ఢిల్లీ అవడానికి రాష్ట్రమే అయినా పాలన రీత్యా అది పూర్తి స్ధాయి రాష్ట్రం కాదు. పాలన కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఆధారపడాలి.
ముఖ్యంగా శాంతి భద్రతలు! మామూలుగా అయితే శాంతి భద్రతలు రాష్ట్రాల హక్కు. రాష్ట్రాల్లోని పోలీసులే శాంతి భద్రతలను చూస్తుంటారు. అలాంటి పోలీసు విభాగం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా కేంద్రం అదుపులో ఉంటుంది. ఈ కారణం వలన పోలీసులు ఢిల్లీ సి.ఎంకు సమాధానం చెప్పరు.
దరిమిలా రాష్ట్రంలో ఎలాంటి నేరం జరిగినా చర్య తీసుకునే అధికారం, అవకాశం ఎఎపి చేతుల్లో ఉండవు. ఈ అంశం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆట ఆడించే అవకాశం కేంద్రం చేతుల్లో ఉంటుంది. కానీ అలాంటి పరిస్ధితిని ప్రజల్లోకి తీసుకెళ్లి కేంద్రం ఎత్తులను ఎండగట్టే అవకాశం ఎఎపికి లేకపోలేదు. అది ఆ పార్టీ నిజాయితీ పైన ఆధారపడి ఉంటుంది.
అయినా గానీ చట్టపరంగా ఢిల్లీ ప్రభుత్వానికి అందుబాటులో లేని అవకాశాల రీత్యా అరవింద్ ప్రభుత్వం, మొదట సానుకూల ధోరణితో ప్రారంభం కావడమే ఉత్తమం. అలా అయితేనే అవతలివారి కుట్రలను ప్రజల్లోకి తీసుకెళ్ళడం సులువు అవుతుంది. బహుశా అందువల్లనే ఏమో ఢిల్లీ సి.ఎం అందరి సలహాలూ తీసుకుంటాం అంటున్నారు. అనడమే కాకుండా ప్రధాని మోడితో భేటీ వేశారు.
ఢిల్లీ సి.ఎం, ప్రధానిల భేటీలో ఏ మాటలు జరిగి ఉంటాయి? అదే ఊహిస్తూ కార్టూనిస్టు ఇలా చమత్కారం చేశారు. పూర్తి మెజార్టీ సాధించిన అతిశయంతో ఢిల్లీ ఎన్నికలను మోడి ఎదుర్కొన్నారు. ఒక దశలో ఐతే తనను చూసి ఓట్లు వేయాలని కోరారు. అరవింద్ కి ధర్నాలు తప్ప పాలన చేతగాదన్నారు. ఆయన అడవులకి వెళ్లాలని బోధించారు. కానీ ప్రజలు తాము ఎఎపి కె ఓటు వేయాలని మోడి ప్రచారాన్ని బట్టి కూడా గ్రహించారు.
ఇది గ్రహించిన ప్రధాని పూర్తి మెజారిటీ వల్ల వచ్చి పడే గర్వాతిశయాల వల్ల ఏం చేయకుండా ఉండాలో నేర్చుకున్నారనీ, ముఖ్యంగా ప్రజలని ‘టేక్ ఇట్ గ్రాంటెడ్’ గా అస్సలు తీసుకోకూడదని గ్రహించారని కార్టూన్ పరోక్షంగా సూచిస్తోంది. ఆ జ్ఞానాన్నే పాఠంగా కేజ్రీవాల్ కి ప్రధాని బోధించి ఉంటారని కార్టూనిస్టు ఊహ!