ఆమ్ ఆద్మీ దెబ్బ ఏమిటో సంపన్నులకు రుచి చూపిన ఘనత ప్రస్తుతానికి ఆమ్ ఆద్మీ పార్టీకి అప్పజెబుదాం. ఎన్ని పరిమితులు ఉన్నప్పటికీ ఈ మధ్య కాలంలో భారత దేశంలోని సామాన్య కార్మికవర్గ పౌరుడు కాస్త గర్వంగా తల ఎగరవేయదగ్గ రోజు ఈ రోజని చెప్పడంలో సందేహం లేదు.
స్ధల, కాల పరిమితులను దృష్టిలో పెట్టుకుంటే భారత దేశంలోని పార్లమెంటరీ రాజకీయాల్లో అచ్చంగా సామాన్య ప్రజలు ఐక్యమై పాలకవర్గాలకు వారి వెనుక ఉన్న సంపన్న కులీన దోపిడీ శక్తులకు తమ పవర్ ని శాంపిల్ గా రుచి చూపిన రోజిది. ఆఫ్ట్రాల్ వోటు శక్తితోనే సామాన్యుడి పవర్ ఇంత ఘాటుగా ఉంటే, ఇక వ్యవస్ధను సమూలంగా పెకలించే రోజున ఆ సామాన్యుడి పవర్ పంచ్ ఏ స్ధాయిలో ఉంటుందో ఎవరికి వారు ఊహించుకోవలసిందే.
ప్రజలే చరిత్ర నిర్మాతలు! ఈ మాట చెప్పే ఒకే ఒక్క సిద్ధాంతం కమ్యూనిజం. సామాన్యులే పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి సైతం పునాది అని, అర్హత లేనివారిని ఇన్నాళ్లూ తమ నెత్తిపై పెట్టుకున్నది వారేనని ఈనాటి ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ప్రపంచానికి చాటాయి. అనేకానేక పని స్ధలాల్లో, ఆకలి, దరిద్రం లాంటి సమస్యల మధ్య నలిగిపోతూ, పార్లమెంటరీ గుంట నక్కల నిరంతర మోసాల మధ్య దారీ తెన్నూ కనపడక ఒక చిన్నపాటి ప్రత్యామ్నాయం కోసం ఈ దేశ సామాన్యుడు ఎంత ఆత్రంగా ఎదురు చూస్తున్నాడో నేటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తెలియజేశాయి.
లేదంటే ఉన్న 70 సీట్లలో 67 సీట్లను పూరాగా ఒక పసి రాజకీయ పార్టీకి కట్టబెట్టిన చరిత్ర భారత దేశంలో సరే, కనీసం ప్రపంచంలో ఎక్కడన్నా ఉన్నదా? ఎఎపి ఎన్నికల్లో పోటీ చేయడం ఇది మొదటిసారి కాదు, జనం ‘కొత్తొక వింత, పాతొక రోత’ సామెత ప్రతిపదికన ఓట్లు గుద్దారని చెప్పడానికి. ఆ పార్టీ నేతలు ఎవరూ హత్యలకు గురి కాలేదు, జనం సానుభూతి ఓట్లు గుద్దారని తీసిపారెయ్యడానికి. ఎన్నికలకు ముందు అక్కడ ఎఎపి యేతర పార్టీ ఏదీ అధికారం వెలగబెట్టలేదు, ప్రభుత్వంపైన వ్యతిరేకతతో (Anti-incumbancy) ఎఎపి కి జనం మూకమ్మడిగా ఓట్లు గుద్దారని తేల్చేయ్యడానికి!
కేవలం 7 నెలల క్రితమే జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఎఎపికి అక్కడ ఒక్క సీటూ దక్కలేదు. ఇకనేం ఎఎపి పని అయిపోయిందని కొందరు పండితులు జోస్యం చెప్పేశారు. వారి జోస్యాల్ని చదివి ఆనందంతో తరిచిపోయాయి పాతుకుపోయిన బడా భూస్వామ్య, పెట్టుబడిదారీ సంపన్న వర్గ పార్టీలు. కానీ వారి జోస్యం అష్ట వంకరల దృష్టితో చూసినదేనని, ఆ దృష్టికి ప్రజా సామాన్యపు ఆక్రందన ఎన్ని జన్మలెత్తినా అంతుబట్టదని ఈ రోజు వారికి అర్ధం అయి ఉండాలి.
అసలు ఓట్లు వేసిందే 100 మంది ఓటర్లలో 64 మంది మాత్రమే. ఆ 64 మందిలో 35 మంది (54.3%) ఎఎపికి ఓట్లు వేయగా 20 మంది (32.2%) బి.జె.పికి ఓటు గుద్దారు. 6గురు (9.7%) కాంగ్రెస్ ఓటు వేయగా ఇతర పార్టీలకు ఇద్దరు (3.8%) ఓటు వేశారని ఎన్నికల కమిషన్ ప్రకటించిన గణాంకాలు చెబుతున్నాయి. మిగిలిన 36 మంది తమ అభిప్రాయం ఏమిటో చెప్పనే లేదు. ఆ విధంగా పార్లమెంటరీ ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అనేక పరిమితులతో కూడినది. అయినప్పటికీ పార్లమెంటరీ ఎన్నికల వ్యవస్ధ పరిధిలో ఢిల్లీ ఓటరు ప్రకటించిన రాజకీయ అభిప్రాయం చారిత్రకం అని చెప్పవచ్చు.
మోడీ మొదలుకొని, కేంద్ర మంత్రివర్గ ప్రముఖులందరితో పాటు మహామహులైన బి.జె.పి నేతలు అందరూ కట్టగట్టుకుని వచ్చి ఎఎపికి వ్యతిరేకంగా ప్రచారం చేశారని, ఫలితంగా ఆ పార్టీపై ఢిల్లీ ప్రజల్లో సానుభూతి పెల్లుబుకిందని తెలుగు వార్తా ఛానెళ్లు విశ్లేషిస్తున్నాయి. ఏ ఛానెల్ ని చూసినా వారి విశ్లేషణలో ఈ అంశం కామన్ పాయింట్ గా కనిపిస్తోంది. ఇది అవాస్తవిక పరిశీలన అని వేరే చెప్పనవసరం లేదు. ఇలా చెప్పడం అంటే సామాన్యులను ఎప్పటిలాగా తామే నిర్వచించలేని సానుభూతికి తేలికగా లొంగిపోయే బలహీనులుగా అంచనా వేసుకుని సంతృప్తి పడడమే. సామాన్యుడి శక్తియుక్తులను అంగీకరించలేక, భరించలేక ఎక్కడో కారణాలను వెతకడమే అసలు బలహీనత!
జనంలో సానుభూతి ఎప్పుడు వస్తుంది? ఒక నియోజకవర్గ ప్రతినిధి చనిపోతే ఆయన భార్యని నిలబెట్టి ఆమెపై పొంగి పోర్లే సానుభూతిని సొమ్ము చేసుకునే చీప్ ఎత్తుగడలకు దిగే పార్టీలు ఏవి? అలాంటి అర్ధం లేని ఎత్తుగడలకు, ప్రజల్ని మోసం చేసి పక్కదారి పట్టించే ఎత్తుగడలకు పాల్పడ్డ చరిత్ర ఏఏపి కి లేదు కదా. అదేమీ లేకుండానే సానుభూతితో ఓట్లు వేశారని చెప్పడం ఎంతటి ఇరుకైన పరిశీలన! ఈ లెక్కన ఈ విశ్లేషకులకు ప్రజల బాధల గాధలను, వారి బతుకు చిత్రాన్ని పసిగట్టగల సామర్ధ్యం ఎప్పటికీ వచ్చేను?
ప్రజల మరుపుపై రాజకీయ పార్టీలకు ఎనలేని నమ్మకం. కానీ అసలు వాస్తవం ప్రజలకి రాజకీయ పార్టీల మోసాలను గుర్తు లేక అవే పార్టీలను మళ్ళీ మళ్ళీ ఎన్నుకోవడం కాదు. ప్రజల ఆశలకు, ఆకాంక్షలకు నిజంగా నిజాయితీతో స్పందించగల రాజకీయ పార్టీ కనీసంగానైనా వారికి అందుబాటులో లేకపోవడమే అసలు వాస్తవం. ప్రత్యామ్నాయం లేని పరిస్ధితుల్లో తాము అయిదేళ్ళ క్రితం అడుగంటా ద్వేషించిన పార్టీనే ప్రజలు మళ్ళీ నెత్తి మీద పెట్టుకోవలసిన అగత్యం ఎదురవుతోంది. అందుకే ఒక వెధవను దించి మరో వెధవను ఎన్నుకోవలసి అగత్యం వారికి వచ్చింది. అంతే తప్ప ప్రజల మరుపు అందుకు కారణం కాదు.
ప్రజలకు మరుపు లేదని చెప్పే చిన్న ఉదాహరణే ఈనాడు ఎఎపి సాధించిన సంపూర్ణ ఎన్నికల విజయం. అధికారంలో ఉన్న 49 రోజులలోనే ఎఎపి తమ చెంతకు తెచ్చిన ప్రత్యామ్నాయ ఆలోచనా ధోరణి ఏమిటో ఢిల్లీ ప్రజలు గుర్తుంచుకున్నారు. ఉన్న వనరుల్లోనే న్యాయబద్ధమైన పంపిణీని సు సాధ్యం చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరి జీవితాన్ని సమస్యా రహితం చేసుకోగల దారి లేకపోలేదని ఆ కొద్ది రోజుల పాలన వారికి నమ్మకం కలగజేసింది.
విద్యుత్ పంపిణీ విషయం తీసుకున్నా, నిత్యావసరం అయిన నీటి పంపిణీ తీసుకున్నా కనీస నిజాయితీ కలిగిన పాలకుడు ప్రతి ఒక్క పౌరుడికీ ఎలాంటి లోటు లేకుండా చూడగలడని 49 రోజుల ఎఎపి పాలన ఢిల్లీ సామాన్యుడికి తెలియజేసింది. రిలయన్స్ లాంటి ప్రైవేటు విద్యుత్ పంపిణీ కంపెనీల నిలువు దోపిడీ, భారీ లాభాలను సంతృప్తిపరచడానికి కట్టుబడే పార్టీకి, అక్రమ-అవినీతి-దోపిడీ కంపెనీ మెడలు వంచి సామాన్యుడికి న్యాయం దక్కేలా చేయాలని భావిస్తున్నట్లు కనిపించిన పార్టీకి ఆచరణలో ఉండే తేడా ఏమిటో 49 రోజుల పాలనలోనే సామాన్య ఢిల్లీ పౌరుడు చూడగలిగాడు. దాని ఫలితమే నేడు ఎఎపి/అరవింద్ పార్టీకి దక్కిన గుర్తింపు.
కృష్ణా-గోదావరి గ్యాస్-చమురు బేసిన ఉన్నది ఎక్కడ? ఆంధ్ర ప్రదేశ్ తీరంలో. అత్యవసరమైన ఆ ఇంధన వనరులను తవ్వి తీస్తున్న రిలయన్స్ కంపెనీ ఉత్పత్తి కార్యకలాపాలు కేంద్రీకృతం అయి ఉన్నది బంగాళాఖాతం సముద్రంలో. బంగాళాఖాతం, ఆంధ్ర ప్రదేశ్ లకీ, ఢిల్లీ కీ మధ్య సాపత్యం చూడవచ్చని ఢిల్లీ ముఖ్యమంత్రిగా రుజువు చేశారు అరవింద్ కేజ్రీవాల్.
రిలయన్స్ గ్యాస్ కొంటున్నవారిలో ఢిల్లీ ప్రజలూ ఉన్నారు. ఆ కంపెనీ ఉత్పత్తి వ్యవహారాలు ఎక్కడ ఉన్నా కొనుగోలుదారులుగా రిలయన్స్ కంపెనీ చేసే అవినీతిని ప్రశ్నించే హక్కు ఢిల్లీ ప్రజలకు ఉన్నదని ఢిల్లీ సి.ఎంగా అరవింద్ రుజువు చేశారు. తన ఉత్పత్తి ఖర్చు కంటే అత్యధిక ధరను రిలయన్స్ కంపెనీ వసూలు చేస్తోందని ఆరోపిస్తూ ససాక్ష్యాలతో ఆ కంపెనీ పైనా, కంపెనీకి ఆ వసతి కల్పించిన కేంద్ర మంత్రులపైనా, కేంద్ర అధికారులపైనా ఢిల్లీ రాష్ట్ర అవినీతి విభాగం చేత విచారణ మొదలు పెట్టించారు అరవింద్ కేజ్రీవాల్. ఈ విచారణ అర్ధం లేనిదని, కేసుకు అవకాశం లేదని చమురు మంత్రి, కార్యదర్శులు ఇతర పెద్దలు మొట్టుకుంటున్నా, అవకాశం ఖచ్చితంగా ఉందని కేసు పెట్టి మరీ చూపారు కేజ్రీవాల్.
ఇక్కడ ఏది పని చేసింది? పాలకుడు ఎవరి ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నాడు అన్న అంశమే పని చేసింది. కాంగ్రెస్, బి.జె.పిలు సంపన్నుల ప్రయోజనాలకే కట్టుబడ్డాయి కనుక వారికి రిలయన్స్ పాల్పడే అవినీతి అసలు కనిపించదు. పైగా కంపెనీ ఎన్నిసార్లు, ఎంత అడ్డగోలుగా ధరల్ని పెంచేసినా, దాన్ని సమర్ధించే సిద్ధాంతాలు లెక్కలూ తయారు చేస్తారే గానీ సామాన్యుడి కష్టాన్ని ఏనాడూ పట్టించుకున్న పాపాన పోనీ పార్టీలు బి.జె.పి, కాంగ్రెస్.. ఇత్యాది పార్టీలు. ఈ తేడాను చూసి గుర్తు పెట్టుకున్నారు గనకనే ఈ రోజు ఢిల్లీ ఓటరు తగిన స్పందనను చూపాడు.
ఎఎపి సాగిస్తున్న రాజకీయాలు భారత దేశ పార్లమెంటు రాజకీయాల చరిత్రలో ఒక వినూత్న ఒరవడికి చెందినవి. ఇన్నాళ్లూ అవి ఆచరణలో లేవు గనుక వినూత్నం అయ్యాయి గానీ అసలు రాజకీయ పార్టీలు చేయవలసిన రాజకీయాలే అవి. ప్రజల ప్రయోజనాలు, వాటి చుట్టూ అల్లుకునే సిద్ధాంతాలూ మాత్రమే రాజకీయా పార్టీలకు ప్రధాన అంశాలు కావాలి. అందుకు బదులుగా సమస్త ప్రకృతి వనరులను, ఉత్పత్తి సాధనాలను అదుపులో పెట్టుకుని వ్యవస్ధను శాసిస్తున్న కొద్దిమంది సంపన్నుల ప్రయోజనాలే తమ పరమావధిగా కాంగ్రెస్, బి.జె.పి లు ఎంచుకున్నాయి గనుకనే వారి రాజకీయాల్లో ప్రజలు ఉండరు. మహా అయితే ఎన్నికల సమయాల్లో దంచే ఊకదంపుడు ఉపన్యాసాల్లో ప్రజలు ఉంటే ఉండవచ్చు గానీ ఆ పార్టీల రాజకీయ కార్యక్రమాల్లో, రాజకీయ ఆచరణలో, పాలనలో ప్రజలు కనిపించనే కనిపించరు. దానికి విరుద్ధంగా ఎఎపి తన రాజకీయ పార్టీకే సామాన్యుడి పేరు పెట్టింది. తన రాజకీయ గుర్తుగా వ్యవస్ధలోని చెడుగుని ఊడ్చుతామన్నట్లుగా సిగ్గుపడకుండా చీపురును ఎంచుకుంది. రాజకీయాలను నిర్వహించే ఈ వినూత్న ఆలోచనా ధోరణి సామాన్యుడిని ఆకట్టుకుంది గనుకనే మర్చిపోకుండా మళ్ళీ అధికారాన్ని కట్టబెట్టారు ఢిల్లీ ప్రజలు.
ఢిల్లీ ఎన్నికల్లో భారత దేశంలో ఎన్నడూ జరగని విధంగా ఒక స్పష్టమైన వర్గ విభజన ప్రస్ఫుటం కావడం పరిశీలకులు గుర్తించాల్సిన అంశం. పార్లమెంటరీ పంధాలో వర్గ విభజన వ్యక్తం కావడం చాలా అరుదుగా జరిగే ప్రక్రియ. వర్గ విభజన వ్యక్తీకరణ ఎంత స్పష్టంగా, ఎ స్ధాయిలో వ్యక్తం అయిందీ అన్నది చర్చాంశం. అది శాశ్వతం అని చెప్పడం కూడా సాహసమే అవుతుంది. కానీ వర్గ విభజన ఛాయలను మాత్రం ఢిల్లీ ఎన్నికల ఫలితాలలో చూడకుండా విస్మరించడం పొరపాటు అవుతుంది. విప్లవ పార్టీల పార్లమెంటరీ ఎత్తుగడలకు ఇదొక అధ్యాయనాంశం కావచ్చు. అలాగని ఎఎపి పాలన పూర్తి స్వరూపం చూడకుండా అప్పుడే ఒక నిర్ణయానికి రావడమూ తొందరపాటుతనం కాగలదు.
కానీ ఎఎపి నిజాయితీ నిజమే అయితే, భవిష్యత్తులోనూ నిజాయితీ పాలననే కొనసాగించదలిస్తే ఈ విజయం శాశ్వతం కాదు. వ్యవస్ధను శాసిస్తున్న ఆధిపత్య శక్తులు సామాన్యుడి గెలుపును ఏనాటికి సహించవు, క్షమించవు. వారి అడ్డు తొలగించుకోవడానికి ఎంతటి దుస్సాహసానికైనా ఆ శక్తులు తెగిస్తాయి. 49 రోజుల పాలన తరహాలోనే బడా బడా సంపన్న కంపెనీలతోనూ, పెట్టుబడిదారీ-భూస్వామ్య-సామ్రాజ్యవాద ఆధిపత్యంతోనూ కాస్త తలపడినా ఆ పాలనను ముగించడానికి ఎలాంటి చట్టవిరుద్ధ చర్యలకైనా వారు తెగిస్తారు. ఆధిపత్య శక్తులతో తలపడాలంటే సామాన్యుడికి ఓటు కాగితం ఎంతమాత్రం సాధనం కాదని గ్రహించేవరకూ వారు తెగిస్తారు. కానీ వారి తెగింపుకు ప్రతి తెగింపుకు ఎఎపి పూనుకుంటుందా అన్నదే అసలు ప్రశ్న. అప్పటివరకూ ఎఎపి తదుపరి పాలనను ఓ కంట కనిపెట్టి ఉండాలి.
//ఈ మధ్య కాలంలో భారత దేశంలోని సామాన్య కార్మికవర్గ పౌరుడు కాస్త గర్వంగా తల ఎగరవేయదగ్గ రోజు ఈ రోజని చెప్పడంలో సందేహం లేదు. //
దాని పరిది ఎంత చిన్నదైనా ఇది మాత్రం వాస్తవం. నియంతృత్వ పోకడలకు ఇది ఒక చెంప పెట్టే ననుకోవాలి. ఇది ఒక తాత్కాలిక విజయమేనైనా మీరన్నట్టు అది చరిత్రాత్మకమే. వేచి చూడవలసిందే!
https://www.facebook.com/prasadamurthy.bandaru?pnref=story
అలెక్సాండర్ రాజ్యాల్ని గెలవడమైతే చేశాడటగానీ, వాటిని పాలించడమ్మీద ఎన్నడూ దృష్టి నిలుపలేదట. బీజీపీ అదే పాలసీని ఫాలోఅవుతూ ఎంతసేపూ దేశమంతా తమ విజయపతాకాలనెగరయ్యాలన్న యావతప్ప బీజేపీలో ఇంకేమీకానరాని ప్రస్తుత తరుణంలో, పరిపాలన అంటే ఉపన్యాసాలూ, విదేశీయాత్రలూ, మతోన్మాద బఫూన్ల చిల్లరవాగుళ్ళూ తప్ప మరేమీ కాదని బీజేపీ అనుకుంటున్న తరుణంలో, తగలాల్సిన దెబ్బ మహా ఘట్టిగానే తగిలింది. ఇప్పటికైనా బుధ్ధెరిగి ఆకాశాన్నివీడి బీజేపీ నేలదారిపడుతుందని ఆశిద్దాం. అరవింద్ సుపరిపాలన అందించి సాంప్రదాయక పార్టీలన్నింటికీ ఇలాంటి గతే పట్టించాలనీ, మరీముఖ్యంగా ఆయన స్ఫూర్తితో మరికొందరు ముందుకొచ్చి భారత రాజకీయాలను మార్చివెయ్యాలనీ కోరుకుంటున్నాను.
కాంగ్రెస్‌కి బీజేపీని ఎన్నుకున్న అనతికాలంలోనే, ప్రజలకు బీజేపీకీ ఒక ప్రత్యామ్నాయం అవసరమవడం అని తట్టడం అద్భుతం!
కేవలం మూదుసీట్లే అని కొట్టిపారెయ్యకుండా, వోట్లశాతాన్ని (32.2%) పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం విశ్లేషకులకుందని నా అభిప్రాయం. ఆప్రకారంగా చూస్తే బీజేపీది మరీ దారుణమైన ఓటమికాదు.
బాగుంది. కాకపోతే ఆ వర్గవిభజన ఊరికే రాలేదు. ఆమ్ ఆద్మీ స్థిరంగా వర్గ భాష మాట్లాడుతున్నది. అటువంటి పోలరైజేషన్ కోసం ప్రయత్నిస్తున్నది. లెఫ్టిస్టు పార్టీలు ఎన్జీవోల భాష మాట్లాడుతున్న వేళ ఎన్జీవోల నుంచి వచ్చిన పార్టీ వర్గభాష మాట్లాడడం వింతైన పరిణామం.
తాత్కాలికంగానైనా ఆమ్ ఆద్మీ పార్తీతో అవసరం ఉంది. అది లేకపోతే భాజపా తనకి తిరుగులేదనుకుని ఇంకా రెచ్చిపోయి, మరింత కఠోరమైన సంస్కరణలు అమలు చేస్తుంది.