లోక్ సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఎదుర్కొన్న పరిస్ధితిని ఢిల్లీ ఎన్నికలకు ముందు బి.జె.పి ఎదుర్కొంది. ఇంకా చెప్పాలంటే ఆనాడు బి.జె.పి ప్రదర్శించిన ఓటు చతురతను ఈ రోజు ఎఎపి ప్రదర్శించింది. వ్యక్తిగత స్ధాయికి వెళ్ళినట్లయితే ఆనాడు మోడి కనపరిచిన చాతుర్యం ఈ రోజు అరవింద్ కేజ్రీవాల్ కనబరుస్తున్నారు.
లోక్ సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నిస్పృహతో చేసిన విమర్శలను తన ప్రచారాస్త్రాలుగా మోడి/బి.జె.పి మలుచుకున్నారు. ఢిల్లీ ఎన్నికల్లోనూ బి.జె.పి ఒకింత బెదురుతో, నిస్పృహతో చేసిన విమర్శలను తన ప్రచారాస్త్రాలుగా అరవింద్ ఉపయోగపెట్టుకున్నారు.
ఉదాహరణకి చాయ్ అమ్ముకునే వ్యక్తి సి.ఎం అయ్యారని కాంగ్రెస్ నేతలు అపహాస్యం చేశారు. ఆ అపహాస్యాన్ని బి.జె.పి ‘చాయ్ పే చర్చా’ పేరుతో ప్రచార ఆయుధంగా మార్చుకుంది.
ఢిల్లీ విషయానికి వస్తే ఎఎపికి వస్తున్న నిధులు అవినీతి సోమ్మేననీ ఆ నిధులు ఎక్కడివో విచారణ చేయాలని బి.జె.పి ఆరోపించింది. కేజ్రీవాల్ క్షణం ఆలస్యం చెయ్యకుండా విచారణకు సంసిద్ధత ప్రకటించారు. తమతో పాటు గత మూడు, నాలుగు ఎన్నికల్లో బి.జె.పి, కాంగ్రెస్ లకు వచ్చిన నిధులపై కూడా విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఆ దెబ్బతో బి.జె.పి నోళ్ళు మూతలు పడ్డాయి.
ఎఎపి అవినీతి వ్యతిరేక ప్రతిష్టకు విరుగుడుగా కిరణ్ బేడీని బి.జె.పి రంగంలోకి దించింది. దానితో ఆమె ఫోటోను తమ ప్రచార పోస్టర్లలో ముద్రించడానికి సైతం ఎఎపి వెనుదీయలేదు. అరవింద్, కిరణ్ బేడీల ఫోటోలు ఇద్దరి ఫోటోలను ప్రచురించి నిజాయితీపరునికా లేక అవకాశవాదిగా ఎవరికి మీ ఓటు? అని ఎఎపి ప్రశ్నించింది. కేజ్రీవాల్ బృందం రాజకీయ పార్టీని పెట్టడాన్నే తీవ్రంగా వ్యతిరేకించిన బేడీ తానే రాజకీయాల్లోకి దిగడం ద్వారా అవకాశవాది అయ్యారని ఎఎపి ఆ విధంగా శక్తివంతమైన అంశాన్ని ప్రజల ముందు ఉంచింది.
అన్నా హజారేకు కేజ్రీవాల్ దండ వేస్తున్నట్లుగా కార్టూన్ గీసి ప్రచారం చేసిన బి.జె.పి, తద్వారా హజారేను మృతుడిగా కేజ్రీవాల్ మార్చారని బి.జె.పి చెప్పే ప్రయత్నం చేసింది. ఆ కార్టూన్ ను కూడా తనకు అనుకూలంగా అరవింద్ మార్చుకున్నారు. బతికి ఉన్న హజారేకు దండవేసి ఆయనను మృతుడిని చేయడం క్షమార్హం కాదని, ఇదేం ఘోరం అని అరవింద్ ప్రశ్నించడంతో బి.జె.పి వద్ద సమాధానం లేకపోయింది.
చివరికి పరిస్ధితి ఎలా తయారయ్యింది అంటే ఢిల్లీ ఎన్నికల ఫలితాలు మోడి పాలనపై రిఫరెండం కాదని బి.జె.పి అధ్యక్షుడు, రాజకీయ చాణక్యుడు అమిత్ షా తడబడవలసి వచ్చింది. ఆ విధంగా ఎన్నికలు జరగడానికి ముందే తమ ఓటమిని అమిత్ షా ఒప్పేసుకున్నారు.
ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఎఎపికే ఆధిక్యత ఇవ్వడంతో అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఢిల్లీ పీఠం అధిష్టించనున్నారని ఢిల్లీ పౌరులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 50 రోజుల పాలనలోనే కార్పొరేట్ దిగ్గజాలకు, వారి వెనుక ఉన్న కాంగ్రెస్, బి.జె.పి లకు చెమట్లు పట్టించిన ఎఎపి, మళ్ళీ అధికారం చేపడితే గనుక, సామాన్యుడికి మేలు చేయగల అదే తరహా పాలన ఈసారి కూడా కొనసాగించాలని ఆశిద్దాం.
శాంతి భూషణ్ చేసిన కేజ్రివాల్ పై చేసిన ఆరోపణలలో నిజంలేదంటారా?