బీహార్ ముఖ్యమంత్రి జితన్ రామ్ మంఝి సంప్రదాయానికి విరుద్ధంగా పోయి గొప్ప చిక్కుల్నే తెచ్చి పెట్టారు. చిక్కులు ఎవరికి అన్నది కొద్ది రోజుల్లో తేలవచ్చు, ఇప్పటివరకు చూస్తే మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆ చిక్కులు ఎదుర్కొంటున్నారు.
మంఝిని నమ్మి ముఖ్యమంత్రి పీఠం అప్పజెపితే ఆయన మోసం చేశారని నితీష్ ఫిర్యాదు చేయవచ్చు గానీ, నిజానికి సి.ఎం సీటులో కూర్చోబెట్టడానికి గానీ, దిగిపొమ్మనడానికి గానీ ఆయనెవరు?
లోక్ సభ ఎన్నికల్లో ఓటమికి బాధ్యత తీసుకుని రాజీనామా చేసిన వ్యక్తి ఆ మాట మీదనే నిలబడాలి. దానికి బదులు మళ్ళీ తన కుర్చీ తనకు కావాలని ఆయన కోరడమే ప్రజాస్వామ్య విరుద్ధం. ఎం.ఎల్.ఏ ల మద్దతు ఉంటే ఉండవచ్చు గాక! కానీ ఆయనకు నైతికంగా సి.ఎం కుర్చీ కోరే అర్హత లేదు.
భారత ప్రజాస్వామ్యం పైకి చూసేందుకు ఎంతటి మేడిపండో తెలియజేసే పరిణామాలు ఇప్పుడు బీహార్ లో జరుగుతున్నాయి. ఈ వ్యవహారంలో మంఝి పాత్ర నామమాత్రం. అసలు పాత్రధారులు నితీష్ కుమార్, బి.జె.పి నేతలు. సుదీర్ఘ కాలం పాటు అధికారంలో కొనసాగడానికి నితీష్ కుమార్, ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని బి.జె.పి ఎత్తులు పై ఎత్తులు వేశాయి.
వైరి శక్తుల ఎత్తులు పై ఎత్తులకు దూరంగా ఉంటూ ప్రజలకి సుపరిపాలన అందించడం ద్వారా ప్రతిష్ట పెంచుకోవడం మాని మంఝి వారి ఎత్తుల్లో పావుగా మారడానికి సై అన్నారు. ఫలితంగా రాజకీయ భవిష్యత్తు పాడు చేసుకున్నారు.
ఆయన రానున్న రోజుల్లో బి.జె.పి లో చేరినా ఆశ్చర్యం లేదు.