కాంగ్రెస్ కంటే తమది విభిన్నమైన పార్టీ అని బి.జె.పి నేతలు చెప్పుకుంటారు. కాంగ్రెస్ లో సంస్ధాగత ప్రజాస్వామ్యం బొత్తిగా లేదని, కేవలం కుటుంబ స్వామ్యమే ఉన్నదని వెంకయ్యనాయుడు లాంటి నేతలు తరచుగా ఆరోపిస్తారు. అలాంటి బి.జె.పి లోనూ నేడు కేవలం ఇద్దరంటే ఇద్దరు వ్యక్తులదే ఇష్టా రాజ్యం అయిందని ఈ కార్టూన్ చెబుతోంది.
బి.జె.పి చిహ్నం కమలంలో వికసించిన పూ రెమ్మలు మోడి అయితే, వాటికి పత్రహరితాన్ని పోషణగా అందించే ఆకులు అమిత్ షా అని కార్టూనిస్టు సూచించారు. అమిత్ షా చాణక్య వ్యూహాలే బి.జె.పిని ప్రస్తుత స్ధాయికి చేర్చాయని కొన్ని పత్రికలు సైతం అన్యాపదేశంగా అంగీకరిస్తాయి.
అమిత్ షా ఎన్నికల ఎత్తుగడల సారం ఏమిటన్న అన్న ప్రశ్నకు సమాధానం కోసం గుజరాత్ లో కరసేవకుల దహనం అనంతరం చెలరేగిన హత్యాకాండ, యు.పిలో ఓటర్లను కాంగ్రెస్, అజిత్ సింగ్ ల జేబుల నుండి గుంపగుత్తగా తరలించిన ముజఫర్ నగర్ అల్లర్లు, బీహార్ లో బౌద్ధ ఆరామంపై జరిపిన బాంబు దాడులు, ఇటీవల ఢిల్లీలో ముస్లింలు, చర్చిలపై వరుసగా జరిగిన దాడులను ఓసారి గుర్తుకు తెచ్చుకుంటే సరిపోతుంది. ఇలాంటి ఎత్తులు గతంలో ఎదో ఒక స్ధాయిలో కాంగ్రెస్ అమలు చేసినవే.
మొత్తం మీద పది సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ సాగించిన అవినీతి పాలన, పాల్పడిన కుంభకోణాలు ప్రజల్లో వ్యతిరేకత రేకెత్తించగా అది బి.జె.పికి బాగా కలిసి వచ్చింది. ఆ పరిస్ధితికి తోడు పైన పేర్కొన్న వివిధ చర్యలు ప్రజలను కుల, మత ప్రాతిపదికన పోలరైజ్ చేయడంలో సఫలమై ఆ పార్టీకి అనుకున్న ఫలితాలను చేకూర్చాయి.
కానీ ఢిల్లీలో ఎఎపి ఎన్నికలను పూర్తిగా భిన్నమైన వేదిక మీదికి తీసుకుని వెళ్లడంతో అమిత్ షా సో కాల్డ్ చాణక్య నీతి పెద్దగా పని చేయలేదని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెబుతున్నాయి. ఈ వేదిక బి.జె.పి లాంటి పార్టీలకు అలవాటు లేనిది. ప్రజలను వారివి కాని సమస్యల వెంట పరుగులు పెట్టించే ఈ పార్టీలు, తమకు అలవాటు లేని సమస్యలను ఎఎపి రంగం మీదికి తేవడంతో ఎటూ పాలుపోలేక అనివార్యంగా, ఎఎపి లేవనెత్తిన అంశాలపైనే మాట్లాడవలసిన అగత్యం ఏర్పడింది.
ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ప్రకటించాక బి.జె.పి లో మోడి, అమిత్ షా ల మాటలకు ఇప్పటి స్ధాయిలోనే విలువ ఇవ్వడం కొనసాగుతుందా అన్నది పరిశీలించడం ఆసక్తిగా ఉండగలదు.