మృత సముద్రం (Dead Sea) తాను కూడా మృత్యువును సమీపిస్తోంది.
మృత సముద్రం జోర్డాన్, ఇజ్రాయెల్ సరిహద్దు మీద ఉంటుంది. సముద్రానికి తూర్పు ఒడ్డు జోర్డాన్ వైపు ఉంటే, పశ్చిమ ఒడ్డు ఇజ్రాయెల్ వైపు ఉంటుంది. ఈ సముద్రంలోకి వచ్చి కలిసే ఒకే ఒక్క నది జోర్డాన్ నది.
ఇంతకీ మృత సముద్రానికి ఆ పేరు ఎందుకు వచ్చింది? మృత సముద్రం అంటే చచ్చిపోయిన సముద్రం అని కాదు. చంపేసే సముద్రం అని. ఈ సముద్రాన్ని ‘Sea of Salt’ అనీ, ‘Sea of Death’ అనీ కూడా పిలుస్తారు.
ఈ సముద్రంలో లవణాల సాంద్రత చాలా ఎక్కువ. ఎంత ఎక్కువ అంటే ఆ సాంద్రత వల్ల జీవం అనేది అక్కడ ఉనికిలో ఉండడం చాలా చాలా కష్టం. చిక్కని లవణాల వల్ల చేపలు లాంటి సముద్ర జీవులు బతకలేవు. చివరికి సముద్ర జలాల్లో కనిపించే మొక్కలు కూడా అక్కడ బతకవు. అందుకే దానిని డెడ్ సీ అంటారు.
మృత సముద్రానికి సమీపంలో ఉన్న ఇజ్రాయెల్, జోర్డాన్, సిరియా, లెబనాన్ దేశాల్లో నీరు మహా లగ్జరీ. ‘మనకి చమురు ఎలాగో వారికి నీళ్ళు అలాగ’ అంటే అతిశయోక్తి కాకపోవచ్చు.
ఈ పరిస్ధితుల్లో అక్కడ ప్రవహించే జోర్డాన్ నదికి తీవ్రమైన డిమాండ్ ఉంటుంది. అంచేత జోర్డాన్ నది నుండి మృత సముద్రంలో కలిసే నీరు యేటికేడూ తగ్గిపోతోంది. కనీసం ఆవిరయ్యే నీటితో పోల్చినా నదిలోంచి వచ్చే నీరు తగ్గిపోతోందట. ఫలితంగా అసలే చిక్కనైన మృత సముద్రం ఇంకా ఇంకా చిక్కబడుతోంది. నీటి ఒడ్డు ఇంకా ఇంకా వెనక్కి, లోపలికి, కిందికి వెళ్లిపోతోంది.
1950లతో పోల్చితే ఇప్పటి మృత సముద్రంలో నీటి మట్టం 130 అడుగులు తగ్గిపోయిందని అంచనా. సముద్రం ఒడ్డుతో పోల్చితే మిగిలి ఉన్న నీటి మట్టం 1407 అడుగుల లోతున ఉంటుందని అంచనా వేశారు. నీటి మట్టానికి అత్యంత లోతైన నేల (ప్రపంచంలో) ఇదే అని కూడా చెబుతున్నారు. సంవత్సరానికి 3 అడుగుల చొప్పున నీరు తగ్గిపోతోందని మరొక అంచనా.
పిలవడానికి సముద్రం అని పిలిచినా, చుట్టూ నేల ఉన్నందున దీనిని నిజానికి సరస్సు అనాలి. అంటారు కూడా. కానీ ఉప్పు లక్షణం వల్ల (సముద్రంలో కంటే 9.6 రెట్లు ఎక్కువ లవణాలు కలిసి ఉన్నాయి) సముద్రంగా ప్రసిద్ధికెక్కింది. ఒకప్పుడు ఇది
ఈ కారణాల వల్ల మృత సముద్రం జీవులను చంపడంతో పాటు తానూ చచ్చిపోతోందని జియాలిస్టులు ఆందోళన పడుతున్నారు. డెడ్ సీ లో లభించే లవణాలను ఉపయోగించి అనేక ఉత్పత్తులను ప్రస్తుతం తయారు చేస్తున్నారు; ఎరువుల దగ్గర్నుంది కాస్మోటిక్స్ వరకూ.
మృత సముద్రంలో నీరు ఏ విధంగా తగ్గిపోతోందో కింది ఫొటోల ద్వారా కాస్త అవగానాకు రావచ్చు.