బ్రిటన్ లో ప్రతి సంవత్సరం జరిగే ‘టఫ్ గై ఛాలెంజ్’ పోటీలు మళ్ళీ జరిగాయి. జనవరి నెల చివరి వారంలో జరిగే ఈ పోటీలు ఈసారి ఫిబ్రవరి 1 తేదీన జరిగాయి. ప్రపంచం నలుమూలల నుండి, ముఖ్యంగా అమెరికా, ఐరోపా దేశాల నుండి వేలాదిగా తరలివచ్చే ఉక్కు పిండాలు ఈ పోటీల్లో పాల్గొంటారు. ఇంతవరకు ఈ పోటీల్లో చివరి వరకు నిలబడిన ‘టఫ్ గై’ ఒక్కరు కూడా లేకపోవడం బట్టి పోటీల పస ఏమిటో తెలుసుకోవచ్చు.
ఛారిటీ కోసం ఈ పోటీల్ని నిర్వహిస్తారు. ఇంగ్లండ్ లోని పెర్టన్ లో బిల్లీ విల్సన్ ఉరఫ్ మిస్టర్. మౌస్ అనే పెద్దాయన పోటీల నిర్వాహకులు. ఈ పోటీ నిర్వహణ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఏయే ఛారిటీ కార్యకలాపాలకు ఖర్చు చేస్తారో వివరణ లేదు. 1987లో ప్రారంభం అయిన ఈ పోటీలను 600 ఎకరాల విశాల వ్యవసాయ భూమిలో నిర్వహిస్తారు. వొల్వర్ హాంప్టన్ సమీపంలోని స్టాఫర్డ్ షైర్ కౌంటీలో పోటీలు నిర్వహించబడే పెర్టన్ ఊరు ఉందని టఫ్ గై వెబ్ సైట్ ద్వారా అందుతున్న సమాచారం.
పోటీలో మొత్తం 200 రకాల ఆటంకాలను పోటీదారులు అధిగమించాలి. ప్రపంచంలోనే అతి కష్టమైన పందెంగా నిర్వాహకులు తమ పోటీని చెప్పుకుంటారు. ఇంతవరకు ఎవరూ చివారికంటా నిలవకపోవడం బట్టి వారు చెప్పేది నిజమే అని నమ్మవచ్చు. ఇప్పటివరకు జరిగిన పోటీల్లో ఇద్దరు చనిపోయారు కూడా. అందువల్ల పోటీలకు ముందు తాము చచ్చిపోతే అందుకు ఎవరూ బాధ్యులు కాదని అంగీకార పత్రాన్ని పోటీదారులు సమర్పించాల్సి ఉంటుంది.
జనవరి చివరి వారంలో జరుగుతాయి కనుక వణికించే చలి ప్రధాన ఆటంకంగా ఉంటుంది. గడ్డకట్టే చలిలో కందకాలలో ఈదవలసి ఉంటుంది. ఏటవాలు కొండ మీది నుండి పరుగెట్టుకుంటూ కిందకు దిగాలి. 40 కిలోల బరువు తూగే శిలువ మోస్తూ పరుగెత్తాలి. భారీ దూరాలు గెంతాలి. గెంతలేకపోతే ఏ ముళ్ళ కంచే మీదకో, లోతైన కందకాలలోకో పడిపోయేలా ఏర్పాట్లు చేస్తారు. మిలట్రీ శిక్షణ తరహాలో తాళ్ల వలపై నడవడం, తాళ్ల సాయంతో ఎత్తులకు ఎక్కడం, విద్యుత్ ప్రవహించే గోడలకు తగలకుండా ఇరుకైన సొరంగాల్లో పాకడం, మంటల మధ్య ఈదడం మొదలైన సవాళ్ళను పోటీదారులు అధిగమించాలి.
పోటీలో అంశాలను కొన్నిసార్లు సవరించినప్పటికీ ప్రధాన ఆటంకాలలో పెద్ద తేడా ఉండదు. ఫిబ్రవరి 1, 2015 తేదీన జరిగిన ‘టఫ్ గై ఛాలెంజ్’ రేస్ ఫోటోలు కింద చూడవచ్చు. ది అట్లాంటిక్ పత్రిక ఈ ఫోటోలను ప్రచురించింది.