ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారం చేతికి రాగానే మరొక మాట చెప్పడం భారత దేశంలో రాజకీయ పార్టీలకు మామూలు విషయం. కానీ కాంగ్రెస్, బి.జె.పిలు తమ మాటల్ని తాము ఎక్కడ ఉన్నామన్నదానిపై ఆధారపడి ఒకరి మాటలు మరొకరు అరువు తెచ్చుకోవడం ఒక విశేషంగా కొనసాగుతోంది.
విశేషం అనడం ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బి.జె.పి ఏ సూత్రాలు బోధించిందో సరిగ్గా అవే సూత్రాలను ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ బోధిస్తోంది. అలాగే అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ తన చర్యలకు ఏయే కారణాలు చెప్పిందో ఇప్పుడు అధికారంలో ఉన్న బి.జె.పి సరిగ్గా అవే చర్యలకు అవే కారణాలు చెబుతోంది.
ఇరు పార్టీలూ కలిసి ఆమోదించిన అణు ప్రమాద పరిహార చట్టాన్ని అమెరికా కంపెనీల డిమాండ్లకు అనుగుణంగా అర్ధం మార్చి చెప్పడానికి గత సంవత్సరం యు.పి.ఏ/కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నించగా బి.జె.పి అంతే తీవ్రంగా విమర్శించింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్.డి.ఏ/బి.జె.పి సరిగ్గా అదే అమెరికా కంపెనీల ప్రయోజనాల కోసం అదే అణు చట్టానికి అప్పటి కాంగ్రెస్ చెప్పిన తరహాలోనే అర్ధం మార్చి చెబుతోంది. దానికి అప్పటి ప్రతిపక్ష బి.జె.పి ఏవైతే విమర్శలు చేసిందో సరిగ్గా అవే విమర్శలను ఇప్పటి ప్రతిపక్ష కాంగ్రెస్ చేస్తోంది.
రెండు పార్టీలు సారంలో ఒకటే అనీ, ఇరు పార్టీలు స్వదేశీ, విదేశీ సంపన్నులు వారి కంపెనీల కోసమే అంకితమై పని చేస్తాయని చెప్పడానికి అణు పరిహార చట్టం ఒకటి చాలు!
బి.జె.పి మద్దతుతో 2013 సెప్టెంబర్ నెలలో యు.పి.ఏ ప్రభుత్వం అణు (ప్రమాద) నష్టాల పౌర పరిహార చట్టం (Civil Liability for Nuclear Damages Act -CLND Act) పేరుతో ఒక చట్టాన్ని తెచ్చింది. అప్పటికి లోక్ సభలో యు.పి.ఏ కి చట్టాలను సొంతంగా ఆమోదించగల బలం లేదు. మైనారిటీ ప్రభుత్వాన్ని యు.పి.ఏ నడుపుతోంది. అందువల్ల అణు ప్రమాద పరిహార బిల్లు ఆమోదం కోసం బి.జె.పి సహాయాన్ని యు.పి.ఏ కోరింది.
ఇరు పక్షాలు ఒక చట్టాన్ని ఆమోదించాలంటే మొదట ఆ చట్టాన్ని తెచ్చే బిల్లులోని అంశాలపై ఇరువురికీ ఆమోదం ఉండాలి. కనుక ఇరు పక్షాలకీ ఆమోదయోగ్యంగా బిల్లును తయారు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వ నేతలు పలు విడతలుగా ప్రతిపక్ష పార్టీలతో చర్చలు జరిపారు. చర్చల్లో లెఫ్ట్ పార్టీల నేతలూ పాల్గొన్నారు.
అణు విద్యుత్ కేంద్రం స్ధాపించడానికి అనేక పెద్ద, చిన్న పరికరాలు కావాలి. అణు రియాక్టర్లు లాంటి భారీ పరికరాలను అమెరికా తదితర పశ్చిమ దేశాల నుండి ఇండియా కొనుగోలు చేయాలి. ఇతర మధ్య, చిన్న స్ధాయి పరికరాలలో కొన్నింటిని భారత దేశంలోని ప్రైవేటు కంపెనీలు కూడా తయారు చేస్తాయి. ఇలా వివిధ పరికరాలను అమ్మే కంపెనీలను సాంకేతికంగా ‘సరఫరాదారు’ (సప్లయర్) గానూ, ఆ పరికరాలతో నిర్మించిన అణు విద్యుత్ ప్లాంటులను నిర్వహించే కంపెనీలను ‘ఆపరేటర్’ గానూ పిలుస్తున్నారు.
రేపు అణు కర్మాగారంలో అనుకోని విధంగా ప్రమాదం జరిగితే అందులోని కార్మికులే కాకుండా అనేక పదుల కి.మీ పరిధిలో నివసించే ప్రజలు కూడా తీవ్రంగా నష్టపోతారు. అణు కర్మాగారంలో మిగిలే వ్యర్ధాలు లీక్ అయితే, వాటి జీవిత కాలం అనేక వందల సంవత్సరాల పాటు ఉంటుంది కనుక, వందల యేళ్ళ పాటు ప్రజలు దాని ఫలితాలు అనుభవిస్తారు. ప్రాణాంతక క్యాన్సర్ జబ్బులు, వింత రూపాల్లో జన్మించే శిశువులతో పాటు పర్యావరణం సర్వనాశనమై నివాసయోగ్యం కాకుండా పోతుంది. కనుక అణు విద్యుత్ శుభ్రమైనదిగా చెప్పే ప్రభుత్వాల మాటల్లో నిజం లేకపోగా అది ఘోరమైన అబద్ధం.
ఇలా జరిగే ప్రమాదాల్లో జరిగే నష్టాన్ని ఎవరు భరించాలి అన్న అంశాన్ని బి.జె.పి సంపూర్ణ మద్దతుతో యు.పి.ఏ ఆమోదించిన సి.ఎల్.ఎన్.డి చట్టం చెబుతుంది. ఈ చట్టాన్ని అమెరికా, ఐరోపా కంపెనీలకు అనుకూలంగా తయారు చేయడానికి యు.పి.ఏ అన్ని విధాలుగా శ్రమించింది. కానీ వామపక్ష పార్టీలు, బి.జె.పి కూడా బిల్లును ఆమూలాగ్రం పరిశీలించి ప్రతి పదాన్ని జాగ్రత్తగా పరిశీలించి ఎప్పటికప్పుడు తప్పుల్ని ఎత్తి చూపించడంతో చట్టంలో అనుకున్న విధంగా కంతలను చొప్పించడంలో యు.పి.ఏ విఫలం అయింది.
యు.పి.ఏ నేతలు చట్టాన్ని బలహీనంగా మార్చేందుకు ఏ విధంగా శ్రమించిందీ, ప్రభుత్వ ప్రయత్నాలను తాము ఏ విధంగా అడ్డుకున్నది తెలియజేస్తూ అప్పటి రాజ్య సభలో ప్రతిపక్ష నాయకుడు అరుణ్ జైట్లీ, బి.జె.పి వెబ్ సైట్ లో సెప్టెంబర్ 22, 2013 తేదీన “Diluting Nuclear Suppliers’s Liability” శీర్షికన ఒక ఆర్టికల్ రాశారు. అది ఇప్పటికీ అందుబాటులో ఉంది. ఆర్టికల్ లోని అంశాలను వామపక్షాల నేతలతో పాటు బి.జె.పి నేతలు జైట్లీ, వెంకయ్య నాయుడులు, చర్చలు సాగుతుండగానే ఎప్పటికప్పుడు పత్రికలకు కూడా వివరించి చెప్పారు. కాగా యు.పి.ఏ ఆటలు సాగకుండా చేయడంలో తనదే ప్రధాన హస్తం అని జైట్లీ తన ఆర్టికల్ లో చెప్పుకున్నారు. ఎవరి హస్తం ప్రధానం అయినా ఎవరికీ ఇబ్బంది అనవసరం అనుకోండి!
ఆర్టికల్ లో జైట్లీ ఏయే ఆరోపణలైతే చేశారో సరిగ్గా అవే ఆరోపణలకు అవకాశం ఇస్తూ చట్టానికి అమెరికా, ఐరోపా కంపెనీలకు అనుకూలంగా అర్ధం ఇస్తోంది ఈ నాటి మోడి ప్రభుత్వం. అణు పరిహారం చట్టం విషయమై తమ మధ్య Breakthrough Agreement కుదిరిందని ఇటీవల ఇండియా సందర్శించిన ఒబామా ప్రకటించారు. ప్రధాని మోడి కూడా అదే చెప్పారు. కానీ ఒప్పందంలోని అంశాలు ఏమిటో ఇరువురూ చెప్పలేదు. ఆ లోటును పూడ్చుతూ నిన్న అనగా ఫిబ్రవరి 8 తేదీన భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనను విడుదల చేసింది. ఆనాడు చట్టానికి ఏవైతే సరఫరాదారు కంపెనీలకు అనుకూల అర్ధాలను యు.పి.ఏ ప్రభుత్వం ఇచ్చిందో అవే తప్పుడు అర్ధాలను ఇప్పటి ప్రభుత్వ ప్రకటన ఇచ్చింది.
యు.పి.ఏ ఇచ్చిన తప్పుడు అర్ధాలను తీవ్రంగా విమర్శించి బి.జె.పి వెబ్ సైట్ లో ఆర్టికల్ కూడా రాసిన అరుణ్ జైట్లీ ఇప్పుడు ఆర్ధిక మంత్రిగా ఉన్నారు. చట్టానికి మోడి ప్రభుత్వం ఇస్తున్న తప్పుడు అర్ధాల గురించి ది హిందు పత్రిక అరుణ్ జైట్లీని అభిప్రాయం అడిగితే ఆయన సమాధానం చెప్పకుండా తప్పించుకున్నారు. ఎంత మోసం!
ఏమిటా తప్పుడు అర్ధాలు?
1. చట్టం ప్రకారం, ఒకవేళ అణు ప్రమాదం జరిగితే కనుక దానికి ‘సరఫరాదారు’ కూడా బాధ్యత వహించాలి. అయితే ఆ బాధ్యత తప్పనిసరి కాదని అప్పటి యు.పి.ఏ ప్రభుత్వం వాదించింది. సరఫరాదారుకూ, ఆపరేటర్ కూ మధ్య జరిగే ఒప్పందంలో సరఫరాదారు బాధ్యత గురించిన స్పష్టమైన అంశం ఉంటే తప్ప సరఫరాదారు పైన ప్రమాద బాధ్యత ఉండదని, కనుక నష్టపరిహారం చెల్లించే బాధ్యత కూడా సరఫరాదారు పైన ఉండదని యు.పి.ఏ అర్ధం ఇచ్చింది. ఇప్పుడు బి.జె.పి ప్రభుత్వం విడుదల చేసిన వివరణాత్మక ప్రకటన కూడా అదే అర్ధం ఇస్తోంది.
చట్టంలోని సెక్షన్ 17(b), సరఫరాదారుపై చట్టపరంగా చర్యలు తీసుకునే హక్కును (right to recourse) ఆపరేటర్ కు ఇస్తుంది. అయితే సెక్షన్ 6a కింద భారత ప్రభుత్వ సంస్ధ ఎన్.పి.సి.ఐ.ఎల్ (ఆపరేటర్), సరఫరాదారుతో కుదుర్చుకున్న కాంట్రాక్ట్ లో ‘right to recourse’ అన్న అంశాన్ని కూడా చేర్చితే తప్ప ఆపరేటర్ కు ఆ హక్కు ఉండబోదని తాజాగా విదేశీ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. చట్టపరమైన చర్యలు తీసుకునే హక్కు ఆపరేటర్ కు ఉన్నప్పటికీ చట్టం ప్రకారం అది తప్పనిసరి నియమం ఏమీ కాదని, ఆ అవసరం కూడా లేదనీ మోడి ప్రభుత్వం అర్ధం ఇస్తోంది. ఈ విషయమై విదేశీ మంత్రిత్వ శాఖ ప్రకటన ఇలా పేర్కొంది:
Section 17 states that the operator shall have a right of recourse. While it provides a substantive right to the operator, it is not a mandatory but an enabling provision. In other words it permits but does not require an operator to include in the contract or exercise a right of recourse.
జైట్లీ ఆనాడు రాసిన ఆర్టికల్ లోని కొంత భాగం కింద చూడండి:
If a Public sector company wilfully enters into an agreement with a foreign vendor and abdicates its’ right to recourse which section 17(b) otherwise provides for its’ benefit, it would not only be violating the provisions of the Civil Liability for Nuclear Damages Act but also section 13(1)(d) of the Prevention of Corruption Act wherein a wrongful loss would be caused to the revenue of a Public Sector company.
అణు నష్టాల పౌర పరిహార చట్టంలో పొందుపరిచిన ‘right to recourse’ ను ప్రభుత్వరంగ కంపెనీ (ఎన్.పి.సి.ఐ.ఎల్) తాను కుదుర్చుకునే కాంట్రాక్టులో ఉద్దేశ్యపూర్వకంగా వదులుకున్నట్లయితే అది అణు చట్టంలోని సెక్షన్ 17(b) కి విరుద్ధమే కాకుండా అవినీతి నిరోధక చట్టం లోని సెక్షన్ 13(1)(d) కి కూడా విరుద్ధం అని జైట్లీ పైన రాశారు. అలా చట్టం కల్పించిన హక్కును వదులుకోవడం ద్వారా తనకు తాను తప్పుడు పద్ధతుల్లో రెవిన్యూ నష్టం వాటిల్లేలా చేసుకోవడం అవుతుందని కనుక అది అవినీతి అని జైట్లీ స్పష్టం చేశారు. ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ పేరు పొందిన లాయర్ అని ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి. యు.పి.ఏ ఆటలు సాగకుండా అడ్డుకున్నానని చెప్పుకున్న జైట్లీ ఇప్పుడు మోడి ఆటలు ఎందుకు సాగనిస్తున్నారు?
దేశభక్తి గురించి, దేశమాత గురించీ పోచుకోలు కబుర్లు చెప్పే హిందూత్వ అభిమాన గణం, ముఖ్యంగా ఆర్.ఎస్.ఎస్ అనుబంధ సంస్ధ అయిన ‘స్వదేశీ జాగరణ్ మంచ్’ ప్రస్తుతం ఏ కలుగులో మొద్దు నిద్రలో ఉన్నట్లు? సదరు సంస్ధ నేత గురుమూర్తి గారి గొంతు మూగబోయిందేల? మీ వారు చేస్తే ప్రణయం, అవతలి వారు చేస్తే రంకు అవుతుందా గురుమూర్తి గారు? హిందూత్వ అభిమానులూ తమరిప్పుడు మోడి-జైట్లీ-వెంకయ్యల విదేశీ కంపెనీల దాసోహం తలచుకుని ‘జై హింద్’ అని అరవగలరా?
2. పౌరులకు నష్టపరిహారం చెల్లించేలా చేసే సెక్షన్ (దీన్ని టార్ట్ లా అంటున్నారు) సరఫరాదారులకు అనగా విదేశీ కంపెనీలకు వర్తించదు అని మోడి ప్రభుత్వం ఇచ్చిన వివరణ పేర్కొంది.
అణు నష్టాల పౌర పరిహార చట్టంలోని సెక్షన్ 46 ప్రకారం ప్రమాద బాధితులైన ప్రజలు తమకు జరిగే నష్టానికి పరిహారం కోరుతూ కోర్టులో దావా వేసుకునే హక్కు ఉన్నది. ఈ హక్కు పరిధిలోకి సరఫరాదారు కంపెనీలు రావని ఇప్పుడు మోడి ప్రభుత్వం సరికొత్త అర్ధం చెబుతోంది. సి.ఎల్.ఎన్.డి చట్టంపై పార్లమెంటులో జరిగిన చర్చలు సరఫరాదారును బాధ్యులను చేయడానికి నిరాకరించాయని మోడి ప్రభుత్వం చెబుతోంది. చట్టానికి ఏ అర్ధాలు ఉన్నాయో చట్టంలోని అంశాలు చెబుతాయి. కానీ మోడి ప్రభుత్వమేమో చట్టానికి అర్ధం ఏమిటో ఆ చట్టంపై జరిగిన చర్చలు చెబుతాయని కొత్తగా చెబుతోంది. చర్చల్లో ఏది నిరాకరించబడితే ఏమిటి? చట్టంలో ఏముందో అది చూడాలి గానీ!
చర్చల ఫలితమే అనేక మార్పులు, చేర్పులు ఇముడ్చుకున్న చట్టం. ఒకసారి పార్లమెంటు చర్చలు జరిపి ఒక బిల్లును చట్టం చేయడం అంటూ జరిగాక ఇక చర్చలు ఎలా సాగినాయో లెక్కకు రావు. చట్టానికి అర్ధం ఏమిటన్న విషయంలో తేడాలు వస్తే ఆ సంగతి కోర్టులు తేల్చాలి గానీ చట్టం రావడానికి ముందు జరిగిన చర్చలు తేల్చవు. కానీ విదేశీ కంపెనీలకు మేలు చేయడం కోసం వారి అడ్డగోలు డిమాండ్లను సంతృప్తిపరచడం కోసం మోడి ప్రభుత్వం ఇలా సరికొత్త వాదనలు వినిపిస్తోంది. ఎలాగైనా విదేశీ కంపెనీలకు మేలు చేయాలన్న తపనే తప్ప ప్రమాదం జరిగితే భారత ప్రజల పరిస్ధితి ఏమిటన్న ఆందోళన ఏ కోశానా ఈ వివరణలో లేకపోవడం ఎంతటి నయ వంచన? ఇలాంటి నేతలా యు.పి.ఏ కి ప్రత్యామ్నాయం ఇచ్చేదీ? ‘యు.పి.ఏ చేత కాని అవకతవకలన్నీ మేము చేసేస్తాం’ అని బి.జె.పి చెప్పుకుని ఉంటే సరిగ్గా ఉంటుంది.
సి.ఎల్.ఎన్.డి చట్టం ఇప్పటికే దేశంలో అమలులో ఉన్న చట్టాలకు అదనంగా పని చేస్తుందనీ, అమలులో ఉన్న చట్టాలను దేనినీ ఉల్లంఘించబోదని సెక్షన్ 46 చెబుతుంది. ఒక ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగినపుడు, దానివల్ల సమీపంలోని నివాసితులు నష్టపోతే వారు సదరు ఫ్యాక్టరీని నష్టపరిహారం కోరే హక్కును ఇచ్చే చట్టాలు దేశంలో ఇప్పటికే ఉన్నాయి. అలాంటి చట్టాలేవీ ప్రజలకు అందుబాటులో ఉండవని కనుక విదేశీ కంపెనీలు భయపడవలసిన అవసరం లేదని మోడి ప్రభుత్వం ఈ వివరణ ద్వారా హామీ ఇస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఎవరి ప్రయోజనాలకు ప్రతినిధి? భారత ప్రజలకా లేక విదేశీ కంపెనీలకా?
“యు.పి.ఏ ప్రభుత్వం ఏవైతే చేసిందని ఆరోపించిందో అవన్నీ ఎన్.డి ప్రభుత్వం చేస్తోందని స్పష్టంగా తెలుస్తున్న విషయం. బాధితుల హక్కులకు మద్దతుగా నిలవడంలో ఈ రెండు ప్రభుత్వాలూ విఫలం అయ్యాయి” అని వామపక్ష పార్టీల నేతలు ఈ వివరణను ఉద్దేశిస్తూ విమర్శించాయని ది హిందు పత్రిక తెలిపింది.
3. “నష్టపరిహార మొత్తంపై పరిమితులు ఉంటాయి. అది కూడా ఇన్సూరెన్స్ పూల్ నుండి చెల్లించబడుతుంది” అని మోడి ప్రభుత్వ (విదేశాంగ శాఖ) వివరణ పేర్కొంది.
సి.ఎల్.ఎన్.డి చట్టం ప్రకారం నష్టపరిహారాన్ని 300 మిలియన్ ఎస్.డి.ఆర్ (స్పెషల్ డ్రాయింగ్ రైట్స్) లకు పరిమితం చేయబడిన మాట నిజమే. కానీ ఈ మొత్తాన్ని సరఫరాదారు చెల్లించాలని చట్టం చెప్పినట్లుగా ఇన్నాళ్లూ కాంగ్రెస్, బి.జె.పి ప్రభుత్వాలు చెబుతూ వచ్చాయి. రిపబ్లిక్ డే సంబరాలకు అతిధిగా వచ్చిన ఒబామాతో ప్రధాని మోడి చర్చలు జరిపిన దరిమిలా ఈ మాటలు మారిపోయాయి.
[ఎస్.డి.ఆర్ లను ఐ.ఎం.ఎఫ్ నిర్వహిస్తుంది. ఇది ప్రధాన అంతర్జాతీయ కరెన్సీలను వాటి వాటి ప్రాతినిధ్య విలువల వారీగా పరిగణించి విలువను పొందుతుంది. ఏయే కరెన్సీలను ఎంత మొత్తంలో తీసుకోవాలన్నది ఐదేళ్లకొకసారి ఐ.ఎం.ఎఫ్ సమీక్షిస్తుంది.]
ప్రస్తుతం ఎస్.డి.ఆర్ కి ఉన్న విలువ ప్రకారం 300 మిలియన్ ఎస్.డి.ఆర్ లు రు 2610 కోట్ల తో సమానం. మోడి ప్రభుత్వం ఇచ్చిన వివరణ ప్రకారం ఈ మొత్తంలో ఆపరేటర్ అయిన ఎన్.పి.సి.ఐ.ఎల్ రు. 1500 కోట్లు మాత్రమే చెల్లిస్తుంది. మిగిలిన రు. 1110 కోట్లు కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇది కాకుండా అదనంగా నష్టం జరిగినట్లయితే దానిని అంతర్జాతీయ అనుబంధ నష్టపరిహారం నుండి తీసి చెల్లిస్తారని కేంద్రం చెబుతోంది. అది కూడా కేంద్ర ప్రభుత్వం CSC అనే అంతర్జాతీయ సదస్సు ఒప్పందాన్ని ఆమోదించిన తర్వాత.
ఒకవేళ సదస్సు ఒప్పందాన్ని ఇండియా ఆమోదించినా కూడా అది కూడా మళ్ళీ కేంద్ర ప్రభుత్వం, దాని ఆధీనంలో ఉన్న జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలే చెల్లించాలి. నష్టపరిహారాన్ని ఈ రెండూ సగం సగం చెల్లిస్తాయట. కేంద్రం ప్రభుత్వం చెల్లించే నిధులు ప్రజల నుండి వసూలు చేసే పన్నులే. ఇన్సూరెన్స్ కంపెనీల వద్ద నున్న సొమ్ము కూడా భారత ప్రజలదే.
ఏతావాతా మోడి ప్రభుత్వం తేల్చింది ఏమిటంటే విదేశీ కంపెనీలు నాసిరకం పరికరాలు సరఫరా చేయడం వల్ల ప్రమాదం జరిగినా, అణు రియాక్టర్ల సాంకేతికతా లోపాల వల్ల ప్రమాదం జరిగినా దానివల్ల తలెత్తే నష్టపరిహారంలో ఒక్క నయా పైసా కూడా ఆ పరికరాలను సరఫరా చేసిన విదేశీ కంపెనీలు చెల్లించవలసిన అవసరం లేదు. ఇన్నాళ్లూ బి.జె.పి, కాంగ్రెస్ నేతలు చెబుతూ వచ్చినది ఇందుకు పూర్తిగా విరుద్ధం. సి.ఎల్.ఎన్.డి.ఏ చట్టం కింద అణు పరికరాలు సరఫరా చేసిన విదేశీ కంపెనీలను కూడా ప్రమాదానికి బాధ్యులు చేశామని ఇక వారెక్కడికీ పోలేరని ఆ పార్టీల నేతలు చెప్పారు. వారు ఇరువురూ ఒకసారి ప్రతిపక్షం లోనూ, ఒకసారి పాలకపక్షం లోనూ ఉన్న పార్టీలే. ఆ విధంగా రెండు పార్టీలూ ప్రత్యేకంగానూ, ఉమ్మడి గానూ దేశ ప్రజలకి అబద్ధాలు చెప్పి నమ్మించారు. ఇప్పటికీ నమ్మిస్తున్నారు.
2011లో జరిగిన ఫుకుషిమా అణు కర్మాగారం ప్రమాదం వల్ల 200 బిలియన్ డాలర్ల నష్టాన్ని జపాన్ ప్రజలు చవి చూశారని ఇప్పటి వరకు నిపుణులు తేల్చిన విషయం. అది దాదాపు 12 లక్షల కోట్ల రూపాయలకి సమానం. ఎక్కడ 12 లక్షల కోట్లు ఎక్కడ 2610 కోట్లు? పైగా ఈ మొత్తాన్ని మన ప్రభుత్వమే ఇవ్వాలట. అణు పరికరాలు అమ్ముకుని బిలియన్ల డాలర్ల లాభం ఆర్జించేది విదేశీ కంపెనీలైతే వాటివల్ల జరిగిన నష్టాన్ని భరించేది భారత ప్రభుత్వం. అనగా భారత ప్రజలు. మన వేలితో మన కళ్లే పొడవడం!
ఈ తప్పుడు అర్ధాలను ఉద్దేశించే బారక్ ఒబామా తాను మోడీతో “Breakthrough Understanding” వచ్చానని చెప్పాడు. ఇలాంటి దగుల్బాజీ అవగాహన ఎవరికి Breakthrough అవుతుందో అప్పుడు (జనవరి 25 తేదీన) తెలియలేదు. ఒబామా వెళ్లిపోయాక, ఆయన వచ్చి వెళ్ళిన సందడి సద్దు మణిగాక, దేశం అంతా ఢిల్లీ ఎన్నికలవైపు చూస్తుండగా గుట్టు చప్పుడు కాకుండా మోడి ప్రభుత్వం వెల్లడి చేసింది.
మోడి-జైట్లీ-ఒబామా బృందం భారత ప్రజలను నిలువునా మోసం చేస్తూ, పార్లమెంటు ఆమోదించిన చట్టానికి తప్పుడు అర్ధాలు సమకూర్చుతూ అవగాహనకు వచ్చారు. ఈ అవగాహన ఫలితం రేపు పూర్తిగా భారత ప్రజలే భరించనున్నారు. ఇంతోసి ప్రభుత్వాన్ని ‘నేషలిస్టు’ ప్రభుత్వం అని చెప్పగలమా? ఈ అవగాహన ఇచ్చిన నేతలు ‘స్వదేశీ’ నేతలు కాగలరా?
(చట్టానికి తూట్లు పొడిచేందుకు యు.పి.ఏ ప్రభుత్వం ఏ విధంగా ప్రయత్నించ్చిందో తెలియాలంటే అరుణ్ జైట్లీ గారు రాసిన ఆర్టికల్ చదివి తీరాలి. జైట్లీ-మోడీల హిపోక్రసీ కూడా ఆర్టికల్ లో తెలుస్తుంది. ఆర్టికల్ కోసం కింద ఇచ్చిన లంకె లోకి వెళ్ళండి.