“వటుడింతింతై…” అన్నట్లుగా ఎదిగిపోయిన సామాన్యుడి పార్టీని చూసి తెల్లబోయే పని ఇప్పుడు బి.జె.పి సామ్రాజ్యాధీశుల వంతు.
‘లోక్ పాల్’ చట్టం కోసం హజారే, అరవింద్, బేడి, భూషణ్ ల బృందం జనాన్ని వెంటేసుకుని ఉద్యమిస్తున్నప్పుడు ‘మీరు రాజకీయాల్లోకి వచ్చి చూడండి. అదెంత కష్టమైన పనో’ అంటూ కాంగ్రెస్, బి.జె.పి పార్టీల నాయకులు ఎకసక్కెం చేశారు.
“అయితే మేమూ రాజకీయాల్లోకి వచ్చి చూపిస్తాం. పార్టీ పెట్టి ప్రజల కోసం చేసే పాలన ఎంత తేలికో చూపిస్తాం” అంటూ సవాలు విసిరిన అరవింద్ బృందం అన్నంత పనీ చేశారు. ఆదిలో వారిని సీరియస్ గా తీసుకున్నవాళ్లు బహుకొద్ది మంది.
ఊహించని విధంగా ఢిల్లీ సామాన్యుడి నాడిని అరవింద్ బృందం అప్పుడే పట్టుకుంది. కేజ్రీవాల్ పురోగమనం తన అభిమాన పార్టీ బి.జె.పి కి ఎసరు తెస్తుందని గ్రహించిన బేడీ, ఆయనకు దూరం జరిగింది. అన్నా చెవిలో జోరీగై ఆయననూ దూరం జరిపింది.
అనూహ్యంగా బి.జె.పి తో పాటుగా సీట్లు గెలిచిన ఎఎపిని దెబ్బ కొట్టేందుకు కాంగ్రెస్ చేత మద్దతు ఇప్పించి ఆ పార్టీని పలుచన చేసేందుకు ఆధిపత్య వర్గాలు పధకం వేశాయి. ఆ పధకాన్ని తిప్పి కొడుతూ తమను కూల్చేందుకు కాంగ్రెస్, బి.జె.పి లు ఎ విధంగా జట్టు కట్టాయో ఢిల్లీ అసెంబ్లీ సాక్షిగా ఎఎపి రుజువు చేసి చూపి ప్రభుత్వాన్ని వదులుకుంది.
ఈ ఎత్తుగడను ఢిల్లీ జనం అర్ధం చేసుకోలేదని అందరూ అనుకున్నారు. లోక్ సభ ఎన్నికల ఫలితాలు ఆ సంగతే చెప్పాయని పత్రికలు ఖాయం చేశాయి. ఇక ఎఎపి ని మర్చిపోవచ్చన్న ధైర్యంతోనో, సుప్రీం కోర్టు తలంటు వల్లనో అసెంబ్లీకి మళ్ళీ ఎన్నికలు ప్రకటించక బి.జె.పికి తప్పలేదు.
ఎన్నికలు ప్రకటించేనాటికి దేశంలో ఇంకా మోడీ గాలే అప్రతిహతంగా వీస్తోందని మోడి బృందం నమ్మి ఉండవచ్చు. ధర్నాలలో మునిగి ఉండే అరవింద్ నక్సలైట్ లలో కలిసిపోవాలి అంటూ ప్రధాని మోడి స్వయంగా ప్రజల ఆందోళనలను పరిహసించారు. లేక నక్సలైట్ అనగానే అరవింద్ ని జనం దూరం పెట్టేస్తారని నమ్మారో!
నక్సలైట్ లను ప్రజలు ద్వేషించరని, నిజానికి ఇష్టపడతారని ‘నక్సలైట్’ అరవింద్ ని ఢిల్లీ ప్రజలు నెత్తిన పెట్టుకోవడం బట్టి భావించవచ్చో లేదో ప్రధాన మంత్రి మోడి చెప్పాల్సి ఉంది.
మొత్తం మీద చీపురును చూసి పరిహసించిన పెద్ద పార్టీ నేతలు అది తమనే ఊడ్చిపారేసేంత విశ్వరూపం ధరించడం ఆ ఇద్దరు నేతలకు కోరుకుడు పడని విషయమే. ఎన్ని చర్చిలను ధ్వంసం చేసినా, ముస్లిం-హిందూ తగవులు తెచ్చినా, తమ పక్కన నిలుస్తారని నమ్మకం కలిగిన రోజున సామాన్యులు అవేమీ పట్టించుకోరని, అన్నీ పక్కన బెట్టి ఐక్యంగా నిలుస్తారని ఢిల్లీ సామాన్యులు నిరూపించారు. వారికి దండాలు!
నర్నోదిక్కులనుండి బోల్షివిక్కులు వచ్చారు. ఏ పుట్టలో ఏ పాముందో ఎవరు చూడొచ్చారు? 🙂
నక్సలైటు అని ఆరోపించిన కేజ్రీవాల్ కే జనం అంతగా ఓట్లు వేస్తే….ఇక అసలు నక్సలైట్లు ఎన్నికల్లో పోటీచేస్తే ఎన్ని ఓట్లు వేస్తారో…