఎపికి ఓట్లు గుద్దారు. ముస్లింలలో ఎఎపి పట్ల ఆదరణ గత ఎన్నికలకు ఇప్పటికీ అనేక రెట్లు పెరగడం గమనార్హం. 2013లో 13 శాతం మంది ముస్లింలు ఎఎపికి ఓటు వేస్తే ఇప్పుడు అది 77 శాతానికి పెరిగింది.
అగ్రకులాల ప్రజల్లో ఎఎపి కంటే బి.జె.పి కే ఎక్కువ ఆదరణ వ్యక్తం అయింది. భ్రాహ్మణులు, వైశ్యులు/జైనులు, జాట్ కులాల ప్రజలు ఎఎపి కంటే బి.జె.పి కి ఎక్కువగా ఓటు వేశారని ఎఎపి కి తక్కువ ఓట్లు వేసింది వీరేనని అధ్యయనంలో తేలింది. కింద ఇచ్చిన గ్రాఫ్ లను పరిశీలిస్తే పరిస్ధితి ఇంకా స్పష్టం అవుతుంది.
Visekhar, please review this story: http://blog.marxistleninist.in/2015/02/blog-post_15.html