అసలే పరువు పోయి బాధలో ఉన్నపుడు మిత్రుడు చేసే సరదా ఎగతాళి కూడా కోపం తెప్పిస్తుంది. మిత్రులు అనుకున్నవాళ్లు సీరియస్ గానే ఎగతాళి చేస్తే ఇక వచ్చే ఆగ్రహం పట్టలేము.
బి.జె.పి పరిస్ధితి ప్రస్తుతం ఇలాగే ఉంది. ఏఏపి చేతుల్లో చావు దెబ్బ తిన్న దిగ్భ్రాంతి నుండి ఇకా బైటపడక ముందే మహారాష్ట్రలో మిత్ర పక్షంగా అధికారం పంచుకుంటున్న శివ సేన ఎగతాళి ప్రకటనలు చేస్తూ బి.జె.పి దుంప తెంచుతోంది.
“వేవ్ కంటే సునామీ ఇంకా శక్తివంతమైనదని ఢిల్లీలో ఎఎపి రుజువు చేసిందని శివసేన నేత ఉద్ధవ్ ఢాకరే ఒక ప్రకటన విడుదల చేశారు. మోడి వేవ్ అంటూ లోక్ సభ ఎన్నికలకు ముందు బి.జె.పి సృష్టించిన కృత్రిమ గాలిని ఉద్దేశిస్తూనే ఉద్ధవ్ తన మాటలు చెప్పారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మోడి వేవ్ కంటే ఎఎపి సునామీ యే అత్యంత శక్తివంతమైనదని ఉద్ధవ్ ఢాకరే ఎలాంటి మొహమాటం లేకుండా ఒప్పేసుకుంటున్నారు.
మహారాష్ట్ర ఎన్నికల అనంతరం తనకు దక్కిన మెజారిటీ సీట్లను అడ్డం పెట్టుకుని మంత్రివర్గం లోని ప్రధాన పదవులను తనకు పంచకుండా తనవద్దనే బి.జె.పి అట్టి పెట్టుకున్న సంగతిని శివసేన నేతలు ఎలా మరువుగలరు?
ముఖ్యమంత్రి పదవి తమదే అని వాదిస్తున్నా, సి.ఎం పదవి అటుంచి కనీసం ప్రధాన మంత్రి పదవులను కూడా ఇవ్వడానికి బి.జె.పి నిరాకరించిన విషయం శివసేనకు ఇప్పుడు బాగా గుర్తుకొస్తోంది.
అందుకే ఎఎపి రాజకీయాలు తనకు విరుద్ధమే అయినా బి.జె.పి పైన కోపంతో ఎఎపి ని పొగడ్తలతో ముంచేస్తోంది. శివసేన పొగడ్తలు బి.జె.పి పైన పాత కోపంతో చేసేవే గానీ ఎఎపి విధానాలు నచ్చి చేసేవి కావు.
ఈ మాత్రానికే ఎఎపి తో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నారా అంటూ (ఆంగ్ల ఛానెళ్ల) విలేఖరులు శివసేన నాయకుడ్ని ప్రశ్నించడం ఏమిటో బొత్తిగా అర్ధం కాని విషయం.
ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ప్రధాని నరేంద్ర మోడీకి ఓటమి అని కూడా శివసేన ప్రకటించడం విశేషం. రాష్ట్రాల్లో వచ్చిన ప్రతి గెలుపునూ మోడి గాలికి అంటగట్టిన బి.జె.పి నేతలు ఢిల్లీ ఓటమి మాత్రం మోడీకి సంబంధం లేనిదిగా చెప్పడం ఎలా సబబు? కాంగ్రెస్ గెలుపులను రాహుల్ గాంధీ ప్రచారం వల్లే వచ్చినవిగా చెప్పే కాంగ్రెస్ నేతలు ఓడిపోయినప్పుడు మాత్రం స్ధానిక నేతలను నిందించడం సబబు కాదని విమర్శించిన బి.జె.పి చివరికి తనదాకా వచ్చాక ఆ విషయంలోనూ కాంగ్రెస్ నీతిని పాటించింది. “గెలుపులన్నీ నాయకుడివి, ఓటములన్నీ కార్యకర్తలవి” అని చెప్పడమే బి.జె.పి, కాంగ్రెస్ ల నీతి.
అరవింద్ రాజకీయ ప్రవేశం నుండి దూరంగా ఉంటూ వచ్చిన అన్నా హజారే ఎఎపి విజయాన్ని కళ్ళు తిరిగిపోయి తన పాత నిర్ణయాన్ని తిరగేసి రాసుకున్నట్లు కనిపిస్తోంది. ఇప్పుడు ఆయన దృష్టిలో బి.జె.పి ప్రధాని నరేంద్ర మోడి మోసగాడు. ఇచ్చిన హామీలను నెరవేర్చనీ ప్రజావ్యతిరేకి. హామీ ఇచ్చినట్లుగా అవినీతి నిర్మూలనకు ఎంతమాత్రం తలపెట్టని పాలకుడు.
అయితే భూ సేకరణ చట్టానికి మోడి ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా చేసిన సవరణలపై పోరాడుతానని చెబుతున్న హజారే ప్రకటనల పట్ల జనం జాగ్రత్తగా ఉండాలి. గతంలో కార్పొరేట్ కంపెనీల అక్రమ కార్యకలాపాలపై ప్రజలకు తీవ్ర వ్యతిరేకత ప్రబలుతున్న సమయంలో హజారే రంగప్రవేశం చేసి అవినీతి వ్యతిరేక ఉద్యమం అంటూ ప్రజల ఆగ్రహాన్ని తన వెంట కొనిపోయారు. ఆ ఉద్యమ వేడి కాస్తా ఎలాంటి ఫలితం ఇవ్వకుండానే ముగిసిపోయింది.
ఇప్పుడు మోడి ఆర్డినెన్స్ కూడా కార్పొరేట్ కంపెనీలకు భూ వనరులను అక్రమంగా దోచిపెట్టేదే. గతంలో ప్రజల ఆగ్రహాన్ని పక్కదారి పట్టించి నీరుగార్చినట్లుగానే ఈసారి కూడా కార్పొరేట్ కంపెనీల అక్రమ భూ స్వాధీనలపై ప్రబలే వ్యతిరేకతను తన వెంట ర్యాలీ చేసేందుకు హజారే ప్రయత్నాలు ప్రారంభించారు. చివరికి ఆ ఉద్యమం కూడా ఎలాంటి ఫలితం లేకుండా నీరుగారి ముగిసిపోయే అవకాశం పూర్తిగా ఉంది. అందుకే హజారే ఉద్యమ కేకల పట్ల జనం జాగ్రత్తగా ఉండాలి.
అరవింద్ రాజకీయ ప్రవేశాన్ని వ్యతిరేకించిన హజారే ఇప్పుడు దూకుడుగా అరవింద్ విజయాన్ని కీర్తించే పనిలో ఉన్నారు. ఇది మంచికా, చెడుకా అన్నది భవిష్యత్తులోనే తెలియాలి.